Previous Page Next Page 
ఆపరేషన్ మేడిపండు పేజి 5

    రాజు దెబ్బతిని. "నా మాటలు వింటూంటే నేనెలాంటివాడిననిపిస్తోందో చెప్పండి పోనీ" అన్నాడు.
    "ఇంత తక్కువ పరిచయంలో నేనేం చెప్పగలను?" అంది పాప.
    "మరి మీరు చెప్పనిదే నాకెలా తెలుస్తుంది?" అన్నాడు రాజు కుతూహలంగా.
    "మీరన్న మాటలు మీ ఆలోచనల్లోంచి పుట్టినవనుకోండి. మీరు ఆదర్శవాది కిందే వస్తారు. అప్పుడు మీరు మీ ఆదర్శాలను ఆచరణలో చూపాలని ప్రయత్నిస్తారు. అదే మీ మాటలు కాలక్షేపం కోసం  యథాలాపంగా అన్నారనుకోండి. ఆదర్శాలు -అంతే సంగతులు" పాప తమాషాగా పెదవి విరిచి ఫక్కున నవ్వింది.
    రాజు ఆ మాటల గురించి ఆలోచించేవాడే- కానీ  ఆ నవ్వు - తాత్కాలికంగా అతణ్ణి సమ్మోహితుణ్ణి చేసింది.
    మధ్యమధ్య ఇందిర కూడా మాట్లాడుతోంది. ఆమె కూడా నవ్వుతోంది.
    కానీ రాజు ఆమెను గమనించడంలేదు. పాప- తనకు కాబోయే జీవితభాగస్వామిని అందువల్ల  అతడామెనా దృష్టితోనే చూస్తున్నాడు.
    మధ్యలో ఫలహారాలు  వచ్చాయి. అందరూ పుచ్చుకున్నారు.
     సీఎం రాజుని పాపపై  అభిప్రాయం  అడుగలేదు. భార్యద్వారా  నడుస్తున్న ఈ వ్యవహారంలో అతడు తన వేలు వుంచదల్చుకోలేదు.
    రాజు  సీఎంని అజేయ్ తొ అపాయింట్ మెంట్ గురించి అడుగలేదు. అడలైనవారిని కలుసుకోవడం అయిపోయిందని అతడికీ అర్థమైంది.
    జయంతి రాజుని అమ్మాయి నచ్చిందా అని అడుగలేదు.ప్రశ్న వుంటేనే కదా బడులు కోరేది.
    రాజు జయంతికి పాపమీద తన అభిప్రాయం చెప్పలేదు. నచ్చిందనడానికి రాణి మీద ప్రేమ అడ్డొస్తోంది. నచ్చలేదనడానికి మనస్కరించడంలేదు.
    వచ్చిన సమస్య ఏమిటంటే అతడికి పాప కూడా ఎంతో నచ్చింది.

                                                                  *    *    *
    సాయంత్రం ఏడుగంటలు.
    రాజు గది తలుపులు తీసివున్నాయి. గదిలో అతడు, అతడికెదురుగా రాణి.
    "అంటే పెళ్లిచూపులకు వెళ్ళొచ్చావన్నమాట" అంది  రాణి అదోలా."
    "పెళ్ళిచూపులని తెలియదు. తెలిస్తే వాళ్లేవాణ్ణి కాదు" అన్నాడు రాజు.
    "నేను సంజాయిషీ అడగడంలేదు. వివరాలు తెలుసుకుంటున్నాను...."
    రాజు  మాట్లాడలేదు. రాణివైపు సూటిగా చూడకుండా పక్కచూపులుచూస్తున్నాడు.
    "జరిగిందాన్నిబట్టి నాకు అర్థమైనదేమిటంటే-పిల్ల బాగుంది. నీకు నచ్చింది"
    "రాణీ అన్నాడు రాజు హర్టయినవాడిలా.
    "పోనీ-నచ్చలేదని జయంతిగారికి చెప్పేశావా- చెప్పు" అందామె.
