Previous Page Next Page 
లవ్ స్టోరీస్ పేజి 8


                                                ఆకర్షణ

    రాధ నించుని అద్దంలో చూసుకొంటూ పెదాలకు లిప్ స్టిక్ పూసుకుంటోంది. నేను వెనుక సోఫాలో కూర్చుని ఆమె వంకే చూస్తున్నాను. ఆ రోజు ఆమె అలంకరణలో చాలా తేడా కనిపించింది నాకు. రెండు జడలు వదులుగా వేసుకొంది. బ్లూ రంగు చీరా, అదే రంగులో - చేతుల్లేని జాకెట్టూ, చెప్పులూ, వాచి స్ట్రాపూ, బొట్టూ- మనిషంతా బ్లూగా ఉంది. ఆమె కళ్ళలో ఓ కొత్త మెరుపు కనిపిస్తూంది. నా వయస్సు పదహారు సంవత్సరాలు. అందుకని ఆ వయసులోని అందరి ఆడపిల్లల్లా మిగతా ఆడవాళ్ల అలంకరణను జాగ్రత్తగా గమనించటం, నచ్చితే కాపీ కొట్టేయటం అంటే ఇష్టం. అంతా ఎక్కువయిం తర్వాత, "ఎలా ఉన్నానే! పౌడర్ కోటింగ్ ఎక్కువలేదు గదా!" అనడిగింది రాధ.

    "అన్నీ అద్భుతంగా సరిపోయాయ్!" అన్నాన్నేను.

    "మరి పోదాం, పద!" అంది, బాగ్ చేతిలోకి తీసుకొని.

    నేను బాగ్ అందుకొని ఆమె వెనకే నడిచాను. ఇద్దరం రోడ్డు మీద కొచ్చాం.

    "టాక్సీ!" అంటూ రోడ్డున పోతున్న ఓ టాక్సీని ఆపేసింది రాధ. ఇద్దరం బాక్ సీట్లో కూర్చున్నాం.

    "పోనీ!" అందతనితో.

    టాక్సీ వేగంగా, రోడ్డు మధ్యగా పరిగెడుతూంది. మేమెక్కడికి పోతున్నామో నాకు తెలీదు. రాధ ఎప్పుడూ ఇంతే! ఎక్కడికి వెళ్తున్నామో, ఆ ప్రదేశం చేరేవరకూ నాకు తెలీనివ్వదు. పోనీ ఆమెని అడిగేంత ధైర్యమయినా నాకు లేదు. చిన్నప్పటి నుంచి ఆమె ఓ డిక్టేటరులా నన్ను శాసిస్తూండటం మూలాన నాకా పిరికితనం ఏర్పడిపోయింది. వయసులో ఆమె నాకంటే అయిదారేళ్లు పెద్దది. అందుచేత మేము స్నేహితురండ్రమయినా,, దాని తాలూకు ఛాయలు చాలా తక్కువగా కన్పిస్తూంటాయి. టాక్సీ గోపీ హోటల్ దగ్గరకు చేరుకోగానే అపమంది రాధ. అతనికి డబ్బిచ్చేసిం తర్వాత ఇద్దరం దిగి హోటల్ మెట్లెక్కి ఓ మూల ఉన్న టేబుల్ మీద కూర్చున్నాం. సాయంత్రపు నీరెండ చిరుగులు చిరుగులుగా చెట్ల ఆకుల మధ్య నుంచి టేబుల్ మీద పడుతోంది. ఉండుండి చెట్లు కదిలినప్పుడల్లా చల్లని గాలి వీస్తోంది.

    సర్వర్ టేబుల్ దగ్గరకొచ్చి - "ఏం కావాలి?" అనడిగాడు.

    "టైమ్!" అంది రాధ.

    అదేమిటో నాకర్థం కాలేదు. సర్వర్ కు కూడా అర్థమయినట్లు లేదు.

    "ఏమిటన్నారూ?" అన్నాడు ఆశ్చర్యంగా ముఖంపెట్టి.

    "టైమయ్యా! అంటే కాలం! ఎంత అయిందో మీ మేనేజర్ని అడిగి చెప్పు - నా వాచ్ ఆగిపోయింది!" అంది చిరాకుగా.

