"ఇదేమిటి?" అంది అపురూపని చూపిస్తూ.
"మన ఫ్రెండు!" అన్నాడు.
దాని తలలో ఏదో గిర్రున తిరిగిన శబ్దం. ఆ సమాచారం రికార్డు అయిందన్న మాట.
"ఈయన పేరేమిటి?" అంది మళ్ళీ అపురూపని చూపిస్తూ.
అప్పుడు గుర్తొచ్చింది అజిత్ కి - ఇంట్లో తనూ, నాన్నగారూ మాత్రం ఉండేవారు. అందుకనే దీని వాడుక భాషలోకి స్త్రీలింగం చేరలేదు ఇంకా.
"తప్పు! ఈమెని, ఈమె అనాలి. ఈయన అనకూడదు."
"ఎందుకూ?" అంది కేటూ, చిత్రంగా చూస్తూ.
"ఆమె స్త్రీ"
"స్త్రీ అంటే?"
"స్త్రీ అంటే ... అమ్మాయన్నమాట... అమ్మాయంటే..." అని మాటలు దొరక్క నిస్పృహగా భుజాలెగరేసి, "ఆల్ రైట్, అపురూప ఒక అమ్మాయి. నువ్వు తెలుసుకోవలసింది అంతే! ఇంకేం అడక్కు. ఈమె అనాలి" అన్నాడు తికమకగా.
అతను ఇబ్బంది పడిపోవడం చూసి పెదిమలు బిగించి నవ్వాపుకుంది అపురూప.
కేటు నాలుక బయటపెట్టి "క్లిక్ క్లిక్ క్లిక్" అని శబ్దం చేసి ,"పోవోయ్ పుల్లాయ్!" అన్నట్లు అజిత్ వైపు చూసింది. తర్వాత గునగున నడుస్తూ అపురూప దగ్గరికెళ్ళింది. దాని కళ్ళలో ఉన్న కెమెరా లెన్సులు ఈ కొత్త ఫ్రెండు రూపాన్ని రికార్డు చేస్తున్నాయి క్షుణ్ణంగా.
"అజిత్ కంటే పొడుగు జుట్టు ఈ అమ్మాయిది. గెడ్డం లేదు. మీసాలు లేవు. చెంపలు గరుగ్గా లేకుండా, అరచేతిలా నున్నగా వున్నాయి. మెడ... మెడ కింద... ఉహు! ఇక్కడ అజిత్ లా లేదు. వేరేగా వుంది."
ఈసారి ఇబ్బంది పడిపోవడం అపురూప వంతయింది. కేటు తన తెలియనితనంతో ఏదన్నా కామెంటు చేసేస్తుందేమోనని కంగారుపడిపోయింది అపురూప.
"ఒకసారి న్యూస్ విందాం" అని కారులోనే ఉన్న టీవీ ఆన్ చేశాడు అజిత్. డాష్ బోర్డు మీద ఉన్న చిన్న స్క్రీను మీద ఒక అనౌన్సరు కనబడుతున్నాడు.
"ఒక ముఖ్య ప్రకటన!" అన్నాడతను. "డాక్టర్ సంజీవ్ చేత సృష్టించబడి. ఆయన్నే హతమార్చి తప్పించుకుపోయిన రాబొట్ నరహరి ఇంకా దొరకలేదు. దానికోసం దేశ దేశాల పోలీసులూ, ఇంటర్ పోల్ సంస్థ, వివిధ దేశాల సైన్యాలు కూడా గాలిస్తున్నాయి.
"ఈ రాబొట్ నరహరిని పట్టుకుని అప్పగించగలిగిన వారికి అంతర్జాతీయ రాబొటిక్స్ సంస్థ బిలియన్ డాలర్ల బహుమతి ప్రకటించింది. కనీసం ఈ రాబొట్ తాలూకు ఆచూకి చెప్పగలిగిన వారికి ఈ బహుమతి మొత్తంలో సగం అందజేయబడుతుంది."
తరువాత స్క్రీను మీద నరహరి ఫొటో! మనిషీ మెషినూ కాకుండా, నిప్పులు చెరుగుతున్నట్లు చూస్తూ, నిగ్రహించుకోలేని ఆగ్రహంతో పరమ కిరాతకంగా, సృష్టిలో ఉన్న చెడుని అంతా తనలోనే ఇముడ్చుకున్నట్లు కనబడుతోంది అది. ఆ టీవీ స్క్రీన్ ని బద్దలు చేసి బయటకు దూకి, అన్నిటినీ ధ్వంసం చెయ్యాలని చూస్తున్నట్లు ఉంది దాని భంగిమ.
స్క్రీన్ మీద కనబడుతున్న రాబొట్ నరహరినీ, తన పక్కనే నిలబడి ఉన్న మరో రాబొట్ కేటూనీ మార్చి మార్చి చూసింది అపురూప.
