సురేష్ తీసుకుని చదివాడు.
"నిరుద్యోగులకు అద్భుత అవకాశం! నేడే మా బ్యాంక్ శాఖలను సంప్రదించండి."
"నేడే అన్నారు కదా! ఇవాళ చాన్స్ వుండదేమో....." నవ్వుతూ అన్నాడు.
"మీకు తప్పకుండా ఇస్తారని అన్పిస్తుంది నాకు."
"నాకివ్వరు"
"ఎందుకని?"
"నా జాతకంలో వుంధలా" లోపలకు నడిచి పేపర్లన్నీ చూశాడు. అన్నిట్లోనూ అవే ప్రకటనలు, జనరల్ మేనేజర్ కావలెను.
5000 ప్లస్ సేర్క్స్ , బంగళా , కారు రెండు డిగ్రీలు, ఓ డిప్లొమా ఏడేళ్ళ ఎక్స్ పీరియన్సూ.
డిప్యుటీ జనరల్ మేనేజర్! 3000 ప్లస్ సేర్క్స్, బంగాళా , కారు డిటో!
వర్క్ షాప్ మేనేజర్! ఇంతకూ ముందు కూడా ఇలాంటి ఉద్యోగమే చేసి వుండాలి.
పర్సనల్ ఆఫీసర్!
డిటో....
రెండు గంటల తర్వాత తిరిగి బయటికొచ్చాడతను.
ఎండ మాడ్చేస్తోంది.
బస్ స్టాప్ లో ఓ అమ్మాయి అతని వంక చూసింది.
"హలో......బావున్నారా?" అడిగాడు సురేష్.
ఆమె అతని వైపు కోపంగా చూసింది.
"మనం అదివరకో సారి కలుసుకున్నాం. మర్చిపోయారా?"
"ఎప్పుడు?"
"ఇరవై ఏళ్ళ క్రితం"
ఆమె అనుమానంగా చూసింది.
"అప్పర్ కేజీ ఇద్దరం కలసి చదువుకున్నాం.'
ఆమె నమ్మలేకపోయింది.
"రోజూ మీకు చాక్ లెట్స్ కొనిచ్చేవాడిని......."
బస్ వచ్చింది. ఆమె నెంబరు కూడా చూడకుండా వెళ్ళి ఎక్కేసింది.
సురేష్ ఇంటికి చేరుకున్నాడు. వంటింట్లో తినడానికి ఏమీ కనిపించలేదు. మంచినీళ్ళు తాగి పడుకున్నాడు.
ఇంకా రెండు గంటల టైముంది తులసి రావడానికి.
ఇవాళ ప్రోగాం వుంది . పిక్చర్, డిన్నర్.
రాత్రికైనా కడుపునిండా తినేయాలి. నిద్ర పట్టేసిందతనికి. తులసి తన నుదుటి మీద ముద్దు పెట్టుకుంటుంటే తిరిగి మెలకువ వచ్చింది.
"హలో డియర్! ఎంతసేపయింది వచ్చి?"
"రెండు గంటలు"
సురేష్ అదిరిపడి లేచి కూర్చున్నాడు.
"మరి నన్ను లేపలేదెం?"
"ఎందుకు లేపడం?"
"మనకి ప్రోగ్రాం వుందిగా యివాళ?"
తులసి అతని పక్కనే కూర్చుంది, మోకాళ్ళ మీద తల పెట్టుకుని ,
"కాన్సిలయింది"
"ఎందుకని?"
"జీతంలో సగం అతను తీసేసుకున్నాడు."
"ఎవరు?"
"నీ పాత రూమ్ ఓనరే....."
"బాస్టర్డ్"
సురేష్ ఆమె పక్కకు తిరిగి, ఆమెను దగ్గరకు లాక్కుని , ఆమె తల మీద ముద్దు పెట్టుకున్నాడు.
"సారీ డియర్"
"బెటర్ లక్ నెక్ష్ట్ టైమ్" నవ్వుతూ అంది.
గంగాభవాని లోపలికొచ్చేసరికి ఇద్దరూ కౌగిలి నుంచి విడిపడ్డారు.
గంగాభవాని సిగ్గుపడింది.
"మళ్ళీ వస్తాన్లెండి" అంది వెనక్కి తిరుగుతూ.
"మీరెప్పుడొచ్చినా ఇంతేలెండి" అన్నాడు సురేష్.
"మీతో మాట్లాదానికే వచ్చాను."
"ఇప్పుడా! ఇప్పుడు తులసి వుందిగా?"
"ఉంటేనేం?"
"మూడో మనిషి ఎదురుగ్గా......ఆఫ్ కోర్స్ ......నాకేం అభ్యంతరం లేదు."
గంగాభవానికి కోపంగానూ, వుంది, ఇంకా అతనితో మాట్లాడాలనీ వుంది.
"మీరు చెప్పేవన్నీ అబద్దాలు కదూ?"
"ఏమిటి అబద్దాలు? రోడ్స్ అండ్ బిల్డింగ్స్ డిపార్ట్ మెంట్ సంగతా? ఆ విషయం ఇంకా మర్చిపోలేదా మీరు? రేపు టాబ్ లేట్ తెచ్చిస్తాను . మీరు వేసుకోండి.
"ఏ టాబ్ లేట్?"
"అదే మనకు అవసరం లేని విషయాలు మర్చిపోయేందుకు టాబ్ లెట్స్......"
"నేను చెప్పేది ఆ విషయం కాదు."
