డ్రైవర్ రాముడు
"డ్యూటీకి టైమైపోయినా అట్టా పడుకున్నావేంది.ఈయాల డ్యూటీకెళ్ళవా ఏంది?" అడిగింది రాముడి భార్య రంగమ్మ రాముడ్ని.
"అయితే అయిందిలే... కంగారేంది?... నేను ఎల్లేవర్కూ అందరూ వెయిటింగ్ సెయ్యాల్సిందే!... హ...హహ..." అన్నాడు ఒళ్లు విరుచుకుంటూ రాముడు...
రాముడంటే ఒట్టి రాముడు కాదు అతను. డ్రైవర్ రాముడు. ఆర్టీసిలో అతనికి డ్రైవర్ ఉద్యోగం. సిటీ బస్సులు తోల్తుంటాడు అతను. అందరూ అతడ్ని డ్రైవర్ రాముడునే పిలుస్తుంటారు. మనం కూడా అలానే పిల్చుకుందాం.
పెళ్లాం రంగమ్మ పోరీ పోరీ పోరీ... పోర్తే అప్పుడు తీరుబడిగా స్నానం చేసి, భోంచేసి బస్సు డిపోకి బయలుదేరి అక్కడినుండి బస్సు తీస్కుని బస్సు స్టాండుకి వెళ్ళాడు...
బస్సు స్టాపులో ఆగగానే జనం బస్సుమీదికి ఎగబడ్డారు. విపరీతమైన తోపులాట! జనం ఒకర్నొకరు మోచేతుల్తో పొడుచుకుంటున్నారు... సందులో వీలు చూస్కుని ఆడాళ్ళమీద చెయ్యేస్ మగరాయుళ్ళు కొందరు!
ఆ తోపులాటకి చొక్కాలు చిరిగిపోతున్నాయ్. చీరలు నగిలిపోతున్నాయ్. కొప్పులు ఊడిపోతున్నాయ్... జడలు ఎగిరిపోతున్నాయ్..." క్రాపులు రేగి, డిప్పలు చీకిపారేసిన చెరుకురసం మామిడి టెంకల్లా తయారవుతున్నాయ్... అంతా గందరగోళం...
అది చూసిన డ్రైవర్ రాముడికి మహా హుషారోచ్చేసింది. పకపకా నవ్వి చప్పట్లు కొట్టాడు.
"ఏంటి డ్రైవర్ రాముడూ... అంత హుషారుగా ఉన్నావ్? పెళ్లాం పుట్టింటికెళ్ళిందా ఏంటి?" అడిగాడు కండక్టర్.
అది విన్న డ్రైవర్ రాముడికి కంపరం పుట్టింది.
"థూ నియవ్వ?... ఎప్పుడూ ఒక్క తీర్నే నవ్వుతార్ వయ్య?... ఆడ సూడు... గుమ్మంకాడ..." అన్నాడు ఎవడ్రా నువ్వూ అన్నట్టు చూస్తూ.
కండక్టర్ బస్సు గుమ్మం దగ్గర జరుగుతున్న దొమ్మీ చూశాడు.
కండక్టర్ చూసే టైంకి ఒకాయన పంచె ఊడిపోయి, చారల చారల డ్రాయరుతో తొక్కుతూ తారుతూ బస్సు ఎక్కుతున్నాడు. ఇంకొహాయన చొక్కా గుండీలు తెగిపోయి బనీను చిరిగిపోయి రొప్పుతూ సీట్లో కూర్చోబోయాడు. అంతలో అతని కాలికి మరో కాలేజీ కుర్రాడు తన కాలిని అడ్డుపెట్టాడు. దాంతో అతను బోర్లా పడ్డాడు. వెంటనే ఆ కాలేజీ కుర్రాడు అతను కూర్చోబోయిన సీట్లో తను కూర్చున్నాడు. ఇంకొకావిడ కొప్పూడిపోతే, కొప్పులో పెట్టుకున్న మల్లెపూలదండ పారెయ్యడం ఇష్టంలేక చెవికి చుట్టుకుని బస్సెక్కింది.
ఇంకా దృశ్యాల్ని చూడలేక కండక్టర్ గిలగిల్లాడిపోతే నవ్వాడు.
"ఏం?... గట్ల నవ్వుతున్నావ్?.... నీ పెండ్లాంగీన నచ్చిందా?" కళ్ళెగరేస్తూ హుషారుగా అడిగాడు డ్రైవర్ రాముడు.
"సారీ అన్నా... తప్పైపోయింది... హి...హిహి" అన్నాడు కండక్టర్.
"సర్లె... సర్లె... నువ్వు పోయి టిక్కెట్లు కొట్టు...పోదాం."
కండక్టర్ ప్రయాణికులకు టిక్కెట్లు కొట్టడానికి బస్సు ఈ చివర్నుండి ఆ చివరకు, గుమ్మం దగ్గరకు వెళ్ళాడు. అక్కడ తోపులాట ఏమాత్రం తగ్గలేదు.
ఇంతలో ఒక ముసలామె బస్సు కిందనుండి డ్రైవర్ రాముడిని అడిగింది.
"సారూ... ఈ బస్సు హిమాయత్ నగర్ పోతాదా సారూ..."
ఆ ముసల్ది కూలిపని చేస్కునేదాన్లా వుంది.
"నన్నెందుకడ్గుతావ్?... బస్సుకి నా తలకాయంత బోర్డు పెట్టలే... సద్వుకో..." విసుగ్గా సమాధానం ఇచ్చాడు డ్రైవర్ రాముడు.
"నాకు సద్వు వస్తె ఈ తిప్పలెందుకు సారూ... జర్ర చెప్పరాదె...ఇమాయత్ నగర్ పోతాదె?"
