దేవయాని కచునికై ఎదురు చూచినది. కచుని జాడ కనిపించలేదు. సందె చీకట్లు కమ్మినవి. ఆమె మనసున చీకట్లు ముసురుకున్నవి. గుండె గుబగుబ లాడినది. అటునిటు తిరిగినది. కచుడు రాలేదు. ఆమెలో ఆరాటము పెరిగినది. మనసు కీడు శంకించినది. దుఃఖము పొంగినది. ఒంటరిగా ఏడ్చినది - ఏడ్చినది. ఒదార్చుకున్నది.
దేవయాని శుక్రుని దగ్గరకు వెళ్ళినది. అతడు మత్తులో ఉన్నాడు. కచుని గురించి డగ్గుత్తుకతో అడిగినది.
"బిడ్డా! కచుడు నావద్ద నుంచి మృతసంజీవని సంగ్రహించునని రాక్షసులు కచునిపై పగబూనినారు. వారు అతనిని చంపి ఉందురు. కచునకు పుణ్యలోకములు ప్రాప్తించును. నీవు విచారించకు" అన్నాడు శుక్రుడు.
దేవయాని దుఃఖము పొంగినది.
"తండ్రీ! కచుడు బృహస్పతి పుత్రుడు. మీకు శిష్యుడు. బ్రహ్మచారి అందమయినవాడు. అతనిని రాక్షసులు చంపినారు. ఇది అన్యాయము. అతడు కనిపించు వరకు నేను అన్నము ముట్టను" అని బెదిరించినది గోడుగోడున ఏడ్చినది.
శుక్రాచార్యుని మైకము దిగినది. తన దివ్యదృష్టితో కచుని కొఱకు సమస్త లోకములు గాలించినాడు కనిపించలేదు. కలవరపడినాడు. అప్పుడు గ్రహించినాడు తనలో చూచుకోలేదని. శుక్రుడు తనలో చూచుకున్నాడు. కచుడు ఉదరమున కనిపించినాడు. కడుపులోని కచుని బ్రతికించినాడు! "కచుడా! ఎట్లున్నావు?" అని అడిగినాడు.
"ఆచార్యా! మీ దయవలన జీవించియున్నాను. బయటికి వచ్చు మార్గము చూపవలెను" అని ప్రార్ధించినాడు.
దేవయాని ఆనందమునకు అవధులు లేవు. బయటికి రప్పించమని తండ్రిని వేడుకున్నది.
శుక్రుడు బయట ఉన్న కూతురును చూచినాడు. కడుపులోని కచుని చూచినాడు. ఆలోచించినాడు. కచునకు మృతసంజీవని బోధించినాడు. తన కడుపు చీల్చుకొని రావలసిందని చెప్పినాడు. కచుడు అట్లే వచ్చినాడు. వచ్చి శుక్రుని బ్రతికించినాడు.
శుక్రుడు సంతోషించినాడు.
దేవయాని మురిసి పోయింది.
అప్పుడు శుక్రుడు మరింత ఆలోచించినాడు. ఇదంతయు కల్లు త్రాగుట వలన కలిగిన ఆపద అని గ్రహించినాడు. బహు ప్రయాసపడి పుణ్యము అర్జింతుము. కల్లు త్రాగుట వలన అది క్షణములో నశించును. కల్లు వలన బుద్ది నశింతును. ఆ మత్తు నందు మనిషి అకార్యములు చేయును. కాబట్టి కల్లు త్రాగరాదు.
"బ్రాహ్మణులు కల్లు త్రాగరాదు. కల్లు త్రావిన బాపలు నరక లోకమున పడుదురు. ఈనాటి నుంచి నేను ఈ నియయము చేసినాను. దీనిని అందరూ పాటించవలెను" అను నియమమును ఏర్పరచినాడు శుక్రాచార్యులు.
కచునకు సంజీవని లభించినది. అతని పని తీరినది. అయినను శుక్రుని వద్ద కొంతకాలము ఉన్నాడు. దేవయానిలో మరిన్ని ఆశలు రేకెత్తించాడు.
