వాణి ఇక చదవలేక ఉత్తరాన్ని పడేసి మళ్ళీనవ్వసాగింది. అతడు దగ్గిరకివెళ్ళి కోపంగా "ఎందుకు నవ్వుతున్నావు?" అని అరిచాడు. ఆమె నవ్వాపి, "బొంబాయిలో యిరవైమంది స్మగ్లర్లని అరెస్టు చేయగానే బంగారం ధర ఎంత పెరిగింది?" అనడిగింది.
అతడికి ఆమె అ ప్రశ్న ఎందుకు అడిగిందో అర్థం కాలేదు. "పన్నెండు శాతం" అన్నాడు.
"అండర్ వరల్డు ద్వారా అరేబియా దేశాల్నుంచి గత సంవత్సరం మనకి స్మగుల్ అయిన ఎలక్ట్రానిక్ పరికరాల విలువ ఎంత?"
"దాదాపు పన్నెండు కోట్లు".
వాణి నవ్వి "ఇన్ని విషయాలు తెలిసినవాడివి, ప్రేమగురించి ఉత్తరం వ్రాయటమే తెలీదేమిటి నీకు!" అంది.
అతడు బిక్కమొహం వేసి, "బావోలేదా" అన్నాడు. అంతలో ఏదో స్ఫురించినట్టు అతడే, "అన్నట్టు సింహం మొదటిసారి తన ప్రేమ గురించి ఎలా చెప్పాడు నీకు?" అనడిగాడు.
అది సిగ్గో మరేదైనా భావమో తెలీదు కానీ, ఆమె తల వంచుకుని, "ఇప్పుడవన్నీ ఎందుకులే" అంటూ అతడి వుత్తరాన్ని తిరిగి చదవసాగింది.
"అన్నట్టు మీకు వంటొచ్చా?... మీరు నా గురించి ఏమైనా తెలుసుకోదల్చుకుంటే వాణిని అడగండి. అన్నీ చెపుతుంది. అన్నట్టు మరో విషయం చెప్పటం మర్చిపోయాను. యింకో వారం రోజుల్లో మా అమ్మెవరో నాకు తెలుస్తుంది. తనెక్కడున్నా సరే తెచ్చేస్తాను. మీరూ నేనూ కలిసి మనం అయితే, దానికి మరో యిద్దరు మనవాళ్ళు కలిస్తే, అమ్మతో కలిసి అయిదుగురం! చూశారా. ఇంత మంచి భవిష్యత్తు కోసమైనా మీరు నన్ను ప్రేమించాలి. అమ్మ కూడా చాలా మంచిది.... 'నీకు తెలియని అమ్మ గురించి చాలా మంచిదని నీకెలా తెలుసు' అని అడక్కండి. అమ్మలంతా మంచివాళ్ళే అయివుంటారు. అవునా! నా కాంట్రాక్టు కూడా అయిపోవచ్చింది! మనం అప్పుడు ఈ ప్రపంచం నుంచి దూరంగా వెళ్ళిపోవచ్చు. అన్నట్టు ఈ ప్రపంచం గురించి మీకు తెలీదు కదూ! మా యీ మాఫియా గురించి.... ప్రపంచంలో మనిషి ఖరీదు ఒక చిన్న బుల్లెట్టు. నా కాంట్రాక్టు అయిపోయాక మనం కట్టుకునే చిన్న యిల్లు ఆ బుల్లెట్లకి దూరంగా వుంటుందని హామీ ఇస్తున్నాను. వుంటాను. నమస్తే. పి.యస్. మీకు ఒక వేళ ఈ ప్రేమ యిష్టం లేకపోతే వెంటనే చెప్పకండి. ఒక వారం రోజులు ఆగండి. అప్పుడు నేను బాధపడితే ఓదార్చటానికి అమ్మ వుంటుంది".
ఆమె చదవటం పూర్తిచేయగానే అతడు ఆత్రంగా "ఎలా వుంది? బావోలేదా?" అని ప్రశ్నల వర్షం కురిపించాడు.
