దానికి అతడు యాభైవేలు అడిగాడు.
ప్రమద్వర తల్లికూడా ఆ రేటే ఫిక్సుచేసింది. కూతురు 'వ్యాపారం'లోకి దిగివుంటే అంత సంపాదించేదట. ఆనంద్! ఇదంతా వ్రాసి నీ మనసు పాడుచేయటం నాకిష్టం లేదు. కానీ జరిగింది అది! యాభైవేలు నేను ఇవ్వటానికి అంగీకరించాను. ఫలితంగా మరుసటిరోజే ఈ వివాహం జరిగింది.
అయితే అంత సులభంగా ప్రమద్వర దీనిని వప్పుకోలేదు. ఆ భ్రష్టుడితో వివాహం కంటే ఆహ్మహత్య చేసుకోవటమే మంచిదని ఆమె భావించింది. కానీ ఆమె మరణిస్తే నువ్వు ఏమవుతావో నేను వూహించగలను. ఆ విషయమే ఆలోచించమన్నాను. ఆమె తెలివైంది. క్షణాల్లో దాన్ని అర్ధం చేసుకుంది. వివాహానికి వప్పుకుంది. యాభైవేలతో భైరవమూర్తి ఆమెను చేసుకున్నాడు.
ఆనంద్ ఇదంతా నేన్నీకు చెప్పకూడదనుకున్నాను. నా డబ్బు గురించి చెప్పుకోవటం కూడా నా కిష్టంలేదు. కానీ హిమాలయాల కంటే ఉన్నతంగా ఎదిగిపోయిన నీ స్నేహితురాలి వ్యక్తిత్వం ముందు నా అల్పత్వం నన్ను హేళన చేస్తూంది. మరణ వాంగ్మూలంకంటే సత్యం మరొకటి ఉండదు. అందుకే ఈ నిజాన్ని నీనుంచి దాచలేదు. చెడిపోయిన నీ స్నేహితురాల్ని ఒక ఇంటిదాన్ని చేశాననే సంతృప్తి ఒకటే నాకు మిగిలింది. నా వల్ల అన్యాయమైపోయిన వారిలో ఆమెకూడా వుంది కదా.
కొద్దిగా ఆస్తికూడా ఆమె పేరుమీద వ్రాస్తున్నాను. భైరవమూర్తి ఈ కారణంగానైనా ఆమెని జాగ్రత్తగా చూసుకుంటాడని ఆశ! నేను చేయగలిగినదంతా చేశాను. ఇక నువ్వు మిగతాది చెయ్యాలి. ఈ లోకంలో లేని నామీద మరింక నీకు కోపం వుండదని ఆశిస్తూ, ఒకవేళ వున్నా, దాన్ని నా కూతురిమీద చూపెట్టవన్న ఆశతో-
-నీ మామయ్య"
14
ఉత్తరం ఎలా పూర్తిచేశానో గుర్తులేదు. మనసంతా ఒక రకమైన శూన్యత ఆవరించింది.
ప్రమద్వర నాశనమైంది! నేను అపురూపంగా పెంచుకున్న మొక్కమరొకసారి కాళ్ళక్రింద పడి నలిగిపోయింది! దాన్ని నిలబెట్టటానికి రావుగారు ప్రయత్నించారు! అటు నన్ను సరిదిద్దడంకోసం ఆత్మార్పణం చేసుకున్నారు. "హిమాలయాలకంటే ఉన్నతంగా ఎదిగిపోయిన నీ స్నేహితురాలి వ్యక్తిత్వం ముందు...."అన్నారాయన. ఎదిగింది ప్రమద్వర కాదు, ఆయనే చేసిన చిన్నతప్పుకు ఇంత శిక్ష వేసుకుని పునీతుడయ్యాడు ఆయన!
ఆయన ఉత్తరంలో వ్రాసిన మరో వాక్యం నన్ను కదిల్చివేసింది. "తను మరణిస్తే నువ్వేమవుతావో ఆలోచించి ఈ వివాహానికి బలవంతంగా వప్పుకుంది ప్రమద్వర".
ఎంత పచ్చినిజం! నిజంగానే నేను పట్నంలో వుండగా, ఇక్కడ ఈ దారుణం జరిగిన తరువాత ప్రమద్వర ఆత్మహత్యా చేసుకుని మరణించి వుంటే నేనేమై వుండేవాడిని? ఎలా ఆలోచించి వుండేవాడిని? ఆమెని రావుగారే చంపించి వుంటారని వూహించేవాడిని కదూ....తన అడ్డు తొలగిపోతేనే మా దాంపత్యం....బాగుపడుతుందని భావించి రావుగారే ఈ పని చేయించారని అనుకుని, తరళకి శాశ్వతంగా దూరమయ్యేవాడిని కదూ!
ఇంత ఆలోచించి ప్రమద్వర ఈ పెళ్ళికి వప్పుకున్నదన్నమాట! మనసులో ఎన్ని అగ్ని పర్వతాలు బ్రద్దలైనా బలవంతంగా తనని చెరిచిన వాడితోనే జీవితం పంచుకోవటానికి సిద్దపడిందన్నమాట. ఒకరు ఆత్మహత్య చేసుకుని నన్ను సరిదిద్దటానికి ప్రయత్నించారు. మరొకరు నాకు మనస్తాపం కలగకుండా వుండటంకోసం ఆత్మహత్యా చేసుకోకుండా నరకంలాంటి దాంపత్య జీవితంలోకి అడుగు పెట్టారు. ఇద్దరూ ఈ విధంగా నా మీద కక్షసాధించారు.
