Previous Page Next Page 
కాలాన్ని వెనక్కి తిప్పకు పేజి 36

 

    అధ్యాయం ముగిసింది కాని కధ ముగియలేదు.
    బెంగుళూరు ఇందిరానగర్ లో చిన్న డాబా యింటి ముందు ఆరోజు ఓ పెద్ద పడవలాంటి కారు వచ్చి ఆగింది. అందులోంచి ప్రముఖ తెలుగునటి 'వరశ్రీ' దిగుతుంటే యిరుగుపొరుగు గుమిగూడారు. ఇంట్లో వాళ్ళు గుమ్మంలోకి వచ్చి గుర్తుపట్టి తెల్లపోయారు . కాలం కల్సి రావడం అంటే అదేమరి - కెమెరా ' ప్యూపైండర్ నుంచి '  షాట్ కోసం చూస్తున్న ఓ ప్రముఖ డైరక్టర్ కంట ఎక్ స్ట్రా వరసలో నిల్చున్న వరలక్ష్మీ కంటపడిన ఆ క్షణం ఆవిడ దశ తిప్పింది. సావిత్రిలా వున్న వరలక్ష్మీ నెక్ట్స్ పిక్చరులో హీరోయిన్ అయింది. ఆ సినిమా పెద్ద హిట్టు - తరువాత రెండు సినిమాలు పెద్ద సక్సెస్. రెండేళ్ళలో ఆరు సినిమాల్లో నటించి నాలుగు హిట్లు, యిచ్చిన వరలక్ష్మీ వరశ్రీగా మారి పెద్ద హీరోయిన్ అయింది. అంత పెద్ద నటీమణి యిక్కడి కెందుకు వచ్చింది? కుర్చీలోంచి  గాభరాగా లేచిన అతను అసిస్టెంటు డైరెక్టరు గా నైనా ఆంధ్రాలో చెల్లుబాటు కాక కన్నడ సినిమాలకి వచ్చిన భాస్కర్ ఎందుకొచ్చింది? భాస్కర్ మోహంలో భయం తన మీద కక్ష తీర్చుకోడానికి వచ్చిందా? గుమ్మంలో నిల్చున్న భార్య, అత్తగారి మొహంలో భయం. ఆదుర్దా , పిల్లాడి గుట్టు బయటపెట్టి యిచ్చేమంటుందా? పాలిచ్చి ఆరేళ్ళ నించి పెంచుకుంటున్న ఆ తల్లి ఆందోళన!
    గుమ్మంలోకి వయ్యారంగా వచ్చి అందరి వంక చిద్విలాసంగా ఓ నవ్వి విసిరి 'బాగున్నారా' అంది వరశ్రీ. అంతా అప్రయత్నంగా తలడించారు. 'యీవిడ యీ అమ్మాయి, మన అమ్మాయి పురుడు పోసుకున్న ఆస్పత్రిలోనే పురుడు పోసుకుంది . పాపం ఎవరూ దిక్కులేదని.....' అత్తగారు అందరి కంటే ముందు అందుకుంది. భాస్కర్ గాభరాగా చూశాడు. "అవును పాపం చాలా సాయం చేశారపుడు" వరశ్రీ నవ్వుతూ అంది. భాస్కర్ మొహంలో గిల్టీ ఫీలింగు, 'పాపం పిల్లాడుపోయాడు' అంది అత్తగారు . భాస్కర్ మొహంలో పెద్ద రిలీఫ్.
    "మీ బాబెలా వున్నాడు. పెద్ద వాడయిపోయుంటాడు. ఈ వూర్లో షూటింగుంది . ఓసారి చూసి పోదామని వచ్చా - మీవారేగా నన్ను ముందు సినిమాల్లో ఏక్ స్ట్రా చేసింది. తన పరిచయం చెప్పింది. పక్కింట్లో ఆడుతున్న బాబు పరిగెత్తి వచ్చాడు. 'అబ్బో ఎంత పెద్దవాడయిపోయాడో - ఆరేళ్ళు కదూ ' అంటూ డ్రైవరు తెచ్చిన పాకెట్టు, బొమ్మలు ,డ్రస్సులు, చాక్ లెట్లు అన్ని యిస్తూ "తీసుకో బాబూ అన్నీ నీకే' అంది దగ్గరికి లాక్కుని ప్రేమగా , "నీ కొడుకు నీ పోలికే అంది చిలిపిగా. నా కొడుకు నాలా వుండక ఎలా వుంటాడు' భాస్కర్ కళ్ళలో కించిత్తు గర్వం . భార్యా, అత్త మొహాలు చూసుకున్నారు. వరలక్ష్మీ మొహంలో కనపడిన చిలిపి చిరునవ్వు వారి దృష్టిని పడలేదు. 'వస్తా - వూరికే చూసి పోదామని వచ్చాను' బాబు బుగ్గ మీద ముద్దు పెట్టింది. 'కూర్చోండి , కూర్చోండి లోపలికి రండి' అంతా గాభరాగా అన్నారు. 'వస్తా, పనుంది బాబుని చూడాలని వచ్చానంతే' అందరి మొహాల్లో పెద్ద రిలీఫ్.
