మర్నాడు తెల్లవారకముందే లేచి కూర్చుంది రాజి. దాని హడావుడికి మా అందరికీ నిద్రపాడయిపోయింది. ఇంకా పూర్తిగా తెల్లవారకముందే రాజి తలంటు స్నానం చేసి జుట్టు అరబెట్టుకొంటూ కనిపించింది మాకు. చెల్లాయ్ వంటింట్లో హడావుడిగా ఉంది. అందరం కాఫీ టిఫిన్లు ముగించేసరికి ఎనిమిదయిపోయింది. రాజి చీర కట్టుకొని పొంగిపోతూ అద్దం ముందు కూర్చుండిపోయింది. ఈలోగా మామయ్య రిక్షా తీసుకొచ్చేశాడు. రాజి తనతోపాటు తెచ్చుకొన్న సూట్ కేస్ తీసుకెళ్ళి రిక్షాలో పెట్టాన్నేను. నాన్నగారు రాజి వెళ్ళిపోతున్నందుకు లోలోపలే కుళ్ళిపోతున్నారు. మామయ్య రిక్షా దగ్గరకెళ్లి నుంచున్నాడు.
"రాజి రాదేం, పిలువ్- ఎక్కడుందో" అంది చెల్లాయ్.
"రాజీ" అంటూ నేను అక్కడినుంచే అరచాను. సమాధానం రాలేదు.
"దయ్యం- ఏ మూల ఏం చేస్తోందో, వెళ్ళి పిల్చుకురా!" అందామె. అన్ని గదులూ వెతుక్కొంటూ తిరిగాను. ఎక్కడా ఆమె జాడ కనిపించలేదు. నాకు ఆశ్చర్యం కలిగింది. ఇంతలోనే ఎక్కడికి మాయమయిపోయిందా అని. చివరకు పెరట్లోని బాదంచెట్టు క్రింద కూర్చుని ఏవో ఆలోచనల్తో ఆకాశంలోకి చూస్తూ కనిపించింది.
"ఏయ్ పద! మామయ్య పిలుస్తున్నాడు. అన్నాను చిరాకుగా.
రాజి జవాబివ్వలేదు. నావంక చూడలేదు. అసలు నా మాట విన్నట్లే కనిపించలేదు. నిర్మలంగా, కదలకుండా అలాగే చూస్తోంది. అక్కడ ఏముందా అని ఆమె చూస్తున్న వేపే నేనూ చూసేను. ఆకాశం నిర్మలంగా ఉంది. చూడదగినంత విశేషం ఏమీ కనిపించలేదు. "ఏయ్ రాజీ! అవతల బస్ కి టైమైపోతుంది. త్వరగా పద!" అన్నాను కొంచెం గట్టిగా.
అప్పటికీ రాజి చలించలేదు. నన్ను గమనించినట్లే లేదు. నాకు ఆశ్చర్యంతోపాటు భయంకూడా కలిగిందీసారి.
దీనికేమయిందివాళ... ఎక్కడా ఓ క్షణం కూడా కూర్చోనిదీ. ఇరవై నాలుగ్గంటలూ ఏదో ఒక చిలిపి పని చేసేది, ఇలా నిశ్శబ్దంగా కూర్చోడమే కాకుండా ఎంత పిలిచినా జవాబివ్వకుండా - అదీ తనెప్పటి నుంచో కావాలని ఏడ్చి, అల్రిపెట్టి, సాధించిన చీర కట్టుకున్న రోజున ఇలా ఎందుకు ప్రవర్తిస్తోంది; నాకేమీ అర్థం కావడం లేదు.
"ఏయ్- నిన్నే పిలిచేది! అలా కూర్చున్నావేమిటి? రిక్షా వచ్చిందవతల. అందరూ నీకోసం చూస్తున్నారు.. ఓ రాజీ!" అంటూ గట్టిగా అరిచాను. ఓ నిముషం తర్వాత నా వంక చూడకుండానే "బావా!" అంది నెమ్మదిగా.
