బహుశా అలా మాట్లాడతానని ఊహించి ఉండడు. కొంచెం ఉలిక్కిపడినట్లు కనిపించాడు. నేనలా మాట్లాడటం నాకే చిత్రమనిపించింది. కొన్ని కొన్ని సార్లు మనం మాట్లాడుతున్నప్పుడు కాని లోపల భావాల గురించి మనకు తెలీదు. ఒక్కోసారి.... ఆ భావాలు మననేనా....? నిజాయితీని శంకించేందుకో ఆత్మపరిశీలన, సొంత భావాలు కాకపోయినా ఆశ్చర్యం లేదు.
తననిలా నిలద్రొక్కుకోటానికి ప్రయత్నించటం తెలుస్తోంది.
"అంత గొప్ప అనుభవాన్ని...."
"ఆ క్షణంలో అది గొప్ప అనుభవం. దాన్ని గురించి తర్వాత అద్భుతంగా ఆలోచించుకుంటూ పోతే ఇంకా గొప్ప అనుభవం. కాని నేను రివర్స్ లో ఆలోచించాను. చేదుగా అనిపిస్తోందని నిన్ను హర్ట్ చెయ్యటమిష్టం లేదు కాబట్టి అది ఒట్టి క్యాజువల్ సంఘటనగా తీసుకుంటున్నాను."
అతని ముఖం కోపంతో, అవమానంతో అయి ఉంటుంది.... ఎర్రగా మారుతోంది.
"తోలి ముద్దు...."
"పుస్తకాల్లో, సినిమాల్లో ఉన్న ఇంపార్టెన్స్ దానికి జీవితంలో లేదు."
"అంతేనా?"
నేనేం మాట్లాడలేదు.
"నువ్వు నన్ను ఎక్కడెక్కడో తాకనిచ్చి చాలా పోగొట్టుకున్నానన్న సత్యం కూడా స్ఫురించటంలేదా?"
నవ్వాను.
"ఒక చిన్న యిన్సిడెంట్ వల్ల ఆ క్షణంలో దానిక్కొంత ఇంపార్టెన్స్ ఉంటే ఉండి ఉండవచ్చు.... కాని ఏదో తీవ్రంగా పోగొట్టుకున్నాననీ, కోల్పోయాననీ అనుకోవటం లేదు. అసలా ఫీలింగే రావటం లేదు. బహుశా చాలామంది ఆడపిల్లలు కూడా మీరు తీసుకుంటున్నంత సీరియస్ గా దాన్ని గురించి తీసుకోరు.... ఎంతో సెన్సిటివ్ అయితే తప్ప."
అతని ముఖంలో ఇంకా రంగులు మారుతున్నాయి.
ఇప్పటికే ఆలస్యమైపోయింది. అమ్మ ఎదురు చూస్తూ ఉంటుంది. అదీగాక ఈ దృశ్యంతో చూపరుల కెక్కువసేపు కనులవిందు చెయ్యటం ఇష్టం లేదు.
అతన్ని విడిచి పెట్టి చకచకా నడుస్తూ ఇంటివైపు సాగిపోయాను.
నా నడకలోని స్టయిల్ నాకు తెలుస్తూనే ఉంది.
* * *
మగాడు, ప్రస్తుతానికి వయసుని బట్టి అబ్బాయి అందాం.... మామూలుగా అమ్మాయిలు తమ దార్న తాము జీవిస్తూంటేనే వెంటబడి వేటాడుతుంటారు. కొంత చనువిచ్చి, ఎంతో కొంత భాగోతం జరిగాక ఊరుకుంటారా. ముఖేష్ కొన్నాళ్ళు తెగ వేధించాడు. రకరకాల ప్రయోగాలు చేశాడు. నేనెక్కడా అవకాశమివ్వకపోయేసరికి విసిగి, వేసారి ఊరుకున్నాడు.
6
తర్వాత కొన్నాళ్ళపాటు సంఘటనలు చకచక జరిగిపోయాయి.
