Previous Page Next Page 
రుద్రనేత్ర పేజి 46


    "శుష్క వాదాలతో సమయం వృథా చేయడం  నా కిష్టం లేదు. చూద్దాం ఎవరు ఎవర్ని ముందుగా ఏం చెయ్యగలరో? ఈ రోజు నా దినచర్య చెపుతాను విను. నేనింకో అరగంటలో ఫ్యాక్టరీకి వెళ్తున్నాను- ట్రాక్షన్ తీసెయ్యగానే. ఆ తరువాత పారిశ్రామికవేత్తల మీటింగ్ కి. సాయంత్రం హోం సెక్రటరీతో మీటింగ్ కి...... రాత్రి గవర్నర్ సభకి ముఖ్య అతిథిని. వీటన్నిటిలో నేను ఎ కార్యక్రమంలో వుండగా షాక్ ఇవ్వాలో ఆలోచించుకో-"

 

    "సరే.... నేనూ నా దినచర్య చెపుతాను విను. ఇప్పుడు ఇంటికి వెళ్ళగానే బీరు తాగి భోజనం చేస్తాను. మూడింటికి నీ చిన్న కూతురుతో సినిమాకి వెళ్తాను. ఆరింటికి నీ పెద్ద కూతుర్ని కలుసుకుని మార్జునానా పార్టీ ఇస్తాను. థర్డ్  డిగ్రీ ఉపయోగించకుండా రహస్యాలు చెప్పిస్తాను. ఎనిమిదింటికి అరెస్టు వారెంట్ తో నీ దగ్గిరకి వస్తాను...... నా దినచర్య బావుందా?"

 

    నేత్ర  అక్కణ్ణుంచి బయటకు వచ్చేశాడు.

 

    సర్పభూషణరావు మొహం రక్తం లేనట్టు పాలిపోయింది.

 

    స్వర్ణరేఖని నేత్ర పట్టుకునే లోపలే ఈ విషయం ఏజెంట్ క్యూకి ఎలా  తెలియజెప్పాలా అని ఆలోచించాడు. మనిషి చాలా వర్రీ  అయ్యాడు.

 

    నేత్రకి కావల్సింది అదే.

 

    చేస్తానన్న పని చేసినా చేయ్యకపోయినా, చేసేటంత డ్రామా బిల్డప్ చేసి  ప్రత్యర్థిని మానసికంగా కృంగిపోయేలా చెయ్యడం  ఒక కళ...... యుద్ధంలో మనకి  అన్నిటికన్నా బాగా  ఉపయోగపడే గొప్ప ఆయుధం- శత్రువు భయం!!!

 

    ఇంటర్ పోల్ ఏజెంట్ కి అది మొదటి అధ్యాయంగా నేర్పుతారు.

 

    "ఎప్పటికప్పుడు శత్రువు ఉనికి తెలుసుకోవడంకోసం- ఊహించని కొత్త పద్ధతుల్ని ఆలోచించు" అన్నది  రెండో  అధ్యాయం. ఆ అధ్యాయంలో భాగంగానే సర్పభూషణరావు చేతికి బ్యాండేజి కట్టేటప్పుడు అందులో డాక్టర్  చేత  సీక్రెట్  ట్రాన్స్ మిటర్ పెట్టించాడు నేత్ర. సర్పభూషణరావు ఎక్కడున్నది, ఎక్కడెక్కడకు వెళ్ళిందీ చెపుతుంది అది.

    
                                                          *    *    *

 

    చాలా చిన్న సందు అది. చీకటిగా వుంది.

 

    మొగవాళ్ళే ఆ సందులోకి ఒంటరిగా వెళ్ళడానికి భయపడతారు. అటువంటిది ఆ స్త్రీ వడివడిగా నడుస్తూ వెళుతూంది. ఆమె నడకను బట్టి  చూస్తే ఆ వీధి ఆమెకు కొత్త కాదని తెలుస్తూంది.

 

    ఆమె వీధి మొదట్లో కారు నిలబెట్టి లోపలికి నడిచినా అక్కడెవరూ ఆమెని పట్టించుకోలేదు. నిక్కర్లేసుకుని గోళీ లాడుకుంటున్న కుర్రవాళ్ళు కూడా చాలా క్యాజువల్ పక్కకి తప్పుకున్నారు.

 

    ఆ సందులో మురికినీరు ఒక పక్కగా  పల్లానికి జారుతుంది.

 

    చిన్న కొట్టు దగ్గిర ఆగిందామె.

 

    ముందు చిన్న  శామియానా వేలాడుతూంది. రెండు బల్లలు వేసి వున్నాయి. లోపలంతా చీకటిగా వుంది. ఆ షాపులో రోజుకి లక్ష రూపాయల అమ్మకాలు జరుగుతాయంటే ఎవరూ  నమ్మలేరు.

 

    "హలో-" అన్నదామె. లోపల కొట్టు తాలూకు యజమాని కదిలిన అలికిడి.

 

    "3- డోస్" అందామె.

 

    లోపల్నుంచి చిన్న వెలుతురు పడింది. ఎంతో నమ్మకస్తులైన కస్టమర్లకి తప్ప అక్కడ అమ్మకం  జరగదు. ఆమె తన మొహం దుకాణదారుకి కనబడేలా ఆ వెలుతుర్లోకి తిరిగింది.

