"నేనూ ఎయిర్ పోర్ట్ కి వస్తానంటున్నాను. ఏం! తప్పా మీ మొదటి భార్యని చూసే హక్కు నాకులేదా? పాపం ఆవిడ మీరు పోయారనుకుంటూందట. బ్రతికి వున్నట్టు మీ అబ్బాయికి నేనూ చెప్పలేదు. అక్కడ కాస్త ఎర్రరంగు దొరికితే వెంటనే చూపుడు వేలుతో ఆవిడ నుదుటమీద దిద్దుదురుగాని. ఆ దృశ్యాన్ని నేనూ చూద్దామనే వస్తున్నాను. అట్నుంచి అటే మీ కూతుర్ని తీసుకుని విజయనగరం కూడా వెళ్దాం. పాపం అక్కడున్నావిడకి మీ మొదటి ఇద్దరి భార్యల సంగతి తెలిసి వుండదు. ముగ్గురు భార్యలు నలుగురు పిల్లలు..... అంతా కలిసి హాయిగా వుండొచ్చు. మీ పెద్ద కొడుకు చాలా స్మార్ట్ గా వున్నాడు. అచ్చుగుద్దినట్లు మీ పోలికే. మరి మీ గుణాలు వచ్చినయ్యో లేదో తెలీదు. రాకూడదని మాత్రం భగవంతుణ్ణి ప్రార్ధిస్తున్నాను. మనమిక బయల్దేర్దామా- భాగ్యేశ్వరి, ఇందిరా ఎదురు చూస్తూ వుంటారు...."
ఆయన మాట్లాడలేదు. దగ్గరికి వచ్చి లాగి బలంగా చెంపమీద కొట్టబోయి ఆపుకుని తిరిగి వెళ్ళిపోయారు.
4
కారు వేగంగా వెళుతూంది. ఆయన మాట్లాడకుండా డ్రైవ్ చేస్తున్నారు. నా ఆవేశం ఇంకా తగ్గలేదు. నా బలహీనత మీద నాకే కోపం వచ్చింది. ఆయన్ని దులిపేద్దామనుకున్నాను. పెళ్ళవకముందు నాకు చాలా అహంభావం ఉండేది. వయసుతోపాటు తగ్గిపోయింది. ఒకప్పుడయితే, అప్పటికప్పుడు లాయర్ మా ఇంటికొచ్చి విడాకుల నోటీసు తయారుచేస్తూ వుండేవాడు. కానీ ఎందుకో అలా జరగలేదు.
చాలామంది అంటారు- స్త్రీ ఆర్ధిక బలహీనతలవల్ల పురుషుడి మీద ఆధారపడుతుందని. కానీ అది అన్ని విషయాల్లోనూ నిజంకాదు. తరళా ఫైనాన్స్ కి సంబంధించిన అన్ని కంపెనీలూ నావే. అయినా నేను వెంటనే ఏ చర్యా తీసుకోలేకపోయాను. ఈయన్నుంచి రాత్రికి రాత్రి వేరుకాలేకపోయాను. భర్తలో దుర్గుణాలని సహించటం భార్యకి దేముడిచ్చిన వరమా? శాపమా?
నేను మాత్రం అందరి ఆడవాళ్ళలాంటి దాన్ని కాదని నా నమ్మకం. అరగంట వ్యవధిలో భర్త తాలూకు ఇద్దరు భార్యల సంగతి వాళ్ళ సంతతి సంగతి...ముఖ్యంగా భర్త ముగ్గురి దగ్గిరా ఒకళ్ళకి తెలియకుండా ఒకరితో ఆడుకున్న నాటకం సంగతీ బయటపడితే, నాలా ఇంత నిబ్బరంగా మాత్రం చాలామంది ఉండలేరు. మీ సంగతి నాకు తెలీదు.
....ఇంతలో కారు విమానాశ్రయంలో ఆగింది. అంతా నిర్మానుష్యంగా ఉంది. ఇద్దరం గేటు దగ్గరికి వెళ్ళాం. అక్కడెవరూ లేరు. ప్రయాణీకుల కోసం ఎదురుచూసే వారుకూడా ఎవరూలేరు.
ఇంతలో ఒక సెక్యూరిటీ మనిషి మా దగ్గిరకొచ్చి "ఏం కావాలి" అని అడిగాడు.
"అమెరికా నుంచి ఏదైనా ఫ్లయిటు వస్తుందా?" అని అడిగారు ఆయన ఇంగ్లీషులో.
"అమెరికా నుంచి విమానాలు హైద్రాబాద్ రావు" వ్యంగ్యంగా అన్నాడా అధికారి.
"ఐ...మీన్- బొంబాయి నుంచిగానీ, ఢిల్లీ నుంచి గానీ ఏదైనా ఫ్లయిటు ఆలస్యమయిందా?"
