Previous Page Next Page 
జీవితం చేజారనీయకు పేజి 42

    నా ఇల్లు, నా మొగుడు, నా సంసారం - నా మొగుడు నా మాట వింటాడు, నా ఇంట్లో నా ఇష్టం చెల్లుతుంది - అనుకొని ఏవో ఊహిస్తాం. దానికి విరుద్ధంగా ఆ భర్త మనల్ని కేర్ చెయ్యకపోతే, మన మీద జులుం చలాయిస్తే మన కలలన్నీ కల్లలయినట్టు తల్లడిల్లిపోయి, ఆ భర్త దుర్మార్గుడుగా కనిపించి అలాంటి భర్త దొరికాడని తిట్టుకుంటాం. మనల్ని గౌరవించలేదని, మన అభిప్రాయాలకి విలువ ఇవ్వలేదని కించపడ్తాం. దాంతో మనస్పర్థలు మొదలు అవుతాయి. కాని ఇప్పుడు అనుభవంతో చెబుతున్నమాట ఏమిటంటే, భర్తలని మనక్కావలసినట్టు మల్చుకోవడం ఆడదాని చేతిలో ఉంటుంది అనిపిస్తూంది. కాస్త సౌమ్యుడైన భర్త అయితే మనకు కావల్సినట్టు మోల్డ్ చేసుకోవడం సుళువు.
    అదే కాస్త కోపిష్టి, ధూర్తుడు, అహంకారి అయితే మనకు కావల్సిన రీతిలో మలుచుకోడానికి టైము పడ్తుంది. ఆ రాయిని మనకు కావల్సిన ఆకారంలో తీర్చిదిద్దడానికి ఉలి, శానం, చేతిలో శక్తి, మెదడులో ఆలోచన వుండాలి. బంకమన్ను అయితే చేతులతో సుళువుగా మలచవచ్చు. ఎలాంటి మగవాడయినా, ఎంత ధూర్తుడైనా కాస్త యుక్తి ఉపయోగిస్తే లొంగక మానడు.         
    మొదట్లోనే ఆ భర్తని మనకు అనుగుణంగా మార్చాలన్న ఆరాటంలో, యావలో తొందరపడి తప్పటడుగు వేయకూడదు మనం. ముందుగా మనం అతనికి లొంగినట్టు నటించి అతని అహాన్ని చల్లార్చాలి. తిట్టినా, కోప్పడినా అతి శాంతమూర్తిలా తలదించుకుని భరిస్తే కొన్నాళ్ళకి, అయ్యో పాపం నేనేమన్నా వూరుకుంటుంది అన్న సానుభూతి సంపాదించుకుంటాం. అన్నింటి కంటే ముఖ్యం తొలిరోజుల్లో సెక్స్ పట్ల ప్రతి మగవాడికి వీక్ నెస్ వుంటుంది. ఆ వీక్ నెస్ ని ఆడది కేష్ చేసుకోగలిగితే మన గుప్పిట్లో చిక్కినట్టే. అతనో హీరో అన్నట్టు. అతనో శృంగార పురుషుడన్నట్టు మాటలలో చేతలలో చూపిస్తే లొంగిపోని పురుషుడుండడు.
    కొత్తరోజుల్లో మనమీద పూర్తిగా అతను అన్నింటికీ ఆధారపడేట్లు చేసుకోవాలి. చేతికి టూత్ బ్రష్ అందించి, షేవింగ్ సెట్ సిద్ధం చేసి, బాత్ రూములో తువాలు పెట్టి, వీపు రుద్ధి, తలంటి, నోటికి ముద్దలందించి కన్నతల్లి చిన్నపిల్లవాడిని సాకినట్టు సాకితే చంటివాడు తల్లిమీద ఆధారపడ్డట్టు మనమీద ఆధారపడిపోతాడు పురుషుడు. కొత్తలో ఒక ఏడాదిపాటు అతనికి మనం లొంగితే. లొంగినట్టు నటిస్తే మిగతా జీవితం అంతా మనకి అతను లొంగిపోతాడు."
    "ఆంటీ...... ఇవన్నీ ఇంత బాగా తెల్సిన మీరు..... ఎందుకు అమలుపరచలేదు?"
