Previous Page Next Page 
అశ్వభారతం పేజి 10


    ఓరోజు శుక్రాచార్య కళ్ళజోడు గ్లాసెస్ మార్పించుకొనేందుకు అబిడ్స్ లోని దక్కన్ ఆప్టికల్స్ కి వచ్చాడు. అనుకోకుండా అదే టైమ్ కి కరీం ఆ షాప్ కి వచ్చాడు.

    కరీంనే పరిశీలిస్తూ ఉండిపోయాడు నిశ్శబ్దంగా....అతనేదో కళ్ళజోడుకు ఆర్డర్ ఇచ్చేందుకు వచ్చినట్లుగా అతని సంభాషణను బట్టి తెలిసింది.

    ఆ తరువాత షాప్ అతన్ని విచారిస్తే కరీం ఆర్డర్ ఇచ్చిన గ్లాసెస్ ప్రస్తుతానికి లేవని మనీ పే చేసి వెల్తే మరుసటిరోజు ఒంటిగంటకు ఇస్తామని చెప్పామని__అతను రేపు ఒంటిగంటకు వస్తాడని చెప్పాడు.

    ఎన్నో సంవత్సరాలుగా ఎదురు చూస్తున్న అవకాశం ఇన్నాళ్ళకి వచ్చింది. దీన్నే ఉపయోగించుకోవాలి_

    అందుకే విశ్వదత్తకు ఫోన్ చేసి కరీం ప్రోగ్రామ్ తెలియజేసాడు. ఇవేమీ శశాంకకు తెలియవనే శుక్రాచార్య నమ్మకం.

    టైం 12.59 అయింది.

    మరో నిమిషమే వుంది.

    పగ, ప్రతీకార జ్వాలలతో నలభై ఏళ్ళుగా మరుగుతున్న రక్తం_ అవి తీరకుండానే చల్లబడతానేమోనని దిగులుపడుతున్న సమయం_చల్లారిపోతున్న రక్తం_ చావుకు దగ్గరవుతున్న ప్రాణం__

    కరక్టుగా 1.09 అయింది.

    శుక్రాచార్య కళ్ళు ఒక్కసారి మెరిసాయి. కరీం జీఫ్ లోంచి దిగాడు అటూ, ఇటూ చూసుకుంటూ షాప్ లోకి వచ్చాడు. కరీం రాకుండా మరొకతన్ని పంపిస్తే ఎలా అని మధన పడుతున్న శుక్రాచార్యకు కరీం రాక ఆనందంగా వుంది.

    అంతలోనే మరో వంక. విశ్వదత్త వస్తాడా....? కరీంని మర్డర్ చేసేందుకు మరొకతన్ని పంపిస్తాడా....?

    కరీం కళ్ళజోడు తీసుకున్నాడు.

    శుక్రాచార్య రోడ్ వేపు చూశాడు. విశ్వదత్త జాడలేదు. కరీం బయటకు వెళ్ళేందుకు ఆఖరియత్నంలో వున్నాడు. మధ్యమధ్యలో భయం భయంగా అటూ ఇటూ చూస్తున్నాడు. విశ్వదత్త కౄరత్వం తెలిసినవాడు గనుకే అంత భయం.

    కరీం షాప్ లోంచి బయటకు వచ్చి ప్లాట్ ఫాంమీద నిలుచున్నాడు. జీప్ కోసం ఎదురు చూస్తూ....

    శుక్రాచార్య అసహనంగా వచ్చి కరీం పక్కే నిల్చున్నాడు.

    కరీంని దింపి వెళ్ళిన జీప్ అన్నపూర్ణా హోటల్ ముందున్న సందులోంచి, స్టేట్ ఫైనాన్షియల్ కార్పోరేషన్ ముందు నుంచి మరలా అబిడ్స్ రోడ్ లోకి వచ్చి కరెక్టుగా దక్కన్ ఆప్టికల్స్ షాపుముందు స్లో అవుతుంది. అప్పటికి రడీగా వున్న కరీం ఆ జీప్ ఎక్కేయగానే అది ఓల్డ్ సిటీ వేపు దూసుకుపోవాలి. ఇది కరీం ప్లాన్....

