Previous Page Next Page 
వెన్నెల్లో గోదారి పేజి 8


    
    కారు ఎలా నడుపుతున్నానో నాకే తెలీదు. నా గుండెల్లో అగ్ని పర్వతాలు బ్రద్దలవుతున్నాయి.
    
    కూతురి విషయం తెలిసిన అరగంటలోనే కొడుకు విషయం మరింత నాటకీయంగా తెలిసినా దాన్ని నేను నమ్మలేకపోదును. కానీ పోలిక? స్వంత కళ్ళకన్నా సాక్ష్యం ఇంకేమీ కావాలి? గోపీచంద్ ఆయన కొడుకు. ఎవరు కాదన్నా ఇది నిజం రక్తం చెప్పే నిజం.
    
    నా తల పగిలిపోతూంది.
    
    ఒక పక్క శ్రీదేవి-మరొకపక్క గోపీచంద్. నా ఇద్దరు సవతులకు పుట్టిన ఇద్దరు బిడ్డలు.
    
    ఒక సవతి, వాళ్ళాయన చనిపోయాడనుకుని కొడుకుని తీసుకుని అమెరికా వెళ్ళిపోయింది.
    
    మరొకామె తన భర్త కంపెనీ పన్లమీద టూర్లు తిరుగుతున్నాడనుకుని సంతృప్తి పడుతోంది.
    
    ఇదంతా నిజమా? కలా.
    
    కలే... అవును కలే.
    
    నాకు బిగ్గరగా నవ్వొచ్చింది. రాత్రి ఆయన పాలగ్లాసు ఫోను ప్రక్కనే పెట్టి అలాగే నిద్రపోయాను. అంత కళ్ళమీద కొచ్చేసింది నిద్ర- ఆ నిద్రలో ఈ కళ ఆయనకి ఫోన్ రావటం.....నేను బయల్దేరటం- ఒక కొడుకూ కూతురు వెంట వెంటనే తగలటం- భలే కల నేను నవ్వుతూనే కారు నడుపుతున్నాను. అంతలో ఒక కుక్క అడ్డుగా రావటంతో బ్రేక్ వేసి ముందుకు తూలాను. కళ చెదిరినట్లు అనిపించింది.
    
    అయినా కూడా నేను కార్లోనే వున్నాను.
    
    పాల వ్యాను నా పక్కనుంచే వెళ్ళింది.
    
    కాబట్టి ఇది కలకాదు. కేవలం 'కల' అయితే బావుణ్ణు అనుకున్న నా ఆలోచన.
    
    శ్రీదేవి... గోపీచంద్.
    
    ఇందిర....భాగ్యేశ్వరి.
    
    ఇంతకాలం నేను ప్రత్యక్షదైవం అని నమ్మిన చెట్టు తాలూకు కొమ్మలు, ఫలాలు!
    
    అదే నిజమైతే ఆ వృక్షాన్ని మొదలంతా నరికేసి, నేను ఆహుతి అవటం ఖాయం నేనెలాటిదాన్నో మీకు ముందే చెప్పాను. ఇదే సంఘటన మీకు ఎదురైతే బహుశా మీరు ఊరుకుంటారేమో! ఆయనకేం మొగ మహారాజు అనో, అమ్మో ఆయన కేమైనా అయితే నా మంగళసూత్రం ఏమవుతుందో అనో ఆత్మవంచన చేసుకుంటారేమో కదూ!
    
    నేను చేసుకోను.
    
    ఒక మొగవాడు తాను బ్రతికుండీ చనిపోయినట్టు నాటకం ఆడి ఒక స్త్రీని పరాయిదేశాలకు పంపిస్తే.... ఒక పురుషుడు తను వివాహితుడు అయివుండీ మరో స్త్రీని అబద్దం చెప్పి పెళ్ళాడితే- అతడు నా భర్తే అయినా అతడిని వదిలిపెట్టను.
    
    అంతు తేలుస్తాను.
    
                                      * * *
    
    నేను వెళ్ళేసరికి ఇల్లంతా లైట్లు వేసి వున్నాయి. ఆయన కారు శబ్దం విని కంగారుగా పోర్టికోలోకి వస్తూ "ఎక్కడికి వెళ్ళావు! మేమంతా ఎంత గాభరా పడుతున్నామో తెలుసా?" అన్నారు.
        
    ఆయనవైపు కన్నార్పకుండా చూశాను. ఇంతటి గొప్ప నటుడు అనుకోలేదు నా భర్త. శ్రీరాముడు నెమలిపింఛం ధరించి నట్టున్నాడు. మాట్లాడకుండా లోపలికి నడిచాను. సాహితి కూడా మెలకువగానే వున్నది కానీ ఏమీ అడగలేదు.
    