    నవ్వింది నిర్మల..... "ఇవన్నీ అప్పుడు తెలిస్తే నేనీనాడు ఎందుకిలా వుంటాను విద్యా! నేచెప్పానుగా, ఏవో ఊహించుకుని, ఏవో చూసి, చదివినా భర్త ఇలా వుండాలనుకుని వెళ్ళిన నేను దానికి పూర్తిగా విరుద్ధంగా జరిగేసరికి నా కలలు కరిగిపోయాయి. అల్లారుముద్దుగా పెరిగిన నేను నన్ను కాదన్న అతన్ని క్షమించలేకపోయాను. అతనికి లొంగిపడి వుండటమా అన్న అహంకారంతో, నాకేం డబ్బుంది. ఆదరించే తల్లిదండ్రులు ఉన్నారన్న అజ్ఞానంతో అతన్ని ఏ విధంగానూ మార్చాలని కొంతైనా ప్రవర్తించలేదు. కొన్నాళ్ళు శాంతంగా, ఓపికపడితే అతనే దారికి వస్తాడు అని కూడా ఆలోచించలేదు.
    ఆ వయసువేడిలో అనుభవశూన్యంగా ప్రవర్తించాను అని ఇప్పుడు అనుకుంటున్నాను. భర్తలని తప్పుపట్టే ముందు మనల్ని మనం సరిదిద్దుకుంటే మంచిది. ఎంత క్రూరుడైన భర్త అయినా ఏదో ఒక చిన్న ప్లస్ పాయింట్ వుండకమానదు మనిషిలో. అది వెతికితీయడానికి ప్రయత్నించాలిగాని మైనస్ పాయింట్లే పదే పదే చెప్పి అవతలి వారిని రెచ్చగొడితే జరిగేది ఏమీ వుండదు విద్యా! చూడు నీ విషయం. మీ ఆయనకి తల్లిదండ్రులంటే భక్తి అలాంటప్పుడు మన మధ్య మీ అమ్మ నాన్న ఎవరు అంటే ఎలాంటి వారికైనా కోపం వస్తుంది. అదే నీవు తెలివిగా 'అవునండి' మీ అమ్మా నాన్నగారు ఎంతమంచివారు, వాళ్ళకి తెలియకుండా ఎలా చేస్తాం? ఇవాళే వాళ్ళకి రాయండి మనం సామానులు కొనుక్కుంటాం అని' అన్నావనుకో, ఆ మానవుడు ఎంతో సంతోషిస్తాడు.
    నాల్గుసార్లు తల్లిదండ్రులతో ఏ పని చెప్పందే చేయడు. అయిదోసారి వాళ్ళకి చెప్పకుండానే నీ ఇష్ట ప్రకారమే చేస్తాడు. తన భార్య తనకి అన్నింట్లో సహకారం ఇస్తుందన్న సంబరంతో 'మా నాన్నకి చెప్పకుండా నిన్ను మీ ఇంటికి పంపను' అంటే మనసులో మండిపోతున్నా కోపం తెచ్చుకోకుండా, 'ప్లీజ్...... ఇవాళే మీ నాన్నగారికి రాయండి - ఫోనన్నా చెయ్యండి' అంటే ఎంత సంబరపడిపోతాడు. నీలాంటి దాన్ని సంతోషపెట్టడానికి వాళ్ళవాళ్ళందరినీ కాదని నీ పాదాక్రాంతుడయ్యే స్టేజికి వస్తాడు......."
    "ఆంటీ, మీరు ప్రాక్టికల్ గా ఆలోచించడం లేదు. నేను మనిషిని కానా, దేవతనా! నాకేం ఫీలింగ్స్ ఉండవా, కోపం తాపం వుండవా. నేనేం మానవాతీతురాలినా అలా మాట్లాడటానికి? నాకేం ఆత్మాభిమానం వుండదా అంతలా లొంగిపోవడానికి? ఇదంతా వినడానికి బాగుంది. చెయ్యడం ఎంత కష్టమో....." మూతి ముడిచి అంది విద్య.    