    కరీం జీప్ అబిడ్స్ రోడ్స్ లోకి తిరిగింది. కరీం అసహనంగా ఎదురు చూస్తున్నాడు తన జీప్ కోసం....

    శుక్రాచార్య విశ్వదత్తకోసం ఎదురు చూస్తున్నాడు, అంతలో వచ్చాయి రెండు బుల్లెట్ మోటార్ సైకిల్స్ రోడ్డుకు అడ్డంగా_కరీం జీప్ కి ఎదురుగా జిప్ డ్రైవర్ కి ఏం చేయాలో తోచక బ్రేక్ వేసాడు.

    క్షణం ఆలశ్యమైన కరీం సహించడు. తనను చంపేస్తాడు.... ఎలా? కావాలనే ఆ మోటర్ సైకిల్స్ రోడ్డుకు అడ్డం వచ్చినట్లుగా తోచింది. వాటిమీద నలుగురు ధృడకాయులు....మొఖాలలో ఏ భావమూ కనిపించకుండా.

    అబిడ్స్ లోకి అప్పుడు ఎంటర్ అయింది విశ్వదత్త జీప్. ఊహించని వేగంతో వచ్చిన ఆ జీప్ దక్కన్ ఆప్టికల్స్ షాప్ వేపు దూసుకు రావటాన్ని అల్లంత దూరానే పసిగట్టిన కరీం ప్రాణభయంతో ఎదురుగా వున్న వేలాండ్ వేపు పరిగెత్తాడు....

    అక్కడే కరీం తప్పటడుగు వేసాడు. విశ్వదత్త జీప్ ఆ వేపు నుంచి మెరుపువేగంతో దూసుకువచ్చింది....

    శుక్రాచార్యకు మహాదానందంగా వుంది.

    వచ్చింది....అనుకున్న ముహూర్తం ఏ పొరపాటు లేకుండా.... ఎక్కడా ఆక్కుండా....

    కొన్ని వందలమంది అక్కడ ఉండగానే, పోలీసులు అక్కడుండగానే....పట్టపగలు పట్టా కత్తితో ఎగిరిదూకాడు జీప్ లోంచి విశ్వదత్త.

    కాలరుద్రుడిలా వున్న విశ్వదత్తను చూడగానే పై ప్రాణాలు పైనే పోయినట్టుయి స్థాణువై పోయాడు కరీం.

    ఆవేశంతో రెండే రెండు అంగల్లో కరీంని సమీపించి విశ్వదత్త ఆ పటకా కత్తితో కరీం డొక్కలో పొడవటం రక్తం చివ్వున ఎగియటం ఆర్తనాదం చేస్తూ కరీం నేలకొరగటం విశ్వదత్త వడిగా జీప్ ఎక్కి వెళ్ళిపోవటం అంతా క్షణాల్లో జరిగిపోయింది.

    అక్కడున్నవారికి జరిగిందేమిటో అర్ధమయ్యేసరికి విశ్వదత్త జీప్ మాయమైపోయింది.

    అప్పుడు వచ్చింది చలనం. అక్కడున్నవారిలో....దారుణం.... కలికాలం. పబ్లిగ్గా....నలుగురు తిరుగుతుండగా నడిబజారులో.... పట్టపగలు.... ఇంతటి దారుణమా!

    స్తబ్దుగా వున్న వాతావరణం చైతన్యం పుంజుకుంది. జనాలు హడావుడిగా షాపింగ్ మానేసి పరిగెత్తటం ప్రారంభించారు.

    అప్పటివరకు కరీం జీప్ ని ఆపిన మోటార్ సైకిల్స్ క్షణాల్లో అదృశ్యమైపోయాయి.