తృళ్ళిపడ్డాను నేను. అంతవరకూ ఏనాడూ నన్ను 'బావా' అని పిలిచిన పాపాన పోలేదు. ఎప్పుడూ ఏదో నిక్ నేమ్ తో గానీ లేదా 'ఒరేయ్ అనిగానీ, లేదా పోట్లాట లొచ్చినప్పుడు తన కిష్టమయిన తిట్లద్వారాగానీ పిలిచేది. నెమ్మదిగా, తాపీగా మాట్లాడసాగిందది. దాని గొంతులో ఏదో కొత్తదనం కనిపిస్తోంది. దాని కళ్ళలో అంతకుముందు కనిపించని వెలుగు-
"నాకే ఆశ్చర్యంగా ఉంది బావా! నాకు ఊహ తెలిసిన దగ్గర్నుంచీ కూడా ఇంత అల్లరిదాన్నిగా, మొండిదాన్నిగా ఎందుకు తయారయ్యాను? అమ్మని ఎందుకంత ఏడిపించేదాన్ని? నిన్నూ, అక్కయ్యనూ ఎందుకంత అల్లరి పట్టించేదాన్ని? నాన్నగారి మనసు ఎందుకు కష్టపెట్టేదాన్ని? నా చుట్టూ ఉన్న వాళ్ళందరూ అయిష్టపడేలా ఎందుకు ప్రవర్తించేదానిని? ఎవ్వరు చెప్పినా వినకుండా తెలుసుకోకుండా, ఎదురు తిరిగి ఎందుకు విర్రవీగేదానిని? నాకే తెలీదు బావా అది. ఈ చీరకోసం ఎందుకంత గొడవ చేసేదాన్ని తెలుసా? ఎందుకో నేను అందరిలా పుట్టలేదనిపించేది నాకు. నా రూపం ఎందుకో నాకు సంతృప్తి కలిగించలేదు. అందరిలా ఉండాలన్న కోరిక నన్నెప్పుడూ కాల్చేస్తూ ఉండేది. చీర కట్టుకొంటే నేనూ ఓ మామూలు అమ్మాయిలా కనబడతానన్న ఆశ కలిగింది నాలో. అందుకే చీర కావాలని గొడవచేసే దాన్ని. చీర కట్టుకొంటే నా రూపం ఎలా వుంటుందా అని ఊహించుకొంటూ గంటల తరబడి అద్దం ముందు నిలబడేదానిని. కాని అమ్మని బాధ పెడుతున్నానన్న విషయమే నేను గమనించలేదు. ఆఖరి క్షణాల్లో కూడా అమ్మ "నాకు చీర కొనిపెట్టమని" కలువరించిందంటే అమ్మకి నా మీద ఎంత ప్రేముందో తెలీటం లేదూ? కాని.... బావా! అంతా నా భ్రమ, చీర కట్టుకొన్నంత మాత్రాన కొత్తరూపం ఎక్కడినుంచి వస్తుంది మనిషికి?" మాట్లాడడం కొద్దిక్షణాలు ఆపింది రాజి.
నేను నిశ్చేష్టుడనయి నిలబడిపోయాను. రాజి పెద్ద ఆరిందాలా అంత పెద్ద మాటలు మాట్లాడుతుంటే వింతగా ఉంది నాకు.
"కాని బావా! నాపై రూపం, లోపలి రూపం ఒకటికాదు. లోపల నాకేమాత్రం కపటం లేదు. పెంకితనం లేదు. ద్వేషం లేదు. అయిష్టం లేదు. కోపం లేదు. నేను అందరినీ ప్రేమించాను బావా! నిన్నూ, అక్కయ్యలనూ, అమ్మనూ, నాన్నగారినీ- నీకు తెలుసుకదు బావా! ఓసారి మనందరం బందర్లో దసరా పండుగకి అర్థరాత్రి కోనేటి సెంటర్ కెళ్ళాం! అక్కడ ఊరేగింపుతో రావణాసురుడి బొమ్మను తీసుకొచ్చారు. ఆ బొమ్మ లోపల ప్రేలుడు సామానుంచారు. పైన గుడ్డలతో కప్పారు. దానిని నిప్పంటిస్తే ఏముంది. బొమ్మ ప్రేలిపోయి అసలు రూపమే లేకుండా చెల్లా చెదురయిపోయింది. అవునా బావా! నేనూ ఆ రావణాసురుడి బొమ్మనే. నేను చేసే అల్లరీ, ఆగడాలూ అన్నీ ప్రేలుడు పదార్థాలు బావా! అన్ని ప్రేలిపోతే లోపల మిగిలేదేమిటి? ఖాళీ! ఏమీ ఉండదు. మీ అందరకూ నేను చేసిన అల్లరికి నేనంటే కోపం ఉంటుంది. నాకు తెలుసు. అందుకే నేను వెళ్ళిపోతున్నా మీకు సంతోషంగానే ఉంటుంది. కానీ చిన్నప్పటినుంచి నాకు ఊహ తెలిసిందగ్గర్నుంచీ, నా సర్వస్వమూ మీరే అనుకొన్న నాకు. ఇప్పుడు మా ఇంటికే వెళ్తోన్నా- ఏ పరాయి వాళ్ళింటికో వెళ్తున్నట్లుంది. నేనింక అదివరకటి రాజిని కాదు బావా! మారిపోయాను. ఎంత మారిపోయానంటే అప్పటికీ ఇక ముందుటికీ అసలు పోలికే ఉండదన్న మాట...." ఇలా చెప్తూంటే ఆమె కళ్ళవెంబడి జలజల నీళ్ళు రాలిపోయినయ్. లేచి నుంచుని నా దగ్గరకొచ్చి నా కళ్ళల్లోకి చూసింది.
