ఇప్పుడు పెళ్లిచూపులు ఫిక్సయ్యాయంటే ఆమెకు తను నచ్చేవుంటాడు.
ఈ విషయం తలచుకోగానే రాజుకు ఛాతీ ఉబ్బింది. పాప తనను ఓకే చేసిందని రాణికి చెప్పాలి. కానీ ఎలా?రాణి అతడికి దొరకడంలేదు.
ఇంట్లో ఏమైనా పిండివంటలు చేస్తే ఇప్పుడు రాణి తమ్ముడు తెచ్చి ఇస్తున్నాడు మీ అక్క రావడంలేదే అని అడగడానికి రాజుకు మొహమాటం.
తమ ఇద్దరి మధ్యా ఇంత ప్రేమ వ్యవహారం నడుస్తున్నదని ఆ ఇంట్లో ఎవరికీ తెలియదు మరి!
సందర్భం రాకపోతుందా- చెప్పొచ్చులే అని అతడా ఉత్తారాన్ని జేబులోని పెట్టుకుని తిరుగుతున్నాడు. కానీ సందర్భం రాలేదు.
రోజులు గడుస్తున్నాయి. రాజుకు పెళ్ళిచూపుల గురించి సస్పెన్సు లేదు. పాపనతడెప్పుడో చూసివున్నాడు. విషయం రాణికి తెలియాలనే అతడి ఆత్రుత....
అలా నాలుగురోజులు గడిచేక-రాజులో సహనం చచ్చిపోయింది.
మర్నాడే తనవాళ్లు బయల్దేరి వస్తున్నారు. ఆ విషయం పవన్ కి కూడా తెలియదు ఎందుకంటే రాజు తల్లిదండ్రులు పవన్ ఇంట్లో దిగడంలేదు.
రాజుకు దొడ్డకూతురొకామె ఆ ఊళ్ళోనే వుంటోంది. ఆమెకు కొత్తగా పెళ్లయింది భర్తది చిన్న ఉద్యోగం. ఆ ఉద్యోగానికి తగ్గ చిన్న ఇంట్లోవాళ్లుంటున్నారు.
రాజు తమ ఇంటికి రావడంలేదని ఆ అమ్మాయి ఫిర్యాదుచేస్తుంది.కావడానికి దొడ్డ కూతురే అయినా రాజుకు ఆ పిల్లతో చిన్నప్పట్నుంచీ ఎక్కువ పరిచయం లేదు స్వత హగా మొహమాటస్థుడైన రాజు ఒకసారి వెళ్ళాడు వాళ్ళింటికి-అంతే!
వెళ్ళిన ఆ కాస్సేపూ అతడు అపరిచితుడిల మసిలాడు. ఆదరించడానికి ఆ అమ్మాయీ ఇబ్బంది పడింది. ఆమె భర్త ముక్తసరిగా పలకరించి ఊరుకున్నాడు. చదువుతక్కువని కాంప్లెక్సుందేమో తెలియదు.
రాజు మళ్ళీ వాళ్ళింటికి వెళ్ళలేదు. అందుకని దొడ్డ రాజుతల్లిమీదా నిష్ఠూరంగా వేసింది.పెళ్ళిచూపుల పేరు చెప్పి వాళ్ళింట్లోనే వుంటున్నాడుకాబట్టి- కనీసం తన తల్లిదండ్రులు వస్తున్నా వార్తా పవన్ కు చెప్పడం తన బాధ్యత అని రాజుకు అనిపించింది.
జాప్యం చేసి చేసి ఆ రోజురాత్రి ఎనిమిది గంటలప్రాంతాల-కబురు చెబుదామని తన గదిలోంచి బయల్దేరిన రాజుకి గుమ్మంలోనే ఎదురయ్యాడు పవన్.
"ఏమిటీ-బయటకు వెడుతున్నావా?" అన్నాడతను.
"లేదండి, మీ గురిందే బయల్దేరాను" అన్నాడు రాజు.