    కారు ఎక్కి వీడ్కోలు చెప్పడానికి వచ్చిన భాస్కర్ తో కిటికీ లోంచి తల బయట పెట్టి "నీవచ్చింది నీకే యిచ్చేశాను" అంది నవ్వి. అర్ధం కాక తెల్లపోయి చూస్తున్న భాస్కర్ తో 'ఆడదానికెప్పుడూ యివ్వడమే గానీ తీసుకోవడం తెలీదు. అర్ధం కాలేదా . ఆలోచించు' అంటూ నవ్వి 'ఆడదాన్ని అందుకే ప్రకృతిలో పోల్చారు- నీకర్ధం కాదులే, నీలాంటి మొగాళ్ళకి అర్ధం కాదు" అంటూ "పోనీయ్ ' అంది డ్రైవర్ తో.
    ఏమంది వరశ్రీ? మీకూ అర్ధం కాలేదా? 'ప్రకృతి- పురుషుడు ' స్త్రీ ప్రకృతి ప్రకృతికి యివ్వడమే తెలుసు. బదులు తీర్చమని అడగదు. సూర్యుడు వెలుగు యిచ్చి వేలకట్టడు! చంద్రుడు చల్లదనం యిచ్చి బదులడగడు. వాయువు ప్రాణాధారమైన గాలిచ్చి ధర కట్టదు. వరుణుడు నీరిచ్చి ధర యింత అనడు. అగ్ని వేడి యిచ్చి బడులెం యిస్తావు అనదు. ప్రకృతి యివ్వడమే తన ధర్మం అనుకుంది. స్త్రీ కూడా అంతే! నవమాసాలు బిడ్డని మోస్తూ కడుపులో బిడ్డ కాలితో తన్నినా వెల కట్టదు! నిద్రాహారాలు మాని అష్టకష్టాలు పడి బిడ్డని పెంచినా ప్రతిఫలం కోరదు. పాలు తాగి రొమ్ము గుద్దినా సహించి యిదెం అని అడగదు. తన గుండె కోసి ప్రియురాలి కిస్తూ జారిపడిన కొడుకుని 'జాగ్రత్త నాయనా' అనే అంటుంది. తన ధర్మం నెరవేర్చని కొడుకుని క్షమించి' నాయనా నీవెక్కడున్నా సుఖంగా వుండు ' అనే దీవిస్తుంది. పురుషుడికి శరీరం అర్పించడం తప్ప కనీసం నా కోరిక తీర్చు, నాకు సుఖం కావాలని అని నోరు తెరిచి అడగదు. అడగలేదు. ప్రతి దశలో ఆడదానికి అర్పించడమే తెలుసు. అందుకే స్త్రీని 'ప్రకృతి ' తో పోల్చారు. ప్రకృతి - పురుషుడు అని వూరికే అనలేదు.
    ఈ ఆరేళ్ళలో ఆరువందల సారైనా పిల్లాడిని తెచ్చుకుని భాస్కర్ కి బుద్ది చెప్పాలన్న ఆలోచన వచ్చినా కన్నబిడ్డని , కళ్లిప్పని బిడ్డని కంటితో కూడా సరిగా చూడకుండా, స్తన్యం అయినా యివ్వకుండా పరాయివాళ్ళ చేతుల్లో పెట్టి చేయి దులుపుకున్న తనకి తల్లి అనిపించుకునే హక్కు లేదు అని తెల్సుకున్న వరలక్ష్మీకి యివ్వడంలోని అనందం, క్షమలోని ఔదార్యం , తృప్తిని మించినది ఏది లేదని అర్ధం చేసుకుంది కనక ప్రకృతితో పోల్చుకుంది గర్వంగా.
    "ఒరే మగాళ్ళూ , వెర్రి వెంగళాయిలూ , స్త్రీ కంటే తామేక్కువని గర్వపడి, స్త్రీని తమ చెప్పు చేతల్లో వుంచుకోగలమని విర్రవీగే మీకు , శారీరకంగా బలవంతులు అయి స్త్రీని గుప్పిటలో వుంచుకున్నామని గర్వపడే మీరు 'ప్రకృతి - పురుషుడు' అన్నపదంలో స్త్రీ కిచ్చిన స్థానం తెల్సుకోండిరా వెంగళప్పలూ' అని చెప్పకనే చెప్పింది వరలక్ష్మీ."

                                                                                           (ఆంధ్రప్రేదశ్ మే- 2002)

 Previous Page Next Page