నిఖిల్ మొహం అయితే పూర్తిగా వాడిపోయింది. అనూహ్యకి అన్నా వదినెలు, వాళ్ళ పాప గుర్తొచ్చారు. నిఖిల్ నే చూస్తున్న వేగా, ఆ నిశ్శబ్దాన్ని బ్రద్ధలుచేస్తూ "మీ పాప ఎలా వున్నదో, అంటే డెబ్భై ఆరు సంవత్సరాల క్రితం పుట్టినప్పుడు ఎలా వున్నదో నేను చూపించగలననుకుంటాను" అన్నాడు. ఆ మాటలకి చప్పున తలెత్తి "ఎలా?" అని అడిగాడు నిఖిల్ ఆశ్చర్యంగా.
"టైమ్ మెషీన్ ద్వారా పరిశోధన యింకా పూర్తి కాలేదనుకోండి! రెండువందల సంవత్సరాల క్రితం వరకూ అడ్జెస్ట్ మెంటయితే వుంది."
"టైమ్ మెషీన్?"
"అవును గతాన్ని చూపించగలిగేది, భూతకాలంలోకి వెళ్ళగలిగేది."
"మేం ఫిక్షన్ లో చదువుకున్నాం."
"ఫిక్షన్ ని నిజం చేయగలిగే అద్భుతమైన శాస్త్రమే సైన్సు" అంటూ అతడు జేబులోంచి చిన్న ట్రాన్సిష్టరు లాంటిది తీశాడు. దానిమీద చకచక అడ్జస్టు చేశాడు. తెరమీద దృశ్యాలు కదుల్తూ ఒకచోట ఆగాయి. నిఖిల్ కళ్ళప్పగించి చూస్తున్నాడు.
చిన్న తెరమీద శ్రీజ పాపతో కనిపించింది. గోరుముద్దలు తినిపిస్తోంది. "పాప పుట్టినరోజు చాలా ఘనంగా చేద్దామనుకుంటున్నానమ్మా" అంటోంది శ్రీజ తల్లి.
"వద్దమ్మా. తండ్రి లేని పిల్ల. తన తోటి అనాధలతో కలసి పుట్టిన్రోజు చేసుకుంటేనే నాకు ఆనందం" అంటోంది శ్రీజ చిత్రం ఆగిపోయింది. నిఖిల్ ముఖంనిండా సంతృప్తి, సంతోషం! కళ్ళల్లో తడి కనిపించకుండా మొహం పక్కకి తిప్పుకున్నాడు.
"నేనూ ఒకసారి చూడవచ్చా?" అడిగాడు వాయుపుత్ర.
"నీ రెండో శ్రీమతిగురించి తెలుసుకోవాలా?" అడిగాడు నిఖిల్ వాతావరణాన్ని తెలికచేస్తూ.
"కాదు. నాకీ పేరుపెట్టి ణా అభివృద్ధి ఏ మాత్రం చూడలేక పోయిన మా ముత్తాతగారిని చూడాలని" అన్నాడు వాయుపుత్ర నవ్వుతూ.
వేగా అతడికి టైమ్ మెషీన్ అందించాడు.
10
సుహృద్భావ్ పైకి లేవటానికి రెడీగా వుంది. నలుగురూ అక్కడికి చేరుకున్నారు. భూలోకవాసుల్ని చివరిసారి చూడటానికి వేగా గ్రహవాసులు గుంపులు గుంపులుగా అక్కడ వేచి వున్నారు.
"మీరు మాకు చేసిన సాయాన్ని మా లోకంవాళ్ళు చాలా కాలం గుర్తుంచుకుంటారు" అన్నాడు యశ్వంత్.
"మేము చేసిందేమీలేదు. ఆల్ఫాగ్రహవాసుల దృక్పథంలో మిమ్మల్ని బుద్ధిజీవులుగా అంగీకరింప చేసుకున్నారు. అది మీ విజయం-" అన్నాడు వేగా బి సెవెన్.