    రాజు తడబడ్డాడు. తన మనసులోని సందిగ్దాన్నంతా ఆమె ముందుంచాలని, "పెళ్ళిచూపులని నాకు తెలియదు చూశాను పిల్ల బాగుంది. నచ్చలేదని చెప్పలేకపోయాను. అయినా వాళ్లు నన్నే ప్రశ్నలూ వెయ్యలేదు. ఏంచెప్పాలన్నా మొహమాటపడ్డాను" అన్నాడు.
    "అందువల్ల ఏమవుతుందో తెలుసా! వాళ్ళు మీవాళ్ళకు రాస్తారు. ఆ తర్వాత పెళ్ళిచూపులు, తాంబూలాలు పెళ్ళి...."
    "రాణీ" ఆవేశంగా అన్నాడు రాజు.
    "ఆ తర్వాత ఉద్యోగం. అమెరికా  చాన్సు...." రాణి కొనసాగించింది.
    "రాణీ!ప్లీజ్! అంత దూరం వెళ్ళకు...."
    "ఇది జలపాతం ధార. దీన్నాపాలని ప్రయత్నించకు. చేతనైతే ఈ శక్తినుపయోగించుకుని విద్యుచ్చక్తిని సృష్టించి ప్రేమదీపాలు వెలిగించు" అంది రాణి.
    "ఎందుకు రాణీ నీలో ఈ నిరాశావాదం" అన్నాడు రాజు బాధగా.
    "ఎందుకంటే నేను నిన్ను ప్రేమిస్తున్నాను. నువ్వేమో ఉద్యోగాన్ని ప్రేమిస్తున్నావు"
    "ఉద్యోగం మనుగడ కోసం. నేను నిన్ను మాత్రమే ప్రేమిస్తున్నాను రాణీ!"
    "అయితే గుండెలమీద చెయ్యివేసుకుని చెప్పు- నేను చెప్పింది జరక్కుండా  ఆపగలవా?" అనడిగింది రాణి.
    రాజు వెంటనే హాస్యాన్నికన్నట్లుగా గుండెలమీద చేయివేసుకున్నడు. ఏదో అనబోయాడు. అంతే-ఆగిపొయాడు.
    రాణి చెప్పింది నిజం. ఆమె చెప్పింది జరక్కుండా ఆపడం తనవల్ల కాదు.
                                                                 *    *    *
    ఆ రాత్రంతా ఆలోచించాడు రాజు.
    తనకు రాణి కావాలా? పాప కావాలా
    రాణి ప్రేమనిస్తుంది. పాప ఉద్యోగాన్నిస్తుంది.
    రాణిని పెళ్ళిచేసుకోవాలంటే ఇరుపక్షాల పెద్దల్నీ ఎంతో కొంత ఎదిరించాలి.
    పాపను పెళ్ళిచేసుకుంటే ఇరుపక్షాల పెద్దలూ మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తారు.
    రాణి అందమైనది. పాప అందంలో  ఆమెకే  మాత్రమూ తీసిపోదు.
    అలాంటప్పుడు తను రాణినే ఎందుకు ప్రేమించాలి. పాపనెందుకు ప్రేమించరాదు?
    పాప తనకందనంత ఎత్తులో వుంది. ఆమెనందుకుంటే తనూ ఎత్తుకి ఎదుగుతాడు.
    రాణి ఇంచుమించు తన స్థాయిలోనే వుంది. ఆమెనందుకుంటే తనస్థాయి మారదు.
    పాపను చూడనప్పుడు రాణిని ప్రేమించాడు. ఇప్పుడు  ప్రేమ పాపమీదకు మళ్ళింది. ఆ తర్వాత మరో తారను  చూస్తే ప్రేమ ఆమెపైకి మళ్ళుతుందా?
    ప్రేమ ఇంత చంచలమైనదా? లేక తన బుద్ది చంచలమైనదా?
    రాజు మెదడు ఆలోచనలు ఆగకుండా వేధిస్తూనేవున్నాయి.