    మేమిద్దరం మా గదిలోకి వెళ్ళాం.
    
    "ఎక్కడికి వెళ్ళావ్?" మళ్ళీ అడిగారు ఆయన.
    
    "నా బోయ్ ఫ్రెండ్ దగ్గరికి-"
    
    ఆయన నవ్వటానికి శుష్కప్రయత్నం చేసి, "మరేమిటి అంత తొందరగా వచ్చేశావు?" అని అడిగారు.
    
    "హోటల్ లో గది తీసుకోవటానికి ఇద్దరం వెళ్ళాం. అక్కడ పాత స్నేహితురాలు కనపడింది. ఆమె సాయం చేసింది. ఇప్పటివరకూ అక్కడే వున్నాను. ఆవిడ పేరేమిటి అని అడగరేం?"
    
    "ఏమిటి?"
    
    "-ఇందిర ఏ ఊర్నుంచి వచ్చింది అని అడగరేం?"
    
    "చెప్పు" అన్నారు నేను స్నేహితురాలు అనేసరికి ఆతృత తగ్గిపోయింది.
    
    "విజయనగరం-" ఆయన మోహంలో భావాలు గమనిస్తూ అన్నాను. అయితే ఆయనలో ఏ మార్పూలేదు. నా వళ్ళు భగభగా మండుతూంది. "ఇందిర కూతురు శ్రీదేవి కూడా వచ్చింది" అన్నాను కొసమెరుపుగా.
    
    అయినా కూడా ఆయన మొహంలో ఏ మార్పూలేదు. "ఇంతకీ నేను వెళ్ళింది ఏ హోటల్ కి అని అడగరేం"?
    
    "ఏ హోటల్ కి?"
    
    "బంజారా".    

    అప్పుడు కనిపించింది ఆయన మోహంలో మార్పు లోపల్నుంచి ఏదో తన్నుకొచ్చినట్టు ఒక్కసారిగా ఆయన మొహం మారిపోయింది. "నువ్వు.....నువ్వు బంజారాకి వచ్చావా?" అని అడిగారు.
    
    "వెళ్ళావా అని అడక్కుండా 'వచ్చావా' అని అడుగుతారేమిటి? మీరు కూడా అక్కడికి వచ్చారా?" ఓరగా చూస్తూ అన్నాను.
    
    ఆయన సమాధానం చెప్పలేదు. లేచి పచార్లు చేయటం మొదలు పెట్టారు. ఆయన మొహం కందగడ్డలా ఎర్రగా మారింది.
    
    "ఇంకో అరగంటలో భాగ్యేశ్వరీదేవి కూడా మన దేశం వస్తోంది." నెమ్మదిగా, తూచి తూచి అన్నాను. ఆయన పచార్లు ఆగిపోయాయి.
    
    "భాగ్యేశ్వరా?" అన్నారు మొహం చిట్లించి.
    
    "ఏం? ఆవిడ కూడా మీకు తెలుసా? వాళ్ళాయన పేరు కూడా ఆనందరావే అట. పాపం పెళ్లవగానే ఆయన పోయార్ట. వాళ్ళబ్బాయి పేరు గోపీచంద్".
    
    -ఆయన అంత వేగంగా కదలగలరని నేను కలలోకూడా అనుకోలేదు. ఊహించని వేగంతో వచ్చి నా రెక్క పట్టుకుని "ఏమన్నావ్?....గోపీచందా?" అని అరిచారు. ఆయన కంఠం కీచుగా ధ్వనించింది.
    
    సరీగ్గా ఎక్కడ దొరకాలనుకున్నానో అక్కడ దొరికారు.
    
    "ఏం? గోపీచంద్ తెలుసా మీకు?"
    
    "ఎక్కడున్నాడు? గోపీ ఎక్కడున్నాడు?" ఆయన ఆవేశంగా అడిగారు.
    
    "వాళ్ళ అమ్మగారు ఈ రోజు అమెరికా నుంచి ఈ తెల్లవారు ఝామున వస్తున్నారు. అందుకు ఎయిర్ పోర్ట్ కు వెళ్తున్నాడు. గమ్మత్తేమిటంటే వాళ్ళ ఇంటి పేరు కూడా మన ఇంటి పేరే..."
    
    ఆయన నా మాటలు వినటం లేదు. మళ్ళీ షర్టు వేసుకుంటున్నారు. ఎక్కడికని అడిగాను.
    
    "ఎయిర్ పోర్ట్ కి-"
    
    "నేనూ వస్తాను-"
    
    "ఏమిటీ?" అన్నారు అర్ధంకానట్టు నాలో అప్పటివరకూ అణిగివున్న ఆక్రోశం, రోషం కట్టలు తెంచుకున్నాయి.

 Previous Page Next Page