Previous Page Next Page 
యువత నవత పేజి 7

   
    "కనిపెంచి , ఇంతవాళ్లను చేసిన తలిదండ్రులకుకూడా ఆ అధికారం వుండకూదనుకొంటే ఎలా అమ్మాయ్?"

    "కన్నందుకు పెంచడం మీ బాధ్యత ఆంటీ! మీ బాధ్యత నెరవేర్చిన తృప్తి మీకుండాలిగాని ఎవరో పరాయి పిల్లను ఉద్దపించినట్టుగా అధికారం చేజిక్కించుకొనే ప్రయత్నం చేయడం  - పిల్లల్లో తిరుగుబాటుతనాన్ని ప్రేరేపిస్తుంది. మీమీద గౌరవాన్ని తగ్గిస్తుంది!"

    "మీ కూతుర్ని ఆడపిల్లగా చూడొద్దు. మనిషిగా చూడండి. ఆర్దికంగా తన కాళ్లమీద తాను నిలబడే అవకాశం వచ్చింది  యిప్పుడు. ఈ అవకాశం ఆమెకు అందకుండా చేయొద్దు ప్లీజ్."

    "ఈ ఉపన్యాసం మీ అంకుల్ ముందివ్వు తల్లీ! ఆయన ఒప్పుకొంటే నాదేంలేదు" అంటూ ఆవిడ అసహనంగా  లోపలికి వెళ్లిపోయింది.

     తల్లి అక్కడినుండి వెళ్లగానే శాలిని కుర్చీలోంచి చటుక్కున లేచొచ్చి సుధను బిగ్గరగా కౌగలించుకొంది" కంగ్రాచ్యులేషన్స్!బ్రెయిన్ వాష్ బాగా చేశావు! నీలాంటి స్నేహితురాలున్నందుకు నేనెంత గర్వపడుతున్నానో!"

    "వట్టి శుష్కప్రియా లేనా! ఏమైనా వుందా?"

    "నా  మొదటి జీతం మొత్తం నీకిచ్చే పార్టీకి అంకితం! సరేనా?"

        *    *    *    *    *
   
    నరహరి ఆఫీసునుండి వచ్చి షర్టువిప్పి కొక్కానికితగిలిస్తూ "శాలిని ఏం చేస్తూంది?" అనడిగాడు.

    "గదిలో వుంది."

    "అలుక తీరిందా?"

    "ఉద్యోగం చేయడానికి మీరు పర్మిషన్ ఇవ్వందే అలుక ఎలా తీరుతుంది? మధ్యాహ్నం అన్నంకూడా తినలేదు."

    "అయితే నీ పర్మిషన్ ఇవ్వడం అయిపోయింది. నాది మిగిలి వుందన్నమాట."

    "నాదేం లెఖ్ఖలెండి!"

    "నీమాట కాదని నేను చేసిందేం లేకపోయినా ఈ ఊతపదం వదలవుకదా?" ఇంతకీ ఏమంటూంది శాలిని? వెళ్లి తీరాలంటూందా?"

    "ఆఁ ఆరు నూరైనా వెళ్లి తీరాలంటూంది! దీనికితోడు ఆ సుధొచ్చి ఇంకా ఎగద్రోసిపోయింది. ఆ పోకిరీపిల్ల ఎన్నెన్ని మాటలు కొట్టిపోసిందో నన్ను! పిల్లల్ని కన్నందుకు పెంచడం మీ బాధ్యతలుగా చేశారు అంది. అదేదో సినిమాలోనే, నవల్లోనో అన్నట్టు "కామం ఎక్కువై కన్నారు కాబట్టి" అని సిగ్గు తీయనందుకు సంతోషించాలి మనం" అంటూ సుధ మాటలన్నీ పొల్లు  విడవకుండా చెప్పింది రాధమ్మ.

     "ఆ పిల్ల కరెక్ట్ గానే మాట్లాడింది. ఈ కాలంలో చదువుకొన్న ఆడపిల్లలు సమస్యను సూటిగా గ్రహించ గలుగుతున్నారు వాళ్లకు చదువుంటే మనకు అనుభవముందికదా అనొచ్చు నువ్వు. ఛాందస బావాలతో ముడిపడిన  మన అనుభవ పాఠాలు ఈ కాలం పిల్లలకు సరిపోవు.  వాళ్లు మనమీద తిరుగుబాటు చేసేంతవరకూ మనం వాళ్లమీద వత్తిడి తీసుకురాకూడదు. మన పెద్దరికాన్ని మన గౌరవాన్ని మనం తెలివిగా కాపాడుకోవాలి! మన శాలిని చదువుకొంది చదివిన చదువు వృధాకాకుండా ఉద్యోగం చేస్తానంటూంది. చక్కగా పంతులమ్మ అయి నాలుగు డబ్బులు సంపాదించే పని చేస్తా నంటూంది. అది సంపాదించక పోతే మనం సాకలేమా అన్న అహానికి పోకూడదు మనం.

     "ఆడపిల్ల ఆర్దికంగా నిలబడడమన్నది ఈకాలంలో చాలా అవసరమైన సంగతి! వరకట్న చావులూ, సంసార జీవితంలో భర్తల దౌష్ట్యానికి బలయ్యే అబలలగాధలూ మనం రోజూఎన్నో వింటున్నాం. కంటున్నాం.  ఈ దురవస్థ మన కూతుళ్లకు పట్టుకూడదనుకొంటే, ముందుగా మనం కూతుళ్లనుచదివించి ఆర్దికంగా నిలబడే అవకాసం కల్పించాలి. ఇవాళ ఆడపిల్లలున్న ప్రతి తల్లీ తండ్రీ కర్తవ్యం ఇది.

     "చదువుకొని ఉద్యోగం చేస్తున్న అమ్మాయి అంటే వరకట్నం దగ్గర మనకు కొంత కన్సెషన్ దొరుకుతుంది కాబట్టి మనం ఇప్పుడు శాలినికి అడ్డు చెప్పొద్దు!" నరహరి సాలోచనగా అన్నాడు.

     "ఆ ఉద్యోగం ఏదో మనవూళ్లో అయితే నేనంచేదాన్ని కాదండీ?"

    "ఉన్న వూళ్లోనే ఉద్యోగాలు కావాలంటే ఎక్కడనుండి వస్తాయి? అవ్వాకావాలి బువ్వాకావాలి అంటే కుదురుతుందా? మా ఆఫీస్ లో హెడ్ క్లర్క్ పరంధామయ్య బోలెడంత డబ్బు ట్యూషన్స్ కు గుమ్మరించి కూతుర్ని ఎమ్మెస్సీ చేయించాడు. ముందు ఆ అమ్మాయిని డాక్టర్ని చేయిద్దామని తిప్పలు పడ్డాడు. మూడేళ్లు వరుసగా ఎంట్రన్స్ లో పోయింది చివరికి ఎమ్మెస్సీ అనిపించాడు. ఇప్పుడు బి. ఇ. డి. లో సీటుకోసం అడ్డమైన వాల్ల కాళ్లూ పట్టుకొంటున్నాడు. రావడంలేదు. ఉద్యోగం అసలే రావడంలేదు. ఇంత కష్టపడి  చదివింది ఇలా వృధా కావడానికా అని ఆయన ఒకటే ఇదైపోతున్నాడు.

 Previous Page Next Page