    రాణిని ప్రేమించి ఉద్యోగం కోసం మధనపడిపోయాడు.
    ఇప్పుడు ఉద్యోగం కోసం పాపను ప్రేమించాలనుకుంటున్నాడు.
    అంటే  తను మనిషిని ప్రేమిస్తున్నాడా-ఉద్యోగాన్ని ప్రేమిస్తున్నాడా?
    రాణి తను ఉద్యోగాన్ని ప్రేమిస్తున్నాడని ఖచ్చితంగా  నొక్కి చెబుతోంది.
    "అంటే-తనకు ప్రేమించే హృదయం లేదు- లేడుగాక లేదు.
    "నో!' అని తలపట్టుకున్నాడు రాజు. అతడు తన ప్రేమను రుజువుచేసుకోవాలని గట్టిగా సంకల్పించాడప్పుడు. అందుకు ఉపాయాన్నన్వేషిస్తున్నాడు.
    తను ఉద్యోగాన్ని కాదు- రాణిని మాత్రమే ప్రేమిస్తున్నాడు. రాణిని పెళ్లిచేసుకోవాలన్న  కోరికతోనే ఉద్యోగాన్ని  కోరుతున్నాడు. అంటే-ఉద్యోగం తన ప్రేమకు ధైర్యాన్నిస్తుంది.
    పాపను నిరాకరిస్తే తనకు వచ్చే ఉద్యోగం పోతుంది. అంటే తన ప్రేమకు ధైర్యంపోతుంది! అంటే  తన ప్రేమకు ధైర్యాన్నివ్వడానికి ఉద్యోగం కాకుండా ఇంకో మార్గం చూడాలి. ఏమిటది?
    అప్పుడు రాజు తనను తాను విశ్లేషించుకొసాగాడు.
    చిన్నప్పట్నుంచీ తను బుద్దిమంతుడిగా పేరుపొందాడు. అందరూ తన గురించి ఎంతో మంచిగా  చెప్పుకొనేవారు. తనవల్ల ఎవరికీ కష్టం కలిగినా సహించలేడు.  ఇతరులకు లాభం కలిగే  పక్షంలో తను కాస్త నష్టపోయిన సంకోచించడు.
    ఎట్టి పరిస్థితుల్లోనూ ఎదుటివారిని మోసగించలేడు. తనకు తెలియకుండా ఎవరైనా మోసపోతే  అది సరిచేయడానికి ఎంతకైనా తెగిస్తాడు.
    మోసం- సరిచేయడం-తెగింపు.
    రాజు తన ఆలోచనలెటువైపు వెడుతున్నాయో గ్రహించడానికి కాసేపు పట్టింది.
    రాణిని తను ప్రేమిస్తున్నాడు. ఇంతవరకూ తమది పవిత్ర ప్రేమ.
    రాణిని ప్రేమిస్తున్నప్పటికీ తన మనసు పాపను చూసి చలించింది. అలా జరక్కుండా వుండాలంటే తను పూర్తిగా రాణికి కట్టుబడిపోవాలి. అందుకు....అందుకు....అందుకు.
    అందుకు ఏంచేయాలో కూడా తల్చుకుందుకు రాజు  భయపడుతూంటే, 'నీకు నిజంగా రాణిని పెళ్ళిచేసుకునే ఉద్దేశ్యముంటే, ఆ ఉద్దేశ్యం నెరవేర్చుకునేందుకు అవసరమైన ధైర్యం రావాలనుకుంటే ఆలోచనలనాపి లాభంలేదు. అడుగు ముందుకు వేయి అని మనసు హెచ్చరించింది.
    అడుగు ముందుకు వేయడమంటే  తనూ రాణీ ఒకటి కావాలి. అదీ ఎప్పుడోకాదు పెళ్ళికిముందే! అప్పుడు తనలోని మంచితనం. గొప్పతనం , దయాగుణం, ఆడర్శగుణం అన్నీ కలిపి ఒక్కటైపోతాయి. అవి తనలో దైర్యాన్ని పెమ్హుతాయి. తమ ప్రేమను రక్షిస్తాయి.'ఈ విషయం రాణికి చెప్పి ఒప్పించాలి' అనుకున్నాడు రాజు దృఢంగా.
