Previous Page Next Page 
అనాథ మహిళా సదన్ పేజి 11


    అణు సమూహాల కలయికతో ఈ ప్రపంచాన్ని సృష్టిస్తాడు. యుగాంతంలో ప్రళయాన్ని కలిగిస్తాడు.

 

    ప్రళయంలో నాశనమయ్యే నేను, అణుసమూహాలతో ఏర్పడ్డ నేను ఎవరు నువ్వు అని అడిగితే నేనొక అణువు అని చెబుతాను.

 

    అదేనా మౌనికా నువ్వు చెప్పబోయేది? అతను జడుసుకోగలడు - జాగ్రత్త! మరేం చెప్పాలి?

 

    "ఎవరు మీరు?" అతనే మళ్ళీ అడుగుతున్నాడు.

 

    ఏదో ఒకటి చెప్పాలి మౌనికా? తప్పదు. తప్పకపోతే ఏం చెప్పాలి?

 

    అయితే సాంఖ్యులు చెప్పినట్లు అవ్యక్తం పరిణామం చెంది 'మహత్' ఏర్పడింది. అందులోంచి అహంకారం, అహంకారంలోంచి మనస్సు, పంచజ్ఞానేంద్రియాలు, పంచకర్మేంద్రియాలు వచ్చాయి. కాబట్టి నేను మొదటి దశలో 'అవ్యక్తాన్ని'

 

    అయ్యో! ఇదంతా గజిబిజిగా వుంది. వద్దు - అలా చెప్పకు మౌనికా! మరి ఇంకెలా చెప్పడం?

 

    "ఎవరు మీరు?" అతను మళ్ళీ అడిగాడు.

 

    బుద్ధ భగవానుడు ప్రవచించినట్లు చెబితే సరిపోతుంది. 'ఓ యువకుడా! నేను దుఃఖం. జన్మం దుఃఖం, వార్థక్యం దుఃఖం, మరణం దుఃఖం, అప్రియమైన వాటితో సంగమం దుఃఖం. ప్రియమైన వాటి నుండి విడిపోవడం దుఃఖం. అందుకే ఓ యువకుడా నేను ఎవరంటే - దుఃఖాన్ని.'

 

    అతను ఏమీ అనడం లేదు. అంటే నేను చెప్పినదంతా అతనికి వినిపించలేదన్న మాట. అసలు నేను చెప్పనేలేదు. ఇది నిజం.

 

    "అదేమిటండీ! నేను ఎంత అడుగుతున్నా జవాబు చెప్పరేం? మీరు ఎవరు?" ఈసారి అతను కాస్త విసుగ్గానూ, గద్దించినట్టు అడిగాడు.

 

    జవాబు చెప్పలేక కాదు. ఏం జవాబు చెప్పాలా? అని ప్రశ్న ఒకటే. రకరకాల జవాబులు.

 

    కొందరు తను చేస్తున్న ఉద్యోగాన్ని చెబుతారు. కొందరు తమ తల్లిదండ్రులు పేర్లు చెప్పి, తాను వారి కొడుకని అంటారు. మరికొందరు తమకున్న కళని చాటుకుంటారు. ఇంకొందరు 'నేను తెలియదా' అన్నట్లు నవ్వుతారు. నిజానికి ఇతనెవరో పక్కింటి వాడిక్కూడా తెలిసుండదు. కానీ మొత్తం ప్రపంచంలో అట్ లీస్ట్ ఈ ఊర్లో తనని తెలియనివారుండరు అనే భ్రమలో వుంటాడు. చాలామంది తన పేరు చెప్పి వూరుకుండిపోతారు.

 

    ఎవరు మీరు? అని ఎదుటివాళ్ళు అడిగితే ఏం జవాబు చెప్పాలో ఎవరైనా పుస్తకం రాస్తే బావుండు. పుస్తకం వుండనే వుంటుంది. చోరకళ మీద కూడా పుస్తకం వున్నట్లు శూద్రకుని మృచ్ఛకటికంలో వుంది.  

 

    కాబట్టి తన పేరు చెప్పేస్తే సరిపోతుంది.

 

    "మౌనికానంద" జీవితంలో మొదటిసారి తన పేరు చెబుతున్నట్లు ఒక్కో మాటని గుండెలోంచి తీసి పెదవుల మీద పేర్చినట్లు చెప్పింది.

 

    అప్పటికి ఆమె మాట్లాడేసరికి హమ్మయ్య అనుకున్నాడతడు. రూపమే కాదు, పేరు కూడా బావుంది.

 

    "ఏం చేస్తుంటారు మీరు?" రెండో ప్రశ్న వేశాడు.

 

    ఇలా వెంటనే ఇంకో ప్రశ్న కూడా వుంటుందని ఆమెకు తెలుసు. ప్రశ్నలు.... ప్రశ్నలు... జవాబులు... జవాబులు... వాదాలు... ప్రతివాదాలు - వాదప్రతివాద నియమాలను గురించి గౌతమ న్యాయసూత్రాలు అనే గ్రంథం వుందట. ప్రశ్నలు - జవాబులు మీద ఏదైనా పుస్తకం వుందా?