పవన్ నవ్వుతూ-"అయితే మా ఇంటికిచ్చి చెబుతావా, లేక మీ ఇంట్లోమాట్లాడుకోవచ్చా?" అన్నాడు.
తను పవన్ లోపలకు రమ్మనలేదని అప్పుడు గుర్తించి,"అయ్యో-లోపలకు రండి" అంటూ ఆహ్వానించాడు రాజు.
అప్పుడా గదిలో వున్న రెండే రెండు కుర్చీలకు ఒక్కసారిగా యజమానులు దొరికారు. "చెప్పు" అన్నాడు పవన్.
"రేపు మా అమ్మానాన్నా వస్తున్నారు....."అన్నాడు రాజు.
"మరి నేను చెప్పనా?"
"చెప్పండి"
"రేపు మీ అమ్మానాన్నా రావడంలేదు."
"అదేమిటీ " అన్నాడు రాజు తెల్లబోయి.
"ఇప్పుడే ఫోనొచ్చింది. నీకు అజేయ్ కూతురితో పెళ్ళిచూపులటగా -ఆ ప్రోగ్రామ్ కాన్సిలయింది. అందుకని వాళ్ళు రావడంలేదని నీకు చెప్పమన్నారు...."
రాజు చప్పబడిపోయాడు. ఏ వార్త చెప్పి రాణిని కలవరపర్చాలనుకున్నాడో ఆ వార్తా తనకే ఎదురుతిరిగింది.
పవన్ రాజు ముఖంలోకే చూస్తూ, "ప్రోగ్రామ్ ఎందుకు కన్సిలయిందో కనుక్కోమన్నారు మీవాళ్లు...." అన్నాడు.
"ఎలా కనుక్కుంటాం- ఏమని కనుక్కుంటాం. వాళ్ళ ప్రోగ్రామ్-వాళ్లిష్టం" అన్నాడు రాజు ఏమనాలో తెలియక.
"నువ్వేం కనుక్కోనక్కర్లేదులే-నేను వాళ్ళకు చెప్పేశాను....."
రాజు ఆశ్చర్యంగా పవన్ ని చూశాడు.
"అజేయ్ కూతురితో నీకు పెళ్ళచూపులున్నట్లు నాకు తెలియదుకానీ-ఉంటే అవి ఆగిపోతాయని మీవాళ్లు ఫోన్ చేయకముందే నాకు తెలుసు" అన్నాడు పవన్.
"ఎలా తెలుసు?" రాజు గొంతులో ఆశ్చర్యముంది.
"నేను జర్నలిస్టుని గనుక...."
"అజేయ్ గారమ్మాయి పెళ్ళిచూపులుంటే జర్నలిస్టులక్కూడా తెలుస్తుందా?"
"ఈరోజు సాయంత్రం మూడున్నర నుంచి ప్రొఫెసర్ అజేయ్ మాయమయ్యాడు. ఏమయ్యాడా అని అంతా కంగారుపడుతూంటే-నాలుగున్నరకు ఆయనింటికి ఫోన్ వచ్చింది. హి వజ్ కిడ్నాప్డ్" అన్నాడు పవన్.
"వ్వాట్!" అన్నాడు రాజు అతడు మ్రాన్పడిపోయాడు.
* * *
ప్రొఫెసర్ అజేయ్ కిడ్నాప్ అయ్యాడన్న వార్తా ఆంద్రప్రదేశ్ అంతటా దావానలంలా వ్యాపించింది. వార్తా పత్రికలు ఆ వార్తను బాక్సుకట్టి మొదటిపేజీలో వేయడంతొ-చిన్న చిన్న గ్రామాల్లో కూడా అది చర్చనీయాంశమైంది.
నమ్మినవారికి దేవుడున్నాడు. నమ్మినివారికి లేడు. కానీ విజ్ఞానశాస్త్రం అలా కాదు. నమ్మినా నమ్మకున్నా అది తిరుగులేని వాస్తవం.
