మనం అప్పటివరకూ వూహిస్తూ వస్తున్నదే జరిగినా, 'అది జరిగింది' అని తెలిసేసరికి కలిగే బాధా, ఆందోళనా వేరు అయితే ఈ రెండింటికన్నా తీవ్రమైనది, ఆ పెళ్ళిపందిరి మధ్యలో కూర్చుని కబుర్లు చేపుతూన్న జి.పి.రావు. వింత నవ్వుతో నా గొంతు కోశాడు!! ఎంత తెలివిగా నా చుట్టూ వల బిగించి, అన్నిదార్లూ మూసేశాడు!! తల్చుకుంటేనే వళ్ళు కంపరంగా వుంది.
ఆ క్షణమే పరుగెత్తుకు వెళ్ళి ఆ పెళ్ళిపందిరి పీకేసి, ప్రమద్వరని నాతో తెచ్చుకోవాలన్న కోరికని బలవంతం మీద ఆపుకున్నాను. అదికాదు మార్గం నేనిలా చేస్తానని తెలిసే క్షణాలమీద ప్రమద్వర వివాహం చేయించేశాడాయన. ఇప్పుడు నేనేం చేసినా నన్ను అది కటకటాల వెనక్కు తోసేస్తుంది. ముల్లుని ముల్లుతోనే తీయాలి. ఈ రకమైన మోసపు పద్దతుల ద్వారా నన్ను కట్టిపడెయ్యలేరని నిరూపించాలి. అలాటి పథకం ఆలోచించటానికి కొంత సమయం కావాలి.
అన్నిటికన్నా ముందు ప్రమద్వరని కలుసుకోవాలి. అసలేం జరిగిందో తెలుసుకోవాలి. ఆమె మీద ఎన్ని రకాలుగా, ఎన్ని విధాలుగా వత్తిడి తీసుకువచ్చారో తెలుసుకోవాలి.
అయితే ఆమె నెలా కలుసుకోవాలో నాకు అర్ధం కాలేదు. అంతలో నాతో మాట్లాడిన కుర్రవాడు తిరిగి అటుకేసి వచ్చాడు. వాడితో చిన్న చీటివ్రాసి పంపించాను. అయిదు నిముషాల్లో గోదారి వడ్డుకు వచ్చి కలుసుకొమ్మని! మామూలుగా వ్రాస్తే ఆమె రాదని అందుకని చివర్లో ఒక వాక్యం చేర్చాను. అయిదు నిముషాల్లో రాకపోతే గోదావరిలో నా శవం తేలుతుందని!!! ఈ చేర్చటం కేవలం ఆమెని బెదిరించటానికే కాదు. ఈ ముసలివాడు ఆడిన నాటకంలో ఒక పావుగామారి, కట్టబడిన మంగళసూత్రానికే ప్రమద్వర ఎక్కువ విలువ నిచ్చేట్టయితే నాకు జీవితంలో ఇక మిగిలినదంటూ ఏమీలేదు. నా మరణం ద్వారా అతఃది కూతుర్ని శాశ్వతంగా విధవరాల్ని చేసి ముసలివాడికి మరపురాని గుణపాఠం నేర్పవచ్చు. ఇంకే విధంగానూ చేతకాకపోతే ఇదే ఆఖరి దారి- అనుకున్నాను.
కాగితం కుర్రాడికిచ్చి పంపి, గోదారి వడ్డుకు బయల్దేరాను.
* * *
ఉరుకులూ పరుగులూ తీస్తూ గోదారి పారుతూంది.
దాన్ని చూస్తూంటే నాకు ఆ తండ్రీ కూతుళ్ళు గుర్తొచ్చారు. ఈ గోదారీ అంతే-దేన్నీ లెక్కచేయదు. అనుకున్నది సాధిస్తుంది. అడ్డొచ్చిన వాళ్ళని ముంచేస్తుంది. మామూలు సమయాల్లో మాత్రం పైకి నిర్మలంగా కనపడుతుంది.
