Next Page 
వజ్రాల పంజరం పేజి 1

                                 


                               వజ్రాల పంజరం


                                                                - కొమ్మనాపల్లి గణపతిరావు

 

                                   


    "నేనో క్షణాన్ని ... నన్ను నేనే మోసుకుంటూ ముందుకు నడిచే విశ్వమాత వీక్షణాన్ని....

 

    ఉదయం సూర్యుని కిరణాన్ని పట్టుకుని శూన్యం నుంచి శబ్దంలోకి....

 

    మంచు స్పర్శ నుంచి మృత్యుశయ్యలోకి.....

 

    శిఖరాగ్రాల శీతల స్వర్గం నుండి ఎడారి అగాధపు చలిబావుల్లోకి....

 

    సరస్సు స్నానాలలో నుండి సముద్ర గర్బంలోకి...

 

    నూనెలో ఉరితీయబడ్ వుల్లిలా...

 

    కన్నీళ్లు చన్నీళ్ళ స్నానమాడించే తల్లిలా....

 

    తల్లి గుండె సంద్రాన చెంగు చెంగున ఉరకలు వేసే కడలి పిల్లలా....

 

    మంచి ఘడియల అన్వేషణలో ముత్యాల కోసం మహార్ణవంలోకి దిగినట్టు పడుతూ లేస్తూ నిద్రపోతున్ పసిపాప పెదవులపై మెరిసే చిరునవ్వుని నా ఉనికిగా మార్చుకుంటాను.

 

    'ఒక్క క్షణం' అంటూ నన్ను ఎవరైనా ఆపాలని ప్రయత్నించినా ఆగని కాలానికి అంకురాన్నైన నేను ఆగుతున్నట్లు కనిపిస్తూనే నిముషాలలోకి రోజులు వారాల్లోకి, నెలలు సంవత్సరాల్లోకి పరుగుతీస్తూనే వుంటాను.

 

    అందుకే నేను క్షణాన్ని...

 

    మా అమ్మ 'కాలం' కి ముద్దుబిడ్డని...

 

    నిజం నేస్తమా....

 

    ప్రకృతి కళ్ళకి వినోదాన్ని అందించే నేను నీకు పసికందులా అనిపించినా గానీ, నాకుగాని, ప్రాణి ప్రారంభానికి గానీ తేడా ఏముంది?

 

    'క్షణం' లాగే అమ్మకడుపులో ఏకకణ జీవిలా ఏ క్షణమో రూపుదిద్దుకునే 'అండం' ఆనక పిండమై,  కోటానుకోట్ల క్షణాల కదలికలో బ్రహ్మాండమై అనంతరం నుంచి అంతం దాకా ఎలా పయనించేదీ నీకు మాత్రం తెలీదూ!

 

    అదేం చిత్రమో....

 

    నేను దేన్నీ ఆపలేనుగాని అంతా చూస్తుంటాను. చూస్తూ సాగిపోతుంటాను.

 

    మిత్రమా!

 

    తూణిరక్షతాలతో కాలం గుండెల పుటల్ని రక్తంతో తడిపేదీ నువ్వే!

 

    యుగాల శకాల శిధిలాల బంధనాల్లోంచి జారిపడే 'శిలువ' సలంస్కృతిని చెరిపి 'శాలువా' లతో  చుట్టిన అందమైన చరిత్రని రేపటి తరానికి అందించేది నువ్వే.

 

    చెప్పు నేస్తం!

 

    చిన్న గాయానికి నేలపడ్డ పావురంలా నీ ముందు నిలబడ్డ ఈ 'క్షణం' కి నీ లాలిత్యపు కళ్లతో నిమిరి ప్రాణం పోస్తావా...

 

    లేక....

 

    గాయపరచడమే నీ ధ్యేయంగా...

 

    నీకు తెలిసిన న్యాయంగా సూత్రీకరించి పక్షవాతం వచ్చిన ప్రకృతి తల్లి నేత్రాంచలాల నను అశ్రువుగా మారుస్తావా....

 

    నీ యిష్టం...

 

    ఎందుకంటే....

 

    నేను వజ్రాన్నే అయినా పంజరంలో వున్నాను.

 

    పంజరం కూడా వజ్రఖచితం కావడంతో నా ఉనికి ఏమిటో తెలుసుకోలేక పోతున్నాను.

 

    "ఏయ్ .... ఏంటా చూపు?'


                                 ******


    కారు నడుపుతున్న మిలింద్ భుజంపై సుతారంగా జరిగింది విజూష.

 

    "ఇందాకట్నుంచీ చూస్తున్నా" చిలిపిగా అతడి పెదవిని చూపుడు వేలితో రాస్తూ మధువనంత దినాన అడవి బాటలో ఒంటరిగా పయనిస్తున్న అనుభూతితో అడిగింది.

 

    "మాట్లాడవు కదూ"

 

    "ఆడనిస్తేగా?"

 

    "ఏమిటి?"

 

    "నీ అందం"

 

    నిశ్శబ్ద నిశీధిలో వేగంగా దూసుకుపోతున్న కారులో మృదువుగా వలికిన మిలింద్ కంఠం శ్రావణమాస వర్షరాత్రిలో మేఘ గర్జనలా వినిపించింది.

 

    "నీ కంఠం చాలా బాగుంది."

 

    "వినడానికా? చూడడానికా?" విస్పరింగ్ గా అన్నాడు.

 

    కిసుక్కున నవ్వింది అతడి చెంప గిచ్చుతూ.

 

    బయట దట్టమైన చీకటి!

 

    తారలతో నిండిన రాత్రిని చూస్తున్న చెట్లు ఒక జంట నిట్టూర్పుల వేడి సెగలకి పులకిస్తున్నట్టు వెనక్కి పరిగెడుతున్నాయి.

 

    పుట్టింది ఎక్కడైనా - మిలింగ్ పెరిగింది తెలుగు రాష్ట్రంలో.

 

    అందుకే అందంగా వుండడం మాత్రమే కాక అందమైన తెలుగు మాట్లాడుతాడు.

 

    మాట్లాడ్డమే కాదు - ట

 

    తెలుగులో మంచి కవితలూ చెప్పగలడు.

 

    నిజానికి అతడిది అందంకాదు.

 

    నిలబడితే అశ్వారూఢుడైన గ్రీకు వీరుడిలా వుంటాడు.

 

    నడిస్తే శబ్దరాహిత్యపు మరో ప్రపంచంలోకి అడుగుపెట్టి అక్కడ సార్వభౌముడిలా స్థిరపడాలనుకుంటున్న గంధర్వుడిలా అనిపిస్తాడు.

 

    నవ్వినప్పుడు కృష్ణ శాస్త్రిని, ఆలోచనల్లోకి తిలక్ ని, చుట్టూ వున్న మనుషుల్ని విశ్లేషించినప్పుడు శ్రీశ్రీని గుర్తుచేస్తుంటాడు.

 

    అయినా అతడు అంతర్ముఖుడు.

 

    తనలోకి తను ఎక్కువగా చూసుకునే అలవాటే తప్ప చుట్టూవున్న ప్రపంచాన్ని అంతగా పట్టించుకోడు. ఎప్పుడో విజూష బలవంతం పై తప్ప.

Next Page