"ఈ యాత్ర భూలోక చరిత్రలో నిలిచిపోతుంది. ఇది సామాన్య విషయం కాదు. కానీ ఇంతకన్నా అసామాన్యమైన విషయం మరొకటి వుంది. అది చరిత్ర పుస్తకాల్లో కాదు - భూలోక వాసులందరూ తమ మనసుల మీద వ్రాసుకోవలసిన పాఠం!" ఆవేశంగా అన్నాడు యశ్వంత్. అతడంత ఆవేశపడటం చాలా అరుదు. "-మనుష్యులు జంతువులుకన్నా తెలివైనవాళ్ళు అని నిరూపించుకోవటానికి ఎంత కష్టపడవలసి వచ్చింది? శాఖాహారం-మాంసాహారం సంగతి సరే- తోటి మనుష్యుల్నే చంపటం - విల్సన్ మండేలా- స్టార్ వార్స్ - అణుబాంబు- ఎంత హేయమైన స్థితి? మనిషిగా పుట్టినందుకు సిగ్గుపడవలసిన పరిస్థితి_"
"మనం వెళ్ళేసరికి మరో వంద సంవత్సరాలు పట్టవచ్చు. అప్పటికయినా 'మనిషి' తన తప్పు తెలుసుకుంటాడని ఆశిద్దాం" అన్నాడు నిఖిల్.
వేగా అతడి దగ్గిరకి వచ్చాడు. "మీ గ్రహవాసుల తరపున ఏం బహుమతి కావాలి? అని అడిగితే, ఇచ్చింది చాలు, ఏమీ వద్దు. అన్నావు గుర్తుందా?"
"అవును, ఏం?"
"నీకో అపురూపమైన బహుమతి ఇవ్వబోతున్నాము మేం"
"ఏమిటది?"
"నీ భార్యనీ- పాపనీ-"
నిఖిల్ దిగ్భ్రాంతితో దాదాపు మూడురెట్లు వేగంతో మిమ్మల్ని మీ గ్రహానికి పంపటం ద్వారా." అక్కడ సూదిపడితే (వినపడుతుందా?) వినపడేటంత నిశ్శబ్దం.
ఆ నలుగురూ సైంటిస్టులు! వేగా చెప్పింది అర్థమైంది. కాంతి వేగం కన్నా ఎక్కువ వేగంతో ప్రయాణం చేయడం అంటే-
భూ.....త.....కా.....లం....లోకి ప్రయాణించటం.
ట్రావెలింగ్ ఇన్ టు ది ఫాస్ట్!!!
"మా ఫ్లోరా- వేగా గ్రహవాసుల తరపున ఇది మీకు బహుమతి, అయితే ఒక విషయం. అంత వేగంతో ప్రయాణంచేసే మీరు భూమి ఆకర్షణ శక్తిలోకి వెళ్ళే లోపులో సాధ్యమైనంత బరువు తగ్గించాల్సి వుంటుంది. బరువు తగ్గిస్తూ వేగాన్ని కంట్రోల్ చేయగల్గితే క్షమంగా లాండ్ అవుతారు-"
"అలాగే, థాంక్స్ అండ్ గుడ్ బై" కన్నీళ్ళు ఆనందానికి సంకేతాలు. కృతజ్ఞతకి ప్రతిబింబాలు, వీడ్కోలుకి చరమగీతాలు అయ్యాయి. సుహృద్భావ్ అంతరిక్షంలోకి ఎగిరింది.
11
"వాయుపుత్రా, కృతజ్ఞత కంటే గొప్పదైన పదం మరేదయినా వుంటే బావుంటుదనిపిస్తోంది. ప్రాణాలకు తెగించి మా ముగ్గురిని కాపాడ్డమే కాదు. భూలోకవాసుల వినాశానాన్ని కూడా కాపాడావు. నీకు కృతజ్ఞతలెలా తెలుపుకోవాలో తెలియడంలేదు" అన్నాడు యశ్వంత్.
"అసలు నీకీ అయిడియా ఎలా వచ్చింది? మాతో మాట వరుసకైనా అనలేదే?" నిఖిల్ అడిగాడు.
