Previous Page Next Page 
లేటెస్ట్ లవ్ పేజి 11

ఏ విధంగా తనవాడు....
ఏ విధంగా తెలిసినవాడు....?!
సింధూకెంత ఆలోచించినా తొట్రుపాటే తప్ప....కారణం కొరుకుడు పడలేదు.
అతనితో మాట్లాడాలనీ, అతనితో చేయీ చేయీ పట్టుకు తిరగాలనీ, కాంపస్ చెట్లక్రింద కబుర్లు చెప్పుకోవాలనీ ఒకటే ఆత్రంగా వుంది.
తన కళ్ళు 'కాంపస్'లో వున్నా అతన్నే వేదికాయి.
అలా మొదట్లో కొన్నిరోజులు గడిచాయి.
అతడూ ఆమెను చూడటం మొదలెట్టాడు.
అతడే ఒకరోజు సింధూ కారు దిగటంతో తన టూ-వీలర్ బైక్ మీద దగ్గరగా వచ్చి....
"హలో లవ్ లీ! మీ పేరు?" అంటూ అడిగాడు.
"సింధూ!"
"వెరీగుడ్! నేమ్ ప్రేమకు సమాధానంగా వుందే."
"సాయంత్రం.....పారడైజ్ లో రెస్టారెంటు దగ్గర కలుద్దాం."
అతడలా అని వెళ్ళటం...తనలా మాట్లాడటం నిజంగా జరిగిందో లేదో చాలాసేపటివరకూ సిన్దూకి కన్ ఫర్మ్ కాలేదు.
తను క్లాస్ రూమ్ లో కెళ్ళినప్పుడు అతడు తనవంక చిలిపిగా చూస్తూ చేతివ్రేళ్ళు తనకు మాత్రమే తెలిసేట్టు ఊపటం జరిగాక-
యస్! సాయంత్రం తమ ప్రోగ్రాం 'పారడైజ్ రెస్టారెంట్ లోనే ఫిక్స్ అయిందనుకుంది.
అన్ని రోజులకూ సాయంత్రాలుంటాయి.
ఉదయం తాము యూనివర్శిటీకొచ్చి సాయంత్రం అయ్యేవరకూ హాపీగా ఫ్రెండ్స్ లో గడిపేవారు.
అప్పుడే సాయంత్రం వచ్చిందా అనుకునేవారు.
కానీ ఆరోజు సాయంత్రం.....చాలాసేపు వున్నట్టూ, ఉదయం మధ్యాహ్నం ఎంతసేపటికీ తరగనట్టు ఒకటే టెన్షన్.
అలాంటి టెన్షన్ కూడా తీయగా వుంటుందని సింధూకి మొదటిసారిగా తెలిసింది.
తను జీవితంలో చాలా తక్కువసార్లు టెన్షన్ పడింది. ఆ టెన్షన్ ఇంత గజిబిజిగా లేదు.
ఈ టెన్షన్ లో శరీరం క్షణ క్షణానికి తేలిక అవుతుంది. గుండె కాస్తంత వేగంగా కొట్టుకుంటుంది. ఏవో తనకే తెలీని ప్రకంపనలు.
ఎన్నడూ అనుభవించి ఎరుగని అలజడులు!
తన పేరు సింధూ అనగానే ఎంత స్పీడ్ గా మాట్లాడాడు.
ప్రేమకు సమాధానంగా వుందే!
తనకు నవ్వు వచ్చింది.
ఇప్పుడు సాయంత్రం తను పారడైజ్ కు వెళ్తుంది.
ఇంతకుముందు అనేకసార్లు తను పారడైజ్ రెస్టారెంట్ కి వెళ్ళింది కారేసుకుని. ఎక్కువసార్లు ఒంటరిగా - తక్కువసార్లు తన తోటి గాళ్స్ తో
బిల్ ఎప్పుడూ తనే పే చేసేది.
ఇప్పుడీ సాయంత్రం ఆ సాదాసీదా రెస్టారెంట్ తనకెందుకనో ఖరీదయిందిగా కనిపిస్తోంది. పేరుకు తగ్గ అర్ధంలా కనిపిస్తోంది. కళ్ళలో అదేపనిగా మెదలుతోంది.
తన ప్రక్కనే అతడు....