 

    ఏదైనా విషయం మీద - అంటే తత్వచింతనమీదో, పాండిత్య ప్రకర్షమీదో పూర్వకాలంలో రాజులముందు తీవ్రస్థాయిలో వాదోపవాదాలు జరిగేవట. గెలిచినవాడికి కనకాభిషేకం - ఓడినవాడికి తన కంచుఢక్కా పగులుకొట్టి పలాయనం చిత్తగించేవాడట. అయితే ఈ వాద ప్రతివాదాలు అనవసరమంటాడు మనువు. ప్రాచీనులు చెప్పినదానిని తర్కంతోనో, ఇంద్రియ అనుభవంతోనో తిరస్కరించకూడదట. అలా తిరస్కరించినవాడు పాషండుడుతో సమానమట.

 

    ఎన్ని అనుకున్నా ఏం లాభం? ఇప్పుడు అతను అడిగినదానికి సమాధానం చెప్పాలి.

 

    "నేనొక వితంతువుని. చిత్తచాంచల్యం కలగకుండా శిక్షణలో వున్నాను" అన్నది ఆమె.

 

    ఇప్పుడు షాక్ తినడం అతని వంతయింది. ప్రబంధ నాయికలా వున్న ఈ అమ్మాయి వితంతువా?

 

    "విజయదశమి రోజు దీక్ష తీసుకోబోతున్నాను. ఇక అప్పటినుంచి అన్నిటినీ త్యజించాలి. ఈ బంధాలకంతా అతీతంగా వుంటూ ధర్మ ప్రచారం చేయాలి" మళ్ళీ ఆమె చెప్పింది.

 

    "ధర్మ ప్రచారమా? ఇంతకీ నేనెక్కడున్నాను?"

 

    "విమలాబాయి మహిళాసదన్ లో"

 

    అతను దాని గురించి విన్నాడు. వివరాలు పెద్దగా తెలియవు. తనను చంపుతామని కొందరు వెంబడిస్తే అనాథ మహిళా సదన్ లోకి ప్రవేశించి తల దాచుకోవడం విచిత్రంగా అనిపించింది అతనికి.

 

    "ధర్మప్రచారం అంటే?"

 

    "సనాతన ధర్మాలు - చనిపోతున్న వాటికి తిరిగి జీవం పోయడం. స్త్రీలు స్వేచ్ఛా స్వాతంత్ర్యాల కోసం పోట్లాడకూడదు. స్త్రీకి భర్తే దేవుడు. అతని అడుగుజాడల్లోనే నడిచి, అతని వికాసానికి తోడ్పడాలి. ఇలాంటివి చాలా వున్నాయి"

 

    వింటున్న అతనికి మతిపోయింది.

 

    "ఇవి ధర్మాలంటే ఒప్పుకుని ఇక్కడ శిక్షణ పొందుతున్నారా? స్త్రీకి స్వేచ్ఛా స్వాతంత్ర్యాలు వుండకూడదా? ఏం - ఆమె మగవాడిలా మనిషి కాదా? ఆమె ఊపిరి పీల్చడం లేదా? రక్తమాంసాలు లేవా? ఆమెకీ మెదడు వుంది. దానికి జ్ఞానం కావాలి. ఆమెకు శరీరం వుంది. దానికి అనుభవం కావాలి. ఆమెకి మనస్సుంది. దానికీ అనుభూతులు కావాలి. ఈ కొత్త సిద్ధాంతాన్ని మీరు వినలేదా?" అతను ఆవేశంగా అన్నాడు.

 

    "మీలా వాదించేవాళ్ళు చాలామందే వున్నారు. మీలాంటివాళ్ళవల్లే సమాజం చెడిపోయింది."   

 

    అతను ఏదో చెప్పబోయి ఇది సమయం కాదన్నట్లు ఆ టాపిక్ ని అంతటితో వదిలేసి "మహిళాసదన్ లో ఎంతమంది వున్నారు?" అని అడిగాడు.

 

    "ఇరవై నాలుగుమంది. ఇప్పుడు మీరున్నది అందులోనే" ఎంత తప్పు చేశారో చూశారా అన్నట్లు చెప్పింది ఆమె. అయితే అతను దాన్ని పట్టించుకోలేదు. సృష్టిలోని అందమైన పూలన్నిటినీ ఒక దగ్గర పేర్చినట్లుండే ఆ అమ్మాయి వితంతువుగా పర్మినెంట్ గా వుండిపోతుందంటే ఏదో బాధగా వుంది.

 

    "ఇక్కడికెందుకొచ్చారు?" అని అడిగింది.

 

    "నన్ను చంపడానికి కొందరు తరుముకొస్తే మీ ప్రహరీ గోడకున్న కంతలోంచి ఇక్కడికి వచ్చి తల దాచుకున్నాను" అని చెప్పాడు.

 

    "చంపడానికా?" శరీరమంతా కంపిస్తూ వుండగా భయపడుతూ అడిగింది ఆమె.

 

    "ఆఁ ఒక సంఘసేవిక మీద వార్త రాశాను. ఆమెకు కోపం వచ్చింది. నన్ను చంపమని కొందర్ని నా మీదకు ఉసిగొల్పింది"

 

    "అంటే పారిపోయి వచ్చారన్న మాట?"

 

    "అవును. వాళ్ళు యిక్కడికి కూడా వచ్చే అవకాశం వుంది. వాళ్ళ కంటపడకుండా వుండడానికి ఇది సురక్షితమైన ప్రదేశంగా నాకు అనిపిస్తోంది. ఈ ఒక్కరాత్రికి మీ వరండాలో పడుకోనిస్తారా?" అతను ప్రాధేయపడుతున్న ధోరణిలో అడిగాడు.

 Previous Page Next Page