"దేముడూ ..... దేముడూ .... అంటూ అరుస్తూ వెంటపడ్డాను.... అయ్యో సునాయాస మరణం ఎప్పుడు? రేపా, నెల్లాళ్ళకా, ఏడాదికా , పదేళ్ళకా అయ్యో దేవుడూ..... చెప్పకుండా వెళ్ళిపోతే ఎలా....?"
* * * *
"అమ్మా అమ్మా "పక్కగదిలో శలవు మీద వచ్చిన అబ్బాయి యోగా చేసుకుంటున్న నా కొడుకు వచ్చి నన్ను లేపుతూ - ' ఏమిటీ దేవుడూ అంటూ అరుస్తున్నావు. వాడెందుకు వస్తాడు ఇంత పొద్దుటే" అన్నాడు - మెలకువ వచ్చి లేచి కూర్చున్నాను.
"తప్పు తప్పు దేముడ్ని వాడంటావేమిటి! 'మా వాడు తెల్లపోతూ ' ఏ దేముడు సంగతి నీవంటున్నది' అన్నాడు. దేవుడు అని ఓ పాత వాచ్ మన్ అప్పుడప్పుడు వచ్చి మా ఇంట్లో మొక్కల పని, ఇంకేమన్నా పన్లుంటే వచ్చి చేసి పెడుతుంటాడు . వాడనుకున్నా గాబోలు-
"అసలు దేముడురా - దేవుడు నాకు వరం యిస్తానని వచ్చాడు తెలుసా !"
"హో .... హో .... దేముడోచ్చి వరం ఇస్తానన్నాడా .... ఏం వరం ఇచ్చేడేమిటి' హాస్యంగా అడిగాడు నవ్వుతూ.
"అలా నవ్వకు..... నిజంగానే వరం ఇచ్చాడు తెలుసా!..... గర్వంగా అన్నా.
'ఇంతకీ ఏ వరం అడిగావు ...... ఓ లక్ష కోట్లు అడగక పోయారా , పది తరాలు కూర్చుని తినే వారం గదా - "పోనీ ఓ పెద్ద ఇళ్ళు - వగైరాలడిగానా - ఏది డబ్బు గిబ్బు ఏం కనపడదేం . తరువాత పంపిస్తాడా ......" సంభాషణ హస్యంలోకి దించాడు.
"అబ్బ అగరా, దేముడు డబ్బు అని ఇస్తే కేవలం నాకే ఉపయోగపడ్తుంది. ఏమిచ్చినా నా వరకే అన్న షరతు పెట్టాడు,. మీకేవరికి ఉపయోగపడునప్పుడు అవన్నీ నేనేం చేసుకోను లేని పోనీ తలనొప్పి " అందుకని ...."
'అందుకని మరి ఏం వరం అడిగావు" కుతూహలంగా అడిగాడు.
'సునాయాస మరణం అడిగా - మంచాన పడి ఎవరి చేత చేయిన్చుకోకుండా ఎవర్ని ఇబ్బంది పెట్టకుండా, నేను బాధపడకుండా వచ్చే మరణం కోరుకున్నా...."
'అబ్బ, ఎంత గొప్ప వరం కోరావు . పోనీ ఆ సునాయస మరణం నీ చేతిలో వుంటుందటనా."
"అదేరా, అది సరిగా చెప్పకుండా వెళ్ళిపోయాడు - ' దిగులుగా అన్నా.
"అడిగి అడిగి ఓ స్టుపిడ్ వరం అడిగావు" అన్నాడు "ఏమిటి అలా అంటున్నావు.'
'ఆలోచించు నీకే అర్ధం అవుతుంది" నవ్వుకుంటూ వెళ్ళిపోయాడు.
అంటే ఆ సునాయాస మరణం ఏ క్షణాన వస్తుందోనని ప్రతిరోజూ ప్రతి గంట ప్రతినిమిషం ఎదురుచూస్తూ బతకాలా! "నీవున్నావా ఊడావా అని మేం రోజుకి పదిసార్లు ఫోను చేసి అడుగుతుండాలా' అని వాడి ఉద్దేశం గాబోలు . రేపు 'నా కూతురు పైకి కిందికీ ఎన్ని సార్లు దిగి చూస్తుండాలి' అని విసుక్కుంటుందేమో ! 'ఈవిడ పాలప్యాకేట్టు, పేపరు తీసుకుందా అని పొద్దుటే చూస్తుండాలి కాబోలు అని పక్కింటి వాళ్ళనుకుంటారేమో! ఆ సునాయాస మరణం నేను కోరుకున్నప్పుడు రావాలి అని అడగనందుకు తిట్టుకున్నాను. ముందు తెలిస్తే చక్కగా నా బంధువులని, స్నేహితులని, రచయితలని, అందరిని పిలిచి హోటల్లో ఓ పెద్ద పార్టీ ఇచ్చి 'టా, టా బై...బై... వీడికోలూ' అని అందరి దగ్గిర శలవు తీసుకుని.... మంచి ముహూర్తం చూసుకుని పిల్లలని, మనవాలని అందరిని పిలిచి అందరి సమక్షంలో సునాయాస మరణం పొందితే ఎంత బాగుంటుంది. వరం ఇస్తానని వచ్చి అదేముడు మరింత టెన్షన్ లో పడేశాడు. మరి కాస్త దానాలు, ధర్మాలు చేస్తే మళ్ళీ ఆ దేముడు ప్రత్యక్షం అయితే వరం నాకు కావాల్సినట్టు మర్చమనాలి ఎలాగైనా!
ఏమిటో ఏ క్షణాన వుంటానో , ఊడుతానో - కాస్త టీవీలో స్క్రోలింగ్స్ న్యూస్ పేపర్ చూస్తుండండి (ఓ రచయిత్రిని కదా పేరు వేయరంటారా. మీరంతా ఎందుకైనా మంచిది టా....టా.... బై...బై ....చెప్పేస్తున్నాను ఇప్పుడే.
(నీతి వాక్యం : వరాలు అడిగి లేనిపోని తలనొప్పులు వద్దు. ఏం ఇవ్వాలో ఎప్పుడు ఇవ్వాలో దేముడికే తెలుసు అనుకోండి.)