"మరి?"
"మీరు ఇంజనీరుగా ఇరాక్ వెళుతున్నారన్న విషయం....."
"ఇరాక్ వెళ్ళటం లేదని ఎవరన్నారు? ఎప్పటికైనా వెళ్తాను."
"ఒక వారంలో వెళతానన్నారు యిందాక"
"కొద్ది సంవత్సరాలు అటూ ఇటూ వుంటుంది కదా......! ఆయినా ఎవరు చెప్పారు అది అబద్దమని?"
"తులసి గారు"
తులసి నవ్వేసింది.
"అయితే అది కూడా మర్చిపోండి! రెండింటికి టాబ్ లెట్స్ తెచ్చిస్తాను." గంగాభవాని వెళ్ళిపోయింది.
సురేష్ బయటికొచ్చి వీధి చివర్లో వున్న గిప్ట్ షాపులో కెళ్ళాడు.
"గుడ్ మాణింగ్ సర్! వెల్ కమ్ ........' అంది అందమయిన ఆంగ్లో ఇండియన్ అమ్మాయి.
"గుడ్ మాణింగ్ 32-26-28..."
"నో.....యూ ఆర్ మిస్టేకెన్ 31-25-29..."
సురేష్ కొంచెం ఖంగుతిన్నాడు.
'అయితే నేను ఇంకొంచెం ట్రైనింగ్ తీసుకోవాలనుకుంటాను."
"కాదు - టైలరింగ్...."
ఓహ్! తను వెళ్ళేదారి ఈ పిల్ల దగ్గర పనిచేయదు. దెబ్బ కొట్టేస్తుంది.
"గిప్టుగా ఇవ్వదగ్గ వస్తువులేమున్నాయ్ మీ దగ్గర?"
'అన్నీ అవే."
'ఓర్నాయనో!" అనుకున్నాడు.
అల్మారాలో అందంగా పేర్చిన వస్తువులు చూడసాగాడు.
"ఈ అరలోని ఆర్టికల్స్ అన్నీ ఒకటే ధరా?"
"మీక్కనిపించే వాళ్ళ మెజర్ మెంట్స్ అన్నీ ఒక్కటిగా వున్నాయా?"
"కొంచెం మంచినీళ్ళు ఇస్తారా?"
"ఏదయినా కొంటేనే. స్ట్రిక్ట్ ఆర్డర్స్ ఇచ్చారు మా బాస్. రియల్ కస్టమర్లకే ఫెసిలిటీస్."
అందమైన ఇత్తడి శిల్పం తీశాడు సురేష్. బుద్దుడి తల, ఎంతో అందమైన ఫినిషింగ్. తులసికి ఎంతో ఇష్టం గౌతమ బుద్దుడంటే.
"ఏంతిది?"
"నాలుగొందల అరవై."
"నేనడిగేది మీతో కలిసి కాదు."
ఆమె మాట్లాడలేక నవ్వేసింది. "యూ ఆర్ ఘ్రడ్."
అమ్మయ్య ఇప్పటికి కొట్టాడు దెబ్బ. మరోసారి ఫోజు కొట్టదిక.
"అల్ రైట్! ఇన్ స్టాల్ మెంట్స్ పద్దతిలో ఇస్తారా?"
"నో ప్లీజ్ ! కాష్ డౌన్."
"మెహందీ బజార్ సిస్టం అన్నమాట మీది?"
'అంటే?"
"అదే క్యాష్ డౌన్ ఫస్ట్. పోనీ మా గర్ల్ ఫ్రెండ్ కి చూపించి మళ్ళీ తెచ్చివ్వచ్చా?"
"మీ గాళ్ ఫ్రెండ్ నే ఇక్కడికి తీసుకురండి."
"వాళ్ళాయన వప్పుకోడు గదా!"
"మైగాడ్!" తుళ్ళి తుళ్ళి నవ్వుతోంది.
"ఇప్పుడు మంచినీళ్ళు ఇస్తారా?"
"మీరింకా ఏమీ కొనలేదుగా?"
"తప్పు మీదే! కాష్ డౌన్ అని బెదిరించి కొననీయటం లేదు."
ఆమె లోపలి కెళ్ళి మంచినీళ్ళు తెచ్చి ఇచ్చింది. గడగడ తాగాడు.
"మంచినీళ్ళడిగితే బ్రాందీ ఇచ్చారేమిటి?"
ఆమె ఆశ్చర్యంగా చూసింది గ్లాస్ వేపు.
"ఓ! మీ చేతులతో పట్టుకునేసరికి నీళ్ళకే మత్తోచ్చినట్లుంది."
మళ్ళీ తుళ్ళి తుళ్ళి నవ్వు."
"అయితే ఈ బొమ్మ రిజర్వ్ చేసి వుంచండి! జీతం రాగానే వచ్చి తీసుకెళ్తాను."
"జీతం ఎప్పుడొస్తుంది?"
'ఉద్యోగం రాగానే."
"యూ ఆర్ క్రేజీ."
'బికాజ్ ఆఫ్ యూ-"
సురేష్ బయటకు నడిచాడు . "థాంక్యు యూ!"
"వెల్ కమ్ ఎగైన్."
సురేష్ ఇంటికి చేరుకున్నాడు. తులసి స్టవ్ మీద ఏదో వండుతోంది. ఆమె మీదకు వంగి కౌగలించుకుని మెడ మీద ముద్దు పెట్టుకున్నాడు.