Previous Page Next Page 
థ్రిల్లర్ పేజి 3


    అతడు నవ్వేడు. "మీరు కేవలం నన్ను పరీక్షించటానికే ఈ కథ అల్లి చెప్పారని నాకు తెలుసు."

    ఆమె కూడా నవ్వి "బాగా కనుక్కున్నారే" అంది. "ఇక ఆ విషయం వదలిపెట్టండి. అసలు విషయం చెప్పేస్తాను. మా బావ ఒకతను వున్నాడు. రూర్కెలాలో పనిచేస్తున్నాడు. అతడిని చేసుకోవాలని మా అమ్మ ఆఖరి కోరిక."

    "మరి మీరు?"

    "అతనంటే పెద్ద ఇష్టంలేదు, అయిష్టం లేదు. మిమ్మల్ని చూశాక అయిష్టంపాలు కాస్త ఎక్కువైంది."

    అతడి మొహం విప్పారింది "థాంక్స్" అన్నాడు.

    ఆమె ఆలోచనగా "కానీ అతన్ని చేసుకోవటం తప్పదేమో" అని, తల విదిలించి "నేనెటూ నిర్ణయించుకోలేకపోతున్నాను" అంది.

    ఆమె చేతిమీద చెయ్యివేసి అనునయంగా, "నా స్నేహంతో మీరు ఊరట పొందుతారని నాకనిపిస్తుంది విద్యాధరీ" అన్నాడు. ఇంతలో బేరర్ వచ్చాడు. వృద్ధుడు జీవితపు కష్టనష్టాలు ముడతల రూపంలో మొహంలో ఇముడ్చుకున్నవాడు. ప్లేట్లు సర్దుతున్నాడు. ఆమె చేతిని వెనక్కి లాక్కొంది.

    బేరర్ వెళ్ళిపోయాక, "ఒక్కప్రశ్నకి జవాబు చెప్పండి విద్యా. మీరు నాతో స్నేహంగా వుండగలరా? మీకు ఫ్రాంక్ నెస్ ఇష్టం అన్నారని అడుగుతున్నాను. జీవితంలో అన్నీ కోల్పోయిన వాడిని. మీరు తరువాత ఏ నిర్ణయం తీసుకున్నాసరే నాకు మాత్రం మీ స్నేహం కావాలి" అభ్యర్థిస్తున్నట్టు అన్నాడు.

    ఆమె మౌనంగా వుండిపోయింది. "మీరు జీవితాన్ని చాలా తేలికగా తీసుకుంటారనుకుంటాను."

    ఆమె అన్యమనస్కంగా "అవును, చాలా తేలిగ్గా" అంది.

    అతడి కాలు ముందుకు జరిగి ఆమె కాలిని స్పృశించింది. తన తండ్రి కూడా పనిమనిషిని ఈ విధంగానే అప్రోచ్ అయివుంటాడా? ఏ కాలంలోనైనా ప్రేమికులు యుగయుగాలుగా ఒకర్నొకరు ఏ విధంగా గుర్తించుకుంటారో దేవుడు ఈ ఆటని చూచి విరక్తిగా నవ్వుకుంటూ వుండి వుంటాడా....

    అతడి కాలు ఆమె శరీరాన్ని సుతారంగా అదిమింది.

    ఆమెకు దుఃఖం వస్తోంది.

    నాకు దుఃఖాశ్రువులు సముద్రంమీద వర్షంలా కురుస్తాయి. ఒక్కటైనా స్వామిముత్యమవుతుందేమోనని జీవితకాలం ఎదురుచూస్తూ వుండగా ఇంటి ప్రాంగణంలో వృద్ధాప్యం నిలబడి పరిహసించింది.

    ఆమె మౌనాన్ని అంగీకారంగా భావించి అతడు ఎదుటి కుర్చీలోంచి లేచి పక్కకి వచ్చి కూర్చుని "ఏమిటి ఆలోచిస్తున్నావు?" అని అడిగాడు.

    మనసు గది చీకటి గురించి పైకి అనలేదు. లోపలే అనుకుంటూన్నట్టు ఆలోచన.

