కుతూహలంగా చూసాడు చిట్టిబాబు. "కమాన్ చెప్పండి" అన్నాడు పెద్దపందెమే వెయ్యండి. ఇలా వెళ్ళి పలకరించడం సింగినాదం కాదు. ఏకంగా ఆ అమ్మాయిని పెళ్ళిచేసుకుంటాను" అన్నాడు రీవిగా.
అదిరిపడి చేతిలోని కాఫీ వంటిమీద పంపేసుకున్నాడు చిట్టిబాబు.
"పెళ్ళా?" అన్నాడు నోరావలించి.
"అఫ్ కోర్స్" అమిత తేలికగా చెప్పేసాడు మోహన్.
"ఏమిటండీ? ఏమిటి మీరనేది? అసలేం మాట్లాడుతున్నారు తెలుస్తుందా మీకు?" అసహనంగా ప్రశ్నించాడు శ్యామ్.
"ఇందులో అంత ఆశ్చర్యం ఏముంది? నేను సీరియస్ గానే చెప్పుతున్నాను. ఆ అమ్మాయిని నేను పెళ్ళి చేసుకుంటాను. మరింత స్పష్టంగా చెప్పాడు మోహన్.
చిట్టిబాబు ఉత్సాహం వర్ణనాతీతరం. "నిజంగా మీరా అమ్మాయిని పెళ్ళి చేసుకుంటారా?" సంభ్రమంగా అడిగాడు.
"అవును. అయితే ఒక్క షరతు. ముందు పందెం విషయం చెప్పండి పందెంలో గెలిస్తే మీరేం ఇస్తారో చెప్పండి" అన్నాడు మోహన్.
"మీకు మేనేజర్ పోస్టు యిస్తాను. స్కూటర్ ఇస్తాను. అన్ని ఎలవెన్స్ లూ యిస్తాను" ముందూ వెనకా ఆలోచించకుండా చెప్పేసాడు చిట్టిబాబు.
ఈసారి ఆశ్చర్యపోవడం మోహన్ వంతు అయింది. "నిజంగానే? తీరా అంతా అయ్యాక మాట తప్పరుకదూ!" అనుమానంగా అడిగాడు.
వెంటనే అతని చేతిలో చేయివేసాడు చిట్టిబాబు. "నేనుకూడా ఇచ్చానంటే తప్పను. నన్ను నమ్మండి. మన మాటకు సాక్ష్యం శ్యామ్.
"సరే నమ్ముతున్నాను" అన్నాడు మోహన్.
"సరే ఇకపోతే టైం ఏమిటి వ్యవధి ఆర్నెల్లు అన్నాడు చిట్టిబాబు.
"ఎందుకంతదాకా? ఇవ్వాళ ముఫై ఒకటి! ఆగస్ట్ నెలాఖరులోగ మా పెళ్ళి జరిగిపోతుంది" అనేసాడు మోహన్.
"సరే అయితే ఇంకో షరతు. ఈ పెళ్ళికి ఆవిడ కూడా మనస్ఫూర్తిగా యిష్టపడాలి బలవంతాలూ, బాలాత్కారాలూ పనికిరావు" మరో షరతు పెట్టాడు.
"ఓ;కే. నా ప్రోబ్లమ్ మీరన్నట్లుగానే ఆవిడచేత కూడా సరే అనిపించి పెళ్ళి చేసుకుంటాను. పెళ్ళికి మిమ్మల్ని కూడా పిలుస్తాను" వెంటనే అంగీకరించేసాదు మోహన్.
"సరే అయితే. పందెం ఖాయం. మీరు గెల్చిన వెంటనే నేను చెప్పినవన్నీ యిస్తాను" వెంటనే అమ్గీకరించేసాడు మోహన్.
"ఒకవేళ ఓడిపోతేమాత్రం మీ ఉద్యోగం పీకేస్తాను." తాపీగా చెప్పాడు చిట్టిబాబు
అదిరిపడ్డాడు శ్యామ్. కానీ మోహన్ మాత్రం తొణకలేదు. చిన్నగా నవ్వాడు.
"మీకంత శ్రమ యివ్వను. ఖర్మకాలి ఓడిపోతే సెప్టెంబర్ ఒకటవ తారీకున రిజైన్ యిచ్చేస్తాను" ఆన్నాడు.
"ఇక వెళ్దామా?" అంటూ లేచాడు చిట్టిబాబు. ముగ్గురూ హొటల్ నుంచి బయటికి వచ్చారు. బస్టాప్ ఖాళీగా వుంది.
బై బై చెప్పేసి బైక్ మీద వెళ్ళిపోయాడు చిట్టిబాబు.
అప్పటివరకూ అతికష్టంమీద ఆగిన శ్యామ్ అతడు అటు వెళ్ళగానే మోహన్ మీద విరుచుకుపడ్డాడు. "ఏమిటండీ ఇది? మీరేదో తెలివిగలవారనుకున్నాను. ఇలా చేసారేమిటి? ఆయనకేం డబ్బున్న మహారాజు. ఎవరితో ఏ పందెం అయినా కడతాడు. ఆయనతో పోటీ పడితే నష్టమైపోయేది ఎవరు? రాకరాక వచ్చిన ఉస్యోగం. దీనిమీద పందాలుకట్టి పోగొట్టుకోవడం శుద్ధ తెలివితక్కువ కాదూ" అని నాలుగూ అనేసాడు.
సమాధానం చెప్పకుండా చిన్నగా నవ్వేడు మోహన్. అంత చిద్విలాసంగా ఏమీ జరగనట్లే నవ్వుతున్న అతడిని చూసి ఒళ్ళు మండింది శ్యామ్ కి.