"బావా! నా మీద కోపం ఇంకా ఉందా?"
"ఉహు... లే... దు..." అన్నాడు గాబరాగా.
"అలా అని మాటివ్వు!" అంది చేయి చాస్తూ.
"నిజంగా రాజీ! నువ్వంటే కోపం లేదు..." అన్నాను ఆమె చేతిలో చేయివేస్తూ.
"రాజిని తీసుకురా అంటే నువ్వూ వచ్చి ఇక్కడే నుంచున్నవా" అంటూ వచ్చింది చెల్లాయ్. రాజి వెంటనే చెల్లాయ్ తో బయటకు నడిచింది. నేనొక్కడినే అక్కడ మిగిలిపోయాను. హఠాత్తుగా ఓ అనుమానం వచ్చి రాజి ఆకాశంలోకి చూసినవేపు చూశాను. అక్కడ ఏమీలేదు. అంతా తెల్లగా ఉంది.
రాజి వెళ్ళిపోయింది. ఆ తరువాత కొద్ది రోజులకు చెల్లాయ్ కూడా అత్తారింటికెళ్ళిపోయింది. నేను వైజాగ్ యూనివర్సిటీలో చేరిపోయాను. ఆరునెలలు కాకుండానే ఇప్పుడీ టెలిగ్రామ్.
"రాజికి సీరియస్ గా ఉంది. వెంటనే బయల్దేరు."
రైలు సామర్లకోటలో ఆగింది. త్వరత్వరగా దిగి స్టేషన్ బయటకు నడిచాను. ఓ టాక్సీ ఎక్కి వేగంగా పోనిమ్మని చెప్పాను డ్రైవర్ కి. గాలిలో తేలిపోతున్నట్లు నడుపుతున్నాడతను. నలభై నిమిషాల్లో మామయ్య వాళ్ళ పల్లె చేరుకున్నాను. ఒకరిద్దరి సాయంతో శిధిలావస్థలో ఉన్న మామయ్య పెంకుటిల్లు చేరుకున్నాను. మట్టి అరుగుల మీద దిగులుగా కూర్చుని ఉన్నాడు మామయ్య. నన్ను చూడగానే అతని ముఖం వికసించింది.
"నీకు టెలిగ్రామ్ అందిందో లేదోనని ఆలోచిస్తున్నాను... పద - రాజిని చూద్దూగాని" ఆనందంగా అన్నాడతను. ఇద్దరం వెల్తురు అంతగా చొరని లోపలిగదిలోకి నడిచాం. మంచం మీద చిక్కి శల్యమయిపోయిన రాజి గుర్తుపట్టడానికి వీల్లేకుండా ఉంది.
"మీ అందరి మీదా బింగెట్టుకొందయ్యా - ముఖ్యంగా నీమీద" నెమ్మదిగా అన్నాడు మామయ్య. నాకు దుఃఖం కమ్ముకొచ్చిందామెను చూస్తుంటే.
మంచంమీద కూర్చుని "రాజీ" అంటూ ఆమె శిరస్సుని తాకాను. అతికష్టం మీద కళ్ళు తెరిచిందామె. "నేనే రాజీ వచ్చేశాను - చూడు!" అన్నాను అప్యాయంగా. ఒక్కక్షణం ఆమె కళ్ళల్లో వెలుగు కనిపించింది నాకు. ఆ రోజు బాదంచెట్టు క్రింద కొత్తచీర కట్టుకొన్న సమయంలో ఆమె కళ్ళల్లో కనిపించిన వెలుగే అది. నెమ్మదిగా తన చేతిని ఎత్తి నా చేతిని తాకింది. అంతే - మరుక్షణం ఆమె ప్రాణాలు గాలిలో కలిసిపోయినాయ్. మామయ్య ఆమె చేతిని పట్టుకొని చూసి బిగ్గరగా ఏడ్చేయడం మొదలుపెట్టాడు. నేను లేచి బయటికొచ్చేశాను, నాకు తెలీకుండానే. నా ప్రమేయమేమీ లేకుండానే నా కళ్ళవెంబడి నీళ్ళు కారిపోతున్నయ్.
రావణాసురుడి బొమ్మ ప్రేలిపోయింది.
లోపల ఖాళీ - అసలా బొమ్మ ఉండేదన్న గుర్తు కూడా మిగలనంతటి శూన్యం! ఆ రాజి నాకు మిగిల్చిందల్లా పుట్టెడు దుఃఖం, ఆనాడు నా గదిలో తగిలించిన నా "రాక్షసి చిత్రం" అంతే!
* * * * *