Previous Page Next Page 
రాక్షసుడు పేజి 43


    "మరేదో ఒక పని చెయ్యాలి కదా!"

 

    "నేనిచ్చిన డబ్బులున్నాయి కదా. మూడు నెలలు అతి దర్జాగా గడిచిపోతాయి. ఆ తరువాత ఎలాగూ నువ్వే దేశాధినేతవి అవుతావు".

 

    "అంత నమ్మకంగా చెపుతున్నావే".

 

    "నిశ్చయంగా అవుతావు".

 

    "పోనీలే. అయ్యానే అనుకో. అయిన తరువాతయినా ఏం చెయ్యాలో ఇప్పటినుంచీ తెలుసుకోవాలి కదా!"

 

    "పిచ్చివాడా" అన్నట్టు నవ్వేడు అతడు. "పాత రాజ్యాంగం ప్రకారం ప్రెసిడెంట్ అయ్యాక నువ్వు చేసేది ఏదీ వుండదు. విదేశాల్నుంచి ఎవరన్నా వస్తే వారితో విందారగించటం, బతుకమ్మ పండుగల్లాటివి జరుగుతూ వుంటే వివిధ రాష్ట్రాలకి వెళ్ళి చూడటం, అప్పుడప్పుడు దేశ సమైక్యత గురించి ఉపన్యాసాలు చెప్పటం, ఏ అయిదారు సంవత్సరాలకో పొరపాటున ఒకసారి మన దేశం హాకీలోనో, ఫుట్ బాల్ లోనో, క్రికెట్ లోనో గెలిస్తే వెంటనే అభినందన టెలిగ్రాం ఇవ్వటం, అకస్మాత్తుగా నీ కార్యదర్శినో, పి.య్యేనో దేశ గూఢచారిగా అరెస్ట్ చేస్తే అందరితోపాటు నువ్వూ ఆశ్చర్యం ప్రకటించటం, నీ కుర్చీకిందే దేశం నిర్వీర్యమైపోతుంటే నువ్వు మాత్రం పట్టనట్టు వుండటం... ఓ దేశాధినేతా! ఇప్పటి వరకూ జరుగుతున్నది ఇది. కొత్త రాజ్యాంగంలో దీన్నెలా మార్చాలో ఆలోచించు చాలు..." అంటూ పేపర్ తీశాడు.

 

    అతడి దృష్టి మొదటి పేజీలో ఆగిపోయింది.

 

    అందులో జానకి ఫోటో వుంది. దాని క్రింద ఇలా వ్రాసి వుంది-

 

    "దేశపు అత్యున్నత పదవికోసం ఇరవై రెండు మంది పోటీ చేస్తున్నారు. కానీ అందులో ముఖ్యమైన పోటీ ఇద్దరి మధ్యే వుంటుంది. ఆంధ్రదేశపు మాజీ ముఖ్యమంత్రి, భారతదేశపు మాజీ ప్రధానమంత్రి (వీరిద్దరూ ప్రెసిడెంట్ పదవికి పోటీ చేయటం కోసం తమ ప్రస్తుత పదవులకి రాజీనామా చేశారు) మధ్య ప్రముఖంగా జరిగే ఈ పోటీలో మరొక ఇరవైమంది కేవలం నామ మాత్రంగా పోటీ చేస్తున్నారు".

 

    అంతవరకూ పెద్ద అక్షరాల్తో ప్రచురితమైంది. అక్కడ నుంచి మామూలుగా సాగింది ఇలా-

 