ఎందుకనో.... అమ్మ ఆరోగ్యం క్షీణించసాగింది. నవనీతరావు ఆమె నుంచి తనకి కావల్సింది లభించకపోయేసరికి రావటం క్రమంగా తగ్గించేశాడు. వచ్చినప్పుడు కూడా తన ఆర్ధిక ఇబ్బందుల్ని గురించి ఏకరువు పెట్టేవాడు.
అమ్మది భరించే స్వభావం. పోరాడే మనస్తత్వం కలది కాదు.
ఇంతకీ అప్పటికి నాకు పదహారేళ్ళు నిండలేదు. ముఖేష్ తో, అలా జరిగినప్పటినుంచీ చాలా శ్రద్ధతో చదువుకుంటున్నాను. ఫస్ట్ ర్యాంక్ లు సంపాదించాలని, ఏవేవో సాధించాలనీ కలలు కంటున్నాను. నా జీవితాన్ని గొప్ప రూపురేఖలతో అలంకరించాలనీ ఉవ్విళ్ళూరుతున్నాను.
కాని కథ మళ్ళీ మొదటి కొస్తోంది.
ఎవరికో ఒకరికి నేను లొంగిపోతే డబ్బు సంపాదించగలనని తెలుసు. కానీ ఓ క్రమశిక్షణకి కట్టుబడి జీవించాలన్న దృఢమైన నిర్ణయం తీసుకోవటంతో అలాంటి ఆ ఆలోచన కూడా దగ్గరకి రానివ్వటం లేదు.
ఒకరోజు స్నేహితురాలు మంజరి నా దగ్గర కొచ్చింది.
"కాలేజీకి రావట్లేదేం?" అనడిగింది.
"డబ్బుల్లేవు" అన్నాను బలవంతాన నవ్వి.
"ప్రపంచంలోని రకరకాల అందాలన్నీ నీలోనే ఇముడ్చుకుని డబ్బుల్లేవంటావేమిటి?"
"డబ్బుకి అందాన్నమ్ముకోమంటావా?"
"తప్పేమిటి?"
ఉలిక్కిపడ్డాను.
"సతి ! ఇంత మహా సౌందర్యాన్ని సంప్రదాయం పేరిట అప్పనంగా ఏ చవట వెధవకో ధార పొయ్యటం కన్నా మంచి వేలకి అమ్ముకొంటేనే, దాని విలువ పెరుగుతుందేమో ఆలోచించు."
"కొన్నాళ్ళకి సౌందర్యం తరిగిపోతే?"
"ఏం జరుగుతుంది."
"దాని విలువ తగ్గిపోదా? అసలు విలువే లేకుండా పోతే? సంప్రదాయం మనిషికి అన్నివేళలా సంపదా, భోగాలూ ఇవ్వలేకపోవచ్చు కానీ చివరిదాకా ఓ రక్షణ కల్పిస్తుంది."
మంజరి నవ్వింది. ఆ నవ్వులో ఎంతో హుందాతనం, జీవితపు లోతుల్ని వ్యక్తం చేసే విషాదం గోచరించింది.
"రక్షణ సంప్రదాయం చివరి దాకా రక్షణ కన్పిస్తుందంటావా? భ్రమ. అంతేకాకుండా మనిషిని ఊపిరి సలపకుండా చేస్తూ, మానసికంగా నలిపేస్తూ, అసహ్యాల పరిధిని పెంచుతూ అనుక్షణం నరుక్కు తింటూ వుంటుంది నేను స్వేచ్చను సమర్థించటం లేదు. కాని సంప్రదాయం నుంచి మాత్రం ఏ విధమైన రక్షణా లభించదని చెబుతున్నాను. ఎవరికి అందుబాటులో ఉన్న దాన్ని బట్టి వాళ్ళే దాన్ని తెలివిగా, లౌక్యంగా నిర్మించుకోవాలి. మనిషిలో గొప్ప కళ వుంటే దాన్ని ఎలా సార్థకం చేసుకోవాలో, అద్భుతమైన అందమున్నా సార్థకం చేసుకోవాలి."