ఇదేదో ఆషామాషీ కాకుండా ప్రభావతి చాలా సీరియస్ గా మాట్లాడుతుందన్నది భాస్కర్ కి అర్ధమైంది, ఛా, తాను కాస్త జాగ్రత్తగా ఉండాల్సింది. ఇలా దొరికిపోయి దీనిముందు దోషిలా నిలబడాల్సి వచ్చిన తన నిర్లక్ష్యాన్ని తిట్టుకున్నాడు. భార్యముందు తగ్గిపోవడం నామోషీ అనిపించింది. జవాబు ఏమీ తట్టక దబాయింపుకి దిగాడు.
"అంత హక్కు ఉందన్నదానివి ఆ ఉత్తరం వచ్చినప్పుడే ఎందుకు అడగలేదు. ఇన్నాళ్ళూ ఎందుకూరుకున్నావు" కోపంగా దబాయించాడు. ప్రభావతి ఆ కోపానికి బెదరనట్టు చాలా తాపీగా "అడిగేదాన్నే, నిజానిజాలు స్వయంగా చూడాలని ఆగాను. అంతేకాక, అదిగాక మీరు దోషి అని నిర్ణయం అయితే నేనేం చెయ్యాలో ఆలోచించుకోవాలిగదా! అడిగాక అవునని తేలితే ఏడ్చి, సాధించి నా కర్మ ఇంతే అని సరిపెట్టుకోవడానికి నేనేం పాతకాలం ఆడదాన్ని కాదుగదా! అన్నివైపులా ఆలోచించి నిర్ణయం తీసుకోవడానికి ఆ మాత్రం టైము నాకు కావాలిగదా". ప్రభావతి ఒక్కొక్కమాట నొక్కి నొక్కి చాలా శాంతంగా అంది. భాస్కర్ ప్రభావతి ఇంతదూరం ఆలోచించి ఇలా మాట్లాడుతుందన్నది ఊహించకపోవడంతో తెల్లపోయాడు.
"చూడండి, ఆకాశరామన్న ఉత్తరాలు, ఫోన్లు రాకముందునుంచే మీలో మార్పు కనిపెట్టలేనంత అమాయకురాల్ని కాదు, ఓ ముప్పయ్ అయిదేళ్ళ మగాడు, వయసులో ఉన్నవాడు కట్టుకున్న భార్యని నాలుగు నెలలనుంచి వేలేసి తాకలేదంటే శారీరక ఇబ్బందన్నా ఉండాలి. మానసికంగా దూరమై ఉండాలి. అంతవరకూ ధూముధాములు చేసినా ఆ పదినిమిషాలు ప్రేమ! ఇప్పుడు రోజంతా ప్రేమ, ఆ పదినిమిషాలు ఎక్కడ భార్యతో గడపాలో అని ఆ టైముకి ధూముధాములు. ఇదంతా కనిపెట్టలేని అమాయకురాలిని కాను. చదువులేని మొద్దుని కాను. ఏమన్నా ఎఫైర్లుంటేనే మగాడు గిల్టీగా ఫీలవుతూ భార్యమీద ఇదివరకటికంటే ప్రేమ కురిపిస్తాడు (నటిస్తాడు). మీ పరధ్యానం, అలంకరణలో మార్పు అన్నీ గుర్తించలేదనుకోకండి. కానీ, ఇది ఊఁ, ఆఁ అంటే విడిపోయేంత తేలిక సంబంధం కాదు. పైగా, మనకో పిల్లవాడున్నాడు కనుక నిజం పూర్తిగా తెలిసేవరకు సహించి ఊరకున్నాను ఇప్పుడింక..."
"ఓహో! ఇప్పుడింక సహించక ఏం చేద్దామని ఇంట్లోంచి వెళ్ళిపోతానంటావా" లోపల బెదురుతూనే తగ్గిపోవడం ఇష్టంలేక బింకంగా అడిగాడు.
