Next Page 
పెళ్ళాంతో పెళ్ళి పేజి 1

                                 


                      పెళ్ళాంతో పెళ్ళి

                                                                మైనంపాటి భాస్కర్

 

                                     


    ఫస్ట్ షాక్!


    "ఆ అమ్మాయి నా భార్య" అన్నాడు కాశీ.


    "ఏమిటీ?" అన్నాడు బాలూ నిర్ఘాంతపోతూ.


    ఒక డాక్టరు అతన్ని టెస్ట్ చేసి, "నువ్వు మొగాడివి కాదు - ఆడపిల్లవి!" అని చెప్పినా కూడా అంతలా షాక్ అయిపోయేవాడు కాడు బాలూ.


    "అవును! ఆమె నా భార్య!" అన్నాడు కాశీ మళ్ళీ.


    బాలూ తేరుకోవడానికి పూర్తిగా ఒక నిమిషం పట్టింది.


    "ఏమిటీ! ఆ అమ్మాయి - మిస్ ఐశ్వర్య రాజ్యశ్రీ - అపురూప సౌందర్యరాశి - అమెరికాలో నెంబర్ వన్ కంప్యూటర్ విజ్ కిడ్ - అరవై వేల కోట్ల రూపాయలకి అధికారిణి - నువ్వేమో పూటకి గతిలేని వాడివి! ఆమె నీ భార్యా?"


    "అవును!"


    ఒక్కసారి తల విదిల్చి, తర్వాత విరగబడి నవ్వాడు బాలూ. ఉన్నట్లుండి నవ్వు మానేసి, సీరియస్ గా అయిపోయాడు. అతని హావభావాలు చాలా సినిమాటిక్ గా ఉంటాయి.


    "నీకు పిచ్చి పట్టిందనుకుంటార్రోయ్! మద పిచ్చి! రామకృష్ణగౌడ్ అని ఒకతను ఉండేవాడు. చాలా ఫేమస్ అయిన అమ్మాయిల వెంటపడి, "నువ్వు నా పెళ్ళానివి!" అంటూ ఉండేవాడు. తనతో కాపురం చెయ్యమని వేధించేవాడు. కోర్టులో కేసు పెట్టేవాడు. జయప్రదకి అట్లాగే చేశాడు. శ్రీదేవిలాంటి వాళ్ళని కూడా విసిగించాడు. చివరికి ప్రియాంకా గాంధీని కూడా తన భార్య అని చెప్పి కోర్టుకెళ్ళేసరికి కోర్టువారు విచారణ చేసి అతనికి జైలుశిక్ష వేశారు. నీ గతీ అంతే అవుతుందిరా కన్నా! నిన్నటిదాకా బాగానే ఉన్నావుగా! ఇదేం పిచ్చి?


    "పిచ్చికాదు. నిజమే చెబుతున్నా! ఆ అమ్మాయి నా భార్యే!" అన్నాడు కాశీ ధృడంగా.


    నిటాగ్గా నిలబడ్డాడు బాలూ. కాశీవైపు ఎగాదిగా చూశాడు.


    "అసలు ఆమె నీ భార్య ఎలా అవుతుంది? అది చెప్పు!" అన్నాడు.


    రెండు క్షణాలు ఆగి అన్నాడు కాశీ.


    "ఆమె నా భార్య అంటే నువ్వు నమ్ముతావా?"


    "చచ్చినా నమ్మను"


    "ఆమె ఎలా నా భార్య అయిందో చెబితే అస్సలు నమ్మవు!" అన్నాడు కాశీ.


                                                            *    *    *    *


            అంతకు ముందు....


                             పెళ్ళాంతో పెళ్ళి


    ఠఠఠఠఠఠఠఠఠఠఠఠఠఠ.....


    గాలిని చక్రాలుగా తరుగుతున్నట్లు శబ్దం!


    "వచ్చేసింది! వచ్చేసింది!" అన్నాడు బాలూ ఎగ్జయిటెడ్ గా."ఏమిటి?" అన్నాడు కాశీ.


    "అదిగో! ఆకాశంలో!"


    తల ఎత్తి చూశాడు కాశీ.


    బ్రహ్మాండమైన తూనీగలా ఉన్న హెలికాప్టర్ క్షణక్షణానికీ దగ్గరవుతోంది.


