Read more!
Next Page 
లక్ష్యం పేజి 1

                                 


                                       లక్ష్యం
                                     -సూర్యదేవర రామ్ మోహనరావు

 

 

    ఎప్పుడైతే, ఎక్కడైతే నీకు దురదృష్టం ఎదురవుతుందో, దాన్ని గతంలోకి నేట్టిపడేయ్... భవిష్యత్ మీదే నీ దృష్టిని, ఏకాగ్రతని కేంద్రీకరించు. గతం తాలూకు చేదు అనుభవం ఎదురవకుండా అప్రమత్తంగా వ్యవహరించు.

 

    గొప్ప భవిష్యత్ కోసం నీవు ఎక్కబోయే ప్రతి మెట్టుకి గట్టి పునాది వుందని భ్రమించకు. యముడి మాయా విన్యాసాలు- ఫేక్ ఇమేజెస్ నిన్ను నమ్మించి పడదోసేందుకు ఎప్పుడూ ప్రయత్నిస్తుంటాయి, ప్రయత్నిస్తుంటారు.

 

    మితిమీరిన అభద్రతా భావం నిత్యశంకితుడ్ని చేస్తే- ఎంతో కొంతయినా అది లేకపోతే ప్రతిక్షణం నీవు మోసానికి గురవుతావు- మోసం ఫ్యాషనయింది గనుక.

 

    కలలు ఖరీదైనవి కావు, ఎన్నయినా కనవచ్చు...

 

    అలా అని వాటిని కంటూపొతే పేకల మేడల పిట్ట గోడలపై నుంచి జారిపడే ప్రమాదం వుంది. ఆ కలల్ని నిజం చేసుకొనేందుకు అనవరతం శ్రమించు- కలలు కనటం అబ్సేషన్ అయితే మిధ్యాజీవిగా మిగిలిపోవలసి వస్తుంది.

 

    పక్కవాడి ఎదుగుదలను చూసి ఉత్తేజాన్ని పెంచుకో- అసూయను కాదు. మొన్నటిదాకా నా కళ్ళ ముందు తిరుగుతూ వుండేవాడే అంత గొప్పవాడు ఎలా అయ్యాడు?... అన్న ప్రశ్న దగ్గర ఆగి, తలుచుకుంటే నేనూ అవుతాను అని ప్రగల్భాలు పలికి పదింటికే పడకెక్కిసి కలల ప్రపంచాన్ని ఆశ్రయించడం అర్భకుల ఆరాటం.

 

    అతనంతగా ఎదగటానికి చేసిన త్యాగాలు, పడిన శ్రమ, పెంచుకున్న పట్టుదల- కేటాయించుకున్న పనిగంటలు, చేసిన హోమ్ వర్క్ ఏమై వుంటుందన్న జిజ్ఞాసను పెంచుకుని, ఆ కేంద్ర బిందువు నుంచి ఆలోచించటం, ఆచరించటం నేర్చుకుంటే- ఎవరైనా ఆ స్థితికి, ఆ ఎత్తుకు చేరుకోగలరు.

 

    Apply yourself. Get all the education you can, but then, by God do something. Don't just stand there, make some thing happen.It is not easy, but if you keep your nose to the grind stone and work at it, is amaging how successful you can be.

 

    నీ అదృష్టానికి పునాదిగా భగవంతుడ్ని నమ్మినా అభ్యంతరం లేదు- ఆ భగవంతుడయినా నీకేదో చేయాలన్నా, అందుకు నీకై సాధించుకున్న అర్హతేమిటి,నువ్వు చేసిన ప్రయత్నాలేమిటి?

 

    తొలుత నీలో నీకు తెలీకుండా వున్న అంతర్గత శక్తుల్ని గురించి తెలుసుకో- వాటిని ఈ ప్రపంచంలో ఎవరికి, ఎలా ఏ రూపంలో అమ్మాలో తెలుసుకో- అమ్మేది అవసరమైందే అయితే కొనేవాళ్ళు ఎప్పుడూ వుంటారు.

