Previous Page Next Page 
అనగనగా ఓ హనీమూన్ పేజి 10


    "ఎందుకని?"
    "కళాకారులు నేర్చురాల్ గా పుడతారు. పెరుగుతారు. అంతేగాని అడ్డమైనోడి సందేశాలు విని కానీ, ప్రబోధాత్మక పాటలు విని కాని, నీతి సూత్రాలు, గైడ్ లైన్స్ లాంటివి చదివికానీ కళాకారులవ్వరు. సాహితీ కారులు కూడా అంతే..."
    "మీకు షూటింగ్ లో ఫస్ట్ ప్రైజ్ వచ్చిందని అన్నారు. నిజమేనా?"
    "అవును! కాలేజ్ లో ఎస్.సి.సి.లో ఉండగా షూటింగ్ పోటీలు జరిగినప్పుడు ఫస్ట్ ప్రైజ్ వచ్చింది. మీకెలా తెలిసిందీ విషయం?"
    "బయట మీ ఫ్రెండ్ ఒకతను కనిపించి చెప్పాడు."
    "ఎవడు? ఆ మారుతీరావుగాడా?"
    "పేరు తెలీదు. గాలి కొంచెం గట్టిగా వీచేసరికి ఎగిరిపోయాడు."
    "అనుమానం లేదు. మారుతీరావుగాడే! వాడి మాటలు ఎక్కువగా నమ్మకండి. ఫిఫ్టీ ఫిఫ్టీ కారెక్టర్!"
    "అన్నింట్లోనూ 50శాతం కట్ చేసేయాల్సిందేనా?"
    "ముఖ్యంగా మాటల్లో"
    "మీరింత కోపంగా ఉన్నారేమిటి? ఒరిజినలేనా, పుట్టుకతోనే మీరిలా వున్నారా? పరిస్థితులిలా మార్చాయా మిమ్మల్ని?"
    సింహాద్రికి నవ్వాగలేదు. "దిసీజ్ టూమచ్" అన్నాడు నవ్వేస్తూ.
    "అఫ్ కోర్స్! కానీ తప్పలేదు. మీ డ్రామా నాశమైపోయి ఉండవచ్చు. ఈ డ్రామాతో సినిమా ఫీల్డ్ కెళ్ళిపోదామనుకున్న మీ ప్లాన్ క్రాష్ లాండింగ్ అయివుండవచ్చు. దాంతో మీరు పూర్తిగా డిజప్పాయింట్ అయిపోయి వుండవచ్చు కానీ అంతమాత్రాన ఇలా ముఖం మాడ్చుకుని అడవిలో రెండురోజులపాటు తిండి దొరకని పెద్దపులిలా గాండ్రించక్కర్లేదు."
    సింహాద్రి ఈసారి మనసారా నవ్వేశాడు.
    "రెండు రోజులు తిండి దొరకకపోతే పెద్దపులి మొహం మాడ్చుకుంటుందా?"
    "లేకపోతే ఆనందంతో విప్పారిన మొహంతో ఉంటుందా ఏమిటి? అయినా ఇది మన ఇమేజినేషన్! నిజంగా అదెలా వుంటుందో తెలీదు." ఆమె కూడా నవ్వుతూ అంది.
    అప్పుడు గమనించాడు సింహాద్రి ఆమె అందాలరాశి అన్న విషయం.
    అతనికి ఆశ్చర్యం కలిగింది. అంతవరకూ చాలా మామూలుగా, సామాన్యంగా ఉన్న ఆమె ముఖం ఆమె నవ్వేసరికి అంత అందంగా మారిపోవటం ఎలా జరిగిందో అర్థంకావటంలేదు.
    "యూ ఆర్ బ్యూటిఫుల్" అన్నాడతను.
    ఆమె చప్పున నవ్వటం ఆపి సిగ్గుపడింది.
    "దొంగలు పడ్డ ఆర్నెల్లకి పోలీసులొచ్చారంట! అలా వుంది."
    "కానీ ఆ దొంగలు ఆర్నెల్ల తరువాతే ముసుగు తీశారు కదా?"