అన్నట్టు అతని పేరు?

                                                          *    *    *    *
"మై నేమీజ్ నిఖిల్!"
ఓ చెట్టుక్రింద నిఖిల్ సింధూతో తనను తాను పరిచయం చేసుకున్నాడు.
ఇరువురు మాత్రమే కూర్చునే ఏర్పాటున్న ఓ పొన్న పూలచెట్టు క్రిందకు నిఖిల్, సింధూ చేరుకున్నారు.
"నిఖిల్ ఈజె గుడ్ నేమ్" సింధూ అంది.
తరువాత ఇరువురూ కాసేపు మౌనంగా కూర్చున్నారు.
సింధూ అంది-
"నిఖిల్! ఎందుకో నిన్ను చూడగానే ఎక్కడో చూసినట్టనిపించింది. నీ పాయింటేడ్ నోస్- నీ సన్నటి ఎర్రటి పెదాలూ, ఆకర్షించే ఆ కళ్ళూ- ఏమిటో అలా చూసినకొద్దీ చూడాలనిపించాయి."
"సింధూ! మీ పేరెంట్స్ ఏం చేస్తుంటారు?"
"బిజినెస్!"
"అయితే మన మధ్య అంతరాలున్నాయి. చివరికి స్నేహితులుగా మిగిలిపోతామేమో."
అతని మాటలకు సింధూ కొంత ఆశ్చర్యంగా చూసింది. తర్వతః అడిగింది-
"మీ పేరెంట్స్ ఏం చేస్తుంటారు?"
"మా డాడీ ఓ ప్రయివేట్ ఫరమ్ లో మేనేజరు. మా మమ్మీకి కూడా ఉద్యోగమే. రెండు జీతాలు- ఓ చిన్న ప్లాటు- సాదాసీదా జీవితం. వారికి నేనొక్కడినే...పిల్లలెవరూ నాకు, ముందుగానీ, తరువాతగానీ లేరు."
తరువాత వారిమధ్య కొంత మౌనం చోటుచేసుకుంది.
నిఖిల్ మెల్లిగా సింధూ చేతిమీద తన చేయిని వుంచాడు.
అతని చేయి తగలగానే ఆమె శరీరం షాక్ తింటుందనీ, తన తనువు పులకించిపోతుందనీ ఆశించిన సింధూకి మరోవిచిత్రమైన అనుభూతి కలిగింది.
ఆ చేతి స్పర్శ చల్లగా వుంది. అది తనకే తెలీని హాయిగా వుంది. తరాల అనుభూతిగా వుంది. మరేదో ఆత్మీయమ్గా వుంది. మృదువుగా వుంది. అర్ధంకాని బ్లెస్సింగ్ గా వుంది.
ప్రేమ స్పర్శ ఇలాగే వుంటుందా?!
ఈ రకం స్పర్శ లేకుండా ముందు ముందు తను జీవించటం కష్టం అవుతుందా?
సింధూ కూడా అతని చేతిని తన చేతుల్లోకి తీసుకుని మెల్లిగా ముద్దు పెట్టుకుంది.
ఇంతలో బేరర్ చిప్స్.....వైన్ జ్యూస్ తెచ్చి టేబుల్ మీద పెట్టాడు.
జీవితంలో మొదటిసారిగా సింధూ ఒక పురుషుడితోనూ, నిఖిల్ ఒక స్త్రీతోనూ, రెస్టారెంట్స్ లో తమకు తెలీని అనుభూతుల్ని తలుచుకుంటూ, చిప్స్ తింటూ ఏం మాట్లాడుకోవాలో తెలీక ఏమీ మాట్లాడుకోకపోతే థ్రిల్ వుండదని మనసులో మాటకోసం వెదుక్కుంటున్నారు.
నిఖిల్ కి కొన్ని మాటలు దొరికాయి.
"సింధూ!" పిలిచాడు.
"చెప్పు నిఖిల్!"
"నేనంటే నీకెంత యిష్టమో చెప్పు."
"నీకు నేనంటే ఎంత యిష్టమో అంతే యిష్టం."
"సో! అవర్స్ ఈజె ఈక్వల్ లవ్."
సింధూ అవునన్నట్టు చిన్నగా నవ్వింది.