 

    you should learn to tap hidden resources in you. Than you will know how to establish affective relations- hips at work so that you can confidently climb up the ladder, rung by successful ring.

 

    ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా పాపులారిటీని, ఇమేజ్ ని, సంపదని, కీర్తి ప్రతిష్టల్ని స్వంతం చేసుకున్న గొప్ప వ్యక్తులకన్నా, తెలివికల వాళ్ళు, సామర్థ్యం వున్నవారు చాలామంది సాధారణ ప్రపంచంలో వున్నారు.

 

    మరి వాళ్ళెందుకు అలా ఎదిగారు?

 

    వీళ్ళెందుకు ఇక్కడే వుండిపోయారు? అర్భకులు, అసమర్థులు, తెలివిహీనులు, మూఢులు, సృజనాత్మకతకు అర్థం తెలీనివాళ్ళు కూడా ఎంతో ఎదుగుతూ, మరెంతో సంపాదిస్తున్నారు.

 

    చాలామందికి, చాలాసార్లు అనిపిస్తుంది ఆ పిచ్చి వెధవ అంత పైకెళ్ళాడేమిటి? ఆ అర్భకులు అంతెలా సంపాదిస్తున్నాడని-

 

    అతను చేసిన పనిని చూసి అంతకంటే నేనే బాగా చేసుండేవాడ్నే అని వాపోతుంటారు.

 

    నిజమే... చేయగలరు.

 

    కాని... ఒక్క తేడా వుంది.

 

    అతనికున్న కేవలం ఐదుశాతం తెలివితేటల్ని, తొంభైఐదు శాతం మాటకారితనానికి జోడించి, జమిలీగా తగిలే వెర్రిబాగులవాళ్ళను పెట్టుబడి దారులుగా చేసి, పెట్టుబడి పెట్టించి పైకెళుతుంటారు... అది తప్పా...? కానేకాదు.

 

    పిల్లికి మొదటి గంట కట్టటమే కష్టం. అందుకే మీ తెలివితేటల్ని అమ్ముకోవటం ఆరంభించండి- అవి కరెన్సీ క్రింద మారటం గమనించండి.

 

    తలుచుకుంటే ఎవరైనా ఏదైనా కాకపోయినా, ఏదో ఒకటి చేయగలరు. ఎంతో కొంత సాధించగలరు.

 

    ప్రగల్భాలు అనర్థం...

 

    కలలు అరిష్టం...

 

    అసూయా ద్వేషాలు అన్ని విధాల నష్టం.

 

    నీకై నీవే ఒక జైలుని నిర్మించుకో- ఆ జైలుకి నువ్వే సర్వాధికారివి- అందులో ప్రతిష్టించబడు- రంగుల ప్రపంచాన్ని, హంగుల హరివిల్లుని మరిచిపో కొంతకాలం. నమ్ముకున్న దానిపై దృష్టిని కేంద్రీకరించు- రాత్రింబవళ్ళు శ్రమించు- అప్పుడు నీవున్న జైలు ద్వారాన్ని నీ అవసరం వున్నవాళ్ళే తెరిచి నిన్ను తన ప్రపంచంలోకి తీసుకెళ్ళి, ఎదిగేలా చేస్తారు. పెరిగేలా తోడ్పడతారు. కొందరుంటారు- పాపం ఓపికుంటే శ్రమిస్తారు. లేదంటే విశ్రమిస్తారు... మరీ కాదంటే శ్రమించేవారిని విశ్రమించేలా చేస్తారు.

 

 

    అవిగో లక్షలు వస్తున్నాయి.

 

    ఇవిగో కోట్లు వస్తున్నాయంటారు...

 

    మరవన్నీ ఏం చేస్తున్నావంటే నా మెయిన్టినెన్స్ కి సరిపోతున్నాయంటారు...

 

    ఏటి ఈత- లంకమేత...

 

    ఎవర్ని ఉద్ధరిస్తుంది?

Next Page