    అతడు ఆమె భుజాలచుట్టూ చేయివేసి, "ఐ లవ్ యూ విద్యా" అన్నాడు. ఆమె అక్కడ లేదు.

    ఎనిమిదేళ్ళ వయసులో అర్థరాత్రి హఠాత్తుగా కళ్ళు విప్పితే - తెరిచి వున్న తలుపుల మధ్య నుంచి, తల్లిని ఆక్రమించుకుంటూ, "వద్దనకు ప్లీజ్! నువ్వు నా రాణివి, నా దేవతవి" అన్న మాటలు - "పగలంతా నేను అవసరం లేదు. అప్పుడేమో రాక్షసిని, ఇప్పుడేమో దేవతని. ఇదిగో ప్రొద్దున్న మీరు కొట్టిన డెబ్బ ఇంకా మంట పెడుతూంది" - అనే అమ్మ జవాబు. "సారీ. కావాలంటే కాళ్ళు పట్టుకొంటాను. క్షమించు" అన్న వేడికోలు.

    ఉచ్చ్వాసానికీ నిశ్వాసానికీ మధ్య బుసకొట్టే కోర్కె మనిషిని తన పాదాక్రాంతం చేసుకుంటూంది. ఈ దాహం ప్రేమకి వర్తిస్తుందా? ఏ కారణమూ, ఏ అవసరమూ, ఏ అనుమానమూ లేకుండా మనిషి మనిషిని ప్రేమించలేడా?

    బుగ్గమీద స్పర్శకి ఆమె ఈ లోకంలోకి వచ్చింది. అప్పటికే చక్రధర్ ఆమె బుగ్గమీద ముద్దుపెట్టుకోవటం పూర్తి చేశాడు. అక్కడ ఉన్న చీకటిలో వాళ్ళు ఆ గార్డెన్ లో మిగతా వారికి కనపడే అవకాశం లేదు.

    దిగులు వేడికి హిమవన్నగం కరిగి బంగాళాఖాతంలో కలిస్తే గుండె లోతుల్లోంచి ఉప్పెనంత దుఃఖం వచ్చినట్టుంది. ఆ చీకట్లో ఆమె భావాల్ని అతడు గమనించలేదు. మరింత దగ్గిరకి తీసుకుంటుండగా ఆమె విదిలించుకోవటానికి ప్రయత్నం చేసింది.

    అంతలో బేరర్ వచ్చాడు. చక్రధర్ ఆమెని వదిలే ప్రయత్నం ఏమీ చేయలేదు.

    "అమ్మగారు ఏడుస్తున్నారు. వదిలిపెట్టండి బాబూ" అన్నాడు బేరరు.

    "నీ కెందుకోయ్ నీ పని నువ్వు చూసుకోరాదూ?"

    ఆ వృద్ధుడు చక్రధర్ వైపు సూటిగా చూస్తూ "ఇటువంటి చోట అట్లాటి పనులు చేస్తే మేం ఒప్పుకోం. ముందు ఆమెని వదలండి" అన్నాడు.

    చక్రధర్ లేచి నిలబడి, వూహించని వేగంతో అతని చెంపమీద కొట్టాడు.

    క్షణాల్లో అక్కడి పరిస్థితి మారిపోయింది. గొడవ పెద్దదైంది. దూరంగా గార్డెన్ లో కూర్చున్న కష్టమర్లు పోగయ్యారు. తలోమాట అంటూండగా మేనేజర్ పరుగెత్తుకుంటూ వచ్చాడు.

    చక్రధర్ తన విజిటింగ్ కార్డు తీసి మేనేజర్ కిస్తూ "డి.జి.పి. ప్రభాకర్ గారి మేనల్లుడిని నేను. ఈ అమ్మాయి నా స్నేహితురాలు. కంట్లో ఏదో పడితే కర్చీఫ్ తో తీస్తుంటే మీ సర్వర్ యిష్టం వచ్చినట్లు వాగుతున్నాడు" అన్నాడు.

    "ఆ అమ్మాయి ఏడుస్తూంది. పబ్లిక్ స్థలంలో యిటువంటివి వప్పుకోము అన్నాను బాబూ, ఆయన నన్ను కొట్టాడు" అన్నాడు బేరర్.