తేనెలో తీపిలా, తీగలో విద్యుత్తులా దేవుడు అదృశ్యరూపుడై వున్నాడంటారు. నమ్మినవారికి తప్పక కనబడతాడంటారు. కానీ విజ్ఞానశాస్త్రం తేనెనుండి పంచదారను వేరుచేసి చూపిస్తుంది. నమ్మనివాడిచేత కూడా విద్యుత్పరికరాలు తయారుచేయిస్తుంది.
ప్రొఫెసర్ అజేయ్ అసమాన ప్రజ్ఞాదురంధరుడు. అతడు భారతీయుల ఆశకిరణం. అట్టడుగు ప్రజలకు వరప్రసాది. దేశం ఆర్ధిక స్వరూపాన్ని పూర్తిగా మార్చివేయగల ప్రయోగాలనెన్నో అతడు రూపొందించాడని ప్రచారముంది. మన దేశం ప్రగతిపథంలో నడువకూడదని కంకణం కట్టుకున్న దుష్టులెవరో అతడిని నిర్భంధించివుండాలి.
ఎవరు-ఎవరు?ఎవరు?
ఇదే ఎక్కడ చూసినా చర్చనీయాంశమైపోయింది.
ప్రొఫెసర్ అజేయ్ పరిశోధనల గురించి ఎన్నో కథలు బయల్దేరాయి.
ఆయన ఆధ్వర్యంలో అన్నిరంగాల్లోనూ పరిశోధనలు జరుగుతున్నాయనీ- వాటిలో ముఖ్యమైనది అణ్వాయుధమనీ- రష్యా, ఆమెరికాలకు తెలియని కొత్త సూత్రాన్నాయన కనిపెట్టడంవల్ల-ఆ రెండు దేశాలవారూ కలసి ఆయన్ను అపహరించారని కొందరన్నారు.
అన్నిచెట్లకూ అన్నిఫలాలూ అన్ని రుతువుల్లో పండించగల కొత్త టెక్నిక్ నాయనడెవలప్ చేయించాడనీ, అది తెలుసుకుందుకు చైనా వారాయన్నపహరించారనీ కొందరన్నారు.
సూర్యరశ్మిని పగలు నిలవుంచుకుని రాత్రిళ్లు వాడుకునే పరిశోధనలు తెలుసుకుందుకు ధృవప్రాంతాలవారాయన్ను తీసుకునిపోయారని కొందరన్నారు.
క్యాన్సర్ కు మందు కనిపెట్టాడనీ-శాస్త్రచికిత్స అవసరం లేకుండా చెత్తో తీసినట్లు మాయం చేయగల అమోఘమైన మందునాయన మన చరకసంహితను క్షుణ్ణంగా చదివి తెలుసుకున్నాడని కొందరన్నారు. ఆయన అపహరణకు కొందరు పాకిస్తాన్నీ, కొందరు అమెరికానీ, కొందరు ఇంగ్లాండునీ, కొందరు రాష్యానీ, కొందరు చైనానీ- ఇలా ఒక్కొక్క ఒక్కో దేశాన్ని తప్పుపడుతూ పోతున్నారు.
ప్రొఫెసర్ అజేయ్ మాయమయ్యాడన్న అలజడి క్రమంగా దేశంమంతటా పాకింది అయితే అందుకు కారాణాలు తెలుసుకోవడం ఎంతో కష్టంగా వుంది. ఎందుకంటే- ఆయన్ను అపహరించినవారు అపహరణ గురించి తెలియపర్చి ఊరుకున్నారు. తమ ఉద్దేశ్యమేమిటో, తమకేం కావాలో మాటవరసక్కూడా చెప్పలేదు.
ప్రొఫెసర్ అజేయ్ పేరు భారతదేశమంతటా ప్రఖ్యాతిగాంచి వుండడంవల్ల శాస్త్రజ్ఞులలో క్రమంగా అలజడి ప్రారంభమైంది. అంతకాలం శాస్త్రజ్ఞుల ఇబ్బందులు కేవలం క్రైమ్ సాహిత్యానికి మాత్రమే పరిమితమయ్యాయి. ఇప్పుడు నేరస్థులా దృష్టి రాజకీయాలనుంచీ భాగ్యవంతునుంచీ విజ్ఞానశాస్త్రజ్ఞులా మీదకూ మళ్లిందంటే వారికి భయంగా వుండదూమరి!
