Previous Page
చీకట్లో సూర్యుడు పేజి 37


    "ఏమైనా అవనీ, క్రెష్ లాండ్ అయి చచ్చిపోతే కాని నిన్ను వదలను" అన్నాడు వాయుపుత్ర. అతడి కళ్ళనించి నీళ్ళ ధారగా స్రవిస్తున్నాయి. ప్రాణంలో ప్రాణంగా చూసుకునే బ్రహ్మవిద్యను శూన్యంలోకి తోసెయ్యడం కన్నబిడ్డను హతమారుస్తున్నంత బాధ. దాన్ని అందరూ అర్థం చేసుకున్నారు. కాని నిస్సహాయంగా చూస్తున్నారు. "వాయూ" పిలిచింది విద్య. "ఇన్నాళ్ళు ఏ క్షణంలో ప్రాణం పోతుందోననే భయంతో బ్రతికారు. అలాంటిది యిప్పుడు సెంటిమెంటుతో అందరి జీవితాలను నాశనం చేస్తావా?"

    "నీకెలా చెప్పేది విద్యా మనవమాత్రులెవరూ చేయలేని పనులన్నీ చేస్తావని బ్రహ్మవిద్య అని పేరు పెట్టాను. ఆ రోజు మమ్మల్నీ, మా భూమినీ కాపాడటానికి సహాయం చేశావు. ఇప్పుడు నిన్ను చేతులారా శూన్యానికి బలిచెయ్యనా?"

    "నేను బ్రహ్మవిద్యనైతే నువ్వే బ్రహ్మవుగా వాయూ! నాలాంటి విద్యలను ఎన్నింటినో సృష్టించే శక్తి నీలో వుంది. కాబట్టి నువ్వు బ్రతకాలి! నీ ప్రయాణం దిగ్విజయంగా అయిందని భూలోకవాసులందరికీ చాటాలి. ఆవేశం వదలిపెట్టి వివేకంతో ఆలోచించు. నా మాట విను. చిరునవ్వుతో నన్ను సాగనంపు. ప్రాణంకంటే ఎక్కువగా ప్రేమించే నీ చేతుల్లో నాశనం అవటం కన్నా ఇంకేం కావాలి నాకు! కానివ్వు. ఎక్కువ టైంలేదు."

    వాయుపుత్ర ముఖాన్ని రెండు చేతులతో కప్పుకున్నాడు. అతడికి దుఃఖం ఆగడం లేదు. నిఖిల్, అనూహ్యల పరిస్థితి కూడా అలాగే  వుంది. "వద్దు. పోతే అందరం కలిసికట్టుగా పోదాం. మనతోపాటు ఒక మనిషిలాగే బ్రతికావు విద్యా. ఇప్పుడు నిన్ను బలిచేయడం మావల్ల కాదు" అన్నాడు నిఖిల్.

    "ఈ షిప్ కెప్టెన్ యశ్వంత్ - నువ్వు చెప్పు నీ నిర్ణయం ఏమిటి?" అడిగింది విద్య.

    "నన్ను ఇబ్బందిలో పెట్టకుప్లీజ్....." యశ్వంత్ మొహం పక్కకి తిప్పుకున్నాడు.

    "సరే అయితే-ఇంకో నాలుగు నిముషాలే టైముంది. ఈ షిప్ తాలూకు కంప్యూటర్ గా  నేనే నిర్ణయం తీసుకుంటున్నాను- నా అంతట నేనే వెళ్ళిపోతున్నాను."

    "వద్దు. వద్దు ప్లీజ్-"

    "ఒక అనాధప్రేతంగా నన్ను శూన్యంలోకి తోసేస్తావో సకల లాంఛనాల్తో సంస్కారం చేస్తావో నీ యిష్టం."
   
    ..........
   
    "మూడు నిముషాలు-"

    యశ్వంత్ - నిఖిల్ ఇక వుండలేనట్టుగా అక్కణ్ణుంచి వెళ్ళిపోయారు. "నిశ్శబ్దం నన్ను  భయపెడుతూంది వాయూ, ఏదైనా మాట్లాడు-"

    "వి....ద్యా....."

