Previous Page Next Page 
ఒక రాధ ఇద్దరు కృష్ణులు పేజి 42


    "తలుపులు పగలగొడదాం !" అన్నాడతను.

    "బాత్ రూమ్ వేపు నుంచీ ఇంకో తలుపు వుంది. పదండి అందులో నుంచి వెళ్దాం!" అన్నాడు రామలింగం.

    అందరూ ఊరేగింపుగా వెనుక వేపు నుంచి గదిలో జొరబడ్డారు. లోపల గది ఖాళీ !

    అవతారస్వామి మాయమైపోయాడప్పటికే, టేబుల్ మీద పేపర్ వెయిట్ కింద ఓ తెల్ల కాగితం గాలికి రెపరెప కొట్టుకుంటూ కనిపించింది. పెద్దపెద్ద అంగలతో వెళ్ళి ఆ కాగితం అందుకున్నాడు నరసింహం.

    "అప్పుడే ఏమైంది ? ముందుంది ముసళ్ళ పండగ" అని రాసి వుందందులో.

    అది చదవగానే నరసింహం గట్టిగా, "ఆమెని పట్టుకోండి. ముందా శారదమ్మని" అని అరిచాడు.

    అందరూ ఆవిడకోసం చూశారు. ఆమె కూడా స్వామితో పాటే మాయమైంది.

    నరసింహం మొఖం మాడిపోయింది. రెండు పిడికిళ్ళూ బిగుసుకున్నాయ్ అప్రయత్నంగా.


                               13


    హరికృష్ణ ఇంటికి చేరుకునేసరికి శారదమ్మ ఖిన్నురాలయి కూర్చుని కనిపించింది.

    "అమ్మా ! వాడి తిక్క అద్భుతంగా కుదిర్చావమ్మా ! నువ్ ఆ అవతారస్వామి గాడినే కొడుకుగా గుర్తు పట్టేసరికి ఆ నరసింహం గాడూ, రామలింగం - ఇద్దరూ చావు దెబ్బ తిన్నారు -"

    శారదమ్మ అతని వంక నిరాసక్తతతో చూసింది.

    "కానీ ఎందుకురా ఇవన్నీ ! మధ్యలో పాపం రాధ బాధపడుతుందేమో ! అసలు భర్త ఎవరో, రెండోవాడెవడో తెలియక ... ఎంత కాదనుకున్నా అది నా కోడలు."

    "అదంతా నా కొదిలేసెయ్ అమ్మా ! కానీ ఆ నరసింహం గాడిని చిత్రహింసలు పెట్టక తప్పదు. వాడు చేసిన దారుణాలకు వాడు శిక్ష ఈ లోకంలోనే అనుభవించాలి. అదీ మన కళ్ళెదురుగా."

    "అంటే - ఇక్కడితో వదిలేయవా ?" ఆందోళనతో అడిగిందామె.

    "అప్పుడే కాదమ్మా ! నాన్నను అమానుషంగా చంపి ఆ నేరం నుంచి తప్పించుకున్నాననుకుంటున్న నరసింహం కూడా అంతటి అమానుషానికి గురి కావాలి. అప్పుడు గానీ నాకు మనశ్శాంతి లభించదు - ఇంకెంతో కాలం అక్కరలేదమ్మా ! కొద్ది రోజులే? ఆ తరువాత వాడి జీవితానికి తెర పడిపోతుంది."

    శారదమ్మ ఏమీ మాట్లాడలేదు. అతను చేస్తున్నది సరియైన పనో, కాదో తెలీటం లేదామెకి.


                         *    *    *


    "రాధా ! రాధా-" గట్టిగా పిలిచాడు మురళి ఇంట్లోకొస్తూ.

    రాధ వడివడిగా వచ్చింది లోపల్నుంచి.

    "ఏమిటండీ ? అప్పుడే వచ్చేశారు-"

    "మన సొంత ఆఫీసేగా ! అడిగేదెవరు ! నిన్ను చూడాలనిపించి వచ్చేశాను- అది సరేగానీ, తెల్లచీర, తెల్లజాకెట్టూ - మల్లెపూలూ - ఏమిటీ వేషం ?"

    "బాగుంది ! మీరేగా ఈ డ్రస్ లో కనిపించాలని చెప్పింది?"

    మురళి ఆశ్చర్యపోయాడు.

    "నేను చెప్పానా ?"

    "అవునూ ! సాయంత్రం సినిమా కెళదాం - తెల్లచీర కట్టుకుని  మల్లెపూలు పెట్టుకోమని మీరు మధ్యాహ్నం భోజనానికొచ్చినప్పుడు చెప్పిన సంగతి మర్చిపోయారా ?"

    మురళి అదిరిపోయాడు.

    "అంటే - ఆ విషయం కూడా మీకు గుర్తులేదా ?" నవ్వుతూ అందామె.

    మురళికి మతిపోయినట్లయింది.

    "నేను ఉదయం పది గంటలకు భోజనం చేసి మీ నాన్నగారితో పాటు ఆఫీస్ కెళ్ళాను కదా ! మళ్లీ మధ్యాహ్నం ఎందుకు వస్తాను భోజనానికి ?"

    "బాగుంది ! నేనూ అదే అడిగితే ఇవాళ బాగా ఆకలేస్తోంది. భోజనం వడ్డించు - అని అడిగి మరీ భోజనం చేశారు -"

    వాళ్ళ వాదన పక్కగదిలో నుంచి వింటూన్న నరసింహానికి గుండెలు వేగంగా కొట్టుకున్నయ్. అంటే ఆ డూప్లికేట్ గాడెవడో తనింటి మీదకే దండయాత్ర ప్రారంభించాడన్న మాట ! రాధ కూడా  వాడిని గుర్తు పట్టలేకపోతోందంటే వాడి పోలికలన్నీ ఖచ్చితంగా మురళి పోలికలే అయుండాలి.

    నరసింహం తన గదిలో నుంచి బయటి కొచ్చాడు. మురళీకృష్ణ దిగాలు పడి కూర్చుని వున్నాడు సోఫాలో. రాధ 'టీ' తేవడానికి లోపలికెళ్ళింది.

    "మావయ్యా ! వాడు మధ్యాహ్నం మనింటికే వచ్చి భోజనం చేసి వెళ్ళాడట. అంతేకాదు - సాయంత్రం పెందలాడే వచ్చి రాధను సినిమాకి తీసుకెళతానన్నాడు. వాడు చెప్పినట్టే రాధ తెల్లచీర కట్టుకుని, మల్లెపూలు పెట్టుకుని, సిద్ధంగా ఉంది - నాకేం అర్ధం కావటం లేదు మావయ్యా ! భయంగా ఉంది - రాధనే మోసం చేశాడంటే - మనకి చాలా సమస్యలు తెచ్చి పెట్టేట్లున్నాడు."

    నరసింహానికి నోట మాట రావటం లేదు. 

 Previous Page Next Page