ఆ అయిదు నిముషాల కాలం నా నిర్ణయంలో మార్పేమీతీసుకురాలేదు. అయినా ఆ నిర్ణయం ఆవేశంలో తీసుకున్నదికాదు.... వాళ్ళిద్దరూ నాకు కలిగించిన మనస్థాపానికి రెట్టింపు నేను కలిగించాలి. అయినా నా మనసులో ఏమూలో కాస్త ఆశవున్నది-ప్రమద్వర వస్తుందని! వస్తే మాత్రం నాతోపాటూ తీసుకువెళ్ళిపోగలననే నమ్మకం వుంది. ఏ సామాజిక కట్టుబాట్లూ, ఏ నైతిక విలువలూ మమ్మల్ని ఆపలేవు. ప్రమద్వర రాలేదు. అయిదు- ఆరు - ఏడు నిమిషాలు గడిచాయి. మరో మూడు నాలుగు నిమిషాలు చూశాను. ఆమె జాడలేదు.
నాకు ఆమెమీద కూడా కోపం వచ్చింది. మనిషికి సెంటిమెంట్లు వుండటంలో తప్పులేదు. వుండాలి కూడా. కాని అర్ధంలేని వాటిని పట్టుకుని వేలాడటంలో అర్ధంలేదు. నాకు మొత్తం మనుష్యులందరి మీదా ప్రేమకన్నా కసి ఎక్కువౌతూంది.
రెల్లుగడ్డి అంచుల్ని తాకుతూ గోదారి ప్రవహిస్తూంది. మరో క్షణం ఆగితే నా శరీరం దానిలో పడి కొట్టుకుపోయేది!
అప్పుడు చూశానా ఆకారాన్ని.
వేగంగా నా వైపుకు వస్తోంది. ఆ నడకలో తొందరపాటు కనిపిస్తూంది.
నా మనసులోని ఆశాదీపం ఒక్కసారిగా ఉవ్వెత్తున ఎగిసి, అంతలోనే ఆరిపోయింది. వస్తున్నది ప్రమద్వర కాదు. నా మామగారు. ఊహించని విధంగా ఆయన్ని అక్కడ చూసి బిత్తర పోయాను. కానీ అది లిప్తకాలం మాత్రమే.
అప్పటి వరకూ నా మనసులో దాక్కొని వున్న కసి, ద్వేషం రెండింతలై ఒక్కసారిగా బయటకు వచ్చాయి. ఇతడే.... ఇతడే.... ఇ..త....డే...
చుట్టూ ఎవ్వరూ లేరు. అలాగే గోదాట్లో తోసేస్తే సాక్ష్యం కూడా మిగలదు.
"ఆనంద్! నీ కోసం రెండ్రోజుల్నుంచీ వెతికించని చోటు లేదు" అంటూ దగ్గిరకు వస్తున్న అతడిని ఏమీ చెయ్యకుండా, నన్ను నేను కంట్రోలు చేసుకోవటానికి చాలా కష్టపడవలసి వచ్చింది. "అదృష్టం బావుండి ఆ కుర్రవాడితో పంపిన ఉత్తరం నా చేతిలో పడింది. ఇంకెవరికైనా దొరికితే కొంప మునిగేది-"
ఆయనవైపు అసహ్యంగా చూస్తూ "ఏం జరిగేది? మీ అల్లుడు ఇలాంటివాడని పదిమందికీ తెలిసేది. అలాంటి అల్లుడి కోసం మీరు వేసిన చౌకబారు ఎత్తులు అందరికీ తెలిసేవి. అంతేగా" అన్నాను.
"ఇక్కడొద్దు బాబూ ఇంటికి వెళ్ళి మాట్లాడుకుందాం పద".
"మీ ఇంటికా? ఇక చచ్చినా ఆ గడపలో కాలు పెట్టను...."