    "చాలా కష్టం విద్యా......నే చెప్పింది ఆచరణలో పెట్టాలంటే చాలా కష్టం అని నాకు తెల్సు. కాని తెలివైన భార్య అయితే అహం కొన్నాళ్లు చంపుకుని అలా చేసి భర్తని దారిలోకి తెచ్చి గుప్పిటిలో పెట్టుకుంటుంది. మనలాంటి వాళ్ళయితే వడ్డించిన విస్తరిని తన్నుకుంటూ లేచిపోతే మన అహం, గరం మనకే శత్రువు అవుతుంది. విద్యా, చేతులు కాలాక ఆకులు పట్టుకోవద్దని నా గోల. ఎందుకింతలా చెబుతున్నానో అన్నది ఆలోచించవేం?" అన్ని రకాలుగా చెప్పి విద్యని నమ్మించలేకపోతున్నందుకు అసహాయత నించి విసుగు వచ్చింది నిర్మలకి.
    "అలా అయితే ఇప్పుడు నన్నేం చెయ్యమంటారు చెప్పండి? నాథా! నీవే నాకు శరణం అంటూ వెళ్ళి అతని కాళ్లుపట్టుకొని క్షమించమని అడగమంటారా? హు!" దురుసుగా అంది విద్య.
    "నిన్నేం కాళ్ళు పట్టుకోమనడం లేదు. క్షమాపణా కోరమనడం లేదు. చూడు, ముందర నీ ఎమ్మే పూర్తి చెయ్యి. ఏది ఎలా వచ్చినా ముందు నీవు నీ కాళ్ళమీద ఆర్థికంగా నిలబడే అర్హత సంపాదించుకో. మీ ఆయన ఫారెన్ నించి వచ్చేలోగా నీ చదువు పూర్తి చెయ్యి. ఈలోగా ఆయన రమ్మని ఉత్తరం రాస్తే నా చదువు ఇంకా ఐదారునెలల్లో అయిపోతుంది, ఇలాంటి స్టేజిలో మానడం నాకిష్టం లేదు అని సౌమ్యంగా రాయి. కోపంగా ఆయన ఉత్తరం రాస్తే జవాబివ్వకు. నీ చదువు అయ్యేవరకు ఓపికపట్టు. ఈ లోగా అతనూ భార్య ఇంట్లోంచి వెళితే ఆ అవమానం, వెలితి గ్రహించుకుంటాడు. అప్పుడు కాస్త తగ్గి దారికి రావచ్చు. నీ పరీక్షలయ్యాక, అతను ఫారెన్ నుంచి వచ్చాడని తెలిశాక పిలవకపోయినా నీ అంతట నీవు వెళ్లి అతనికి ఒక ఛాన్స్ ఇచ్చి చూడు. ఆ వెళ్ళినప్పుడు మాటల్లో, ప్రవర్తనలో సౌమ్యత కనబరుచు. అతనేమన్నా కొన్నిరోజులు మాట్లాడక ఊరుకో."     
    "తిట్టినా, కొట్టినా, అవమానిస్తున్నా సహించమంటారా?" తీవ్రంగా అంది విద్య.
    "కొన్నాళ్ళు మాత్రం సహించు. కనీసం సహించినట్టు నటించు. ఎందుకంటే, ఎక్కడో మరీ క్రూరుడు, సాడిస్ట్ అయితే తప్ప భార్య తగ్గిపోగానే హింసించడం మానేస్తాడు. భార్యని లొంగదీసుకున్నానన్న తృప్తితో, ఆనందంతో, గరంతో నీ జోలికి రావడం తగ్గిస్తాడు. నేను చెప్పినట్టు కొన్నాళ్ళు అతనన్నదానికి అవునని చూడు. అలా ప్రవర్తిస్తే దారికి వచ్చేది లేనిది నెలా రెండు నెలల్లో పరీక్షించి చూడు. నీవు కొంచెం మారితే, అతన్ని మార్చగలనన్ననమ్మకం నీకు కలిగితే అతనికి అనుగుణంగా నీవు కొన్నాళ్ళు మారాలి. నూటికి తొంభై మంది మగవారు ప్రేమకి, అనురాగానికి లొంగుతారు. నీవెంతంటే నీవెంత అని ఎదిరించే భార్యని ఎదుర్కొంటాడు కాని లొంగి, ప్రేమ, అనురాగాలు చూపే వ్యక్తి త్వరలోనే లొంగిపోతాడు. అని నా నమ్మకం. అన్ని విధాల ఓ రెండు నెలలు నేర్పుగా, ఓర్పుగా అతన్ని మార్చడానికి ప్రయత్నించు."     

 Previous Page Next Page