Read more!
Next Page 
కాదేదీ కథకనర్హం పేజి 1

                                 

 

                                                                 కాదేది కధకనర్హం

                                                         డి. కామేశ్వరి

                                              

                                                కుక్కపిల్ల
                   

    చలి ఎముకలు కొరికేస్తుంటే పాడు పడిన యింటి అరుగు మీద, ఇంటి మీదే కాక వంటి మీదా ఏ కప్పూ లేని సింహాద్రి - పొట్టలోకి కాళ్ళు తప్ప పెట్టుకోడానికో ఏమి లేని సింహాద్రి కాళ్ళు ముడుచుకుని మూడంకేసి , చలితో జ్వరం తో వణుకుతూ మూలుగుతున్నాడు. అడుక్కోడానికో మట్టి మూకుడు, దాహం తీర్చుకోడానికో పాత డాల్డా డబ్బా, మానం కప్పుకోడానికి ఏ ధర్మాతుడో దయతల్చి యిచ్చిన చిరుగుల కాకి నిక్కరు, ఏ పెంట మీద నిండో ఏరుకుని తెచ్చుకున్న చీలికలు నాలికలు అయిన తుంగచాప సింహాద్రి ఆస్థి! వాటితో పాటు ఏడాదిగా పేగులు తోదేస్తున్న దగ్గు, సాయంత్రం అయ్యేసరికి చలి కుదుపుతో వచ్చే జ్వరం కూడా వున్నాయి.
    కట్టుకున్న పెళ్ళాం - ముష్టేత్తయినా ముద్దపెట్టలేని అసమర్దుడని మరో మంచి ముష్టివాడితో లేచిపోయింది. కన్న ఒక్క కొడుకు కళ్లి ప్ప కుండానే కన్నుమూశాడు. అతనికీ లోకంలో తోడూ నీడ, నేస్తం అని చెప్పుకోడానికి వున్నది , ఒకే ఒక్క కుక్కపిల్ల! ఏ వూరకుక్కో కనిపారేస్తే తల్లి నించి తప్పడి ఏడుస్తున్న కళ్లిప్పని కుక్క పిల్లని జాలిపడి దగ్గిరికి తీసి, తాను తాగే గంజి యింత పోసి , అడుక్కు తెచ్చుకున్న అన్నం ఓ ముద్ద పడేసి , యింటింటికి ముష్టికి తిప్పి, పసి పాపలా గుండెల మీద పడుకో పెట్టుకుని కుక్క పిల్లని పెంచుకున్నాడు సింహాద్రి.
    గత రెండు మూడు నెలలుగా, సింహాద్రి రోగం ముదిరి , ధర్మాసుపత్రి డాక్టర్లు నీ గుండె చిల్లు పడింది, మరి బతకవు ఫో..... రోజులు లెక్క పెట్టుకో ఫో....అని చెప్పేశాక - యిల్లిల్లు తిరిగే ఓపిక లేక చెట్టు కింద గుడ్డ పరచుకుని పడుకుని ఏ ధర్మాత్ములో విసిరినా పైసలు నాలుగు కూడ తీసి ఏ టీ కొట్టువాడో దయతలచి యిన్నీ టీ నీళ్ళు పోస్తే , ఆ డబ్బులతో చిన్న రొట్టె కొనుక్కుని దాన్లో ముంచుకుని తింటూ చావుకోసం ఎదురుచూస్తూ చావలేక బతుకుతున్నాడు. తన బతుక్కే టికాణాలేని సింహాద్రి కుక్కపిల్ల బతుక్కి హామీ యివ్వ లేకపోవడంతో  కుక్కపిల్ల తన బతుకు తెరువు తాను వెతుక్కుంది మధ్య. చలికి మెలకువ వచ్చి వెచ్చదనం కోసం పక్కలో కుక్కపిల్లని దగ్గిరకు లాక్కోబోతే చేతికి అందలేదు. జ్వరం మగత లోంచి బలవంతంగా కళ్లిప్పి చూసేసరికి కుక్కపిల్ల లేదు - దూరంగా ఆ అరుగు మీద మరోమూల పడుకున్న ముష్టి రాములు గాడి పక్కలో దూరి వెచ్చగా పడుకున్న కుక్కపిల్లని చూసేసరికి సింహాద్రిగాడికి తిక్కరేగింది-
    సింహాద్రి రోగం ముదిరి కదలలేని స్థితికి వచ్చిందగ్గిర నించి కుక్కపిల్లకి తిండి కరవయి తోటి ముష్టివాడు రాములు గాడి చుట్టూ తోకాడించుకుంటూ తిరిగి వాడు జాలిపడి పడేసే మెతుకులు తినడం మొదలుపెట్టింది కుక్కపిల్ల. సింహాద్రి మరి లాభం లేదని కుక్కపిల్లకీ అర్ధం అయిపొయింది. సింహాద్రి పిలిస్తే దగ్గిరికి రావడం మానేసింది. రాములు గాడి దగ్గిర చేరి పడుకోడం మొదలు పెట్టింది. "దొంగనంజా యింతప్పటి నించి సాకాను, యిస్వాసం లేదే నీకు, నీయమ్మ .....రాయే...." బండ బూతులు తిడ్తూ సింహాద్రి తూలుకుంటూ లేచి కుక్కపిల్ల చెవులు పట్టుకు లాక్కొచ్చి అది కదలకుండా కావలించుకుని పడుకున్నాడు. కుక్కపిల్ల గింజుకుంటూ లేచి దూరంగా పోయి మిడుకు మిడుకు చూస్తూ గుర్రు గుర్రుమంది - 'రంకు నంజా నాలుగురోజులు తిండేట్టకపోతే మరీడ్నీ మరిగావ్ గుడిసేటి నంజా - " సింహాద్రి కోపం పట్టలేక ఓ రాయి తీసి విసిరాడు - కుక్కపిల్ల చెంగున గెంతి తప్పించుకుని "ఎంత కుక్కనైతే మాత్రం తిండేట్టకపోతే యిస్వాసం ఏమిటన్నట్టు" సింహాద్రిని నిరసనగా చూసి, నిర్లక్ష్యంగా రాములు గాడి పక్కలో దూరి పడుకుంది మళ్ళీ ------