    "పై వార్త నాలుగు రోజుల క్రితం మేము ప్రచురించాం. అప్పటి నుంచీ మ కార్యాలయానికి వేల వేల ఉత్తరాలు వస్తున్నాయి. వీటిని చూస్తుంటే- పోటీలో పాల్గొంటున్న అభ్యర్థి- 'జానకిరాముడు' కూడా ఈ ఎన్నికల్లో గట్టి పోటీ ఇవ్వగలడని తెలుస్తూంది. ఒక మారుమూల గ్రామంలో, ఇంతవరకూ ఏ రాజకీయ ప్రాముఖ్యతా లేని ఒక మామూలు వ్యక్తిని వెనకేసుకొస్తూ (ఈ పద ప్రయోగానికి క్షమించాలి- ఎడిటర్) ఇన్ని ఉత్తరాలు వచ్చినందుకు మేము ఆశ్చర్య పోయాము. మా ప్రత్యేక విలేకరిని స్వయంగా ఆ గ్రామానికి పంపాము. ఆశ్చర్యం కలిగించే విషయాలు ఎన్నో బయట పడ్డాయి.

 

    జానకిరాముడు ఒక అద్భుతమైన వ్యక్తి. నిరాడంబరుడు. గ్రామాభివృద్ధి కోసం, తన చుట్టుపక్కల పరిసరాల అభివృద్ధి కోసం ఆయన నిరంతరం సేవ చేస్తూ వుంటారు. ఆయన గ్రామవాసుల్ని మా విలేఖరి ఇంటర్వ్యూ చేశారు. తన పన్నెండో ఏటనే 'కామ- క్రోధాల్ని' జయించిన శ్రీ జానకిరాముడు ఈసారి ఎన్నికలో నిలబడటం కేవలం దేశాన్ని ఈ విషమ పరిస్థితుల్నుంచి రక్షించటం కోసమే అనీ, ఆయన తప్పక ఈ ఎన్నికలలో గెలుస్తారనీ గ్రామవాసులు చెప్పారు.

 

    ఇన్ని కోట్ల దేశ ప్రజలకి- మారుమూల గ్రామపు వ్యక్తి గురించి ఏం తెలుస్తుంది? ఇతడికి రాజకీయ చరిత్ర గానీ, మిగతా అభ్యర్ధుల్లా ఏ ప్రాముఖ్యతా లేదు కదా- అని మా విలేఖరి ప్రశ్నించగా అదంతా స్వామి వెంకటేశ్వరుడే చూసుకుంటాడని వారు జవాబుఇచ్చారు. గ్రామస్తుల్లో ఒకరిద్దరికి దేవుడు కలలో కనబడి జానకిరాముడికి ఎన్నికల్లో సాయం చెయ్యమని చెప్పాడని వారు ఈ విలేఖరికి స్వయంగా చెప్పారు.

 

    ఈ విలేఖరి శ్రీ జానకిని కూడా ఇంటర్వ్యూ చేశాడు. కేవలం దేవుడు ఆజ్ఞ ఇవ్వటం వల్లనే తను ఎన్నికల్లో పాల్గొంటున్నానని ఆయన చెప్పారు. దేశాన్ని ఈ విషమ పరిస్థితుల్లోంచి తప్పించటం కోసం తను ఈ రాజకీయాల్లో ప్రవేశిస్తున్నానని ఆయన చెప్పారు. ఈ రోజు నుంచీ భారత ప్రజల శ్రేయస్సు కోసం తన జీవితాన్ని అంకితం చేస్తానని కూడా ఆయన అన్నారు.

 

    ఇంగ్లీషు అసలు రాని, విదేశాలు ఏవి ఎక్కడ వున్నాయో కూడా తెలియని మీరు ఈ దేశానికి సారధ్యం వహించే శక్తి వున్నదని నమ్ముతున్నారా అని ప్రశ్నించితే-దానికి ఆయన "అకుంఠిత దీక్ష వుంటే ఏదైనా సాధించవచ్చు" నని చెప్పారు.