కచుడు స్వర్గమునకు తిరిగి వెళ్ళదలచినాడు. శుక్రునికి పాదాభివందనం చేసినాడు. ఆచార్యుని వద్ద అనుమతి పొందినాడు. దేవయానితో "లాంచానము" గా చెప్పుటకు వెళ్ళినాడు. దేవయాని క్రుంగిపోయింది. మగవారలు కదా! అనుకున్నది కచునితో అన్నది :-
"నీవు బ్రహ్మచారివి. నేను కన్యను. నీ మీద వలపు పెంచుకున్నాను. నా తండ్రి వద్ద మృతసంజీవని స్వీకరించినావు. అట్లే నన్ను కూడ స్వీకరింపుము. నీవు లేక బ్రతుకుట దుర్లభము" ఇంకను చాల చెప్పదలచినది. కాని దుఃఖము పొంగినది. కన్నీరు జలజల రాల్చినది.
కచుడు కరగలేదు.
"దేవయానీ! గురువు తండ్రితో సమానుడు. నీ తండ్రి నాకు తండ్రి అగును. నీవు నాకు చెల్లెలివి . నిన్ను స్వీకరించుట తగదు, లోకము మెచ్చదు."
దేవయాని ప్రేమపాదపము మీద అగ్గివాన కురిసినది. అది వాడి, కాలి, కూలినది. దేవయానిలో రోషాగ్ని రగిలినది. ఆమె శపించినది :-
"నా వలపు నెపమున సంజీవని సాధించినావు. అది నీకు ఫలించకుండునుగాక."
కచుడు ప్రతిశాప మిచ్చినాడు.
"నేను ధర్మమార్గమున సంజీవని సాధించినాను అదినాకు ఫలించకున్న నా ఉపదేశము పొందిన వారికి ఫలించును; నీవు ధర్మ విరుద్దమయిన కోరిక కోరినావు. కావున నిన్ను బ్రాహ్మణుడు పెండ్లాడడు."
ఆవిధముగా ప్రేమ పగగా మారినది.
ఆలోచనామృతము
ఇదొక ప్రేమ కధ. ఇందు మనసుల రాపిడులు వినిపించుచున్నవి. ఎడదల చప్పుళ్ళు వినిపించుచున్నవి.
ఇది వట్టి ప్రేమ కధ మాత్రమూ కాదు. ఇందు ఆలోచించవలసినది చాల ఉన్నది. లోతుగా ఆలోచించుటకు అనువయిన సామాగ్రి చాల ఉన్నది.
1. వృషపర్వుడు రాక్షసులకు ముఖ్యుడు. అతనిని రాజుగా చెప్పలేదు. ఇంకా వ్యవస్థగా రాజు ఏర్పడినట్లు కనిపించదు. దేవతలకు ఇంద్రుడు రాజుగా ఉన్నట్లు కనిపించదు. ఈ కధలో ఇంద్రుని ప్రసక్తి లేదు.
2. రాక్షస ముఖ్యుడు వృష పర్వుడు దేవతలకు ముఖ్యుడు ఉన్నట్లు లేదు.
3. రాజుల కన్న పురోహితులు ప్రాముఖ్యము వహించినారు. పురోహితులు మేధావులు, శాస్త్రజ్ఞులు. రాచ బలము కన్న శాస్త్రబలమునే ఎక్కువ గుర్తించినట్లున్నారు.
4. శాస్త్రవిజ్ఞానమున దేవతల కన్నా రాక్షసులే మిన్నగా కనిపించుచున్నారు.
5. మృత సంజీవని మిధ్య కాదు. ఈనాటికి దాని కొఱకు నిరంతర పరిశ్రమ సాగుచున్నది. సంజీవని రానున్నదని అమెరికాలో మృత కళేబరములను భద్రపరచుట జరుగుచున్నది.
6. నాటి నుంచి నేటి వరకు ప్రేమ ఫలించు సమాజము అవతరించలేదు. ఆయుధము గెలుచుచున్నది. ప్ర్రేమకు విజయము లేదు.
7. పవిత్రమయిన ప్రేమను నికృష్టమయిన రాచకీయమునకు బలి ఇచ్చుట జరిగినది.
దేవతలు కుట్ర చేసినారు. శుక్రుడు ఉదారుడు. కచుడు వచ్చిన కార్యము అతనికి తెలియును అయినను, శిష్యునిగా గ్రహించినాడు.
దేవయాని ఆడది. అమాయకురాలు. కచుని ప్రేమించినది. ఏ పక్షము వాడయినదీ లక్ష్య పెట్టలేదు. కచుడు దేవయాని ప్రేమను వాడుకున్నాడు. ఆమె లేకున్న అతనికి సంజీవని లభించేడిది కాదు. అంతవరకే ఆమెతో పని. పని తీరినది ఆమెను ఈసడించినాడు.