విజ్ఞానశాస్త్రానికి మేథస్సు అవసరం. ఊహలతో ఎవరేం చెప్పినా వేదాంతమవుతుంది. విమర్శకులు దొరికితే ఏ వేదాంతానికైనా సింహాసనం దొరుకుతుంది. కానీ సైన్సు అలా కాదు. ఊహను వాస్తవం చేసేదే సైన్సు. ఆ వాస్తావాన్ని అందరికీ ఉపయోగపడేలా చేసేసి సైన్సు. ప్రాథమిక సూత్రాలు తెలిసేక-సైన్సును ఎవరైనా ప్రయోగించవచ్చు.
మనదేశంలో బ్రిటిష్ వారి ధర్మమా అని-మేథస్సును చంపే, బానిసత్వం పెంచే పరిపాలనా యంత్రాంగం కొనసాగుతోంది.
అందువల్ల అధికారానికున్న ప్రాధాన్యత సృజనాత్మకతకు లేదు. ఐఏయస్ ఆఫీసర్లకున్న వసతులు సైంటిస్టులకు లేవు. రాజకీయవాదులకున్న స్వేచ్చ సైంటిస్టులకు లేదు. వ్యాపారస్థుల సంపాదనలో ఒఅ అణువు కూడా వారికి జీతం కాదు. కానీ అణువును బద్దలుకొట్టి బ్రహ్మాండం తీసే పని మాత్రం సైంటిస్టులు చేయాలి.
సైంటిస్టులు దేశానికి ఏం చేశారు-అనే ప్రశ్న పదేపదే వినబడుతుంది.
సైంటిస్టులు రాజకీయవాదులు కారు. సంఘసేవకులు కారు.
ప్రజల నాడి వారికి తెలియదు. ప్రజల అవసరాలు వారికి తెలియవు.
క్యూరియాసిటీ-ఏదో తెలుసుకోవాలన్న తపన....అదే సైన్సు....
ఒక మహారాజుకు సామన్యుడైన పేదవాడిపట్ల అభిమానం పుట్టి సన్మానించాలనుకున్నాడు. తన లోకజ్ఞానం మేరకు ఆయన వాడికి తెల్లఏనుగును బహూకరించాడు. రాజిచ్చిన ఆ కానుకను కాదనలేక, ఆ ఏనుగును పోషించలేక పేదవాడు అష్టకష్టాలూ పడ్డాడు.
సైంటిస్టులా రాజువంటివారు. వారి ఉద్దేశ్యం మంచిదే. వారి సామాజిక స్పృహ మొబైల్ ఫోన్లను సామన్యుడికుపయోగించే మార్గం అదేనని వారు నమ్ముతారు.
మన ప్రభుత్వం, మన రాజకీయవాదులు-మన ప్రజల అవసరాలివీ అని నిర్ణయించి-ఇన్నేళ్ళలో ఇవి సాదించాలీ అని శాస్త్రజ్ఞులకో జాబితా ఇచ్చి సవాలు చేస్తే. ఆ సవాలును స్వీకరించడానికి అనుకూల వాతావరణాన్ని కల్పిస్తే ప్రతి శాస్త్రజ్ఞుడూఓ మదర్ థెరీసా కాగలడు.
మన దేశంలో సైన్సుకూ, సైంటిస్టుకూ ప్రాధాన్యత లేదు. పోతన భాగవతం వ్రాసి శ్రీ రాముడికంకితమిచ్చినట్లు సైంటిస్టులు పరిశోధనలు చేసి సైన్సుకంకితం చేస్తున్నారు. ఏ గవాస్కరో, అమృతరాజో, పడుకోనేయో, పీటి ఉషో, ఆనందో సహజ ప్రతిభకు తమకు తాముగా మెరుగులు దిద్దుకుని పేరు తెచ్చుకుంటే అందువల్ల దేశానికి పేరు వచ్చిందని పొంగిపోతుందే తప్ప-అలాంటి వ్యక్రుల్నీ, వ్యక్తిత్వాల్నీ తయారుచేయగల యంత్రాంగాన్ని సమకూర్చే కృషిచేయని ప్రభుత్వం మనది.