"లేదు". ముక్తసరిగా, ఇక వెళ్ళండి- అన్నట్టు అన్నాడు.
ఆయన నావైపు చూశారు. నేను తెల్లబోయాను. ఆ యువకుడి మాటలు ఇంకా నా చెవుల్లో మార్మోగుతున్నాయి.
"ఏమని చెప్పాడు అతడు?" కార్లో వెళ్తూవుంటే ఆయన అడిగారు. నేను జవాబు చెప్పలేదు- తప్పు చేసింది ఆయన. తప్పు చేసినట్టు అవమానంతో తల వంచుకొని సంజాయిషీ చెప్పాల్సింది ఆయన! నన్ను ప్రశ్నలడిగే హక్కు ఆయనకు లేదు.
"ఎక్కడికి వెళుతున్నాం మనం?" అడిగాను.
"బంజారాకి-"
"చిన్నకూతుర్ని చూడటానికా" అందామనుకుని వూరుకున్నాను. సూటిపోటి మాటలనడం, ఏడవటం, సాధించటం....చివరికి మనసుకు సర్దిచెప్పుకుని కలసి సంసారం చేయటం, ఇవన్నీ మామూలు గృహిణులు చేసేపని. తరళ చేయదు. నేనేం చెయ్యాలో అప్పటికే నిశ్చయించుకున్నాను. ఈయన నా భర్త అయినాసరే, భాగ్యేశ్వరిని కలుసుకుంటాను. ఈయన చనిపోయాడని ఆవిడ ఏ పరిస్థితుల్లో అనుకుందో తెలుసుకుంటాను. అక్కడ తప్పించుకున్నా- ఇందిర విషయంలో తప్పించుకోలేడు. చీటింగ్ కి శిక్షేమిటో ప్రబంధ్ ని అగడాలి.
ఆయన కారు నడుపుతూ-
"గోపీ నిన్ను హోటల్ లోనే కలిశాడు కదూ-" అడిగారు.
"అవును ఈ హోటల్ లోనే తనూ దిగాడు" అన్నాను. అతడిని కలుసుకోవాలని నాకూ తొందరగా వుంది. ఎయిర్ పోర్ట్ కే అని చెప్పాడు. నాకు బాగా జ్ఞాపకం. ఎందుకలా చెప్పాడో తెలుసుకోవాలి. ఈయన వ్యవహారం చూస్తూంటే ఈ గోపి అనే పేరు సుపరిచితంలా వుంది.
కారు హోటల్ ముందు ఆగింది.
ఇద్దరం దిగి లోపలికి వెళ్ళాం. ఆయన రిసెప్షన్ దగ్గిరకి వెళ్ళి "గోపిచంద్ రూమ్ ఎంత?" అని అడిగారు.
"గోపీచందా? అటువంటి పేరుగల వారెవరూ లేరే" అన్నాడు రిసెప్షనిస్టు, వెనుక బోర్డు పరిశీలించి చూసి ఆయన మొహం వాడిపోయింది. "మరొకసారి చూడండి" అన్నారు.
అతడు మళ్ళీ చూసి, "లేదు సర్" అన్నాడు.
మేము వెనుదిరగబోతుంటే అన్నాను. "ఒక్కసారి పైకి వెళ్దాం"
"ఎందుకు?"
"మీకంతా తెలుసు మళ్ళీ 'ఎందుకు' అని తెలియనట్టు అడుగుతున్నారు! ఇక్కడెందుకు ఆ అమ్మాయిని? మనతోపాటు తీసుకువెళ్దాం అనుకుంటున్నాను".
ఆయన మాట్లాడలేదు. మౌనంగా లిఫ్ట్ వైపు నడిచారు. ఆయన మౌనం మరింత బాధపెట్టింది. లిఫ్ట్ లో ఇద్దరమే వున్నాం. "మీకు చీమకుట్టినట్టయినా లేదా?" అన్నాను.
"దేనికి తరళా?"
"దేనికి అని అడుగుతున్నారా? మీరసలు మనుషులేనా? రెండు వేరు వేరు వూళ్ళలో రెండు కాపరాలు పెట్టటానికి, అసలింకో పెళ్ళామే లేదని చెప్పటానికి మీకు సిగ్గులేదూ-"
"నువ్వు అనుకున్నట్టు నాకు రెండో సంసారం ఏదీ లేదు".
"మరి పైనున్న అమ్మాయెవరో? మూడో భార్య కూతురుకాదా?"
.....
"ఆ సంగతి అలా వుంచండి. భాగ్యేశ్వరికి మీరు బ్రతికున్నట్టు తెలుసా?"
"నాకే భాగ్వేశ్వరీ తెలీదు తరళా నన్ను నమ్ము".
"తెలియకుండానే మీ ముక్కునుంచి పడ్డట్టు వూడిపడ్డాడా మీ కొడుకు?"
......