Previous Page Next Page 
యువత నవత పేజి 8

   
     ఆయన్ని, ఆయనబోటివాళ్లను చూచి నన్ను చూచుకొంటే ఎంతో గర్వపడేట్టు చేసింది శాలిని. మన శాలినికి ఏనాడైనా ట్యూషన్సు  పెట్టానా? ఏనాడైనా నువ్వు ఫస్ట్ రాకపోతే కుదరదని  చెప్పానా? ఏనాడైనా సీటుకోసం ఎవరినైనా యాచించానా? అవేం లేకుండా ఎవరి ప్రోద్బలం లేకుండా క్రిందనుండి పై వరకూ ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ అనిపించుకుంది." ఆనందమో ఏదో, ఆయన గొంతు పట్టేసినట్టుగా అయింది.

     "ఆడపిల్లకు ఎంత  తెలివివుంటే ఏంలెండి! తెలివున్న ఆడదీ, తెలివి లేని ఆడదీ చివరికిచేసే పని ఒక్కటే! ఆ తెలివిఏదో మన రామకృష్ణకి వుంటే సంతోషిద్దు. బి. ఏ. నాలుగుసార్లు పల్టికొట్టి ముష్టి మూడొందల రూపాయలకోసం ఆ ప్రేవేట్ ఉద్యోగం చేయాల్సిన గతి పట్టేదికాదుకదా! వాడికి చదువులో దీని తెలివివస్తే ఎంతపైకి చదువుతానంటే అంత పైకి చదివిద్దుంకదా?

     ప్రక్క గదిలో వున్న శాలినికి అమ్మా నాన్న సంభాషణ యధాతధంగా చెవిని పడుతూంది. తల్లి చివరి మాలు వింటూంటే శాలినికి కలిగిన బాధా, కోపం అంతా ఇంతా కాదు.

     మగపిల్లవాడు ఎంత  తెలివిహీనుడైనా, మొద్దు సద్దు అయినా వాడు మాత్రమే ఉద్దరిస్తాడా
వీళ్లను. ఆడపిల్ల ఎంత తెలివైనదైనా, చురుకైనదయినా ఉద్దరించలేదు. మొదటనుండి వీళ్లు ఆడపిల్లను ఎలా పెంచుతారంటే ఒకింటికి వెళ్లిపోయేదే కదా, ఎప్పుడైనా పిలిచి పిడికెడు పసుపు కుంకుమ ఇచ్చి పంపేసే సంబంధమేకదా మిగిలేది అన్ని ధ్యాసతో పెంచుతారు. ఆ ధ్యాసతోనే మగపిల్లలకి ఇచ్చే ప్రత్యేకతలేమీ ఇవ్వరు. "నీకేం? మగవాడివిరా?" అన్న ప్రోత్సాహం ఇస్తూ పెంచడంవల్లే అతడు స్త్రీని చూసి మీసం మెలివేయ గలుగుతున్నాడు. ఇంకో స్త్రీ అణిచివేతకు అలా తీర్చి దిద్దుతున్నది తల్లి! స్త్రీ అయిన తల్లి.ఎంత విచిత్రం: అబ్బాయిని అలా పెంచిన తల్లే  "మనది ఆడబ్రతుకే: ఎంతకీ కొంచెం అణిగి మణిగి వుంటేనే మంచిది! ఆడపిల్లకు అణకువే అందం, సహనం భూషణం: అన్న దాస్యభావాలు నూరిపోస్తూ పెంచుతుంది కూతుళ్లని.

     ఎందుకని తన గొయ్యి తనే త్రవ్వుకొంటున్నది ఆడది? తననితను ఎందుకు కించపరుచుకుంటున్నది?
     కందిరీగల తుట్ట కదిలించినట్టుగా శాలినిలో ఆలోచనలు రేగుతాయి గాని అవి వెంటనే బయటపడవు సుధలా ఎదురుపడి వాదువాడే మనిషి కాదు శాలిని అవసరమైతే మట్టుకు తనకు కావలసింది ఎట్టి పరిస్థితిలోనూ వదులుకోదు!ఇష్టం లేనిదానితో రాజీ పడదు! అయితే పోట్లాడి సాధించే తత్వమూ కాదు. గాంధీగారి శిష్యురాలు. నిరాహారదీక్ష ప్రారంభిస్తుంది. ఒక్కపూట గడవకముందే లొంగిపోతారు అమ్మానాన్న.