"అలా అనకు. ఏం తప్పు జరిగినా నాదే".
"ఈ మాటే రెండ్రోజుల క్రితం మీరు అన్నారు. ఆ తరువాత ఈ రోజు మీ చేతుల్తోనే ఇంకో పెళ్ళిచేసి మరో ఘోరమైన తప్పు చేశారు".
"ఏది? ప్రమద్వర పెళ్ళేనా? ఆ విషయమే మాట్లాడతాను. కొంచం సావధానంగా విను".
"నేనేమీ వినదల్చుకోలేదు. నన్ను రెచ్చగొట్టకండి-" అరిచాను.
-ఆ విధంగా మా ఇద్దరిమధ్యా వాదోపవాదాలు చాలాసేపు జరిగాయి. గోదారి పారుతూనే వుంది. మా మాటలు వింటూనే వుంది. లౌక్యుడైన మధ్యవర్తిలాగా ఎవరిది న్యాయమో ఎటూచెప్పకుండా వుండిపోయింది. మామూలుగా ఆయనతో మాట్లాడటానికే అందరూ భయపడతారు. కానీ నాకేం భయం?
"చూడండి! నేను కాబట్టి ఇంకా మీకు గౌరవమిచ్చి మాట్లాడుతున్నాను. ఇంకొకరైతే చేసిన పన్లకి మొహంమీద ఉమ్మేసేవారే. మీ స్వార్ధంకోసం నాకు అన్యాయంచేస్తే చేశారు. కానీ పాపం ఆ ప్రమద్వర ఏం చేసింది? ఆ అమ్మాయిని ఒక రౌడీకి, ముసలోడికీ ఇచ్చి కట్టబెట్టాల్సిన అవసరం మీకేమొచ్చింది?"
"అది చెపుదామనే..." ఆయన మాటలు వినిపించుకోకుండా అరిచాను- "ఏం చెపుతారండి మీరు? నాకు గుండెజబ్బు అని అబద్దం చెప్పిన డాక్టరుకి ఎంతిచ్చారో చెపుతారా? ప్రమద్వర పెళ్ళి బలవంతంగా చేయించటానికి రౌడీలకి ఎంతిచ్చారో చెపుతారా? మీ కూతురుతో కలిసి వుంటే నాకెంత ఆస్థి వస్తుందో ఆ వివరాలు చెపుతారా? ఇదేమీ అక్కర్లేదు. కానీ నేనొక సలహా చెపుతాను వినండి. మీ పరువు నిలిచేది!..... నేనెవరికీ కనపడకుండా వెళ్ళిపోతాను. మీ అల్లుడు గోదాట్లో పడి చనిపోయినట్టు ప్రకటన చేసి మీ కూతుర్ని విధవరాల్ని చేయండి. తరువాత పెద్ద మనసుతో పునర్వివాహం చేస్తున్నట్టు ప్రకటించండి. ఇక పెళ్ళికొడుకులంటారా? మీ అంత డబ్బున్నాయనకి అల్లుడవటానికి ఎవరిష్టపడరు? డబ్బుకోసం కక్కుర్తిపడి, నిండు ఆరోగ్యవంతుడికే గుండెజబ్బు అని చెప్పగలిగిన డాక్టరు మీ అల్లుడయితే మరీ మంచిది. మామా అల్లుళ్ళు కలిసి ఇంకెందర్నో నాశనం చెయ్యొచ్చు..."
"నువ్వు నన్నెన్నైనా అను. కానీ తరళ భవిష్యత్తు బాగుండాలి. నేను చేసిన తప్పుకి దాన్ని శిక్షించకు. అయిందేదో అయిపోయింది. మీరిద్దరూ సుఖంగా వుండాలంటే నేనేం చెయ్యాలో చెప్పు."
"ఏమైనా చేస్తారా?"
"నా కూతురు సుఖంగా వుండటం కోసం ఏమైనా చేస్తాను".