Previous Page Next Page 
అనగనగా ఓ హనీమూన్ పేజి 11


    ఆమెకు కోపం వచ్చింది. "ఏం కాదా?"
    "మీకు మహాభారతం కథ తెలుసా?"
    "తెలుసు. టీ.వి.లో చూశాను."
    "అందులో రాయబారానికి వచ్చిన పాండవుల కోరిక ఏమిటో తెలుసా?"
    "తెలుసు."
    "ఏమిటి?"
    "మాకు అయిదు ఊళ్ళిచ్చినా చాలు. ఇంకేమీ అడగం అన్నారు."
    "అది చాలా సింపుల్ కోరికలా కనిపిస్తుంది కదూ?"
    "కనిపించటమేమిటి? వెరీ రీజనబుల్ ఆల్సో."
    "అక్కడే దెబ్బతిన్నారు."
    "ఎందుకని?"
    "వాళ్ళడిగిన అయిదు ఊళ్లేమిటో తెలుసా?"
    "ఏమిటి?"
    "ఢిల్లీ, బాంబే, మద్రాస్, కలకత్తా, బెంగుళూరు."
    "అబద్ధం."
    "అంటే ఖచ్చితంగా ఈ నగరాలని కాదు! ఆ కాలంలో దేశానికి అంత ప్రాముఖ్యత వున్న అయిదు ఊళ్ళడిగారు. ఆ అయిదు ఊళ్ళూ వాళ్ళకిస్తే ప్రస్తుత ఢిల్లీ, బాంబే, మద్రాస్, కలకత్తా, బెంగుళూరు లేకుండా మిగిలిన భారతదేశం ఎలా ఉంటుందో, అలాంటిది కౌరవులకు మిగుల్తుందన్నమాట! ఇప్పుడర్థమయిందా?"
    "మీరన్నీ అబద్ధాలు చెప్తున్నారు. నా కలేం అంత పెద్దది కాదు"
    "లేకపోతే ఏమిటి? ఇల్లంటే మాటలా? మనదేశంలో మధ్యతరగతి వాడు ఒక ఇల్లు సొంతం చేసుకోవాలంటే ఆ తరం కాక మరో మూడు తరాల వరకూ ఆ ఇంటి తాలూకూ అప్పుల్తో అడుక్కుతినాల్సిందే. కాదంటారా?"
    శోభ మాట్లాడలేదు. ఆమె ముఖం చిన్నబోయింది. తల వంచుకుని ఆలోచిస్తూండిపోయింది.
    "అరె ఏమిటలా సైలెంటయిపోయారు?"
    "ఆలోచిస్తుంటే మీరు చెప్పేది నిజమే అనిపిస్తోంది. నా కల అలా కలగా మిగిలిపోవలసిందే కదూ?"
    "ఏమో! ప్రస్తుతానికయితే సగటు భారతీయుడు కలలు కనడానికి రూల్స్ ఒప్పుకోవు."
    "మరి మీ కలేమిటి?"
    "ఒకడిని చేయి చాచకుండా, ఒకడికి తల వంచకుండా బ్రతకటం."
    ఆమె నవ్వేసింది.
    అతనికి కోపం వచ్చింది.
    "ఇందాక మీ కల విని నవ్వానని ఇప్పుడు రివెంజ్ కోసం నవ్వుతున్నారు కదూ?"
    "కాదు! ఇది మాత్రం ఏం చిన్న కలని! మీ కల నెరవేరాలంటే మీరూ ఏ టాటానో బిర్లానో అయ్యుండాలి."
    సింహాద్రి నవ్వేశాడు.
    "అఫ్ కోర్స్. అందులో తప్పేం లేదుకదా! పైగా అది కల!"
    "అవును థాంక్యూ! చాలా మంచి ఇంటర్వ్యూ దొరికింది."
    "నా ఇంటర్వ్యూ కూడా ప్రచురించే పేపర్ ఒకటి ఉందంటే నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. మీ పేపర్ పేరేమిటి?"
    "ఈ క్షణం!"
    "అంటే ఈ క్షణం దాటితే పేపర్ వుండకపోవచ్చనా?"
    "నవ్వకండీ! నేటి చిన్న పత్రికలే రేపటి నేషనల్ న్యూస్ పేపర్లు" ఆమె లేచి నిలబడుతూ అంది.
    "నేనే మీకు థాంక్స్ చెప్పాలి. ఎందుకంటే మీతో మాట్లాడటం వల్ల ఈ డ్రామా ఫెయిలైన దిగులు చాలావరకూ తొలగిపోయింది."
    "నిజం చెప్పాలంటే ఈ పాడు ఉద్యోగం మీద రోజురోజుకి పెరిగిపోతున్న విరక్తికి ఇవాళ రిలీఫ్ దొరికినట్లయింది. కనుక మీకే నేను ధన్యవాదాలు చెప్పుకోవాలి."
    ఆమె వెళ్ళిపోయింది.
    వెళ్ళిపోయాక అనిపించిందతనికి ఆమె అడ్రస్ తీసుకుని వుండాల్సిందని.
    అలా ఎందుకనిపించిందో అతనికే తెలీదు. అప్పుడు స్పృహలోకొచ్చి చూశాడతను.
    థియేటర్ లో తనొక్కడే వున్నాడు. స్టేజి మీద కుర్రాళ్ళు సోఫాలు, కుర్చీలూ అన్నీ బయటకు మోస్తున్నారు. ఫిల్మ్ ఇన్ స్టిట్యూట్ లో విద్యార్థులంతా కూడా వెళ్ళిపోయారు.
    సంగీత మాత్రం ఇంకా తన అభిమానులకు ఆటోగ్రాఫ్ లు చేస్తూనే వుంది బయట కారు దగ్గర. ఆమె ఆటోగ్రాఫ్ తీసుకుంటున్నవారిలో ఇద్దరు మంత్రిగారి సంతకం అవసరమున్న కాంట్రాక్టర్లు, మరో ఇద్దరు మంత్రిగారిప్పిస్తానన్న ఇండస్ట్రీ లైసెన్సుల బ్రోకర్లు, ఇంకో అరడజను మంది ఆయన పార్టీ కార్యదర్శులూ.
    ఆటోగ్రాఫ్ ల పర్వం పూర్తవగానే ఆమె ఇంకెవరయినా తన ఆటోగ్రాఫ్ కోసం వస్తున్నారేమోనని చుట్టూ చూసింది.
    తన అరచేయి ఆమె ముందుంచాడు చిరంజీవి.
    ఆమెకు అర్థంకాక అతనివేపు చూసింది.
    "ఏం కావాలి?"
    "ఆటోగ్రాఫ్!"
    "ఎక్కడ?"
    "మీ ఇష్టం! ఈ అరచేయి, గుండె, ఎక్కడ కావాలంటే అక్కడ రాయండి."
    అతని అరచేతి మీద ఆటోగ్రాఫ్ చేస్తూ అతనిని ఎక్కడో చూసినట్లనిపించి మరింత పరీక్షగా చూసింది.
    "మిమ్మల్నింతకు ముందెక్కడో చూశాను" అంది ఆలోచనలో పడుతూ.
    "తప్పకుండా చూసే వుంటారు"
    "ఎక్కడా?"
    "ముందు వరుసలో"
    "మీరు ముందు వరుసలో ఉన్నారా?"
    "అవును! మీ డాన్స్ చూసి పిచ్చి కేకలు వేసి అల్లరిచేసిన వాళ్ళను చావగొట్టింది నేనే."
    "మైగాడ్! మీరా?"

 Previous Page Next Page