Previous Page Next Page 
నేను పేజి 11


    "అమ్ముకోవటం మినహాయించి సార్థకం చేసుకోవటానికి వేరే మార్గాలు లేవంటావా? అంతే కళాత్మకంగా మలుచుకోటానికి."  


    "ఉన్నాయి కాని చరిత్ర తిరగెయ్యి. నూటికి ఒక శాతమో రెండు శాతమో ఆ అవకాశం వరిస్తూ ఉంటాయి. కాలగర్భంలో ఎన్ని అద్భుత సౌందర్యాలు నిరుపయోగంగా అణచివెయ్యబడి, నిర్దాక్షిణ్యంగా కరిగిపోయాయో తెలుసా?     


    "మంజరి? ఎందుకిలా మాట్లాడుతున్నావు?"


    "జీవితం నేర్పిన పాఠం వల్ల"


    "అంటే?"


    "సతి! ఈ ప్రపంచం ఎంత భయంకరమైనదో, వికృతమైనదో నీకు తెలీదు. అభం శుభం తెలీని వయసులో, నా పన్నెండో ఏట, అంటే ఇంకా రజస్వల కాకముందే ఓ పాడుబడ్డ కొంపలో నేను చెరచబడ్డాను. అసలా సంఘటన కర్థంలేదు. ఏం జరుగుతున్నదో తెలుసుకొనే లోపలే ఇంకా వికసించని నా రొమ్ములు దారుణంగా నలిపి వెయ్యబడ్డాయి. పుష్పించీ పుష్పించని నా యవ్వనం చిరిగి నెత్తురోడుతూ గొల్లున ఏడ్చింది. తర్వాత అయిదారు రోజుల దాకా మంట, వాపు, దుఃఖం. తర్వాత.... ఆలాంటి వాటికి అలవాటు పడిపోయాను.


    "అంటే?"


    "అంతే" అంటూ నవ్వేసింది.


    ఆ నవ్వు కేవలం కొన్ని క్షణాలు తర్వాత ఆమె ముఖం మళ్ళీ గంభీరంగా మారింది. అందులో బోలెడంత కసి తొంగి చూస్తోంది.


    "స్త్రీ సెక్స్ సింబల్ గా చూపబడటం నాగరికత పెరిగిన కొద్దీ మరీ విశృంఖలంగా తయారవటం ఆశ్చర్యంగా లేదూ? ఆఫ్ కోర్స్ సెక్స్ ఫీలింగ్స్ నుంచి మనిషి తప్పించుకోవటం కష్టమే. ఒప్పుకుంటున్నాను. ఆకలి, దాహం నుంచి తప్పించుకోలేనట్లు ఆ ఫీలింగ్స్ కూడా వుండాల్సిన అవసరం కూడా లేదు. అవి తీర్చుకోవాలంటే ఎన్నో మార్గాలున్నాయి. కానీ ఇదేమిటి? ఈ రాక్షసత్వం.... బహుశా ఆ రోజుల్లో రాక్షసులు కూడా ఇంత ఘోరంగా ప్రవర్తించిన దాఖలాలు లేవు. పదేళ్ళ పిల్లల్ని రేప్ చెయ్యటం, ఆరేళ్ళ పిల్లల్ని రేప్ చెయ్యటం, ప్రేమించిన అమ్మాయి లొంగకపోతే కత్తులతో నరకటం, పెట్రోల్ పోసి కాల్చి చంపడం, ఏవేవో కక్షలతో వివస్త్రలను చేసి నడిపించడం.... చిత్రమేమంటే.... ఇవన్నీ చూస్తూ ప్రజలు దున్నపోతుల్లా నిలబడతారు. కాని అడ్డు రావటానికి ప్రయత్నించరు."    


    "ఈ మహిళా సంఘాలూ, గొప్ప గొప్ప కవయిత్రులూ...."


    "పాపం వాళ్ళేం చేస్తారు? మీటింగులు పెట్టి సానుభూతి చూపిస్తారు. ఆవేశం ప్రదర్శిస్తారు. కవయిత్రులు కత్తుల్లాంటి పదాలుపయోగిస్తూ గేయాలు రాస్తారు. వాళ్ళ ఆవేదనలో నిజాయితీ వుంది. కానీ సమాజాన్నెలా మార్చగలరు?" సభ్య సమాజం సిగ్గుపడేలా".... అంటూ శీర్షికలు పెట్టి పత్రికలు వార్తలు ప్రచురించి, సంపాదకీయాలు రాస్తాయి. తర్వాత.... షరా మామూలే. ఏమీ జరగనట్టు ప్రపంచం మామూలుగా నడిచిపోతూ వుంటుంది.


    నాకేం మాట్లాడాలో అర్థం కాక "మరిప్పుడు ఏం చెయ్యాలంటావు?" అన్నాను అయోమయంగా.      