"ఈ కృతజ్ఞతలు, పొగడ్తలూ యశ్వంత్ కీ, బ్రహ్మవిద్యకీ చెందాలి. మనం మొదట వేగా గ్రహన్నుంచి ఆల్ఫాగ్రహానికి ప్రయాణమైనప్పుడు మన పరిస్థితినంతా బ్రహ్మవిద్యకు ఫీడ్ చేశాను. వాళ్ళ వాతావరణాన్ని, అలవాట్లని, వాళ్ళు దేనికి రివర్స్ అయ్యేది అన్నీ తెలుసుకుంది.... మనం న్యాయస్థానాన్నుంచి రాగానే అడిగితే వివరాలన్నీ చెప్పింది. మీరు గమనించారో లేదో 'వేగా', 'ఆల్ఫా' గ్రహాలలో ఎక్కడా మనకు ఎలాంటి శబ్దం వినిపించలేదు. మనం గట్టిగా మాట్లాడటం కూడా వీళ్ళు సహించలేకపోయారు. వాళ్ళ పట్టణాలలో కూడా అన్నీ సౌండ్ ప్రూపే. అందుకే ఈ మార్గం ఎన్నుకొన్నాను. అందులో యశ్వంత్ పరిశోధన చాలా ఉపయోగపడింది."
"థాంక్యూ బ్రహ్మవిద్యా" అంది అనూహ్య. "ఈసారి గ్లోబల్ ప్రైజ్ నీకుకూడా ఇవ్వాల్సిందే. నేను రికమెండ్ చేస్తాను" అంది. "థాంక్యూ" అంది విద్య.
రోజులు వేగంగా గడిచిపోయాయి. పదిరోజులకే వాళ్ళు జూపిటర్ కూడా దాటేశారు. వేగా యిచ్చిన శక్తి ఏమిటోగాని ఆస్టరాయిడ్ బెల్ట్ దాటినట్లే అనిపించలేదు.
"మనం వస్తున్న వార్తని భూమికి తెలియచేయవచ్చా?" అడిగింది అనూహ్య.
"ఈ వేగానికి అది వీలుపడదు. స్పీడు కంట్రోల్ చేశాకే చెప్పాలి" అన్నాడు యశ్వంత్.
"అంటే యింకెంత కాలం పడుతుంది?"
"మహా అయితే రెండు రోజులు."
ఆ రెండు రోజుల తర్వాత వచ్చిపడింది ప్రమాదం. మార్స్ ని కూడా దాటేశారు. భూమి, చంద్రుడు, సూర్యుడు వరసగా కనిపిస్తున్నాయి.
"జన్మభూమికి దగ్గరగా వచ్చాం. ఎంత సంతోషంగా వుందో......జన్మభూమి స్వర్గానికి సమానం అని అందుకే అన్నారు కాబోలు. భూమిని కాంటాక్ట్ చెయ్యొచ్చాయిక?"
"మనం వేగం తగ్గిస్తేగానీ భూకక్ష్యలోకి ప్రవేశించలేం. వార్తలేమీ పంపలేం."
"బెల్ట్ లు తగిలించుకోండి. మనం జెట్టీసన్ మొదలు పెట్టాలి" అరిచాడు యశ్వంత్. (ఓడలు మునిగిపోతున్నప్పుడు బరువు తగ్గించటాన్ని జెట్టీసన్ అంటారు.)
"అలాగే" అని వాయుపుత్ర, కుర్చీ చేరుకునే లోపల రెండు సార్లు జారాడు.
యశ్వంత్, నిఖిల్ బిజీ అయిపోయారు. తెరమీద సోలార్ వింగ్స్ జారిపోవడం, ఆ తర్వాత సోలార్ మెషీన్ స్టోరేజి, టాంకులు పడిపోవడం, కనిపించింది. రోదసీలో వస్తువుల్ని వదిలేటప్పుడు వాటిని పూర్తిగా క్రష్ చేసి పోడిగాచేసి వదలాలన్న నిబంధన వాళ్ళు పాటించలేకపోతున్నారు, అది అసాధ్యం కాబట్టి.
కంప్యూటర్ తెరమీద బరువు యింకా ఎక్కువగానే వున్నట్లుగా కనిపిస్తోంది.
"తర్వాత ఏమిటి?" అడిగాడు వాయుపుత్ర.
"పైనున్న ఫిక్ రూం లాబొరేటరీ అవసరం లేదుగా."