    నాకు నవ్వాగలేదు. రాధ ఎప్పుడూ ఇలాంటి తమాషా ఏదో ఒకటి చేస్తూనే ఉంటుంది. కాలేజీకి వెళ్ళేటప్పుడు త్రోవలో కుర్రా డెవరయినా మా ముందు ఒంటరిగా నడుస్తూ కనిపించాడా, అతని ఖర్మ కాలిందన్న మాటే! అతన్ని మూడు చెరువులు నీళ్ళు తాగించేది. 'అబ్బ, దేవానంద్ లా ఉన్నాడే! మన కాలేజేనా అతనిది?' అనేది. అతను వెనక్కు తిరిగి సీరియస్ గా చూసేసరికి "అబ్బ! మన మాటలు నిజమే ననుకొని ఫోజు పెడుతున్నాడోయ్. మంకీ బ్రాండ్ మొహం వీడునూ!" అనేది. దాంతో కురాడు ఎక్స్ ప్రెస్ బస్సులా అక్కడి నుంచి పరుగెత్తేవాడు. ఇలాంటి సంఘటనలు ఇంకా చాలా జరిగాయి. వట్టి ఆకతాయి రకమని కాలేజీ అంతా ఆమె పేరు మార్మోగిపోయింది. కొంతమంది ఆమెకు 'ఫైరింజన్' అనీ 'వైల్డ్ హార్స్ అనీ బిరుదు లిచ్చారు. కానీ, ఆవేమంత ప్రాచుర్యంలోకి రాలేదు. కారణం 'ఎల్లో రోజ్!' అన్న బిరుదు. పీయూసీలో చేరిన మొదటి రోజునుంచే ఆమె అందాన్ని చూసి 'ఎల్లో రోజ్' అని బిరుదు పెట్టారెవరో! ఆ పేరే సార్థకమయిపోయింది కూడా!   

    రాధ నిజంగా అందమయినదే! అదీ సామాన్యమయిన అందం కాదు. మగాళ్ళకు వెర్రెక్కించే అందం. దానికి తగ్గట్లుగా ఆమె అలంకరణ కూడా చాలా పెద్ద ఎత్తులోనే ఉండేదీ. మార్కెట్లో ఏమయినా కొత్తరకం చీరలుగానీ, చెప్పులుగానీ వస్తే మొదట రాధ కొనాల్సిందే! మంచి సినిమాలు వస్తే రాధ నన్నూ, తన ఫ్రెండ్స్ నూ ఫస్ట్ డే, ఫస్ట్ షోకి కాలేజీ ఎగ్గొట్టించమయినా సరే తీసుకువెళ్ళేది. హాల్లో నానా గొడవా చేసేవాళ్లు. నేను ఆ తమాషా అంతా చూస్తూ, రాధ అంత పెద్దదాన్నయ్యాక నేనూ ఎలా అల్లరి చెయ్యాలో రిహార్సలో వేసుకుంటూండేదాన్ని. వీలయినంత వరకూ ఆమెను అనుకరిస్తూండేదాన్ని కూడా! కాని ఎటోచ్చీ - రాధ అంత అందం, వాళ్ళకున్న స్థితిగతులూ నాకు లేవు. మాది బీద కుటుంబం. మాతల్లిదండ్రులకు మేము నలుగురాడపిల్లలం. మిగతా ముగ్గురూ నాకంటె చిన్నవాళ్ళు. మా నాన్న కొచ్చే జీతంలో మాఅందరికీ గడవడం కష్టంగానే ఉండేది. అడపా దడపా ఆయన అప్పులు చేస్తూండటం నాకు తెలుసు. అలా అప్పులు చేసినప్పుడల్లా అమ్మ నాన్నమీద విరుచుకుపడుతూండేది. "జీతమంతా పేకాటలో పెడుతున్నారు. అందుకే మనకు చాలటం లేదు!" అంటూండేది. నాన్న పేకాట ఆడతారో, లేదో నాకు తెలీదు. కానీ అమ్మ అలా ఊరికే నాన్నని నిందించటం- ఆమెకు సంతోషకరమయిన విషయమని నే ననుకోను. ఎప్పుడో ఒకప్పుడు నాన్న పేకాటలో తగలేసే ఉండాలని నా అనుమానం. ఇకపోతే నా విషయంలో- నేనెప్పుడూ డబ్బుకోసం అవస్థపడలేదు. అందుకు కారణం - ఎప్పుడూ రాధ వెంబడి తిరగడమే. రాధ డబ్బు ఖర్చు చేసేప్పుడు నన్ను తన స్వంత చెల్లి అనుకొనే ఖర్చు చేసేది. మా ఇద్దరికీ పరిచయం కూడా చాలా విచిత్రంగానే జరిగింది.