     ఆ రాత్రి భోజనాలదగ్గర అన్న రామకృష్ణ చెల్లెలికి  ఉద్యోగం వచ్చినందుకూ,  వెళ్లి చేరబోతున్నందుకూ కంగ్రాచ్యులేషన్స్ తెలిపి, అన్నాడు. "ఆడ బ్రతుకే మధురమని వెనుకటికి ఏ కవి  మహానుభావుడు సెలవిచ్చాడోగాని, అది అక్షరాలా నిజం మా ఫ్రెండొకడు ఎం కాం ఫస్ట్ క్లాస్ లో పాసై నాలుగేళ్లయింది ఇంతవరకు ఉద్యోగం గతిలేదు:వాడొక్క డేనా? ఇలా ఎందరో వేలాది, లక్షలాదిమంది నిరుద్యోగ మగ ప్రాణులు! నువ్వు బి. ఇ. డి. పాసై ఏడాది గడవకముందే ఉద్యోగం నిన్ను వెతుకుతూ వచ్చేసింది. ఆడ మహారాణుల రాజ్యం ఇప్పుడు బస్సులో సీట్లు ప్రత్యేకం. కాలేజీలో సీట్లు ప్రత్యేకం. ఉద్యోగాల్లో రిజర్వేషన్సు ఇన్నిన్ని చాలవని ఆస్తి హక్కుల కోసం పోరాటం సమాన హక్కుల కోసం పోరాటం! రోజు రోజుకూ మగవాడి తలమీద గుడ్డ కప్పేస్తున్నారే మీ ఆడమహారాణులు :"

    "నీ నోరు చల్లగా! ఆడ మహారాణులం అనిపించుకునే రోజు త్వరగా రావాలన్నయ్యా మాకు!"

    "ఇపుడుమాత్రం మీకేం తక్కువైందే?" పని పాట లేనట్టుగా కాకుల్లా గోల చేస్తున్నారుగాని! మగవాడు బయట అష్టకష్టాలుపడి సంపాదించి తెస్తే ఇంట్లో కూర్చొని వండి పెట్టడం కష్టమైపోయింది మీకు! అది బానిసత్వంఅని, దోపిడీ అని, వెట్టి చాకిరీ అని గోలెత్తి పోతున్నారు! అదే మీరు ఉద్యోగం పేరుతో ఏ బాస్ క్రింద పనిచేసినా, ఏ ఆపీసరిణికింద పని చేసినా బానిసత్వంకాదు ఏ బాధా బరువూ బాధ్యత లేకుండాహాయిగా ఇంటిపట్టు నుండక ఆర్దిక స్వాతంత్ర్యంతో అతివల అన్ని కష్టాలూ తీరిపోతాయన్న భ్రాంతితో అష్టకష్టాలసూ కొని తెచ్చుకొంటున్నారు ఇంట్లో చాకిరీ, వీధిలో  చాకిరీ అని ఆపసోపాలూ, అసురులూ!"

    ఆడవాళ్లమీద దండెత్తాలంటే భలే ఉత్సాహం వస్తుంది రామకృష్ణకు. అతడికీమధ్య ఓ వార పత్రిక "మగవాళ్లకి ప్రత్యేకం" శీర్షిక క్రింద నిర్వహించిన వ్యాసరచన పోటీలో ద్వితీయ బహుమతి వచ్చింది. అప్పటి నుండి అతడి ఉత్సాహం ద్విగుణీకృతం అయింది.

     "నీకు జవాబు నాకంటే సుధ బాగా ఇవ్వగలదన్నయ్యా!"

     "అబ్బ! ఒట్టి మగరాయుడే నీ ఫ్రెండు! మా ఫ్రెండ్స్ సర్కిల్ తో ఆ అమ్మాయి పేరేమిటో తెలుసా? తాటకి!"

    "మీ సంస్కారం ఇక్కడే తెలుస్తూంది: ఆడవాళ్లకి పేరుపెట్టి వెక్కిరించడం కంటే వేరే పనేమీలేదా మీకు?" శాలిని కోపంగా అడిగింది.

 Previous Page Next Page