    హత్య జరిగిన చోటే వున్న పోలీసు విజిల్ వేయటం.... కొందరు హడావుడిగా కరీం చుట్టూ చేరటం నిమిషాల్లో జరిగిపోయింది.

    అప్పటివరకూ మౌనంగా చూస్తూన్న శుక్రాచార్య పక్కతనికి వినబడేంత మెల్లగా "శశాంక తేజదత్త కొడుకు ఎంతపని చేసాడు. అన్నాడు....

    క్షణాల్లో మర్డర్ చేసిన వ్యక్తి విశ్వదత్త అని తెల్సిపోయింది అక్కడున్న అందరికీ.

    మౌనంగా నడుచుకుంటూ ఓ సందులోకి దూరి అదృశ్యమైపోయాడు శుక్రాచార్య.

    చర్యకు విశ్వదత్త అంకురార్పణ....

    ప్రతిచర్య పోలీసులు చేపడతారు....

    చూడాలి. ఈ డ్రామా ఏ మలుపు తిరుగుతుందో ....

    ఆ ప్రాంతానికి ఈ మధ్యనే వచ్చిన కొత్త సర్కిల్ ఇన్స్ పెక్టర్ కేసు పరిశోధన తన చేతుల్లోకి తీసుకుంటాడు.

    ఒకవేళ అతన్ని కొనో భయపెట్టో కేసు మాఫీ చేయించాలని చూసినా అంత పబ్లిక్ లో జరగటం, ఎంతోమంది చూట్టాన్ని ఎవరూ మాఫీ చేయలేరు. రేపీపాటికి పేపర్స్ ఈ మర్డర్ ని ఎత్తిచూపిస్తూ ప్రభుత్వ అసమర్ధత అంటూ విమర్శిస్తాయి.

    ప్రతిపక్షాలు ఎలాగూ వుండనే వున్నాయి. ఇలా ఆలోచిస్తూనే శుక్రాచార్య మినార్ ఎక్స్ ప్రెస్ కాచ్ చేసేందుకు స్టేషన్ వేపు వడిగా సాగిపోయాడు.


                               *    *    *


    యాభై ఏళ్ళు పై బడ్డ శశాంక ఆరడుగుల ఎత్తుతో ధృడంగా ఉంటాడు. భారతదేశ ధనవంతులలో ప్రముఖుడిగా గుర్తించబడుతున్న శశాంకకు మరేం పని వుండదు. డబ్బు డబ్బును సంపాదిస్తుంది గనుక వినోదమే అతని జీవితాశయం.

    ప్రపంచ వ్యాప్తంగా తిరిగైనా మంచి పందెపు గుర్రాల్ని కొని ఏ సీజన్ లో ఎక్కడ రేసెస్ జరిగితే అక్కడ తన గుర్రాల్ని పందెంలో ప్రవేశపెడతాడు....అందువలన లక్షల రూపాయలు నష్టం వచ్చినా__వచ్చే కప్పుల కోసం ట్రోపీల కోసం ఆరాటపడుతుంటాడు.

    ఒకప్పుడు మొహమూద్, రాజ్ కపూర్, దేవానంద్, సునీల్ దత్ లాంటి ప్రముఖ హిందీనటులు రేస్ హార్సెస్ ని మెయిన్ టెయిన్ చేసేవారు.

    ధనవంతుల రేస్ హార్సెస్ ప్రెస్టేజ్ సింబల్. కోట్లకు కోట్లు సొమ్ముకు పడగలెత్తిన శశాంక తేజదత్తకు ఏనాడు దేనిపట్ల భయం కలగలేదు. తొలిసారి కొడుకు జైల్లో పడటం__బెయిల్ లభించకపోవటం ఓ పక్క అవమానంగా వుంది. మరోపక్క కొడుక్కి ఏమవుతోందోనని భయంగానూ వుంది.