    "ఏదైనా చెప్పు వాయూ, వీడ్కోలు ఇంత మౌనంగా వుండకూడదు"

    "ఐ లవ్యూ విద్యా-"

    "ఐ టూ వాయూ - నేన్నిజంగా మనిషినైతే, కనీసం మొగవాడిగా పుట్టినా నిన్నింతగానే అభిమానించేదాన్ని. నీలాంటి తెలివైనవాళ్ళు సాధారణంగా సీరియస్ గా వుంటారు. ఇంత హాయిగా, ఇంత నవ్వుతూ తృళ్ళుతూ.. ప్చ్... నీలాంటివాడు నిజంగా మంచి స్నేహితుడు అవుతాడు. భగవంతుడు మీ మనుష్యులకి కళ్ళు ఇచ్చి చాలా మేలుచేశాడు. బాధని వెలువర్చటానికి, నీళ్ళని వెదజల్లుటానికి అవి చాలా ఉపయోగపడతాయి. మొదటిసారి నేను మనిషిగా పుట్టనందుకు బాధపడుతున్నాను. గుడ్ బై....."

    ప్రియమైన వ్యక్తి చితికి నిప్పంటిస్తున్నప్పుడు పడే వేదన అతడికి అర్థమవుతూంది. బ్రహ్మవిద్యను తోసుకుంటూ వెళ్ళాడు. శవపేటికలో వుంచినట్టు దాన్ని జాగ్రత్తగా వుంచి బటన్ నొక్కబోయాడు. "కెన్ ఐ కిస్ యూ విద్యా"

    "అనూహ్య ఈర్ష పడుతుందేమో-"

    "ఆఖరి నిముషంలో కూడా ఇంత హాయిగా ఎలా మాట్లాడుతున్నావ్ విద్యా-"

    "మనిషిని కాదు కాబట్టి! వెళ్ళొస్తాను వాయూ- అనూహ్యా- గుడ్ బై....."

    "గు.....డ్.....బై" ఇద్డురూ చెప్పారు.

    వాహనం నుంచి వెలువడిన బ్రహ్మవిద్య దిగంతాల్లోకి దూసుకుపోయింది. బైట శూన్యం.

    అది వాళ్ళ మనసుల్లోనే వుంది.

    అతడు తిరిగి వచ్చేసరికి అందరి కళ్ళలో నీళ్ళు. యశ్వంత్ దుఃఖాన్ని కంట్రోలు చేసుకుంటున్నాడు.

    "మనమందరం ఈ రోజు ఇలా బ్రతికి వున్నామంటే కారణం  బ్రహ్మవిద్యే. భూమినే రక్షించింది......ప్రాణం పోసిన వాళ్ళ ప్రాణాన్ని తీసిన ఘనత మనకే దక్కుతుంది. ఈ విషయం తెలిస్తే ఆల్ఫాగ్రహవాసులు మళ్ళీ మనమీద దండెత్తుతరేమో" అన్నాడు నిఖిల్ విషాదంగా నవ్వుతూ. అనూహ్య వాయుపుత్ర భుజంమీద చెయ్యివేసింది అనునయంగా.

    "నేను బాగానే వున్నాను అనూహ్యా. మన మనసుల్లో ఎలాంటి నైరాశ్యం వుంచుకోకూడదని బ్రహ్మవిద్య చివరగా కోరింది. చూడండి. అప్పుడే మన స్పీడ్ తగ్గిపోయింది.....భూమిని కాంటాక్ట్ చెయ్యి యశ్వంత్."

    యశ్వంత్ అప్పటికే ఆ పనిలో మునిగిపోయి వున్నాడు.

    "హలో,,,,,ఎర్త్ హియర్. ఎవరది, ఎవరది?" అడుగుతున్నారు. వాయుపుత్ర స్పీకర్ అందుకున్నాడు.

    "ఆల్ఫా గ్రహవాసులం- భూమిమీద విహారానికి వస్తున్నాం. సన్నాహాలు చేయండి. యుద్దానికి సిద్దంకండి,"

    "నిజం చెప్పండి ఎవరిది? సుహృద్భావ్, యశ్వంత్ మీరేనా అది" ఆ సర్వంలో సంభ్రమాశ్చర్యాలు.