యశ్వంత్ వాటిని వాహనాన్నుంచి విడదీసి వదిలేశాడు. అయినా కంప్యూటర్ స్పీడు కంట్రోలు అవసరమైనంత తక్కువ అవడం లేదని చూపిస్తోంది.
"విద్యా" మళ్ళీ పిలిచాడు వాయుపుత్ర.
"మీకు వేరే గదులెందుకిక? ఇక్కడే గడుపుకుందాం- మరో నాలుగు రోజులేగా."
యశ్వంత్ చేతులు చకచకా పనిచేసినయ్. వాళ్ళకు అన్ని సంవత్సరాలుగా ఉపయోగపడ్డ గదులు రోదసీలో తిరుగుతున్నాయి. "ఇంకా వెయిట్ తగ్గించాలి" చెప్పింది విద్య.
"డైటింగ్ చెయ్యి" అన్నాడు వాయుపుత్ర కోపంగా.
"బావుంది? నా మీద కోప్పడతావేం? నన్నింత బరువు పెంచింది మీరేగా? సరే ఆక్సిజన్, ఆహరం కొద్దిగా వుంచి మిగతాది తోసెయ్యండి."
ఆ పనికూడా చేశారు. స్పీడ్ కాంతివేగంలో సగానికి వచ్చింది.
"ఇంకా తగ్గించాలి" అంది విద్య.
"ఇంకా మిగిలిందేమిటి నువ్వూ, నేనూ" విసుగ్గా అన్నాడు.
"అదే నేను చెప్పేది. నువ్వు చాలా తేలిక. నేను మాత్రం మిగిలాను. తోసెయ్యి" అంది కామ్ గా విద్య.
కొద్దిసేపు అదేమిటన్నదీ ఎవరికీ అర్థంకాలేదు. అర్థంకాగానే "నో....నో...." అని అరిచారందరూ అప్రయత్నంగా.
"వాడ్డూయు మీన్? వాయుపుత్ర తమాయించుకుంటూ అన్నాడు.
"ఐ మీన్ వాట్ ఐ సెడ్. నేనే ఇక మిగిలిన బరువైన వస్తువుని. మీరు వదిలేయాల్సింది నన్నే."
"జోకు లెయ్యకు సరిగ్గా చెప్పు."
"సరిగ్గానే చెపుతున్నా. యింకా కనీసం వెయ్యి కిలోల బరువు తగ్గించాలి. నా బరువే ఎక్కువయిపోయిందిప్పుడు. తప్పదు. నన్నే వదిలెయ్యి. ఒక కంప్యూటర్ గా అన్ని లెఖ్ఖలూ చేసి చెప్తున్నాను."
"పిచ్చి మాటలు మాట్లాడకు."
'నేను జోకు లెయ్యడం లేదు వాయూ. ఉన్న విషయం చెపుతున్నాను. నాలాంటి దాన్ని తయారుచేయడం కష్టంకాదు, తప్పదిక......ఆలస్యం చెయ్యకు. భూ వాతావరణంలోకి అడుగు పెట్టడానికి కొద్ది నిముషాలే టైముంది...."
అందరి ముఖాలూ పాలిపోయాయి.
"అదంతా నిజమేనా? బ్రహ్మవిద్యను రక్షించుకునే ఉపాయం లేదా యశ్వంత్" దీనంగా అడిగింది అనూహ్య.
"లేదు అనూ. మనం నలుగురమూ, ఈ కంట్రోలు రూం తప్ప - మిగతా వస్తువులన్నీ జెట్టీసన్ చేస్తే తప్ప భూమికి క్షేమంగా చేరలేం. వేగా మనకి శక్తి నిచ్చినప్పుడే అనుమానించాను, ఇలాంటి పరిస్థితి వస్తుందని" యశ్వంత్ అన్నాడు. ఎంత దయనీయమైన పరిస్థితి! కేవలం "తొందరగా వెనక్కి వెళ్ళాలన్న" తాపత్రయంతో ఈ బహుమతికి వప్పుకున్నారు. దాని పరిణామం ఇంత దారుణంగా వుంటుందని తెలిస్తే వప్పుకునేవారా? ఏమో.....మనిషి స్వార్థాన్ని లెఖ్ఖకట్టే యంత్రమేదీ లేదుకదా....