నా మనసు ఆ ఇంటిలాగే శ్మశానవైరాగ్యంతో నిండింది. పనులన్నీ ఒక నిమిత్త మాతృడిలా నిర్వహించాను.
ఒకసారి మనిషి మానసికంగా చచ్చిపోవటం ప్ర్రారంభిస్తే ఇక ఆ మరణం ఒక్కసారి జరగదు. ఆగదుకూడా!.... ఏ గాయపు బాధనైనా ఎదుర్కోవచ్చు. ఏ ఓటమినైనా ఎదుర్కోవచ్చు. కానీ ఆత్మ- అంతరాత్మల మధ్య సంఘర్షణని భరించటం మాత్రం అసాధ్యం. ఒకసారి అది మొదలైతె ఇక ఎంతటి వాడైనా కృంగికృశించి పోవాల్సిందే అది పతనానికి ప్రారంభం.
నాకు చాలాసార్లు ఒకే కల మాటిమాటికీ వచ్చేది. ఆ కలలో రావుగారూ, తరళా వీళ్ళెవరూ లేరు... అప్పటికి నాకు పెళ్ళయిందో లేదో కూడా తెలీదు. రెండ్రోజులు పట్నంలో ఏదో పని మీద వెళ్ళొచ్చేసరికి ప్రమద్వరని ఆమె మావయ్య బలాత్కరించినట్టు తెలిసింది. కొడవలితో పరుగెత్తానట.... తలుపు తట్టేసరికి ఎదురుగా ప్రమద్వర.... మెళ్ళో మంగళసూత్రంతో - నాభర్తని చంపొద్దు అన్నట్టు చూస్తూ...
నేను బిగ్గరగా నవ్వుతున్నాను. "నన్ను హంతకుడిని చేయటం ఇష్టంలేక నీ భర్తను నేనెలాగూ చంపనన్న ధీమాతో నీకై నీవు కట్టుకున్న తాళి అది. అంతే తప్ప నీ భర్త కట్టింది కాదు".
ఆ అరుపులతో కల చెదిరిపోతుంది.
ఇలా చాలాసార్లు వచ్చేది.
ఈ కలకి అర్ధం నేనిలా చెప్పుకున్నాను- "నేను సుఖంగా వున్నాను- నువ్వూ సుఖంగా వుండు" అని నాకు చెప్పటం కోసమే ప్రమద్వర ఆ వివాహం చేసుకుంది తప్ప అసలది వివాహమే కాదు అని నా మనసులో ఎక్కడో బలంగా ముద్రపడి పోయింది. ఆ భావరూపమే తరచుగా వచ్చే ఈ కల!
నేను ఈ జీవితంలో రాజీపడలేకపోయాను. ఒక రకంగా చెప్పాలంటే నా కంటే రావుగారే ధైర్యవంతుడేమో? పరిష్కారంగా ఆత్మహత్య చేసుకున్నాడు.
తరళలో పిచ్చి, పెంకితనంతోపాటు విపరీతమైన ప్రేమకూడా వుంది. అయితే దాన్ని ప్రదర్శించే విధానాలే బావుండేవికావు. "ప్రొద్దున్నెళ్ళి రాత్రొస్తారు. అంతసేపూ ఏం చెయ్యను?" అంది విసుగ్గా 'పేరు వ్రాసుకు చూసుకుని సంతృప్తిపడు' అన్నాను. ఆ రోజు సాయంత్రం ఇంటికి వచ్చేసరికి గోడల్నిండా పేర్లు వ్రాసింది ఇదీ ఆమె ప్రేమ ప్రకటించే విధానం. ఇంకెవరైనా అయితే ఆమెతో సుఖపడేవారేమో కానీ, ఒకసారి సెలయేటికి అలవాటు పడినవారు జలపాతపు హోరును భరించలేరు. అయితే ఆమె ప్రేమ నన్ను అప్పుడప్పుడు కదిల్చివేసేది. కానీ ఆమె దగ్గరకు రాగానే నాకు ప్రమద్వర గుర్తొచ్చేది. దాంతో దూరం తొలగిపోయేవాడిని. ఆమెని తాకింది మొదటిరోజు మాత్రమే. అయితే విధి- ఆ అవకాశం చాలంది!
తరళ గర్భవతి అని నాకు తెలిశాక మునుపటిలా ఆమెతో కఠినంగా వుండలేకపోయాను. కానీ మానసికంగా ఎప్పుడూ దగ్గిర కాలేనన్నది పచ్చి నిజం. నాకు ప్రేమగురించి పెద్దగా వివరించటం తెలీదు. ప్రేమికులు ఎలా ఒకరికొకరు నమ్మకంగా వుంటారు, ఒకరి ఆలోచనల్లో ఒకరు అనుక్షణం గడుపుతారు అన్నది చెప్పలేను. ప్రేమ అన్నది ఒక ఫీలింగు. హృదయంలో పుట్టుమచ్చ. దాన్ని అనుభవించాలే తప్ప మరొకరు వివరిస్తే వినాలనుకోవటం హాస్యాస్పదం. చాలా రోజుల క్రితం ఒక సంఘటన జరిగింది. అప్పటికి మేము ముగ్గురం స్నేహితులం మాత్రమే. నేను గోదారి ఒడ్డుకు వెళ్ళేసరికి తరళ ప్రమద్వర ఏదో మాట్లాడుకుంటున్నారు. తరళ అన్న దానికి ప్రమద్వర బిగ్గరగా నవ్వుతూంది. ఆ తరువాత ఒంటరిగా ఉన్నప్పుడు ఆమెను అడిగాను-