    "అవును. విజయంతో తిరిగి వస్తున్నాం. కొద్దిసేపట్లో భూకక్ష్యలోకి వస్తాం."

    "ఇంత తొందరగా ఎలా వస్తున్నారు? మీరు వెళ్ళిన పని ఏమైంది?"

    "సాధించుకు వస్తున్నాం."

    "నా కర్ధం కావటంలేదు. ఇంత తొందరగా ఎలా సాధ్యమైంది అది? ఎగిరే గాలిపళ్ళేల్లో ప్రాణులు మిమ్మల్ని కాంటాక్ట్ చేశారా? సంధికి  వప్పుకున్నారా?"

    "లేదు చీఫ్ మేము సుదీర్ఘ నక్షత్రాల అంచులవరకూ వెళ్ళి తిరిగి వస్తున్నాం. వేగా గ్రహంమీద కాలు పెట్టి వస్తున్నాం."

    "బట్ హౌ? ఇంత తొందరగా ఎలా వచ్చారు?"

    "కాంతికంటే వేగంగా గతంలోకి ప్రయాణించటం ద్వారా-" ఆ వార్త క్షణాల్లో ప్రపంచమంతా ప్లాష్ అయింది. ఏ నోట విన్నా అదే వార్త. అపూర్వమూ అసాధ్యమూ అయిన ఆ విషయపు వివరాలు ఆ రోజు పేపర్లలో నింపటానికి విలేఖర్లు హడావుడిగా పరుగెడుతున్నారు. బయల్దేరినప్పటినుంచి ఆ క్షణం వరకూ జరిగిన ప్రతీ విషయమూ, యశ్వంత్ ట్రాన్స్ మీటర్ ద్వారా చెపుతున్నాడు.

    'సుహృద్భావ్' భూమిచుట్టూ మరో రౌండు తిరిగి, భూమికి చేరువైంది.

    లక్షలాది ప్రజలు సముద్ర తీరంలో గుమిగూడారు. గ్రహాంతరవాసుల వల్ల వచ్చే ప్రమాదం తెలిసి, అప్పటికి ఎక్కువ కాలం కాకపోవటంవల్ల తమని రక్షించిన ఆ టీమ్ ని చూడటానికి, అభినందించటానికి జనం తండోప తండాలుగా అక్కడికి చేరుకుంటున్నారు. అవును. అది నిశ్చయంగా మామూలు విజయం కాదు. 


                               ఉపసంహారం


    దగ్గరలో వున్న సముద్రంలో సుహృద్భావ్ తాలూకు Capsule లో ఆస్ట్రోనాట్స్ దిగే ఏర్పాటు చేశారు. రెండు స్టీమ్ బోట్స్ నిండా NSRI అఫీషియల్స్ వాళ్ళకు స్వాగతం చెప్పడానికి సిద్ధంగా వున్నారు.

    అనుకున్న సమయానికి కాప్స్యూల్ నీళ్ళలో దిగింది. వెంటనే వాళ్ళను బోట్ లోకి ఎక్కించారు. అందరూ కంగ్రాచ్యులేషన్స్ తో వాళ్ళను ఉక్కిరి బిక్కిరి చేస్తున్నారు. పూలహారాలతో వాళ్ల మెడలు నిండి పోతున్నాయి. నూట నలభై సంవత్సరాల (వాళ్ళకి సంబంధించినంత వరకూ) ప్రయాణపు ఒంటరితనం తరువాత తమవాళ్ళని చూసిన ఆనందం ఆ నలుగురిలోనూ కనబడుతూంది. స్పీడ్ బోట్ ఒడ్డున ఆగింది. అందరూ దిగారు.

    భూమి తరపు ప్రతినిధిగా ఓ ఏడాది పాప, చేతిలో పూల గుచ్ఛంతో తప్పటడుగులు వేస్తూ ముందుకు వచ్చి నిఖిల్ కి గుచ్ఛం అందించింది. ఆప్యాయంగా పాపని ఎత్తుకుని తన  మెడలో దండ తీసి పాపకి వేశాడతడు.