ఒకటి నరరూప రాక్షసిలా ఉంటే, మరొకటి నవ్వుల పందిరిలా ఉంది.
తండ్రి ఆ రాక్షసిని తయారుచేస్తే కొడుకు ఈ జోకర్ ని తయారుచేసేడా?
మనుషుల స్వభావాలు ఇలాంటి విషయాల్లోనే బయటపడి పోతుంటాయి.
స్క్రీన్ మీద కనబడుతున్న నరహరిని భయంగా చూసింది అపురూప.
తర్వాత మెల్లిగా అజిత్ వైపు తిరిగింది.
"అజిత్"! అంది కంపిస్తున్న స్వరంతో. "ఏం జరగబోతోంది? ఏం చేస్తుంది ఈ నరహరి?"
కొద్దిసేపు ఆలోచించి అన్నాడు అజిత్. "బహుశా నేను చెప్పేది మీకు అతిశయోక్తిగా అనిపించవచ్చునేమో అపురూపా? కానీ నేను ఈ రాబొట్ ని కంట్రోల్ చేయగలనని అనుకుంటున్నాను. అవకాశం దొరికి, అతి త్వరలోనే దీన్ని నాశనం చెయ్యగలనని కూడా అనుకుంటున్నాను. మీరు భయపడకండి! సరేనా?"
ఆ పరిస్థితుల్లో అతని మాటలు నమ్మశక్యంగా లేకపోయినా, నమ్మాలనిపించింది అపురూపకి.
కారణం, అతని మాటల్లో, చేతల్లో కూడా 'గెలిచి తీరతాను' అన్న ఆశా, చివరిక్షణం దాకా ఓటమిని అంగీకరించను అన్న ఆత్మ విశ్వాసం కనబడుతున్నాయి.
ఆశా, ఆత్మ విశ్వాసం - ఈ రెండే మనిషికి ఊపిరి.
అతని మాటలతో కొత్త ఊపిరి వచ్చినట్లయింది అపురూపకి. నరహరిని తలుచుకున్న భయంతో ఎండిపోయిన పెదాలమీద బలహీనమైన చిరునవ్వు మెదిలింది.
"కేటూ! అపురూపకి తోడుగా ఉండు. నేను ఊళ్ళోకి వెళ్ళి బాటరీలు తీసుకువస్తాను" అని కదలబోయాడు అజిత్.
అప్పుడు -
ముందూ వెనకా అరడజను ఫ్లాష్ లైట్లు వెలుగుతూ రాయంచలా ఉన్న కారొకటి వచ్చి అతని ముందు ఆగింది.
అందులోనుంచి ఒక యువతీ, మరో యువకుడూ దిగారు. పూర్తి నగ్నంగా ఉన్నారు ఇద్దరూ. నగ్నంగా ఉన్నందుకు వాళ్లు సంకోచిస్తున్నట్లు గానీ, సిగ్గుపడుతున్నట్లు గానీ లేదు. అది చాలా సహజమైన సంగతి అన్నంత నిబ్బరంగా ఉన్నారు వాళ్ళు.
మెకానికా దేశంలో వస్త్రధారణ అనేది వాతావరణం నుంచి కాపాడుకోవడం కోసమే గానీ, అవయవాలని దాచుకోవడానికి కాదని అపురూపకి తెలుసు. తనెప్పుడూ రాకపోయినా, అమ్మ చాలాసార్లు ఈ దేశానికి వచ్చింది.
అఫ్ కోర్స్? వీళ్ళ సినిమాలు మాత్రం కొన్ని చూసింది తను. అయితే తెరమీద బొమ్మలని చూడటం వేరూ, సజీవమైన మనుషులని నగ్నంగా చూడటం వేరూ!
కార్లో నుంచి దిగిన ఇద్దరూ గులాబిరంగులో ఉన్నారు. వాళ్ళ జుట్టు బంగారపు రంగులో, పట్టుకుచ్చులా మెరుస్తోంది. పలకరింపుగా వాళ్ళు చిరునవ్వు నవ్వగానే, తీరుగా, తెల్లగా వున్న పలువరస తళుక్కుమంది. దివినుంచి భువికి దిగివచ్చిన దేవతల్లాగా చాలా అందంగా వున్నారు వాళ్ళు. కానీ అదుపులేని భోగలాలసత్వం వల్ల అలిసిపోయినట్లు వున్నాయి మొహాలు.
వాళ్ళు దగ్గరికి రాగానే ఏవో దివ్యలోకాల తాలూకు సుగంధాన్ని తలపించే మృదు మధుర పరిమళం సోకింది.
"హాయ్!" అన్నారు వాళ్ళిద్దరూ అజిత్ ని, అపురూపనీ చూసి.