    వాచీ చూసుకున్నాడు బాలూ.


    "ఇంక మొదలైపోతుంది" అన్నాడు ఉత్సాహంగా.


    దగ్గరయినట్లే కనబడిన హెలికాప్టర్ నగరం మొత్తాన్నీ వృత్తాకారంలో చుట్టేస్తూ, మళ్ళీ వెనక్కి వెళ్ళడం మొదలెట్టింది.


    "ఈ పాటికి అందరూ హెలికాప్టర్ ని చూసేసి ఉంటారు. ఇంక సినిమా మొదలవుతుంది చూడు!" అన్నాడు బాలూ.


    అతని మాట పూర్తికాకుండానే -


    ఆకాశంలో ఉన్న హెలికాప్టర్ నుంచి - కట్టలు కట్టలుగా కాగితాలు కిందపడడం మొదలెట్టాయి.


    మొదటి కొద్ది క్షణాలలో అవి అసలు కాగితాలుగా కనబడలేదు. నల్లటి, చిన్నచిన్న చుక్కల్లాగా కనబడ్డాయి. గాలివాటంతోబాటు కొట్టుకుని నెమ్మదిగా కిందికి వస్తున్నకొద్దీ వాటి ఆకారం కొంచెం కొంచెంగా స్పష్టం కావడం మొదలెట్టింది.


    "ఏమిటవీ?" అన్నాడు కాశీ కళ్ళు చిట్లించి చూస్తూ.


    "కళ్ళు తెరుచుకు చూడవయ్యా! నీకే అర్థం అవుతుందీ!" అన్నాడు బాలూ.


    కానీ, అప్పటికే అర్థం అయిపోయింది కాశీకి - ఆ కాగితం ముక్కలేమిటో!


    ఉత్తకాగితం ముక్కలు కావు అవి! వందరూపాయల నోట్లు! సరికొత్త వందరూపాయల నోట్లు!


    మళ్ళీ హెలికాప్టర్ ఇటువైపు వచ్చింది.


    ఇంకో పెద్ద వాన తెర వచ్చినట్లుగా, ఆ స్పాట్ లో కూడా కొన్ని వేల వందరూపాయల నోట్లని వదిలింది హెలికాప్టర్.


    మెల్లిమెల్లిగా నోట్లు కొన్ని బాలూ, కాశీ నిలబడి ఉన్న తోటలో పడ్డాయి. కొన్ని చెట్లమీద పూసిన వింత పువ్వుల్లా ఆకుల మధ్య తగులుకుని ఆగిపోయాయి. కొన్ని నేలమీద పడ్డాయి. ఒకటి కాశీ మోకాలిని తాకి, అతని పాదాల దగ్గర పడింది.  


    కాశీ కదలలేదు. మెదలలేదు.


    కానీ బాలూ మాత్రం "అరె ఇస్కీ!" అని ఎగ్జయిటెడ్ గా, దొరికినన్ని నోట్లు ఏరుకుంటూ, జేబుల్లో కుక్కేసుకుంటున్నాడు.


    హెలికాఫ్టర్ మళ్ళీ దూరంగా వెళ్ళింది. నగరంలో ఇంకేదో ప్రాంతంలో వందరూపాయల వర్షం కురిపించింది. వృత్తాకారంలో ప్రదక్షిణాలు చేస్తూ, మళ్ళీ తోటవైపు రావడం మొదలెట్టింది.


    "బాప్ రే...బాప్! అన్నా! అప్పుడెక్కడో అదేదో ఊళ్ళో కప్పల వాన కురిసిందని రాశారు. ఇంకేదో ఊళ్ళో చేపల వాన కురిసిందిట. పొల్యూషన్ ఎక్కువైతే యాసిడ్ వానలు కూడా కురుస్తాయట. కానీ వందరూపాయల వర్షం ఈ భూమ్మీద ఎప్పుడూ కురిసి ఉండదు. ఒకటికాదు, రెండు కాదు. మొత్తం పాతిక లక్షలు!" అన్నాడు బాలూ.


    "పాతిక లక్షలా! ఏమిటి బాలూ! ఎవరు వెదజల్లుతున్నారు నోట్లు? ఎందుకు? వాళ్ళకేమైనా పిచ్చా!" అన్నాడు కాశీ ఆశ్చర్యంగా.

Next Page