ఆమె నెమ్మదిగా కళ్ళెత్తింది. అవి తడిగా ఉన్నాయి. కదిలిపోయిన కంఠంతో ఆమె అంది. "ఈ లేఖ తాలూకు అందం గురించి కాదు. నిజాయితీ గురించి మాట్లాడతాను. నువ్వు అడిగావు జ్ఞాపకం వుందా? సింహం, తన ప్రేమ గురించి మొదటిసారి ఎలా చెప్పాడు అని. ఎవరు ప్రేమ గురించి చెప్పవలసి వచ్చినా, అవతలి వాళ్ళని పొగడటం, అవతలి వారి నుంచి దూరంగా వుండటం వల్ల తను పడే బాధ- వీటిని వర్ణిస్తారు తప్ప ఇంత సిన్సియర్ గా, ప్రాక్టికల్ గా, భవిష్యత్తు గురించి ఆలోచించరు. ప్రేమలో ఇంత ప్రాక్టికాలిటీ వుందని ఇప్పుడే మొదటిసారి నాకు తెలిసింది. మన బలహీనతలూ, మన కోపతాపాలూ, సెక్స్ పట్ల మన అల్టిమేట్ కోరికలూ అన్నీ నొక్కి పట్టి కేవలం మన మంచితనాన్నీ, నెమ్మదిగుణాన్నీ ప్రకటించడమే ప్రేమ అనుకునేదాన్ని. వెళ్ళు! గో ఎహెడ్! తీసుకెళ్ళి ఈ ఉత్తరాన్ని ఆమె కివ్వు. సుమతి తప్పక వప్పుకుంటుందని నా ఉద్దేశ్యం. ఒకవేళ ఆమె ఈ ఉత్తరంలోని నిజాయితీని అర్థం చేసుకోకపోతే, నేను ముందు నవ్వినట్టు నవ్వేస్తే అలాటి అమ్మాయిని వదిలేయటం మంచిది. సుమతి అంత తెలివి తక్కువగా నీ ప్రేమని నిరాకరిస్తుందని నేననుకోను. వెళ్ళు".
* * *
ఆ సాయంత్రం అతడా ఉత్తరాన్ని పట్టుకుని సుమతి వాళ్ళ ఇంటికి వెళ్ళాడు. అతడి గుండె వేగంగా కొట్టుకోసాగింది. మొదటిసారి పిస్టల్ పట్టుకున్నప్పుడు కూడా అతడు అంత టెన్షన్ అనుభవించలేదు.
సుమతికిదేం తెలీదు. మామూలుగా లోపలికి ఆహ్వానించింది. కేదారేశ్వరి కూడా వుంది. "ఏం బాబూ! ఎంతవరకూ వచ్చినాయ్ నీ ఎలక్షన్ పనులు" అని అడిగింది.
"బాగానే సాగుతున్నాయండీ" అన్నాడు.
సుమతి నవ్వుతూ, "చిన్న అసెంబ్లీ ఎలక్షన్ లోనే అభ్యర్థులు నియోజక వర్గం అంతా తిరుగుతారుకదా? మీ వాడు దేశానికే నిలబడి, అసలీ పల్లె కదలటం లేదేమిటి? ఎలక్షన్లు ఇంకెన్నో రోజులు కూడా లేవు. ఇలా అయితే అసలు డిపాజిట్టన్నా దక్కుతుందా?" అని అడిగింది.
అతడు కూడా నవ్వుతూ, "మా అభ్యర్థి వెళ్ళనవసరం లేదు. జనమే ఇతడి దగ్గిరకు వస్తారు. మీరే చూస్తారుకదా" అన్నాడు. ఈ లోపులో ఏదో పనిమీద కేదారేశ్వరి లోపలికి వెళ్లింది. వేళ్ళు వణకటం స్పష్టంగా తెలుస్తూంది. "నేను..." అన్నాడు. మళ్ళీ ఆగి "నేనూ" అన్నాడు. ఆమె అతడివైపు చూసింది. అతడి పెదవులు సహకరించలేదు. ఉత్తరం ఇచ్చేసి మౌనంగా వూరుకోవటమే మార్గమనుకున్నాడు. వేళ్ళు కదులుతున్నాయి తప్ప జేబు దగ్గిరకి వెళ్ళటంలేదు. అసలు తను తనేనా అన్న అనుమానం కలిగింది. రౌండ్ టేబిల్ కాన్ఫరెన్సులూ, కారురేసులూ గుర్తుకొచ్చాయి. 'ఇలా అయితే లాభం లేదు అవమానం' అనుకున్నాడు. చివరికి ఎలా అయితేనేం జేబులోంచి కాగితాన్ని బయటకు తీయగలిగాడు.
అంతలో బయట ఎవరో పిలిచిన చప్పుడయింది. ఆమె బయటకు తొంగిచూసి విప్పారిన మొహంతో "రా శేఖరం రా" అని, అతడివైపు తిరిగి "నాకు వరసకి తమ్ముడవుతాడు. పక్కన పట్నంలో వుంటాడు. అప్పుడప్పుడూ ఇలా వచ్చి చూసి పోతూ వుంటాడు" అంది. ఈ లోపులో ఆ కుర్రవాడు లోపలికి వచ్చాడు. ఆ కుర్రవాడిని చూడగానే ఎక్కడో చూసినట్టు అనిపించింది.
ఆమె అతడిని పరిచయం చేస్తూ, "శేఖరమని, యూనివర్శిటీలో రిసెర్చి చేస్తున్నాడు" అంది. అప్పుడు గుర్తుకొచ్చింది అతడికి. ఈ కుర్రవాడు వ్రాసిన పి.హెచ్.డి. రిసెర్చి పేపర్లనే తను తీసుకుని డాక్టరేట్ పొందింది.
అతడు చెయ్యిసాచి ముందుకు వచ్చాడు. అప్పటివరకూ గోడదగ్గరున్నవాడు చీకట్లోంచి బయటకు రావటంతో, గుమ్మం తాలూకు వెలుతురు అతడి మొహం మీద పడింది.