    "అయితే మీ పొగడ్తకు నేనేం పొంగిపోయి 'అందాలున్నవి కన్నులలో అవి అల్లరి చేసెను వెన్నెలలో' అని పాడుకోనులెండి. మా ఇంట్లో అద్దం వుంది."
    "అద్దం గీటురాయి కాదు."
    "మీరూ గీటు రాయి కాదు."
    "నేనొప్పుకోను! రచయితలు, చిత్రకారులు, కవులు అందాలకు గీటురాళ్ళని మారుతీరావుగాడు చెప్పాడు."
    "పెద్ద గాలివీస్తే ఎగిరిపోయే వాళ్ళ మాటలు కూడా గాలి సరుకే నమ్మకండి."
    "మీరేం చేస్తున్నారు?"
    "ఇంటర్వ్యూ."
    "నేనడిగేది 'అవుటర్ వ్యూ' సంగతి."
    "ఫ్రీలాన్స్ జర్నలిజం."
    "మనిండియాలో అలాంటిది వుందా?"
    "నేనే ఋజువు"
    "సుమారుగా ఎంత సంపాదిస్తారు?"
    "తిండికి సరిపోయేంత."
    "మరి మిగతా వాటికి?"
    "రాత్రుళ్ళు ఇంట్లో బట్టలు కుడతాను."
    "మైగాడ్! చాలా కష్టం కదూ. ఈ రెండింటికీ."
    "లైఫ్ ఈజ్ లైక్ దట్."
    "అఫ్ కోర్స్ లైఫ్ ఈజ్ లైక్ దట్."
    "మరి మీరేం చేస్తుంటారు?"
    "నిరుద్యోగాన్ని రూపుమాపటానికి ప్రయత్నిస్తున్నాను. అందులో ఇది ఆఖరి ప్రయత్నం."
    "భారతదేశానికి నెలరోజులు టైమిస్తాను. ఆ నెలరోజుల్లో నాకు ఉద్యోగం చూపించకపోతే మంచి మనిషి చెడ్డ మనిషిగా మారిపోతాడని వార్నింగిస్తాను."
    ఆమె నవ్వేసింది. "అంటే డెకాయిట్ అయిపోతారా?"
    "ఇంకా తెలీదు. చెడ్డ మనిషి అవ్వాలనుకునే వాడికి లక్ష దారులున్నాయి. ఎటైనా వెళ్ళవచ్చు"
    "మీ డ్రీమ్స్ ఏమిటి?"
    "మీ డ్రీమ్స్ ఏమిటో చెప్పండి ముందు. అవి నావల్ల అవుతాయో లేదో తేల్చుకుంటాను."
    "అదేమిటి? నా డ్రీమ్స్ కీ, మీకూ ఏమిటి సంబంధం?" కుతూహలంగా అడిగింది.
    "మీ కలల్ని నిజం చేయడంలో నేనూ మీకు హెల్ప్ చేయవచ్చు కదా!"
    "ఎలా చేస్తారు? ఎవరి డ్రీమ్స్ వాళ్ళవి!"
    "అయినా ఒకరి డ్రీమ్స్ లోకి మరొకరి డ్రీమ్స్ జొరబడకూడదని ఎక్కడుంది?"
    ఆమె పజిలయింది.
    "ఏమో! నాకు తెలీదు! కల ఒక్కటే. నాకేం ఖరీదైన ఆశలు, కోరికలు లేవు. నాకో సొంత ఇల్లుండాలి. ఆ ఇంటిచుట్టూ నాకు నచ్చిన పద్ధతిలో గార్డెన్ వుండాలి. ఆ తోటలోనే ఓ మనిషి బ్రతకడానికి అవసరమైనన్ని కూరగాయలు, పళ్ళు వుండాలి. అంతే! పెళ్ళీ పెటాకులూ అవసరం లేకుండా హాయిగా బ్రతకేస్తాను."
    సింహాద్రి విరగబడి నవ్వేశాడు.
    "ఇదేం చిన్న కోరికా?"

 Previous Page Next Page