    న్యాయం చెప్పాల్సిన బాధ్యత మానేజర్ మీద పడింది. పోలీసు మనుషుల్తో గొడవపడే ధైర్యం అతనికి లేదు. "మీరు కూర్చోండి సార్! వియ్ ఆర్ సారీ" అన్నాడు.

    "సారీ కాదు. అతను నాకు క్షమాపణ చెప్పాలి."

    మానేజర్ బేరర్ వైపు చూశాడు. "నన్ను కొట్టింది ఆయన సార్" అన్నాడు బేరర్.

    "అమ్మగార్ని చెప్పమనండి. ఆవిడకి యిష్టంలేకపోయినా ఈయన ఆ అమ్మాయిని..." అతడింకా చెప్పబోతుంటే "నోర్ముయ్" అని అరిచాడు చక్రధర్.

    వృద్ధుడు కదలకుండా "అమ్మగార్ని చెప్పమనండి" అన్నాడు.

    అందరూ ఆమెవైపు చూశారు. ఆమె ఏదో అంటూంటే, "విద్యా వీళ్ళందరికీ ఎక్స్ ప్లనేషన్ చెప్పవలసిన అవసరం మనకు లేదు. పద" అంటూ బలవంతంగా కారు దగ్గరికి లాక్కెళ్ళాడు.

    అక్కడ కెళ్ళాక వెనుకే వచ్చిన మానేజర్ వైపు తిరిగి "నేనెవరో ఆ కార్డులో వుంది. రేపటికి ఆ బేరర్ ని తీసేసినట్టు నాకు ఫోను రావాలి" అన్నాడు అధికార యుక్తంగా. ఆ మాటల్లో - మీరాపని చెయ్యకపోతే రేపట్నుంచీ మీ రెస్టారెంట్ కి ఫామిలీస్ రావు. మీ లైసెన్సు ప్రమాదంలో పడుతుంది- అన్న హెచ్చరిక వుంది.

    వాళ్ళు వెళ్ళిపోగానే మానేజర్ ఎంక్వయిరీ చేసాడు. ఈ చక్రధర్ ఎవరో అతడి వెనుక ఎంత బలగం వుందో కనుక్కోవటానికి అయిదు నిముషాలు చాలు. అతడి వెన్ను జలదరించింది.

    కార్లో విద్యాధరి తలవంచుకుని ఆలోచిస్తూంది. "నువ్వేమీ మనసు పాడుచేసుకోకు. ఆ బాస్టర్డ్ ఉద్యోగం పోతుంది. జరిగినదానికి .... ఐయామ్ సారీ" అన్నాడు చక్రధర్.

    మానేజర్ తన వ్యాపారం పోతుందని అతడికి సారీ చెప్పాడు. ఇతడు తన ఈగో దెబ్బతినకుండా సారీ చెప్తున్నాడు. మనుషుల మధ్య "థాంక్స్" "సారీ"లు తప్ప ఇంకే బాంధవ్యాలు లేవా?

    చక్రధర్ కారు ఆపగానే ఆమె దిగింది. "జరిగినదంతా మర్చిపో. రేప్రొద్దున్న కల్సుకుందాం. స్వీట్ డ్రీమ్స్" అని అతడు వెళ్ళిపోయాడు.

    ఆమె గదిలోకి వెళ్ళి బట్టలు మార్చుకుని లైటార్పి పడుకుంది.

    ఆమె మనసంతా శూన్యంగా వుంది.

    రాత్రి పది దాటింది. ఆమె తల తప్పి పక్కకి చూసింది.

    కిటికీలోంచి వెన్నెల ఆ పుస్తకంమీద పడుతోంది.

    థ్రిల్లర్.

    ఆమె మనసులో ఏదో సంచలనం నెమ్మదిగా ప్రారంభమై క్షణాల్లో గుండెనిండా వ్యాపించింది. గోడమీద మల్లెనీడ వికృతంగా వూగుతోంది. గాలికి మొదటి అట్ట దానంతట అదే పక్కకి తిరిగింది.

    తనకున్న ఒకే ఒక శక్తివల్ల మనిషి మిగతా ప్రాణుల్ని డామినేట్ చెయ్యగలిగాడు. ఆ శక్తి పేరు "రీజనింగ్."