    
                                                                                          అగ్గిపుల్ల
        

    'అప్పా , అగ్గి రాజెట్టి నావా - కాస్త అగ్గెట్టు " పిడక పట్టుకుని గుడిసెలోకి వచ్చింది రత్తాలు. అప్పాలేదు, అగ్గీ లేదు - కాని అగ్గిలాంటి సింహాద్రి - ఫాక్టరీ నుంచి వస్తూ సుక్కేసుకు వచ్చి సగం మత్తులో నులక మంచానికి అడ్డం పడి వున్నాడు.
    సింహాద్రిని చూస్తె నిప్పని చూసినట్టే రత్తాలుకి భయం - ఆడి సూపుసోకితే కాలి భస్మం అవుతుందని భయం - దగ్గిరకెడితే కాలుతుందని భయం - నిప్పుకి దూరంగా వుండాలనుకుంటుంది - సింహాద్రి అంటే సింహస్వప్నం రత్తికి. సుక్క లాంటి రత్తి వంక ఎంత ప్రయత్నించినా తనకు దక్కకుండా పోతుందని సింహాద్రికి ఉడుకు - తాగుబోతు సచ్చినోడు, ముండల ముఠాకోరు సింహాద్రిని చూస్తె వంటికి నిప్పంటుకున్నట్టు మంట రత్తికి - నలుపు అయితేనేం , చారడేసి కళ్ళతో, కనుముక్కు తీరుతో,నొక్కుల జుట్టుతో నిండుగా పుష్టిగా నీటుగా వుండే సుక్కలాంటి రత్తిని పొందని జన్మ ఏం జన్మ అన్పిస్తుంది సింహాద్రికి - మనసు పెంచుకుని మనువాదాలన్న కోరిక ఎంత ప్రయత్నించినా తీరక మనసు పడిన మగువ మరొకడి మగువ అయిందన్న దుగ్ధ సింహాద్రిని నిలవనీయలేదు- కాపేసి, కొంగట్టుకు కౌగిలిలోకి లాక్కుంటే, చెంప దెబ్బ తిన్న అవమానం. మానని పుండులా యింకా సలుపుతూనే వుంది సింహాద్రిని - మనసున్న మనిషికి మనసు ఇచ్చి సల్లగా కాపురం చేసుకుంటుంటే కళ్ళలో నిప్పులు పోసుకుని కాపురానికి నిప్పెట్టాలని సింహాద్రి చేసే ప్రయత్నాలు, వేసే వెకిలి వేషాలు చూస్తుంటే రత్తి గుండెల్లో నిప్పు రాజుకుంటుంది - నిప్పు వెంట పొగలాగా ఎక్కడి కెడితే అక్కడ తనవెంట తయారవుతూ ఆమె గుండెల్లో కుంపటిలా తయారయ్యాడు సింహాద్రి - నిప్పులాంటి సింహాద్రికి 'చల్లని నీటికుండ లాంటి నంద్రి పెళ్ళం - ఏదో మయాదారి దేముడు - అప్ప మొహం చూసి వగ్గుతున్నా నేకపోతే నీకేప్పుడో నిప్పెట్టే దాన్నిరా-' యీ పాటికి అనుకుంటుంది కసిగా రత్తి.
    "అప్పా- యేటి సందేళ తొంగున్నావా వల్లు సరి నేదా - ' ఫాక్టరీ నించి సుక్కేసుకుని , మూడు ముక్కలాటాడి ముండ దగ్గర తొంగొని ఏ అర్దారాత్రో కొంప చేరే సింహాద్రి - ఆరోజు సంజవేళ కొంపలో తొంగుంటాడని కల్లో కూడా వూహించలేదు రత్తి- సంజె చీకట్లో మంచం మీద మనిషి అప్పే అనుకుని మీద చెయ్యేసింది. అంతే - నిప్పు కాలినట్టు చెయ్యి వెనక్కి లాక్కుంది. అనుకోని అవకాశం దగ్గిర కొచ్చేసేరికి సింహాద్రి వంట్లో సెగలు పొగలు రేగాయి - 'రత్తే!-' అంటూ మత్తుగా చెయ్యి పట్టుకున్నాడు.