    "పాపా, నీ పుట్టిన్రోజుకి ఎంత మంచి బహుమతి తెచ్చారో మీ నాన్న" నిఖిల్ అటువైపు చూశాడు. శ్రీజ నిలబడింది చిరునవ్వుతో అప్పుడర్థమైంది ఆ పాప ఎవరో కళ్ళల్లో నీళ్ళు చిప్పిల్లాయి.

    అతడి మనసు ఆనందంతో గంతులు వేసింది. ప్రేమగా శ్రీజను దగ్గరకు తీసుకున్నాడు.

    "పాపకి ఈ రోజువరకు పేరు పెట్టలేదు మీరు రాకపోతే ఈ రోజే నామకరణం చేద్దామనుకున్నాం. వచ్చేశారు. మీ పాపకి మీరే పేరు పెట్టాలి."

    మరో ఆలోచన లేకుండా చెప్పాడు నిఖిల్ - "బ్రహ్మవిద్య"

    అనూహ్యని అన్నా వదినలు, బిందూ చుట్టుముట్టారు. అందరి కళ్ళలో ఆనందాశ్రువులు కుశల ప్రశ్నలయ్యాయి.

    "ఏమ్మా యశ్వంత్. నువ్వూ మళ్ళీ  కలిసిపోయారా?" అడిగాడు అన్నయ్య.

    "మేమెప్పటికీ స్నేహితులమే  అన్నయ్యా, నువ్వలాంటి అనుమానాలేమీ పెట్టుకోకు. ప్రాణాలరచేతిలో పెట్టుకుని గాలక్సీ చివరి  అంచువరకు వెళ్ళి వచ్చిన వాళ్ళం. పెళ్ళి పిల్లలు సంసారసుఖంలాంటి విషయాలు చాలా అల్పంగా తోస్తున్నాయి యిప్పుడు. నా బాధ్యత ఏమిటో తెలిసిపోయింది. రేపటినుంచి మళ్ళీNSRIలో నా డ్యూటీ మొదలవుతుంది" అంది అనూహ్య స్థిరంగా.

    యశ్వంత్ పత్రికా విలేఖర్లు ప్రశ్నల్తో ఉక్కిరిబిక్కిరి చేస్తున్నారు.

    వాయుపుత్ర ఒక్కడే దూరంగా నిలబడ్డాడు. ఎదురుగా అనంతానంతమైన సముద్రం. అతడి హృదయంలో కెరటాలు.

    భూమి ఆకాశం కలిసే చోటునుంచి సూర్యుడు పైకి వస్తున్నాడు. దిగంతాల శూన్యంలో చిన్న మబ్బు తునకలా 'విద్య' అతడిని అభినందిస్తున్నట్టు సంకేతాలు పంపుతూంది. కేవలం మనసుకి మాత్రమే అర్థమయ్యే సంకేతాలు అవి. తమని విడిచి అతిధిలా వెళ్ళిపోయిన డాక్టర్ ఫిలిప్స్ అమ్మోనియా మేఘాల వెనుక నుంచి చేయి వూపుతున్నట్టు అనిపించింది.

    మొహంమీద ప్లాష్ వెలిగేసరికి ఈ లోకంలోకి వచ్చాడు. ఓ ఇరవై ఏళ్ళ అమ్మాయి, పత్రికా విలేఖరిలా వుంది. ఫోటోలు తీస్తుంది. అతడి దగ్గిరగా వచ్చింది.

    "గాలక్సీ అంచుకవరకూ వెళ్ళి వచ్చిన మీరు, ఈ సందర్భంగా మానవజాతికోసం ఏం సందేశం తెచ్చారు?" అని అడిగింది.

    "ఆటవిక న్యాయం వదిలెయ్యమని-"

    "ఆ క్లుప్తతకి ఆమె ఆశ్చర్యపడి, ఆ విస్మయాన్ని తనలోనే దాచుకొని, ఆ పాయింట్ నోట్ చేసుకుని అక్కణ్ణుంచి పరుగెత్తింది.

    చీకట్లని చీల్చుకుంటూ చిరునవ్వుతో సూర్యుడు పైకి వస్తున్నాడు.


                           (శుభం)

 Previous Page