    రీజనింగ్ .... రీజనింగ్ ....

    బార్లో పెద్ద మనుషులు, మానేజర్ - అందరూ చక్రదర్ వైపే ఎందుకు మాట్లాడారు? తమ తమ అవసరాలు, తమ తమ స్థానాలు నిలుపుకోవటానికేగా. తను మాత్రం ఏం చేసింది? అతడు తనను ముద్దు పెట్టుకున్నట్టు చెపితే తన పరువు పోతుందనే రీజనింగ్ తో - ఆలోచించి....

    తన లైసెన్సు పోతుందనే రీజనింగ్ తో మానేజర్ - ఆలోచించి ....

    .... గాలికి కిటికీరెక్క టపటపా కొట్టుకుంటూంది. ఆమె ఒక నిర్ణయానికి వచ్చినదాన్లా లేచి, గదికి తాళంవేసి తిరిగి రెస్టారెంట్ కి బయలుదేరింది.

    పదకొండు అవుతుండగా వచ్చిన విద్యాధరిని మానేజర్ ఆశ్చర్యంతో చూశాడు.

    "ఆ బేరర్ ని ఏం చేశారు?" అని అడిగింది.

    "తీసేస్తున్నామమ్మా, ఇప్పుడే ఆయన ఇంటినుంచి ఫోనుచేశారు". అన్నాడు. చక్రధర్ఎంత పట్టుదల మనిషో, పగబడితే పాములాగా ఎలా మారతాడో ఆమెకి తెలుసు.

    "ఆ బేరర్ చెప్పినదంతా నిజమే. నాకిష్టం లేకుండా అతడు నన్ను దగ్గరకు తీసుకోబోతే మీ మనిషి వారించాడు. అతడిని ఉద్యోగంలోంచి తీసెయ్యకండి."

    మానేజరు తెల్లమొహం వేసి, "ఆయన -" అంటూ ఏదో చెప్పబోయాడు. అతడి మాటల్ని మధ్యలో కట్ చేస్తూ "ఆయనకి మీరేమి సర్ది చెప్పుకుంటారో మీ ఇష్టం" అంది.

    "సరేనమ్మా, మీరు వెళ్ళిరండి. మేము చేసుకుంటాం" అన్నాడు మానేజర్.

    "నన్ను పంపించి దీన్ని సెటిల్ చేద్దామనుకుంటున్నారేమో. సరే. నేను చెప్పేది కూడా వినండి. రేపు మళ్ళీ వస్తాను. ఆ బేరర్ ని మీరుగానీ తీసేసినట్టు తెలిస్తే సరాసరి పోలీస్ స్టేషన్ కు వెళ్ళి రిపోర్టు యిస్తాను. అక్కణ్ణుంచే అన్ని పత్రికాఫీసులకీ వెళతాను."

    "మీరు చక్రధర్ గారికి చెప్పండి-"

    "ఆ అవసరం నాకు లేదు. ఈ సమస్య బేరరు ఉద్యోగానికి సంబంధించింది."

    ఆ మాటలు వినకుండా మానేజర్ గబుక్కున ఫోను తీసి డయల్ చేసి నాలుగు నిముషాలు మాట్లాడి "మీతో మాట్లాడతారట" అని ఇచ్చాడు. ఆమె ఏదో అనబోయేంతలో అట్నుంచి చక్రధర్ స్వరం వినిపించింది. "నీకేమైనా మతిపోయిందా? మళ్ళీ ఆ బార్ కి ఎందుకు వెళ్ళావ్?"

    మనిషి జీవితంలో రీజనింగ్ కి నిలబడాలి కాబట్టి."

    "ఆర్యూ మాడ్?"

    "అతడిని ఉద్యోగంలోంచి తీసేస్తే మ్యాడ్ అవటం ఖాయం."

    "రేపు మాట్లాడుకుందాం. ఇంటికెళ్ళు".

    "కుదర్దు."

    "కానీ నువ్వు?"

    "మీరు నన్ను గౌరవంగా బహువచనంలో సంబోధిస్తారా? ప్లీజ్"

    "నువ్వెరితో మాట్లాడుతున్నావో తెలుస్తోందా?"   

 Previous Page Next Page