"కానీయండి ఎవరి ఖర్మకి ఎవరు కర్తలు? ఎండ మాడ్చేస్తుంది. నేను వెళ్ళుతున్నా. మళ్ళీ రేపు కలుద్దాం" అనేసి చరచర వెళ్ళిపోయాడు.
నిజమే ఎండ మండిపోతుంది. కానీ మోహన్ కు మాత్రం పండు వెన్నెలలా అనిపిస్తోంది ఆ ఎండ ఎగిసి పడుతుంది అతని హృదయం. పెల్లుబికి వస్తున్నా ఉత్సాహాన్ని అదుపులో పెట్టుకొడం కష్టంగా వుంది.
అమితో త్సాహంతో నాలుగు కిలోమీటర్ల దూరాన్ని అరగంటలో అదిగమించి తను వుంటున్న చౌకబారు లాడ్జికి చేరాడు రూమ్ తాళం తీసి ధారగా కారుతున్న చెమటనికూడా తుడుచుకోకుండా, గొంతు ఎండిపోతున్నా లెక్కచేయకుండా సూట్ కేసు దగ్గర కూల బడ్డాడు. వణికే చేతులతో తీసి సూట్ కేస్ తెరిచాడు.
బట్టల నందున పడివున్న ఇన్ లేండ్ కవర్ వెలికితీసి మంచంమీద కూర్చొని ఉత్తరం విప్పాడు.
చిరంజీవి మోహన్ కి, అనంత ఆశీస్సులు.
ఇక్కడ మేము క్షేమం. నువ్వు క్షేమంగా ఉన్నావని తలుస్తాను. నువ్వు రాసిన ఉత్తరం అందింది. నిరాశగా నీరసముగా రాసావు. ఆ ధైర్యపడకు ఉద్యోగం తప్పకుండా దొరుకుతుంది. డబ్బుకి ఏ మాత్రం ఇబ్బంది పడకు. కావాలంటే మొహామాట పడకుండా రాయి పంపుతాను. నీ ఆరోగ్యం జాగ్రత్త.
అన్నట్లు ఓ ముఖ్యమైన విషయం. నీతో ఎప్పుడో చెప్పినట్లు కూడా జ్ఞాపకం. నా చిన్న నాటి స్నేహితుడు నారాయణమూర్తి అని ఆ ఊళ్లోనే ఉంటున్నాడు. నాకు చాలా దగ్గర వాడు. చిన్నవుడు ఒరే అంటే ఒరే అనుకుంటూ ఉండేవాళ్ళం.
కలెక్ట రాఫీసులో పనిచేసి ఈ మధ్యనే రిటైర్ అయ్యాడు. చాలా మంచివారు, వాడికో కూతురింది. మీ చిన్నతనంలో నా కూతుర్ని నీ కోడలిగా చేసుకోవాలిరా విశ్వం! అంటూ ఉండేవాడు.
ఆ తరువాత వాడు అక్కడికి వెళ్ళడం, అక్కడే సెటిల్ అయిపోవడం వల్ల రాకపోకలు ఆగిపోయాయి. ఆ మధ్య ఎప్పుడో అంటే ఏడెనిమిదేళ్ళ క్రిందట బెజవాడలో కనబడి ఎంతో ఆప్యాయంగా మాట్లాడాడు.
ఇప్పుడు ఇదంతా నీ కెందుకు రాస్తున్నానంటే మొన్ననే అక్కడినించే తెలిసినాయన ఒకడు మనింటికి వచ్చాడు. ఆయనకీ నారాయణమూర్తి కనిపించి నా గురించి నీ గురించీ మరీ మరీ అడిగాడట. అడ్రస్ ఇచ్చి నన్ను ఉత్తరం రాయమన్నాదుట, నీ గురించి అయితే పదిసార్లు అడిగాడుట, విశ్వం నన్ను బొత్తిగా మర్చేపోయాడు. చిన్న నాటి స్నేహం గుర్తేలేదు అన్నాడుట.
ఇదంతా చూస్తుంటే చిన్ననాటి మాటనిలబెట్టుకునే ఆలోచనలో ఉన్నాడేమో అనిపిస్తుంది. ఈ మధ్యనే వాడి భార్య పోయిందట పాపం వాడంతగా మనలని గుర్తుచేసుకుంటున్నప్పుడు మనం ఏమీ ఎరగనట్లు ఉండిపోతే బాగుండదు.
కాబట్టి నువ్వో పనిచెయ్. ఈ ఉత్తరం అందగానే వీలు చూసుకుని వాడింటికి వెళ్ళిరా, వాళ్ళింటి అడ్రస్ క్రింద రాస్తున్నాను స్వంత యిల్లే వాడిది. చాలాకాలంగా అక్కడే ఉంటున్నాడు కాబట్టి యిల్లు కనుక్కోవడం అంత కష్టం కాదు.
వెళ్ళు వెళ్ళినన్ను పరిచయం చేసుకో. పరిచయం అంటే ఏమీ అక్కర్లేదు. కంకిపాడు విశ్వనాధం కొడుకుని అని చెప్పు చాలు. మీరు, గారు అంటావేమో అవసరం లేదు. లక్షణంగా మావయ్యా అను.
వెళ్ళగానే వాడి భార్య మరణం విషయం మాట్లాడు నాన్నగారు కూడా చాలా బాధపడ్డారు అని చెప్పి పరామర్శ చెయ్యి.
వీలు చూసుకుని వాడి కూతురిని చూడు, ఇప్పుడు కాకపోయినా రెండేళ్ళు ఆగాక అయినా పెళ్ళి చేసుకోవలసిందే. అన్నీ అనుకూలించి ఈ వివాహం జరిగితే అన్ని విధాలా మంచిది.