"వెళ్ళిపోవాల్సింది నేను కాదు. మీరు. ఇది బ్యాంకువాళ్లు నాకిచ్చిన ఇల్లు" భాస్కర్ అదిరిపోయాడు. ప్రభావతి ఇంత తెగేసి అంటుంది, ఇంతదూరం ఆలోచించి అప్పుడే నిర్ణయం తీసుకుంటుందని ఊహించని అతను షాక్ అయ్యాడు. కాసేపు నోటమాట రాలేదు. తరువాత మొహంలోకి నెత్తురుజిమ్మింది. అంటే నన్ను ఇంట్లోంచి పొమ్మనా' కోపంతో గొంతు వణికింది. ప్రభావతి సూటిగా అతనివంక చూసి అవునన్నట్లు తల ఆడించింది. భాస్కర్ కి దాంతో పౌరుషం వచ్చేసింది.
"ఎంత పొగరు నీకు. ఉద్యోగం ఉందనా ఇంత మిడిసిపాటు. సంపాదిస్తున్నాననా ఇంత అహంకారం. కట్టుకున్నవాడిని ఇంట్లోంచి పొమ్మనేవరకు నీవు వచ్చాక నేనేం అంత చవటని కాను. నిన్ను పట్టుకువేలాడే కర్మ నాకేం లేదు. ఆడదానివి నీకే అంత పొగరైతే నాకెంతుండాలి."
"ఓహో, పొగరులో కూడా ఆడదానికి తక్కువే ఉండాలన్నమాట" హేళనగా అంది.
"నాలుగు డబ్బులు సంపాదిస్తున్నానని మిడిసిపడకు. మొగుడు లేకుండా ఉండడం ఏమిటో నాలుగు రోజులుంటే తెలుస్తుంది. మీ ఆడాళ్ళు సంపాదన చూసుకుని ఎగురుతున్నారు. అందుకే ఆడదాన్ని ఇదివరకు చదువూ సంధ్యాలేకుండా మూల కూర్చోపెట్టారు. అదే సరిఅయింది. చచ్చినట్టు పడి ఉండేవారు" కసిగా అన్నాడు.
"అవును అదే మీ బాధ. ఆడదానికి ఆర్ధిక స్వాతంత్ర్యం లేనన్నాళ్ళూ మీ మగాళ్ళేం చేసినా చెల్లింది, తన్నినా నీవే గదా నాధా అని కాళ్ళు వదిలేది కాదు. ఉంచుకున్నదాన్ని తీసుకొచ్చి కాళ్లు కడిగించినా సహించింది పాపం ఆనాటి ఆడది. ఇప్పుడు ఆడది సంపాదించాలి గాని, అలా పాతకాలంనాటి ఆడదానిలా పడుండాలి. అంటే ఎలా కుదురుతుంది భాస్కర్ రావుగారూ." హేళనగా అంది. భాస్కర్ కి కోపం ముంచుకొచ్చినా అలా మాట్లాడుతున్న ప్రభాతిని ఏం చెయ్యాలో అర్ధం కాలేదు.
"సరే. నీకు మొగుడు అక్కరలేదంటే, ఇంత చిన్న విషయానికి కాపురం వదులుకోవడానికి నీవు సిద్ధపడితే.."
'ఇది చిన్న విషయమా! కట్టుకున్న పెళ్ళాం సంపాదించి, ఇల్లూ వాకిలి చూసుకుని, పిల్లని కని, వంశాన్ని వృద్ధి చేయడానికి, సరసాలకి, సరదాలకి ప్రియురాలన్నది చిన్న విషయంలా మీకనిపించిందేమో? కానీ, ఇది పెద్ద అవమానం. నా వ్యక్తిత్వానికి అవమానం ఈ ఇల్లు నాది. ఈ సంసారం నాది అని ఆడది చాకిరీ చేస్తుంది. అలా లేనప్పుడు ఈ ఇంటికోసం చాకిరీ చేసి సంపాదించి మీ చేతిలో పోయడం ఎందుకు? ఆ డబ్బుతో గౌరవంగా, ఆత్మాభిమానం నిలుపుకుంటూ వేరేగా బతకడం మంచిదన్న నిర్ణయానికి వచ్చాను."