ఈ కారణాలవల్ల ప్రతిభావంతులు దేశాన్ని వదిలి వలసపోతున్నారు. వలసపోనివారి ప్రతిభ క్రమంగా క్షీణించి-ప్రతిభ లేకనే వారు వుండిపోయారన్న అపకీర్తిని సంపాదించుకుంటున్నారు.
ఈ నేపథ్యంలో ప్రొఫెసర్ అజేయ్ ఉద్భవించాడు. ఆయన సామాజిక స్పృహతొ కూడిన సైంటిస్టు. దేశం అలాంటివారి కోసమే ఎదురుచూస్తోంది. సామాన్యుల కోసం ఆయన ఎన్నో పతాకాలు వేసి అమలుచేయనున్నాడు. దేశం స్వరూపమే మారిపోవచ్చునని అనుకునే సమయంలో ఆయన అపహరణ.....
అజేయ్ ఎందుకపహరించబడ్డాడూ అన్నది సైంటిస్టులందర్నీ కలవరపెడుతున్న సమస్య. ఎందుకంటే దేశంలో సైంటిస్టులకు ప్రాధాన్యత లేదు కాబట్టి వారికున్న భద్రతా ఏర్పాట్లూ అంతంతమాత్రం . ప్రభుత్వం తమకు రక్షణనివ్వలేదని తెలిసిన సైంటిస్టులు తమను తామే రక్షించుకోవాలని అనుకుంటున్నారు.
అందుకు ఉపాయం ఒక్కటే- అజయ్ పరిశోధనలేమితో తెలుసుకోవాలి! ఆయన పరిశోధనల్లో ఏది అపహరణకు దారితీసిందో తెలుసుకోవాలి. సైంటిస్టులా తరహా పరిశోధన జోలికి వెళ్ళకుండా జాగ్రత్తగా వుండాలి.
అజేయ్ అపహరించబడిన వారం రోజులకు దేశంలోని సైంటిస్టుల్ సంఘం ఒక నివేదికను తయారుచేసి ప్రభుత్వానికి సమర్పించింది.
అప్పటికింకా అజేయ్ అపహరణకు కారణం బయటపడలేదు.
* * *
పదడుగుల వెడల్పూ, పన్నెండడుగుల పొడవూ వున్న గది అది.
ఆ గదిలో గోడవారగా టేబిలూ, కుర్చీ వున్నాయి. గది మధ్యలో మంచముంది. పైన ఫ్యానుంది. గోడకు ట్యూబులైటుంది. ఆ గదికి అటాచ్డ్ బాత్రూమూ వుంది.
ప్రొఫెసర్ అజేయ్ ఆ గదిలో అసహనంగా పచార్లు చేస్తున్నాడు.
రోజుకు ఇరవైనాలుగుగంటలు. గంటకు అరవై నిముషాలు. నిముషానికి అరవై సెకన్లు సెకన్లో లక్ష మైక్రో సెకన్లు.
ప్రొఫెసర్ అజేయ్ మైక్రోసెకనుకు ప్రాధాన్యతనిచ్చే మనిషి.
ఆయన ఆ గదికి వచ్చి అప్పుడే వారంరోజులు దారిపోతోంది.
రోజూ ఉదయం వార్తాపత్రిక అందుతుంది. తర్వాత కాఫీ, టిఫిన్లు.
లంచ్ టైముకు లంచ్. డిన్నర్ టైముకు డిన్నర్.
రోజూ గదిలో బెడ్ షీట్స్ మారుస్తున్నారు. టవల్స్ మారుస్తున్నారు. తన లోదుస్తులు మార్చుతున్నారు. బట్టలు ఉతికించి తెస్తున్నారు.
ఒక మంచి హొటల్లో జరిగే సదుపాయలన్నీ అక్కడ జరుగుతున్నాయి. కానీ మాట్లాడ్డానికి మనుషులు లేరు. చేయడానికి పని లేదు.