    "నువ్వా - ఛీ - సేయ్యోగ్గు - అప్ప అనుకున్నాను." అంది రత్తి చీత్కారం చేసి.
    "అగ్గి అప్పే ఎట్టాలేటి - నే నేట్టలేనా ఏటి. యింద అగ్గి పెట్టె  ." మేలమాడి అగ్గిపెట్టె చేతిలో పెట్టాడు చెయ్యి వదలకుండానే.
    "సచ్చినోడా- కొంపలకి అగ్గెట్టమేగా నీపని సెప్పు దెబ్బలు తిన్నా బుద్ది రాదు." అంది తిరస్కారంగా చెయ్యి గుంజుకుంటూ. సింహాద్రి విలాసంగా నవ్వుతూ " నిన్ను చూస్తుంటే పాడుబుద్ధి నిలవదే నా రత్తాలూ - ఏటలా నిప్పు తొక్కినా కోతిలా తైతక్కలాడిపోతున్నావు- నీకోసం పడి చస్తుంటే కనికరం లేదే - రెండు నిమిషాలు కల్లు మూసుకుయే సిలకా -' రత్తిని మంచం మీదకు లాగుతూ అన్నాడు. రత్తి అపరాకాళి అయింది - ' ",ముందా చేయి మర్యాదగా వగ్గు - నీ వెన్ని సార్లు సచ్చినా నీకీ రత్తి దక్కదు. అనవసరంగా గోల సెయ్యకు. వగ్గు - నేదంటే కేకలేడతాను-" అంది తీవ్రంగా. రత్తి తిరస్కారంగా సింహాద్రికి మరింత పట్టుదల , పగ రేపింది.
    "ఎట్టు, కేకెడితే - సంజె వేళ అప్పనేకుండ చూసి గుడిసె లో దూరి మీదడ్డది అని నేనూ సెప్పగలను - పెద్ద నిప్పునాటి పతివత పోజులు మాని రాయే . నిప్పుతో సెలగాటాలడ్డం యీ సింహాద్రికి కొత్త కాదులే - రా -రా- మల్లీ మీ అప్పవస్తది "- అంటూ బలంగా మంచం మీదకి తోసాడు సింహాద్రి. ఆ తెగింపుకి , ఆ ఆరోపణకి ఒక్క క్షణం దిక్కు తోచని దానిలా ఉండిపోయింది . ఆమె వళ్ళు నిప్పులా మండింది. ఆమె వూపిరి సెగలు పొగలు కక్కింది, ఒక్క ఉదుటున బలం కూడకట్టుకుని సింహాద్రిని వొక్క తోపు తోసింది.
    'అవునురా, నిప్పునేరా నేను - నిప్పుతో చెలగాటం ఆడితే బూడిదే మిగులుతుందిరా - " అంటూ ఒక్క ఉరుకున రాటకి కట్టిన కిరసనాయిలు సీసా తీసి సింహాద్రి మీద వంపి, సింహాద్రి ఏం జరిగేది తెల్సుకునే లోపలే అగ్గిపుల్ల గీసి విసిరేసింది - భగ్గున మంట - కెవ్వున కేక వేశాడు సింహాద్రి. "సావు నంజుకొడకా యీ రోజుతో నీ పీడ యిరగడయింది. వరేయ్ - యీ అగ్గిపుల్ల నిప్పు రాజేయ్యడానికే కాదురా, నిప్పు అర్పుతుంది కూడారా . నా గుండెల్లో నిప్పు చల్లారింది రా యిన్నాళ్ళకి. వికటంగా నవ్వి గుడిసె నుంచి బయటకు పరిగెత్తింది రత్తి.

                                                                                      (జనసుధ' సౌజన్యంతో) ***

Next Page