 

    "స్వర్ణరేఖా" అప్పుడు వినపడింది నెమ్మదిగా. గుండు దెబ్బ చెవి  పక్కనుంచి సాగిపోయిన లేడిపిల్లలా ఆమె ఉలిక్కిపడింది.

 

    లోపల్నుంచి నేత్ర బయటకు వచ్చాడు.

 

    అతడిని చూసి ఆమె బిత్తరపోయి "మీరా?" అంది.

 

    "అవును. నేనే. చాలా రోజుల తరువాత కలిసేం కదూ. ఆ రోజు పార్టీలో ....... మళ్ళీ ఇన్నాళ్ళకి......"

 

    "ఎవరు మీరు?"

 

    "నేత్ర ......సీక్రెట్ సర్వీస్....."

 

    ఆమె బెదిరిపోయి వెనుదిరిగింది. అతడామెని అనుసరిస్తూ అన్నాడు-" ఈ షాపువాడిని ఈ రోజే అరెస్టు చేసేం. మాదకద్రవ్యాలు అమ్మడం  ఎంత నేరమో, వాడడం కూడా అంత నేరమే తెలుసా."

 

    "కావాలంటే నన్ను అరెస్టు చేసుకోండి."

 

    "తలుచుకుంటే అది పెద్ద విషయం కాదు. కానీ, నీ మీద వున్న గౌరవంతో ఆ పని చేయలేక పోతున్నాను."

 

    వేగంగా వెళ్తున్నది ఆగి, ఆశ్చర్యంగా అతడివైపు చూసి, "గౌరవమా?" అంది.

 

    "అవును. నీ తెలివితేటలకి ఏ మనిషైనా ఇవ్వవలసిన గౌరవం."

 

    "అనవసరం. నాకు  మీరన్నా, మీ ప్రజలన్నా తెగ అసహ్యం" కసిగా అంది.

 

    "ఎందుకు?"

 

    ఆమె సమాధానం చెప్పకుండా వడివడిగా కారు దగ్గిరకి నడిచింది. గోళీ లాడుకుంటున్న కుర్రవాళ్ళలో ఏదో గొడవొచ్చినట్టు ఒకర్నొకరు తరుముకుంటూ పరుగెడ్తున్నారు.

 

    "స్వర్ణరేఖా! ఒక్క ప్రశ్నకి సమాధానం చెప్పు. అక్కడ తోటలో, అప్పుడు  నారాయణ్ పేటలో అంత రహస్యంగా చేసే ప్రయోగాలు దేనికోసం?"

 

    ఆమె ఏదో చెప్పబోయింది. అంతలో ఆమె నిలబెట్టిన కారు కదిలి ఆమె  ముందుకు వచ్చింది. వాటి గ్లాసు అద్దాలకి నల్లపేపరు వుండడం వల్ల లోపల  డ్రైవరు  సీటులో ఎవరున్నదీ తెలియడం లేదు. కారు దగ్గిరకు రాగానే ఆమె చప్పున అందులో ఎక్కి కూర్చున్నది.

 

    ఆ తెరిచిన తలుపు సందుల్లోంచి క్షణకాలం, లోపల డ్రైవరు సీట్లో కూర్చున్న వ్యక్తి నేత్ర వైపు చూసి నవ్వేడు.

 

    అతను ఏజెంట్  క్యూ!

 

    టైరు పేల్చడంకోసం నేత్ర మెరుపులా జేబులోంచి పిస్టల్ తీశాడు. అతడి  చేతల్లో దిగ్భ్రాంతికి కూడా చోటులేదు. ట్రిగ్గర్ నొక్కబోయిన వేలు ఆఖరి క్షణంలో ఆగిపోయింది.

 

    గోళీ లాడుకునే కుర్రాళ్ళు రోడ్డుకడ్డంగా పరుగెడుతున్నారు.

 

    కారు మలుపులో అదృశ్యమైంది.


                                                             *    *    *    

 

    ఆ సాయంత్రం ఏజెంట్ 'క్యూ' నుంచి సర్పభూషణరావుకి కోడ్  మెసేజ్ వచ్చింది.

 

    "..... నువ్వు పంపిన వార్త అందింది. ఇంటర్ పోల్ స్వర్ణరేఖ నుంచి ఏ  విధంగానయినా రహస్యాలు సేకరిస్తుందని నాకు తెలుసు. ముఖ్యంగా  నేత్ర  రంగంలోకి దిగాడంటే మనం  జాగ్రత్తగా వుండాలి. స్వర్ణరేఖ ఏ షాపులో మందు కొంటూ వున్నదో  కూడా అతడు తెలుసుకున్నాడు.

 

    మన పథకం  చివరి దశలో కొచ్చింది. నీ కూతురు చేస్తున్న ప్రయోగం  ఫలించింది. ఈరోజే దానిని పరీక్షకు పెడుతున్నాం. అది అనుకున్న ఫలితాల్నిస్తే, పుటోనియం తెప్పించి, నీ ఫ్యాక్టరీలో పెద్ద ఎత్తున ఉత్పత్తి జరగాలి.

 Previous Page Next Page