అలాగే రోజులు గడిచిపోతున్నాయి. అజేయ్ లో అసహనం పెరిగిపోతోంది.
ఎవరు? ఎవరు తననిలా నిర్భంధించారు? ఎందుకీ పనిచేశారు?
ఆ సందేహాలకు సమాధానం స్పూరించడంలేదాయనకు.
ఎవరీ పని చేసినా చాలా తెలివిగా చేశారు. ఆ రోజు...
ప్రొఫెసర్ అజేయ్ తను కిడ్నాపైన రోజును గుర్తుచేసుకుంటున్నాడు. అలా గుర్తుచేసుకుంటే తన అపహరణకు సంబంధించి ఏదైనా క్లూ దొరకవచ్చునని ఆయన ఆశ. ఆ ఆశలో ప్రతిరోజూ నాలుగైదుమార్లైనా ఆ సంఘటనను గుర్తుచేసుకుంటున్నాడాయన. కానీ ఇంతవరకూ ప్రయోజనం కనిపించలేదు. అయితే.....
ఆ రోజు నవంబరు30. ఈ రోజు డిసెంబరు7.
రెండురోజులకూ వున్న ప్రత్యేకత అవి ఆదివారాలు కావడమే!
ఆదివారాలకు అజేయ్ జీవితంలో ప్రత్యేక స్థానముంది. అది చిన్నప్పట్నుంచీ కొనసాగుతోంది.
అజేయ్ ఆదివారంనాడు పుట్టాడు. నామకరణం ఆయనకు ఆదివారంనాడే జరిగింది. ఆదివారంనాడే అక్షరాభ్యాసం. కొన్ని కారాణాలవల్ల ఆదివారంనాడే స్కూలు, కాలేజీ తెరవాల్సిరావడం ఆ రోజుల్లోనే ఆయన కూతురు ఆదివారంనాడు పుట్టింది.
'ఆదివారానికి నీ జీవితంలో ప్రత్యేక స్థానముంది" అని పధ్నాలుగేళ్ళ వయసులో ఓ ఆదివారంనాడు జ్యోతిష్కుడొకాయన చెప్పాడు.
ఆ మాట అజేయ్ కు నరనరాలా పట్టేసింది.
ఆదివారం-ఆదివారం.
ముఖ్యమైన కార్యం ఏది తల పెట్టినా ఆయన ఆదివారానికి ముడిపెట్టడానికి ప్రయత్నించేవాడు. ఆయన చదువయ్యేక ఫారిన్ కు పెట్టిన అప్లికేషన్స్ కూడా జీపీఓకు వెళ్లి ఆదివారంనాడు పంపేవాడు-మామూలుగా అయితే ఇంటిపక్కనే పోస్టాఫీసు- ఎంతో సుఖం!
తండ్రి అజేయ్ ను ఒకటి రెండు సార్లు మందలించాడుకూడా బాబు! ఆదివారాన్ని పిచ్చిగా నమ్మకు. ఎలా జరగాల్సిందలా జరుగుతుంది. కాబట్టి జీవితాన్ని తేలిగ్గా తీసుకోవడం నేర్చుకోవాలి. నీకు జయం రాసిపెట్టి వుంటే ఏ రోజునైనా పని జరుగుతుంది. నీకు ఆదివారం చెయ్యలేవు. చదువుకున్నవాడివి. రీసెర్చి చేయబోతున్నవాడివి. సైన్సు స్టూడెంటువి. నేను నీకింతకంటే ఏం చెప్పను?"
సాధారణంగా తండ్రి మాటలను ఎంతగానో గౌరవించే అజేయ్ కీ మందలింపు ఏ మాత్రమూ నచ్చేదికాదు.
అజేయ్ తల్లికి మహా చాదస్తం. ఆమె మూఢాచారాలను నమ్ముతుంది. ప్రచారం చేస్తుంది. చిన్నప్పట్నుంచీ అజేయ్ తల్లిని వేళాకోళం చేయని రోజుండేది కాదు.