మీరంతా తీయ మామిడి పళ్ళలాంటివారు. మేం మీ నుండి పేపర్లో ప్రకటించిన విధంగా మీ ముందు జీవిత సాఫల్యానికి ఎలాంటి విఘాతం కలుగకుండా స్త్రీ గర్భసంచిలోకి ప్రవేశించిన అండాన్నిజాగ్రత్తగా తీసి పురుషుని వీర్యకణాన్ని సేకరించి-ఆ రెండింటినీ సంయోగం జరిపి__టెస్ట్ ట్యూబ్ లో జై గోట్ గా మార్చి- వేరే జంటలకు దానం చేస్తాం! దానం తీసుకునే జంటలు మీ అంత అందంగా వుండరు. ప్రేమ కేవలం అందం నుండే ఉద్భవించదు. వారూ పరస్పరం ప్రేమించుకుంటూనే ప్రణయంలో తేలిపోతూనే...మరో దారిని భయపడతారు.
ముందు ముందు మనకు పుట్టబోయే పిల్లలు మనలా వికారంగా వుంటే సమాజం చులకనగా చూస్తుంది. వారు అందమైన ప్రేమకు కరువవుతారు.
సో....మన ఆకారాన్ని మనం ప్రేమించటం మాని....ఓ అందమైన జంట దానం చేసినా 'జై గోట్' ని తీసుకుని....మన శరీరానికి అంటుకట్టుకుని-సారాన్ని అందిద్దాం! అది పెరిగి పెద్దదయి అందంగా తయారవుతుంది.
ఆ తయారయిన రూపం ఆడకావచ్చు, మగ కావచ్చు. సమాజం ఆ రూపాన్ని అందంగా చూస్తుంది.
అవే ఆలోచనలున్న ఆ జంటలు-ఈ క్లబ్ కు మీ తరువాత వస్తారు. మీ నుండి సేకరించిన 'జైగోట్స్' ని అలా వచ్చిన స్త్రీల గర్భసంచుల్లో అంటు కడతాం. సారం మొత్తం ఆ స్త్రీ నుండే వస్తుంది. జైగోట్ పిండమై మీ అంత అందంగా ఆ స్త్రీ శరీరంలో పెరుగుతుంది.
ఆమె నవమాసాలూ మోసి కంటుంది. కన్న తరువాత ఆ తల్లికి అమితానందం కలుగుతుంది. ఆ తండ్రికి అమితానందం కలుగుతుంది. రంగు తమ శరీరానిదికాదు. ఆకారం తమ శరీరాలకు చెందదు.
తమకులేని అందాలు తమ బేబీలో ఉన్నందున వారి మనసులు పండుగ చేసుకుంటాయి. తమకు పుట్టిన బిడ్దేనా అని అనుమానపడతారు. అవును వారికి పుట్టిన బిడ్డే!
కానీ రక్తాన్ని పంచి, ఇచ్చింది వారు!
ఇక ఈ విషయాలు సీక్రెట్ గా వుంచబడతాయి. ఎందుకంటే....ఇప్పుడు మీరు 'జై గోట్స్' ని దానం చేస్తున్నారు.
దాన్ని మరో వికారంగా ఉన్న జంటకు అంటు కడతాం.
వారెవరో మీకు తెలీగూడదు. మీరెవరో వారికి తెలీగూడదు. మీరు మీ జై గోట్ ని దానం చేశాక....వారెవరో మీకు తెలిసిపోయిందను కోండి. వారికి మీ లాంటి పాపో....బాబో కలిగాడనుకుందాం! మీరు ఆ పిల్లవాడ్ని తరచూ చూస్తారు. ఒక రకంగా 'పేరెంటల్ లవ్' మీ నుండి ప్రారంభం అవుతుంది. మీ మనసులు మీ అంత అందమైనవి కాకపోతే...ఆ జైగోటి నిజాన్ని వారికి చెప్పేస్తారు.
అప్పుడా పిల్లవాడికి జీవన సారాన్ని అందించి, రూపం ఇచ్చి, పెంచి పెద్దచేసి ఆశలు పెంచుకున్న తల్లిదండ్రులు అంటే కొంత అయిష్టత ఏర్పడుతుంది. ఫలితంగా వారి జీవితంలో అలజడులు మొదలవుతాయి. అది మా ప్రాజెక్టుకు ఒక రకమైన అపజయం.
ఈ అపజయం మేం రూపొందించిన 'ఇన్ విట్రో ఫెర్టిలైజేషన్ ఎంబ్రియో ట్రాన్స్ ఫర్" పద్దతి నుండి ఉద్భవించింది" అంటూ అతడు మరింత వివరంగా చెప్పాడు.
మొదట రేఖ దీనికి అంగీకరించలేదు.