    ప్రస్తుతం తన ప్యాలెస్ లో పిచ్చివాడిలా పచార్లు చేస్తున్నాడు.

    ఎదురుగా నలుగురు సీనియర్ లాయర్స్, ఇద్దరు పోలీస్ ఇన్ స్పెక్టర్స్, ఒక యస్.పి. ఒక పబ్లిక్ ప్రాసిక్యూటర్ కూర్చుని వున్నారు.

    ఓ పక్కన సుదర్శన్ నిలబడి వున్నాడు. ఎన్నివిధాలుగా ఆలోచించినా విశ్వదత్త బయటపడ్డం కష్టమని అక్కడున్న శశాంక శ్రేయోభిలాషుల అభిప్రాయం.

    కాలుగాలిన పిల్లిలా తిరుగుతున్న శశాంకకు పిచ్చెక్కినట్లుగా వుంది.

    "అంతేనంటారా....?" అడిగాడు శశాంక తేజదత్త.

    "మీ సొమ్ముతో బతుకుతున్న వాళ్ళం....మీ సొమ్ముతో మేడలు కట్టుకున్న వాళ్ళం. మీరు కళ్ళెర్రజేస్తే మాడిమసైపోయేవాళ్ళం. ఆపైన అవకాశం వుంటే ఇలా చేతులు ముడుచుకుని కూర్చుంటామా....?" యస్.పి. అన్నాడు.

    "పబ్లిగ్గా....అంతమంది సాక్షుల మధ్యనుంచి ఎలా తప్పించటం ఎన్నో క్లిష్టతరమైన కేసుల్ని ఉప్ మని ఊదినవాడ్ని....నాకే ఏం తోచటం లేదు. ఒకరు, ఇద్దరు సాక్షులయితే అంత భయపడక్కర్లేదు. వాళ్ళిద్దర్ని కొనటమో__ చంపేయటమో చేసే వాళ్ళం...." కాని" ఓ లాయర్ అన్నాడు.

    "బాబుని ఈ దేశం నుంచి రహస్యంగా పంపేస్తే....?"

    "యూ షటప్....చాతకానివాడిలా ఆ పని చేయలా? ఆలోచించండి....జయంతిచౌదరి అయితే ఈ సందర్భంలో ఏం చేసేవాడు.... చార్లెస్ శోభారాజ్ అయితే ఏం చేసేవాడు.... ప్రపంచంలో ఇండియన్ కానిస్ట్యూషన్ అంత తేలిగ్గా మరేది వుండదు. ఇక్కడ తప్పించుకోలేకపోతే మరెక్కడా ఆ పని సాధ్యంకాదు...." ఘర్జించినట్లుగా వున్నాయి శశాంక మాటలు.

    "అసలు శశాంకగారి కొడుకని అక్కడున్న వారికెలా తెలిసింది" ఓ ఇన్ స్పెక్టర్ అసహనంగా అడిగాడు.

    అప్పుడు ఉలిక్కిపడ్డారు అక్కడున్న వాళ్ళంతా.

    విశ్వదత్త ఎప్పుడూ హైసర్కిల్స్ లో తిరుగుతాడు....ఎప్పుడు ఎక్కడికి వెళ్ళినా క్లోజ్ డ్ ఎయిర్ కండిషన్డ్ మెర్సిడన్ కారులో వెళ్తాడు. కేవలం పరోక్షంగానే శశాంక కొడుకని తెలుసు. ప్రత్యక్షంగా? చూసినవాళ్ళు చాలా తక్కువమంది.... మరి ఎలా....ఎలా....తెల్సింది.

    అప్పుడొచ్చింది అనుమానం శశాంక తేజదత్తకు తన శత్రువులెవరైనా....? అసలు విశ్వదత్తకు కరీం ఆ సమయంలో అక్కడికొస్తాడని ఎవరు మెసేజ్ ఇచ్చారు....? 

 Previous Page Next Page