    ఆ రాత్రి రాజుకు చాలా ఆలస్యంగా నిద్రపట్టింది. ఆ నిద్రలో కలలు. ఆ కలల్లో రాణి. ఆ రాణి తన మాటలు  వింటోంది. తన తెలివిని అభినందిస్తోంది. "ఈ తెలివి నీకెప్పుడో రావాల్సింది. పోనీలే ఇప్పటికైనా మించిపోయింది లేదు" అందామె.
    ఆమె తన ఈ నిర్ణయం కోసం ఎంతోకాలంగా ఎదురుచూస్తోందని అప్పటికి గ్రహించిన రాజు-
    "పోనీ-నువ్వేనా ముందే నాకీ ఐడియా ఇవ్వాల్సింది" అన్నాడు.
    "ఆడపిల్లను. నోరువిడిచి ఎలా అడగను?" అంది రాణి గోముగా.
    ఆ తర్వాత కలలో సంభాషలకు చోటులేకపోయింది.
                                *    *    *
    సముద్రపుటలలు అంతెత్తున ఎగిరెగిరిపడుతున్నాయి.
    తన ఎదుట కూర్చున్నరాణి అంతకంటే ఎత్తుగా ఎగిరిపడుతున్నట్లు తోచింది రాజుకి.
    "ఇదా నీ తెలివి?" అంది రాణి అతడు మెదడు  నరాలను చేదిస్తోంది.
    "ఏమో-నాకు తోచింది నేను చెప్పాను: అన్నాడతడు తడబడుతూ.
    "ఇందులో తోచడానికేముంది? నువ్వూ అందరి మగాళ్ళలాగే మాట్లాడేవు"
    "నాకీ మగా ఆడా మాటల తేడాలు తెలియవు. మన ప్రేమ విఫలం కాకూడదంటే మన బంధం మరింత బలపడాలి-అందుకే...."
    "మన బంధం బలంగానే వుంది" అంది రాణి.
    "రాణీ! నీకు నా మీద నమ్మకం లేదా?"
    "మనిషిని బలహీనతను ప్రోత్సహించే నమ్మకం-నమ్మకం కాదు"
    "నువ్వు నన్ను నమ్మడంలేదు" బాధగా అన్నాడు రాజు.
    "ఒక నమ్మకం మరో నమ్మకాన్ని దెబ్బతీయకూడదు. నేను నిన్నూ నమ్ముతున్నాను. మన సంప్రదాయాన్నీ నమ్ముతున్నాను"
    "ఏమిటి  మన సంప్రదాయం?"
    "మన సమాజంలో ప్రేమ,పెళ్లి అన్న పదాలు వేరుకావడానికి కారణమైనదే మన సంప్రదాయం. ఒకరంటే  ఒకరిష్టపడితే అది ప్రేమ. అది ఇష్టం దగ్గరే ఆగిపోతుంది. ప్రేమికు లిద్దరూ ఒకటైతే అది పెళ్ళి. ప్రేమ లేకుండా దంపతులు ఒకటి కావచ్చు. కానీ పెళ్ళి లేకుండా ప్రేమికులొకటి కాకూడదు. అదీ మన సంప్రదాయం"
    "అలాగైతే అసలు ప్రేమించుకోవడమే మన సంప్రదాయం కాదు" అన్నాడు రాజు  ఉక్రోషంగా.
    "ప్రేమకు సంప్రదాయమేమిటి? ఎవరైనా నవ్వుతారు?"అంది రాణి వెంటనే మందలింపుగా.
    "అయితే ప్రేమంటే ఏమిటి నీ ఉద్దేశ్యం?"