కళ్యాణ్ కల్పించుకుని....
"డియర్! మన రూపాలు అనేకం ప్రపంచంలో వుంటే...అది మనకే గర్వకారణం! ఆలోచించు అన్నాడు."
రేఖ మెల్లిగా కన్విన్స్ అయింది. వేస్టేజి నుండి అందమైన కళ్యాణ్.... మరో అతను రూపు దిద్దుకోబోవటం ఆమెకూ ఆనందాన్ని కలుగజేసింది.
అయితే ఆ రూపం ఎక్కడ పెరిగి పెద్దదవుతుంది. అది తమకు తెలీదు. అలా తెలియజేయడం అని కూడా వారు అంటున్నారు. ఎక్కడో అజ్ఞాతంగా పెరిగే తమ రూపానికి తాము ఆనందపడాలి.
అసలు అది కూడా మంచిది కాదని నిర్వాహకులు అంటున్నారు. మర్చిపోవటం మరీ మంచిదని సెలవిస్తున్నారు.
ఒక అనుభూతి! ఒక దానం!
ఈ దానం విచిత్రమయింది!
ఇంతలో కళ్యాణ్ చెప్పటం మొదలెట్టాడు.
".....డియర్! ప్రపంచం పరిధుల్ని మార్చుకుంటుంది. హైటెక్ రంగం ఇప్పుడు అంతటా విస్తరించుకుంటుంది. మనిషి ఆలోచనలు కూడా తన పరిధుల్ని పెంచుకోవాలి.
ఈ రోజున మనిషి నేత్రదానం చేస్తున్నాడు. కిడ్నీల్ని, అమ్ముకుంటున్నాడు. రక్తం అమ్ముకుంటున్నాడు. హ్యూమన్ బాడీ మీద ఇతరుల అవయవాల ట్రాన్స్ పరెంటేషన్ జరుగుతుంది. ఇప్పుడు మనం చేస్తుంది అంత విలువయిందేం కాదు! నెల నెలా రక్తంలో కలిసి బయటికి వెళ్ళే ఒక ఎగ్.....ఆవేశంలో చల్లార్చుకునే లక్షలాది వీర్యకణాల్లో ఒక కణం..."అతడు పూర్తిగా చెప్పకుండానే రేఖ....కళ్యాణ్ నోటిని తన చేత్తో మూసి.....
"నో కళ్యాణ్! ఇంకా నాకేం చెప్పవద్దు. అర్ధం చేసుకున్నా. ఒకరికి కాదు.....పదిమందికి డొనేట్ చేయటానికైనా నేను సిద్దంగా వున్నాను" అంది.
"థాంక్యూ డియర్! ఐయామ్ ప్రౌడ్ ఆఫ్ యూ" అని రేఖని చాలా డెలకేట్ గా ఆమె చెక్కిలి మీద ముద్దెట్టుకున్నాడు. ఇరువురు కలిసి తిరిగి వేధిక దగ్గరకు వచ్చారు.
అప్పటికే అక్కడ వరుసల్లో నిలబడిన అందమైన జంటలు తమ తమ బయోడేటాల్ని కంప్యూటర్ పీడింగ్ కిస్తున్నారు. ఒక క్లర్క్ మొత్తం అందులోకి ఎక్కిస్తున్నాడు.
* * * *
కాలానికి సరైన కొలత భూభ్రమణం-పరిభ్రమణమే అయితే....ఆ భూమి తన చుట్టూ తాను తిరుగుతూనే సూర్యుడి చుట్టూ మూడుసార్లు తిరిగింది.
తమ భవంతిలో బెడ్ రూమ్ లో కూర్చుని రేఖ, కళ్యాణ్ వంక చిలిపిగా చూస్తూ అంది-
"డియర్ కళ్యాణ్! నీ రూపమో....నా రూపమో ఎక్కడో పెరుగుతూనే వుండాలి కదా! ఆ విషయం మనకెలా తెలుస్తుంది?"
"ఎప్పటికీ తెలీదు."
"ఎందుకో నాకు తెలుసుకోవాలన్పిస్తోంది."
"అసాధ్యం డియర్! నీ కిప్పుడు పిల్లలమీద మనసవుతుంది. నీకీ కాదు. నాకు కూడా ఓ బేబీ నట్టింటిలో తిరగాలని ఆశకలుగుతోంది. ఇక మనం గేట్లు ఓపెన్ చేద్దాం. ఎవరినో ఒకరిని ఆహ్వానిద్దాం!" కళ్యాణ్ అనటంతో రేఖ ముఖం మధురంగా విచ్చుకుంది.
