Next Page 
శ్వేతనాగు - 2 పేజి 1

                                                                శ్వేతనాగు - 2
                                                                                                        ------ లల్లాదేవి
                                                              (1982 కళాపీఠం అవార్డు గ్రహీత)
               
    శ్వేతఛత్రాన్ని ధరించిన చక్రవర్తుల్లా ఉన్నాయి శ్రీగిరి శిఖరాలు. కొండకొమ్ముల మీద దూదిపింజల్లాంటి మబ్బుతునకలు తారాడుతున్నాయి.  ఎటు చూసినా ప్రశాంత ప్రకృతి తన విశ్వరూపాన్ని ఆవిష్కరిస్తోంది.
    ఎత్తయిన గిరి శిఖరాల మధ్య దిగిపోయిన లోయల్లో నీలివర్ణం జలధారలు పరవళ్ళు చేస్తున్నాయి. సాగర సంగమానికి విరహిణిలా పరుగులు తీస్తోంది కృష్ణాతరంగిణి.
    కొండగాలి విసురుకు ఎత్తయిన అలలు వచ్చి ఒడ్డున ఉన్న ఎత్తయిన శిలావేదికల్ని తాకి విరిగి పడుతున్నాయి. వెదురు పొదల్లోకి దూరిన కొండగాలులు ఈలపాటలు పాడుతున్నాయి.
    ఎత్తుగా లేచిన కృష్ణా తరంగాలు విరిగిపడి పల్లవాలవంటి ఆ పసి పాదాలను తడుపుతున్నాయి. ఈ ప్రపంచంలోకి వచ్చి ఒక ఏడాది మాత్రమే నిండిన ఆ పసివాడికి నీరు వచ్చి పాదాలను తాకటం పరమ అద్భుతమైన దృశ్యంగా కనిపిస్తోంది.
    అతడు కిలకిలా నవ్వుతున్నాడు.
    "కృష్ణా! ఏమిటా చిలిపి పనులు? ఇలా వచ్చెయ్యి అంటూ చేతులు చాచింది ఆ పసివానికి జన్మనిచ్చిన తల్లి ఆమె మాటలు అర్ధమయినాయో లేదో కాని కృష్ణుడు కిలకిలమని నవ్వాడు ఒక్క అడుగు దూరంలో మాత్రమే ఉన్న మాతృమూర్తిని అందుకోవాలని వచ్చీ రాని అడుగులు వేయటం ప్రారంభించాడు.
    ఈ దృశ్యాన్ని అల్లంత దూరంనించి చూస్తున్న తండ్రి తన్మయుడయినాడు. అద్బుతమైన ఆ దృశ్యాన్ని తన "పుల్ వ్యుఫెక్ష్స్" కెమెరాలో బంధించాడు. పొద్దు పశ్చిమ శిఖరాల్లోకి దిగుతుంది. ఆ తల్లి రెండు సంవత్సరాలకు పూర్వం ప్రొఫెసర్ కృష్ణస్వామి ప్రోత్సాహంతో సాహసోపేతమైన పరిశోధనలు చేసిన వాణి.
    రెండు సంవత్సరాలకు పూర్వం ఇల్లాలు అయింది. తల్లి అయిన తరవాత ఓ ఋతుచక్రం తిరిగి వచ్చింది. తల్లిగా, ఇల్లాలుగా ఇప్పుడామె ఆడబతుకులోని అర్దాలనన్నింటినీ అందుకుంది.
    ఆమెను ప్రేమించి, ఆమె అభిరుచులను అభిమానించిన స్వప్నకుమార్ ఆమెను తన సమార్ధంగా స్వీకరించేందుకు ఎంతోకాలం ఓరిమితో ఎదురు చూచాడు. తాను కన్న కలలన్నింటినీ పుష్కలంగా పండించుకున్నాడు.
    అంది వచ్చిన అవకాశాలన్నీ అర్ధవంతాలయినాయి. ఆ అర్ధాలకు వారు కల్పించుకున్న ఆకృతి ఈ పసివాడు వారి మనోగతాలు ఇప్పుడా పసివాని చుట్టూ అల్లుకున్నాయి వారి అంతరిక లోకంలో సంయుక్తంగా నిర్మించుకున్న ఒకే ఒక్క రూపం ఆ పసివాడు. అతడు నవ్వినప్పుడు ఆ ఇంటిలో పున్నమి జాబిల్లి ప్రత్యక్షమయినట్లు ఉంటుంది.
    వాణి లోకమే మారిపోయింది. తల్లిగా, ఇల్లాలుగా తన కర్తవ్యాలను నిర్వహించటం ప్రారంభించాక జీవితంలో క్షణం తీరిక అంటూ లేకుండా పోయింది. ఆమె తన ఇంటిలో తన మనసులో ఒక అద్భుతమైన లోకాన్ని సృష్టించుకుంది.
    మిగిలిన ప్రపంచం గురించి రవంత అయినా పట్టించుకోని స్వార్ధపరురాలయిన మాతృమూర్తిగా మారిపోయింది. సాహసోపేతమయిన పరిశోధనలతో విజ్ఞాన ప్రపంచపు వెలుగు కిరణంలా నిలిచిపోవాలని ఆశించిన ఆ వాణికి  ఇది పునర్జన్మ.
    స్వప్నకుమార్ లో ఆనాటికి, ఈ నాటికీ విశేషమయిన మార్పులేమీ లేవు.
    ఆనాడు ప్రియుడు, ఈనాడు ప్రియతముడైన భర్త. అంతే అతనిలో వచ్చిన మార్పు.
    వేయలేక అడుగులు వేస్తున్న బాబుని అందుకుని అక్కున చేర్చుకుని ముచ్చట పడిపోయింది వాణి.
    "చూశారా వీడి తుంటరి పనులు" అంది.
    "అవునోయ్! ఆ మాత్రం తుంటరి పనులు చేయకపోతే ఈ తండ్రికి వారసుడు ఎలా అవుతాడు" అన్నాడు స్వప్నకుమార్ గర్వంగా చూస్తూ.
    వాణి పెదవుల మాటున నవ్వుకుంది కృష్ణను తనివి తీరా గుండెను హత్తుకుంది.
    "డియర్ స్వప్నా! ఈ అల్లరికృష్ణుడు నీ వారసుడే! అందుకే నీటి తుంపరలు పాదాలను తాకగానే రవంత భయపడి అమ్మకోసం పరుగు తీశాడు." అందామె నవ్వుతూనే.
    స్వప్నకుమార్ ముఖం నల్లగా అయిపోయింది. ప్రధమం నించి ఇంతే జరుగుతోంది. వాణి చేతిలో తాను పరాజితుడు కావటం అలవాటు అయిపొయింది. ఎప్పటికయినా తనది ఫై చేయి అనిపించుకోవాలంటే  అది అసాధ్యమవుతోంది.
    వాణి అనే ఒక అద్భుత స్త్రీమూర్తిని తన అర్ధాంగిగా పొందగలగటమే తాను జీవితంలో సాధించిన మహత్తరమైన విజయం. ఆ విజయం దొరికాక ఎన్ని పరాజయాలయినా తనను బాధించవు.
    వాణితో పెట్టుకుని చిత్తుగా ఓడిపోయిన ప్రతిసారీ అతనికి ఆనందమే కలుగుతూంది. తన అర్ధాంగి అంతటి ఉన్నతురాలు కావటం అతనికి గర్వకారణమవుతోంది బతుకు సాఫల్యాన్ని సాధించుకున్న తరవాత గెలుపు, ఓటములతో నిమిత్తమేమిటి?

Next Page