"ఆ...పోతాది...ఎక్కు..." అన్నాడు డ్రైవర్ రాముడు నొక్కి నొక్కి పలుకుతూ.
అంతే... ముసల్ది బస్సు గుమ్మందగ్గరి గుంపులో కలిసిపోయింది.
"అసలు బస్సు హిమాయత్ నగర్ పోనే పోదు.. బస్సెక్కితే సస్తదిముండ... లేకపోతే గట్ల విసికిస్తాది!!?... హి...హి..." కసిగా నవ్వుకున్నాడు డ్రైవర్ రాముడు.
ఇంతలో ఒక డెబ్భై ఏళ్ళ వృద్ధుడు డ్రైవర్ పక్కనున్న బస్సుముందు గేట్లోంచి బస్సెక్కబోయాడు.
"హెయ్... ఛీ... ఛీ..." అన్నాడు డ్రైవర్ రాముడు.
అలా తననెందుకంటాడ్లే... ఏ కుక్కనో, పందినో అని వుంటాడని డ్రైవర్ ని ఖాతరు చెయ్యకుండా ముసలాయన బస్సు ఎక్కబోయాడు.
"అర్రే ఇస్కీ.. దిగమంటుంటే నిన్నుకాదు?" మళ్ళీ అరిచాడు డ్రైవర్ రాముడు.
"బాబూ ముసలోడిని... నన్ను ఇక్కడినుండే ఎక్కనియ్యి బాబూ..." తేరుకున్న అతను బ్రతిమలాడే గొంతుతో అడిగాడు.
"ముస్సాళ్ళు కాదా అని ఈడకెళ్ళి ఎక్కనిస్తే బస్సంతా ముస్లాళ్ళతో నిండిపోతాది... ఛల్ దిగు".
"బాబూ... నాకు చాలా అర్జంటు పనుందిబాబూ... వెనకనుండి బస్సు ఎక్కలేను... ఈ బస్సు ఎక్కలేకపోతే చాలా కష్టం బాబూ..."
"గట్టనా.... అంత అర్జంటైతే ఆటోల ఫో... లేదా టాక్సీల ఫో... ఛల్ దిగు..." డ్రైవర్ రాముడు సీట్లోంచి లేచొచ్చి ముసలాయన చొక్కా కాలర్ పట్టుకున్నాడు.
ముసలాయనకి ఆత్మాభిమానం దెబ్బతింది.
"ఏంటలా చొక్కా పట్టుకుంటావ్?... వదులు!" కాస్త కోపంగా అన్నాడు. ఆయన రిటైర్ కాకముందు గవర్నమెంటాఫీసులో పెద్ద గెజిటెడ్ ఆఫీసర్ గా చేసేవాడు.
"అరే చల్ భే...ఏంది నక్రాల్ చేస్తున్నావ్?... దిగు.... నీయవ్వ...".
ముసలయిన్ని గుమ్మందాకా బరబరా లాక్కెళ్ళి బస్సులోంచి దింపేసి డ్రైవింగ్ సీట్లో కూర్చున్నాడు డ్రైవర్ రాముడు.
ముసలాయన తిట్టుకుంటూ అవమానంతో తలవొంచుకుని వెళ్ళిపోయాడు.
బస్సులోని జనం ఈ సంఘటన చూశారుగానీ ఎవ్వరూ ఏమీ అనలేదు. ఏమైనా అంటే తమనీ బూతులు తిట్టి బస్సులోంచి తోసేస్తాడని భయమేమో!
ఇంతలో బస్సు గంట "ఠంగ్ ఠంగ్" అని మోగింది. డ్రైవర్ రాముడు బస్సు స్టార్ట్ చేశాడు. ఇంతలో బస్సు అపమన్నట్టు సింగిల్ గంట మోగింది."ఠంగ్" మంటూ డ్రైవర్ రాముడు ఇంజన్ ఆఫ్ చేద్దామని అనుకుంటుండగా మళ్ళీ బస్సుని పొమ్మని చెప్తూ "ఠంగ్... ఠంగ్" అని రెండుసార్లు గంట మోగింది.
మరిక్షణం ఆగమన్నట్టు ఒకేసారి "ఠంగ్" మని మోగింది గంట.
"అర్రే ఇస్కీ... ఈగడబడేంది?... ఆ?" వెనక్కి తిరిగి చూస్తూ అరిచాడు డ్రైవర్ రాముడు.
"నేను టిక్కెట్టు ఇస్తున్నా అన్నా... బస్ పోనీకు... వేరే ఎవరో డబల్ బెల్ కొడ్తున్నారు?" కండక్టర్ కేకేశాడు.
"అర్రే... ఎవ్వడ్ బే సాలెగాడు గంట కొడ్తున్నారు... నీ..." అరిచాడు జనంవంక చూస్తూ డ్రైవర్.
ఆ అరుపుకు సమాధానం ఏమీ రాలేదుగానీ మరోసారి ఎవరో బెల్ కొట్టారు.
"అర్రె నీయవ్వ... చొక్కాపట్టి కిందకి దించేస్తా... ఎందుకట్లా కొడ్తుండ్రు?" ఇరిటేట్ అయ్యాడు డ్రైవర్ రాముడు.
"లేకపోతే ఏంటయ్యా... టిక్కెట్లు ఇవ్వడం ఇంతసేపా?"
"త్వరగా పోనియ్... ఇప్పటికే ఆలస్యం అయ్యింది..."
"బస్సు నీ తాత సొమ్ములా చేస్తున్నావ్..."
జనంలోంచి ఎవరో ముగ్గురు అరిచారు సహనం కోల్పోయినవాళ్ళు.