"అయితే ముందుగా మనం ఎవరింటికి జంటగా వెళ్దాం? మీ ఇంటికా మా యింటికా?"
సింధూ ఠపీమని చెప్పింది.
"మా ఇంటికే....నిన్ను తీసుకుపోయి మా పేరెంట్స్ కి పరిచయం చేస్తాను. వాళ్ళు తప్పనిసరిగా మన ప్రేమకు గ్రీన్ సిగ్నల్ యిస్తారు."
సింధూ మాటలకు నిఖిల్ పెద్దగా నవ్వాడు.
అతని బిహేవియర్, మాటల తీరూ గమనించాక సింధూ అనుకుంది.
నా నిఖిల్ లో కాస్తంత అమాయకత్వముంది.

                    *    *    *    *
సాయంత్రం నాలుగు గంటలు!
సింధూ ఓ పెద్ద భవంతిముందు కారాపింది.
"డియర్ నిఖిల్! ఇదే మా యిల్లు!"
ఆమె మాటలు వినటంతో నిఖిల్ కాస్తంత తత్తరపడ్డాడు. ఒక కుటుంబం నివసించడానికి అంత బిల్డింగ్ అవసరమా? అన్న అనుమానం అతనికి కలిగింది. తమ ప్రేమ అంగీకరించబడితే ఈ బిల్డింగ్ మొత్తానికీ తనో యువరాజు!
కారుని చూసి గేట్ మాన్ సిందూకి శాల్యూట్ చేసి గేటు తీశాడు.
భవంతి ముందు రకరకాల చెట్లున్నాయి. ఓ చిన్ని దిన్యోద్యాన వనంలా ఆ ప్రదేశం మనోహరంగా వుంది.
తాముండేది ఓ చిన్న యిల్లు. రెండు బెడ్ రూమ్స్ - ఒక హాలు-మరో కిచెన్. యింటి ముందు ఎలాంటి ఓపెన్ ప్లేసూ లేదు. కాస్త కంజెస్ట్ డ్ గా వుంటుంది. తమ యింటికి దూరంగా వున్న ప్రదేశంలో పాపర్టీలైన్ మీదున్న జనం వున్నారు.
సింధూ భవంతికి గ్రౌండ్ ఫ్లోర్ కాక- పైన మరో రెండు అంతస్థులున్నాయి. భవంతిని అత్యంత ఆధునికంగా తీర్చిదిద్దారు.
అప్పటికే హాలులో సింధూ తల్లిదండ్రులు ఏదో డ్రింక్ సిప్ చేస్తూ- ఎదురెదురుగా కూర్చుని మాట్లాడుకొంటున్నారు.
హాలు మొత్తం నేలమీదా, గోదాలకూ గ్రానైట్ రాయి అతికించబడింది. ఎప్పుడూ క్లీన్ చేసే మనుష్యులు వుండటంతో, ఆ నల్లటి రాయి మీద గోల్డెన్ డాట్స్ కన్నుల పండుగగా కనిపిస్తున్నాయి.
సింథూని చూడటంతో ఆమె తల్లిదండ్రులు....
"హాయ్ బేబీ! కమాన్! హుఈజ్ దట్...."
వారి మాటలు పూర్తికాకుండానే.....
"చెప్తాను డాడీ! హి ఈజ్ మై క్లాస్ మేట్. తరువతః నా బోయ్ ఫ్రెండ్."
అంతవరకు చెప్పి ఆగిపోయింది.
విషయం ఇరువురికీ అర్ధమయింది.
సింధూ తల్లి రేఖ ఒక్కసారిగా తను సిప్ చేస్తున్న డ్రింక్ ను అలాగే టీపాయ్ మీద పెట్టి లేచి నిలబడింది. మెల్లిగా అడుగులు వేసుకుంటూ నిఖిల్ దగ్గకొచ్చింది. అతన్ని మరింత పరిశీలనగా చూసింది.
"బేబీ! ఎంతకాలంనుండి ఇతని స్నేహం చేస్తున్నావ్?"
"ఎందుకు మమ్మీ?"
"చెప్పు...ఐ వాంట్ ది డిటైల్డ్ షెడ్యూల్ ఆఫ్ యువర్ ఫ్రెండ్ షిప్ విత్ దిస్ బోయ్?"

 Previous Page Next Page