    మంజరి నవ్వింది. ఆమె నాకంటే వయసులో మూడు నాలుగేళ్ళు పెద్దది. మేమిద్దరం క్లాసుమేట్సుము కాము. ఏదో సందర్భంలో పరిచయమై, ఆ పరిచయం క్రమక్రమంగా బలపడ్డది.   


    "జీవితం జీవించటానికి దాన్ని విధికి ఒదిలేసి ప్రేక్షకుల్లాగా కూచోటం కన్నా, సూక్తులు వల్లిస్తూ పనికి మాలిన దుర్బలత్వాన్ని వరించటం కన్నా, అది ప్రకాశించే మార్గాన్ని అదెలాంటిదైనా సరే నిర్దేశించుకోవాలి. చెడి పొమ్మని చెప్పటం లేదు. కాని మంచిగా ఉండి అందమైన జీవితాన్ని నాశనం చేసుకోటం కన్నా, చెడిపోయి అంటే ఇతరుల దృష్టిలో ఉన్నత శిఖరాలకు ఎగబ్రాకటం మిన్న."     


    "చెడిపోవటం అంటే....??"


    "అసలిది ఎవరికీ అర్థంకాని రహస్యం. 'చెడు' అనే దానికి ఓ స్పష్టమైన స్వరూపం, నిర్వచనం ప్రపంచం ఇంతవరకూ ఇవ్వలేదు. క్లియోపాట్రా చెడిపోయింది. ద్రౌపది చెడిపోయింది. జాక్విలిన్ కెనడి చెడిపోయింది. నూర్జహాన్ చెడిపోయింది. కాని వీళ్ళంతా మహావ్యక్తులు. ఇంకా ఇప్పుడూ మన కళ్ళముందు ఇప్పుడా పేర్లన్నీ వద్దులే. సృష్టిచే ధిక్కరించే, కళ్ళు విప్పే అద్భుత సత్యాలని"     


    అంతకన్న లోతుల్లోకి వెళ్ళటం ఇష్టంలేక.... సంభాషణ అర్థాంతరంగా ముగించేశాను.


                                                              *    *    *


    ఉన్నట్లుండి అమ్మ ఒకరోజు బాంబు పేల్చినట్లుగా "నీకు పెళ్ళి చేద్దామనుకుంటున్నాను" అంది.


    తృళ్ళిపడి ఆమె ముఖంలోకి చూశాను. నేననుకున్న వ్యతిరేక భావాలేవీ కనబడలేదు.


    "నా ఆరోగ్యం నాకు తెలుస్తోంది. ఉన్న ఒక సహాయం కూడా, దారి మూసుకుపోయినట్లుగా ఆగిపోయింది."


    "కాని అమ్మా నేనింకా మైనర్ని...."


    "తెలుసు కాని చట్టవిరుద్ధమైన పన్లు.... ఎన్నో మనం చేస్తున్నాం. వాటి కన్నా ఘోరమైన తప్పిదమేం కాదు ఇది....  


    ఆమె ముఖంలోకి చూశాను. అందమంతా కరిగిపోయి, దాని స్థానంలో మృత్యు ఛాయలు ఆక్రమిస్తున్నాయి.


    నాకేడుపు రావడం లేదు. బహుశా ప్రతి అంశాన్నీ సహజ పరిణామంగా తీసుకునే తత్వం నాలో జీర్ణించుకుపోతున్నదేమో తెలీదు.


    "కాని ఈ స్థితిలో.... నన్నెవరు పెళ్ళి చేసుకుంటారమ్మా?"


    "చేసుకునే వాళ్ళున్నారు"


    ప్రశ్నార్థకంగా చూశాను.

 

    "నువ్వు కాలేజీకి వెళుతూంటే ఆ అబ్బాయి తల్లి కారులో పోతూ చూసిందట. ఆవిడకి నువ్వెంతో నచ్చావు. నిన్ను చూసుకోటానికి రేపొస్తున్నారు...."


    "కాని అమ్మా నాకు ముందు చెప్పకుండా...."


    "కొన్ని నిర్ణయాలు ఎదుటివాళ్ళకు చెప్పకుండానే తీసుకోవాల్సి వస్తుంది. గత్యంతరం లేక సతీ! నీకేదో అన్యాయం చేద్దామని ఈ నిర్ణయం తీసుకోలేదు. నేనింకా ఎన్నో రోజులు బ్రతకనని తెలుసు. కానీ కట్నం ఇవ్వనవసరం లేకుండా ఈ అవకాశం వెతుక్కుంటూ వచ్చింది. కాదంటే బలవంతం చెయ్యను. కాని ప్రస్తుతం మనం చిక్కుకుపోయి ఉన్న పరిస్థితినీ, భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకుని ఆలోచించు"          

 Previous Page Next Page