బాగా పొడుగున్న ఆ యువకుడు అపురూపని ప్రీతిగా చూస్తూ, "హనీ! వాతావరణం ఉక్కగా ఉంటే బట్టలేసుకున్నావేమిటి? లేకపోతే నీ అందం చూసి నువ్వే సిగ్గుపడి మాసిన బట్టల్లో దాచేశావా?" అన్నాడు చేతిని చనువుగా ఆమె వక్షం మీద వెయ్యబోతూ.
"డోంట్ డేర్ టచ్ మీ!" అంది అపురూప విదిలించుకుంటూ.
అతను అనుకోని ఈ పరిణామానికి విస్తుబోయి, తన పార్టనర్ వైపు చూశాడు. ఆ అమ్మాయి ముక్కు చిట్లించి నవ్వింది.
అతను కూడా తేరుకుని, ఎకసెక్కెంగా నవ్వి అపురూపని పరీక్షగా చూశాడు. నల్లటి శిరోజాలు, నల్లటి కనుపాపలు, గోధుమరంగు వళ్ళు.
"ఇండియా?" అన్నాడు. 'అడవిలోనుంచి ఇప్పుడే వచ్చావా?' అన్నట్లు. "సారీ! మేమెవరమో పరిచయం చేసుకోనేలేదు కదూ? నేను టార్జాన్ - ఈమె జేన్!" అన్నాడు. అతని మాట ముద్దగా వస్తోంది. మత్తుతో అతని కళ్ళు గాజు కళ్ళలా ఉన్నాయి.
అతను ఏదో డ్రగ్స్ తాలూకు భ్రమలో ఉండి మాట్లాడుతున్నాడని గ్రహించాడు అజిత్.
ఆ 'జేన్' సోలిపోతున్న కనురెప్పలు బలవంతంగా పైకెత్తి - అజిత్ ని చూస్తూ, "హాయ్ హాండ్సమ్!" అంది. ఆమె ఎంత నగ్నంగా ఉందో, ఆమె కళ్ళలోని ఆహ్వానం కూడా అంతే నగ్నంగా కనబడుతోంది. అజిత్ ఛాతీమీద తల ఆనించింది ఆ అమ్మాయి.
జెలసీ అంటే ఏమిటో మొదటిసారిగా తెలిసివచ్చింది అపురూపకి. తన పొడుగాటి గోళ్ళతో ఆ జేన్ ని పట్టుకుని రక్కెయ్యాలనిపించింది.
పూల భారంతో కొమ్మ వంగిపోయినట్లు ఆ అందాల కొమ్మ తన ఎదమీద పడుతున్నా, నిర్వికారంగా వెనక్కి ఒక్క అడుగు వేశాడు అజిత్.
ఆధారం లేకపోవడంతో అసలే మత్తుగా ఉన్న జేన్, సౌందర్యం కుప్ప పోసినట్లు అతని పాదాల దగ్గర ఒరిగి పోయింది.
'ఇతను నా వాడు!' అని తన హక్కు ప్రకటిస్తున్నట్లు, అజిత్ ని ఆనుకుని నిలబడింది అపురూప అప్రయత్నంగానే.
"రోమ్ లో ఉన్నప్పుడు రోమన్లలాగా ఉండాలన్న సామెత మీకు తెలియదూ? మా ముందు ఇలా బట్టలేసుకుని అనాగరికంగా తిరుగుతూ మమ్మల్ని ఇన్సల్టు చెయ్యకండి" అన్నాడు తను టార్జాన్ ని అని భ్రమ పడుతున్న యువకుడు.
అంటూనే మోటుగా అపురూప మీద చేతులేసి, బలవంతంగా ఆమె బట్టలు గుంజెయ్యడానికి ప్రయత్నించాడు.
"మిస్టర్! ప్లీజ్ బిహేవ్ యువర్ సెల్ఫ్" అన్నాడు అజిత్. కాలమేఘం గర్జిస్తున్నట్లు ఉంది అతని కంఠస్వరం. "ఆమె మీద చేతులు తీసెయ్యండి తక్షణం!"
"తియ్యకపోతే ఏం చేస్తావ్?" అన్నాడు టార్జాన్ ఈసడింపుగా.
"వాటిని విరిచి, వాటితోనే నిన్ను చావగొట్టాల్సి వస్తుంది" అన్నాడు అజిత్ రౌద్రంగా.
టార్జాన్ వెనక్కి తగ్గాడు. అతని కళ్ళలో పట్టరాని ద్వేషం కనబడుతోంది.
ఒక ఆడదాని కోసం తను ప్రయత్నిస్తుంటే, ఇంకో మగాడు తనకి అడ్డం పడుతున్నాడు!
అతనిలోని జంతు స్వభావం ప్రకోపించి, అజిత్ ని ఒడుపుగా దెబ్బకొట్టడానికి తగిన అవకాశం కోసం చూస్తూ, అతని చుట్టూ వలయాకారంగా తిరగసాగాడు.