 

    శ్రీ జానకిరాముడు నిరాడంబరి. చిన్నతనం నుంచీ కష్టాల్లో ఉండి పైకివచ్చినవారు. ఇప్పటికీ ఆయన పూరిపాకలోనే ఉంటున్నారు. ఆంధ్రదేశపు ముఖ్యమంత్రి, భారతదేశపు ప్రధానమంత్రి- వీరితో పోటీ చేయగల శక్తి మీకు ఉన్నదా అన్న ప్రశ్నకి సమాధానమిస్తూ, "భారత ప్రజలచేత దేవుడే తనకి ఓటు వేయిస్తాడని" ఆయన అన్నారు. "భారత ప్రజలు స్వతహాగా తెలివైనవారు. ఎవరికి ఓటు వేయాలో వారికి తెలుసు. కేవలం మీరు దేవుణ్ణి నమ్ముకుంటే డిపాజిట్టుకూడా పోతుందేమో" అన్నదానికి ఆయన చిరునవ్వు సమాధానమైనది. మా విలేఖరి ఆ చిరునవ్వులో ఆత్మవిశ్వాసాన్ని గమనించాడు. రేపు శ్రీ జానకిరాముడితో ఇంటర్వ్యూ పూర్తి పాఠాన్ని అందిస్తున్నామని తెలియచేయటానికి సంతోషిస్తున్నాం.

 

    అతడు చదవటం పూర్తిచేసి పేపరు జానకిరాముడికి అందించాడు.

 

    "ఏం వ్రాశారు అందులో?" అడిగాడు జానకి.

 

    "అదేమిటి? నీకు తెలుగుకూడా రాదా?"

 

    "అక్కడక్కడా కూడబలుక్కుని చదవగలను" అని, అతడు మౌనంగా ఉండటం చూసి, "అందుకే" అన్నాడు. "వ్రాయటం, చదవటం సరీగ్గా రానివాడు ప్రెసిడెంట్ పదవికి పోటీ ఏమిటి" అని. "కనీసం సంతకం కూడా సరిగ్గా పెట్టటం రాదు నాకు".

 

    అతడి కళ్ళముందు ఒక దృశ్యం కదలాడింది. ఫ్రెంచి దేశాధినేతా, జానకిరాముడూ దేశ విదేశ ప్రముఖుల మధ్య, రాయబారుల నడుమ, అణుశక్తి ఒప్పందం మీద సంతకాలు పెట్టి, పత్రాలు మార్చుకోవటం.... ప్రపంచ చరిత్రలో మొదటిసారి ఒక అత్యున్నత అధికార పత్రం మీద దేశాధినేత సంతకం బదులు వేలిముద్ర వుండటం.

 

    "ఏమిటి ఆలోచిస్తున్నావ్? నేను ముందే చెప్పా...."

 

    "భారతదేశాన్ని ఏలటానికి వేలిముద్రవాడు చాలు. అదికాదు నేను ఆలోచిస్తున్నది. ఈ పేపరు వార్త తాలూకు ప్రభావం దేశంలో ఎలా ఉంటుందీ- అని" సాలోచనగా అన్నాడు అతడు.  

 

                                                         *    *    *

 

    అతడు వూహించిన దానికన్నా ఎక్కువ సంచలనాన్ని కలిగించింది ఆ వార్త.

 

    దేశ ప్రజలు కొన్ని కోట్లమంది ఆంగ్లంలో ఆ వార్త చదివారు. స్థానిక పత్రికలు వెంటనే తమ బాషలోకి ఆ వ్యాసాన్ని అనువాదం చేసి ప్రచురించాయి. తిరుపతి ఫిలాసఫర్స్ అసోసియేషన్ వాళ్ళు (సభ్యులు నలుగురు. అందులో ఒకరు ప్రెసిడెంటు. ఒకరు సెక్రటరి. ఒకరు కోశాధికారి. ఒకరు సలహాదారు. మొత్తం నలుగురే. అయితేనేం? అసోసియేషన్ అసోసియేషనే కదా) తమ మద్దతు తెలిపారు. ప్రధానమంత్రన్నా, ముఖ్యమంత్రన్నా పడని విజయవిచార మంచ్ లాటి పార్టీలు హడావుడిగా జానకిరాముడుని సపోర్టు చేశాయ్.

 Previous Page Next Page