    వాళ్ళ మేడకు ఎదురుగా ఉన్న పెంకుటింట్లో అద్దెకు దిగాం మేము. వాళ్ళ కాంపౌండ్ గోడ నానుకొని లోపలివేపు బోలెడు గులాబీ మొక్కలుండేవి. రోజూ అవి విరగబూస్తుండేవి. వాటిని కోసుకోవాలని ఆశగా ఉండేది. కాని భయం వేసేది. ఓ రోజు తెగించి బయటినుంచి కష్టపడి ఓ పువ్వు కోశాను. కోసి వెనక్కు తిరిగేసరికి రాధ నించుని ఉంది.

    "దొంగతనంగా పూలు కోస్తున్నావా, బ్లడీపూల్!" అంది.

    "నువ్వే బ్లడీ పూల్!" అంటూ ఎదురుతిరిగాన్నేను. మరుక్షణమే నా చెంప చెళ్ళుమనిపించింది రాధ. నేను గట్టిగా ఏడవటం మొదలెట్టాను. ఏడుపు చూసి కంగారుపడిపోయింది రాధ. చాలాసేపు ఏడవవద్దంటూ బ్రతిమాలింది. తనే మరికొన్ని పూలు కోసుకొచ్చి నాకిచ్చింది. వెంటనే మా ఇద్దరికీ రాజీ కుదిరిపోయింది. ఆ రోజునుంచీ ఇద్దరం ప్రాణ స్నేహితులమైపోయాం. ఎప్పుడూ ఆమెతోనే కలిసి  తిరగడం, కలిసి చదువుకోవడం, వాళ్ళింట్లోనే పడుకోవడం అలవాటయిపోయింది. ఆ ఇంటికి రాధ ఒక్కర్తే ఆడపిల్ల కావడం వల్ల ఆమె ఇష్టానికి ఎవ్వరూ అభ్యంతరం పెట్టేవాళ్ళు కాదు.

    "అయిదూ పది!" అన్నాడు సర్వర్, తిరిగొచ్చి.

    తన వాచీలో టైమ్ సరిచేసుకొంది రాధ.

    సరిగ్గా అప్పుడే ఓ యువకుడు నీట్ గా డ్రస్ చేసుకొని మా టేబుల్ దగ్గరకు వచ్చి నిలబడ్డాడు.

    "కమాన్, హావ్ యువర్ సీట్!" అంది రాధ అతన్ని చూసి చిన్నగా నవ్వుతూ.

    అతను రాధ కెదురుగ్గా ఉన్న కుర్చీలో కూర్చున్నాడు.

    నాకు ఆశ్చర్యం వేసింది. అతన్నింతకు ముందు ఎక్కడా చూసినట్లు గుర్తు లేదు. రాధ బంధువుల్లో కూడా అలాంటి కుర్రాడున్నాడని నేననుకోను.

    "మీరు పది నిమిషాలు లేట్!" అంది రాధ.

    "ఎక్ట్ర్సీమ్లీ సారీ, టైమ్ కి బస్సు దొరకలేదు" అన్నాడతను. అని, చిన్నగా నవ్వి నావంక చూసాడు. అంతే! ఉక్కిరి బిక్కిరయ్యాను. అతని చూపుల్లో విపరీతమైన ఆకర్షణ శక్తి ఉంది. ఆ ఆకర్షణ సామాన్యమైంది కాదు. ఒక్కసారి చూస్తే జీవితమంతా అతని పక్కనే గడిపేయాలనిపిస్తుంది. అతనితోపాటు కళ్ళు కూడా నవ్వుతున్నాయి. బిస్కెట్ రంగుపాంటూ, తెల్లని షర్టూ అతనికి చక్కగా అమరినాయి. ఎర్రని అతని శరీరపు రంగు చాలా రొమాంటిక్ గా ఉంది. అప్పుడు నేను హెచ్.ఎస్.సి. చదువుతున్నాను.

    వాళ్ళ సంభాషణ నాకు మరీ విడ్డూరమనిపించింది. ఇక్కడ కలుసుకోవాలని వాళ్ళిద్దరూ ముందే అనుకున్నారు. ఎప్పుడు అనుకున్నారు? అసలెందుకు కలుసుకున్నట్లు? ఇంతకూ అతనెవరూ? మొదలయిన ప్రశ్నలయితే చకచకా వచ్చాయ్ గాని, జవాబు ఒక్కటీ దొరకలేదు.

 Previous Page Next Page