నిజమే! ఇంకా ఎందుకు తాము ఆగాలి? ఈ నాలుగైదు సంవత్సరాలూ తనూ, కళ్యాణ్ కలిసి దేశం మొత్తం తిరిగారు. కాశ్మీర్ ప్రాంతాన్ని కూడా తిలకించారు. చూసిన వారంతా "మేడ్ ఫర్ ఈచ్ అదర్" పోటీలకెళితే మొదటి బహుమతి మీదే అన్నారు.
ప్రణయార్జవం లోతుల్ని చూశారు.
ప్రేమ సామ్రాజ్యం అంచుల్ని తాకారు.
ప్రతి సంవత్సరం దేశంలోని ఏదో ఒక చోటుకు వెళ్తూనే వున్నారు, అందమైన ప్రదేశాల్లో తమ తమ అందాల్ని ఆస్వాదించుకుంటూ వారాలూ, నెలలూ గడిపారు. ఎక్కడా తమ ప్రణయం- ఫలంగా మారకుండా తీయటి అనుభూతుల వరకే పరిమితం చేసుకున్నారు.
ఇప్పుడు పిల్లలు కావాలనుకున్నారు. అనుకున్న తరువాత వారి ప్రణయం అర్ధవంతంగా మారింది. రేఖ నెలలు నిండిన మనిషి అయింది.
కళ్యాణ్ ఆమెను చాలా జాగ్రత్తగా మెడికల్ చెకప్స్ కు తీసుకుపోతూ...ఆమె కెలాంటి బాధా కలుగకుండా జాగ్రత్తపడ్డాడు.
రేఖ ఓ ఆడపిల్లను కంది!
ఆ పిల్ల అచ్చం రేఖలా వుంది! వారికిష్టమైన పేరును సెలక్టు చేసుకుని సింధూ అని నామకరణం చేశారు!
* * * *
సింధూ చాలా మంది పిల్లల కంటే ఎక్కువ గారాబంగా పెరిగింది.
ఆమె తరువాత మరలా వారికి సంతానం కలుగలేదు. ఆ కారణంగా సింధూను మరింత జాగ్రత్తగా, మరింత మురిపెంగా, మరింత సుకుమారంగా పెంచారు.
ఇప్పుడు సింధూ చదువుకుంటుంది.
సెకండరీ విద్య నుండి....కాలేజీ విద్య వరకూ వెళ్ళింది....ఆ తరువాత యూనివర్సిటీలో ప్రవేశించింది. కాలంతో పోటీగా ఎదిగింది.
కాలం ఇరవై సంవత్సరాల వయసును సింధూ శరీరానికి లేబులుగా అతికించి మరోసారి అందరినీ ఆమె అందాల్ని చూడమంది.
సింధు తెల్లగా మల్లెపువ్వులా వుంది. అప్పుడే విచ్చుకున్న తెల్లకాలువలా కూడా వుంది.
సింధూ కళ్ళు విశాలంగా వున్నాయి.
ఆ కళ్ళల్లో కాలమ ఇప్పుడు కన్నెవయసు కుండాల్సిన కాంక్షల్ని.....వెలుగు జిలుగులుగా అద్దింది. ఆమె యవ్వనాన్ని, యదపొంగులుగా తీర్చిదిద్దింది. ఆమె నడుమును నాజూగ్గా వత్తింది. ఆమె కాళ్ళని అరటి బోదెల్లా నిలబెట్టింది.
ఆమె మాటల్లో లవ్లీనెస్ తో పాటు 'లవ్' సింబల్స్ ని కూడా చేర్చింది.
ఫలితంగా ఒక కుర్రవాడ్ని యూనివర్సిటీలో లైక్ చేసింది.
అతగాడు మిస్టర్ వరల్డ్ లా.....మనోహరంగా వున్నాడు. యూనివర్సిటీలో అతన్ని చూడటంతో మొదటిసారే సింధుకి కాస్తంత తొట్రుపాటు కలిగింది.
ఆ తొట్రుపాటు అదోలా వుంది. గుండెల్లో తనకు తెలీని గుబులుగా మారింది.
క్లాస్ రూమ్ లో కూర్చున్నప్పుడు ఒకటికి పదిసార్లు అతన్నే చూసింది. అలా చూడగూడదని....కుటుంబం నేర్పిన కట్టుబాట్లు వెనక్కిలాగుతున్నా మరలా మరలా చూసింది.
అలా తను అతన్ని మరలా మరలా చూస్తున్నప్పుడు అతను కూడా తనవంక రెండుసార్లు చూశాడు.
అప్పుడే తనకు మరింత తడబాటు వచ్చింది. ప్రొఫెసర్ లెక్చరింగ్ కొనసాగుతోంది. అయినా ఒక్క ముక్కా బ్రెయిన్ లో కెక్కలేదు. ఎక్కడో చూసినట్టు....అతగాడు తనవాడయినట్టు....తనకేం తెలీని అనుభూతి!