    "ప్రేమకు నీ, నా ఉద్దేశ్యాలు లేవు. ప్రేమంటే ఏమిటో ప్రేమించినవారికే తెలుస్తుంది. నీకు మాత్రం ప్రేమకూ, పెళ్ళికీ తేడా తెలిసినట్లు తోచదు"
    "అవున్లే- అన్నీ నీకే తెలుసు-నాకంటే పెద్దదానివిగా...."
    "నా పెద్దరికాన్ని గుర్తించావు కాబట్టి జాగ్రత్తగా నేను చెప్పింది విను. ధైర్యం సంపాదించడానికి నువ్వెన్నుకున్న మార్గముందే-దాన్ని ధైర్యమూ, మనోబలమూ వున్న ఏ ఆడపిల్లా ఆమోదించదు. నువ్వు నన్ను నమ్మకు, నిన్ను నమ్మమనకు. మనమిద్దరం  నమ్ముకావలసిందిప్రేమను. ఈ ప్రపంచంలో ప్రేమకు  అపజయంలేదు"
    "సరే- ప్రేమను నమ్ముకుంటూ కూర్చుంటే నాకు పాపతో పెళ్ళేపోతుంది" బెదిరిస్తున్నట్లుగా  అన్నాడు రాజు.
    "అది నీ భ్రమ!ప్రేమను నమ్మకపోవడంవల్ల నీలో ఆ భ్రమ పుట్టింది. ప్రేమను మనస్ఫూర్తిగా నమ్ము. ఏదో ఒక రోజున మనిద్దరికీ తప్పక పెళ్ళి జరుగుతుంది"
    ఆమె మాటలో ధ్వనించిన నమ్మకానికి రాజు ఆశ్చర్యపోతూ, "నువ్వన్నదే- నిజం కావాలి.పోనీ, నేను ధైర్యం చేస్తాను. మనమిప్పుడే పెళ్ళిచేసుకుందామా?" అన్నాడు.
    రాణి నవ్వి "నేను గ్రాడ్యుయేట్ నవ్వాలి. అంటే మన పెళ్ళికి నువ్వింకా రెండేళ్ళకు పైగా ఆగాలి. అంతవరకూ నో మ్యారేజ్...."అంది.
    "రెండేళ్ళా?"
    "కంగారుపడకు. అంతవరకూ నీకూ ఉద్యోగం దొరకదని నా హామీ...."
    "అమ్మో-అంత నమ్మకంగా చెప్పకు. నాకు భయమేస్తోంది. నా మాట విని పెళ్ళికి ఒప్పుకో గప్ చిప్ గా ఏ గుడికో వెళ్ళి దండలు మార్చుకుందాం"
    "ప్రేమంటే నీకు నేనే గుర్తుకొస్తున్నాను. కానీ నిన్ను మీవాళ్ళూ నన్ను మావాళ్ళూ కూడా ప్రేమిస్తున్నారు. మన గురించి వాళ్ళకూ కొన్ని సరదాలుంటాయి. ఆ సరదాలుమన ప్రేమకు పత్రిబంధకాలు కావని రుజువుచేసుకునే అవకాశం వాళ్ళకూ ఇవ్వాలికదా!"
    ఏ విషయాన్నయినా ఆడది నాలుగువైపుల్నించీ ఆలోచిస్తుంది. మగాడు తనవైపు నుంచే ఆలోచిస్తాడు. ఆ విషయం రాజుకిప్పుడే అర్థమైంది.
    "అయితే  మనం  విడిపోతున్నాం. అందుకు నువ్వే  బాధ్యురాలివని గుర్తుంచుకో"
    రాజు మాటలు విని తమాషాగా నవ్వింది రాణి. "మనం కలుసుకోవడం కూడా ఐదే ఆఖరుసారి. అందుకు నువ్వే బాధ్యుడివని-నువ్వూ గుర్తుంచుకో" అందామె.
    "ఇందులో నా బాధ్యత ఏముంది?"
    "మనమెప్పుడు కలుసుకున్నా-నాకు నీ ఉపాయం గుర్తుకొస్తుంది. అది నీమీద అసహ్యన్నైనా పెంచుతుంది. నన్ను బలహీనపర్చనైనా పరచగలదు. ఉపాయం నువ్వే చెప్పావు కాబట్టి ఆ బాధ్యత నీదేకదా -బై!" అంటూ లేచింది రాణి.