భాస్కర్ బిత్తరపోయాడు. ఈ వ్యవహారం ఇంతదూరం వెళుతుందని ఊహించని అతను నిరుత్తరుడయ్యాడు. 'ఇల్లు, సంసారం, భార్యని వదిలేసి హఠాత్తుగా ఎక్కడికి వెళ్ళాలి. అందరికీ తెలిస్తే పరువేం కాను. బంధువుల ముందు తలెలా ఎత్తుకోవడం, రేపు ఆఫీసులో అందరకీ తెలిస్తే ఎంత చులకన!' అరక్షణంలో లక్ష ఆలోచనలు చుట్టుముట్టాయి. కలవరపడిపోయాడు. తగ్గిపోయినట్లు కనిపించడానికి అవమానం అనిపించింది.
"సరే, ఆడదానివి నీకంత నిబ్బరం అయితే నాకేం, రేపే రాహుల్ ని తీసుకొని వెళ్ళిపోతారు. ఈ ఇల్లు నీవు కట్టుకుని ఊరేగు" ఉక్రోషంగా అన్నాడు.
"వాడి ఒంటిమీద చేయి వేశారంటే మర్యాద దక్కదు. కట్టుకున్న భార్య, కన్నకొడుకు ఉండగా మరో ఆడదానితో తిరిగే మీరు రేపు వాడిని సరిగా చూస్తారని నాకేం నమ్మకం లేదు. వాడు నా దగ్గరే ఉంటాడు. కావాలంటే కోర్టుకెక్కండి. బలవంతంగా తీసుకెళ్ళాలని ప్రయత్నిస్తే నలుగురినీ పిలిచి మీ సంగతంతా చెప్తాను. పోలీసు కంప్లయింట్ ఇస్తాను" నిష్కర్షగా అంది. "మీ దారిన మీరు వెళ్ళి ఆ రంజనతో ఊరేగండి" ఆ నిర్లక్ష్యాన్ని భరించలేక కోపంగా చెయ్యెత్తాడు. ప్రభావతి తీక్షణంగా చూసి చెయ్యి విసిరేసింది. "జాగ్రత్త ఒంటిమీద చెయ్యి పడితే ఊరుకోను. మర్యాద దక్కించుకోండి."
"చూస్తా, వాడిని ఎలా ఇయ్యవో చూస్తా. తండ్రిగా నా హక్కు ఏ కోర్టు కాదంటుందో చూస్తా. నీ అంతు చూస్తా. నీ పొగరణచి నా కాళ్లమీద పడేసుకోకపోతే నా పేరు భాస్కర్ కాదు. నీగతి కుక్కకి కూడా పడకుండా చూస్తా. మొగుణ్ణి కాదన్నందుకు గుణపాఠం నేర్పుతా. ఆ రంజనని పెళ్ళాడి నీ రోగం కుడురుస్తా." చిందులు తొక్కుతూ సూట్ కేస్ లాగి గబగబా బట్టలు కుక్కాడు. అప్పటికీ ప్రభావతి బెదరకపోవడం చూసి కల్లుతాగిన కోతి అయి పెట్టె ధడాలున మూసి "రేపు పొద్దున వచ్చి ఈ సామానంతా పట్టుకుపోతా. చచ్చినా ఈ ఇంట్లో ఉండను" అన్నాడు.
"ఏ సామాను పట్టుకెడతారు. ఈ ఇంట్లో గిన్నెలు, బొన్నెలు, మంచాలవీ మావాళ్ళిచ్చారు. టీ.వీ. ఫ్రిజ్ వగైరాలన్నీ నా జీతంతో కొన్నవి. బట్టలు తప్ప మీవేం లేవు ఇక్కడ."
తన జీతంతో ఇంటిఖర్చు, ప్రభావతి జీతంతో ఇంట్లో సామానులు కొన్నారు. అది ఎంత తెలివిగా తన అవసరానికి తిప్పుకొంది. తనుత్త వెధవ అయిపోయాడు. "సరే చూస్తా, కోర్టులోనే తేల్చుకుందాం." విసవిసా వెళ్ళిపోయాడు.
* * *
రాత్రి పదిగంటలవేళ సామానుతో వచ్చిన భాస్కర్ ని చూసి రంజన తెల్లబోయింది. రంజన భాస్కర్ ఆఫీసులో పనిచేస్తూ ఓ ఇంట్లో గ్యారేజి మీద ఉన్న రూములో అద్దెకుంటుంది. ఆ రూముకి బయటనుంచి ఇంటివాళ్ళ ప్రమేయం లేకుండా వచ్చిపోయే వీలుంది.