    రాణికి కోపం వచ్చిందని అతడు గ్రహించాడు.
    కానీ అతడామెను వారించలేదు. అతడికీ కోపం వచ్చింది మరి!
                                                                 *    *    *
    పాపను చూసివచ్చిన పన్నెండురోజులకు రాజుకు ఇంటిదగ్గర్నుంచి ఉత్తరం వచ్చింది. అందులో పెళ్ళిచూపుల ప్రసక్తి వుంది. డిసెంబరు ఆరున ప్రొఫెసర్ అజేయ్  కుమారైను తాను  సకుటుంబంగా చూడబోతున్నాడు.
    రాజు వాచీలో తేదీ చూసుకుంటే నవంబరు30. అంటే సరిగ్గా  మరో ఆరురోజుల్లో పాపతో పెళ్ళివ్యవహారం ముందడుగు వేస్తుంది. రాణితో ప్రేమవ్యవహారంమాత్రం ఎక్కడ వేశావే గొంగళీ అన్నట్లే వుంది.
    ఉత్తరంలో ప్రొఫెసర్ అజేయ్ ఇంటి చిరునామా కూడా వుంది.
    రాజు ఆశ్చర్యపడ్డాడు.
    అజేయ్ దియానగర్ లో వుండడంలేదు. ఆయన కూడా సీఎం  లాగానే  విశాఖపట్నంలోనే వుంటున్నాడు. ఆయన వుంటున్నది సిరిపురం ఏరియా.
    సిరిపురం-సిరిగలవారి పురం.
    తనకు పాపతో పెళ్ళైతే- బహుశా  తనూ ప్రతిరోజూ సిరిపురం నుంచి దియానగర్ కి వెళ్ళివస్తూంటాడు సీఎం లాగే.
    "ఛా! సీఎంలా ఎందుకవుతుంది? అజేయ్ కార్లో వెడతాడు తను. తన పక్కన  ప్రొఫెసర్ అజేయ్ వుంటాడు. సీఎం  అయితే  ఆర్డినరీ స్టాఫ్ తొ బస్సులో పయనిస్తాడు.
    అవును-అప్పుడు తను సీఎం ని సర్ అనాలా? లేక అతడే తనని-సర్ అంటాడా?
    రాజు ఆ ఉత్తరాన్ని జేబులోకి తోసి. 'అప్పుడే నా మనసు పాపతో పెళ్ళి  గురించి కలలు కంటోంది. అంటే రాణిని నేను మరచిపోతున్నట్లేనా?' అనుకున్నాడు.
    ఆ ఉత్తరం సంగతి రాణికి చెప్పాలని అతడనుకున్నాడు. కానీ  బీచిదగ్గర కలుసుకున్నాక- బై చెప్పాక్- రాణి మళ్లీ అతణ్ణి కలుసుకోలేదు. దూరాన్నుంచి ఎప్పుడైనా కనబడ్డా పలకరింపుగా కూడా నవ్వడంలేదు.
    రాణి గురించి ఆజు మనసులో అంతొ ఇంతో బాధ లేకపోలేదు. కానీ అతడికి ప్రేమ కంటే భవిష్యత్తు ముఖ్యం. ఆ భవిష్యత్తుకు పాపతో ముడిపడివుంది.
    పాప-జీన్సుపాప.....
    అజేయ్ కూతురనగానే తనెంత భయపడ్డాడో!
    పాప-చెప్పాలంటే రాణికంటే కూడా బాగుంది. అందానికి మించి ఆధునికంగా వుంది. మనిషిలో చొరవ వుంది. తెలివి వుంది.
    అసలు రాణిని అడిగినట్లే పాపను అడిగివుంటే ఒప్పేసుకునివుండేది.
    తెలివైనది. చురుకైనది. ఎందుకొప్పుకోదూ?

 Previous Page Next Page