తరళ అలాగే నిశ్చేష్టురాలై నిలబడిపోయింది. తను నా జీవితానికీ, ప్రమద్వర భవిష్యత్తుకీ ఎంత ద్రోహం చేసిందో, మేమిద్దరం కన్న కలల్ని ఎలా సమూలంగా నాశనం చేసిందో, చెపుదామని నోటి చివరివరకూ వచ్చింది. కానీ అంతలోనే "ఛీ-ఈవిడతో చెప్పేదేమిటి" అనిపించి అక్కన్నుంచి క్రిందికివచ్చేశాను. అదొక్కటే కాదు కారణం. వీళ్ళు ఎంతకయినా తెగించిన వాళ్ళు. నాకూ ప్రమద్వరకూ మధ్యనున్న ప్రేమ ఈవిడకి తెలుస్తే అది ప్రమద్వర ప్రాణానికి కూడా హాని కలిగించవచ్చు.
ఆ క్షణం తరళ నా భార్య అన్న విషయం కూడా మర్చిపోయాను. నా శతృవులు, ఈమె... ఈమె తండ్రి... అంతే! అదొక్కటే భావం నా మనసంతా నిండిపోయింది.
మనుష్యుల్ని కొనగలరు వీళ్ళు!
ద్బబుతో-లేకపోతే బెదిరించి...అదీ కాకపోతే మరేదో (ఇప్పుడు వేసినట్టు) ప్లాన్ వేసి- అనుకున్నది సాధించగలరు.
వాళ్ళ మొహం చూడటానికి అసహ్యం వేసింది. అందుకే నా గదికి వచ్చేశాను. అసలీ తప్పంతా ప్రమద్వరది!
నా చేతులు కట్టేసి ఈ వివాహానికి వప్పించింది. త్యాగం పేరిట అనవసరంగా నన్నీ ఊబిలోకి దింపింది.
.....
నేను గదికి వచ్చేసిన ఐదు నిముషాలకి తరళ తండ్రి వచ్చాడు.
చాలా గొప్ప నటుడు. వంద లంకణాలు చేసినట్టు మొహం పెట్టాడు. రాగానే చేతులు పట్టుకుని "అల్లుడూ, ఈ తప్పంతా నాది నన్ను క్షమించు" అన్నాడు.
నన్ను నేను నిగ్రహించుకోవటానికి చాలా కష్టపడవలసి వచ్చింది. "చూడండి, అయిపోయిందేదో అయిపోయింది. మీ కూతురికీ నాకూ ఏ సంబంధమూ లేదు. మీరు పెద్ద భూస్వామి అనీ, ఈ వూళ్ళోకెల్లా గొప్ప ఇన్ ఫ్లుయెన్సున్న మనిషనీ నాకు తెలుసు కానీ మీరేం చెయ్యగలరో నేనూ చూస్తాను. మీరూ మీ కూతురూ కలిసి వేసిన ఈ అతి గొప్ప ప్లాన్ కి నేను మీ కూతురికి వేస్తున్న శిక్ష అదే! మొదటి రాత్రయ్యాక మొగుడు వదిలేసిన దానిలాగ ఇక జీవితాంతం గడపాలి. ఎందుకు వదిలేశాడు- అన్న దానికి కారణం- మీరేం చెప్పుకుంటారో మీ ఇష్టం. ఇక మీ రెళ్ళొచ్చు..."
"నేనీ నాటకం ఆడినట్టు తరళకి తెలీదు".
"ఏమిటి మీరంటున్నది"?
"అవును ఆనంద్ తరళని ఇందులో కలపకు. ఇందులో ఏ తప్పున్నా అది కేవలం నాది మాత్రమే. తరళ అమాయకప్పిల్ల. అది నిన్ను ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమిస్తూంది. దాని గురించే నేను డాక్టర్ కి అలా చెప్పమని చెప్పాను". తరళకి ఈ ప్లాన్ లో భాగం లేదన్న విషయం నాలో సంచలనాన్ని రేపింది కానీ వెంటనే సర్దుకున్నాను. ఇప్పుడు సమస్య తరళకి ఇందులో భాగం వున్నదా లేదా అని కాదు. నాశనమయిపోయిన నా జీవితం గురించి.
"నేను చెప్పానుగా మీరెంత చెప్పినా నేనిక మీ ఇంటి గుమ్మంలోకి అడుగు పెట్టను. మీ కూతురికి మీరేం చెప్పుకుంటారో మీ ఇష్టం. ఇందులో ఆమె తప్పు లేకపోవచ్చు. కానీ ఏం తప్పు లేకుండానే కొంతమంది శిక్ష అనుభవిస్తూ వుంటారు. అలాటి వాళ్ళల్లో నేను మొదటివాణ్ణి అయితే మీ కూతురు రెండోది. అనుకుని సంతృప్తి పడండి".
"అంటే ఇందులో నీ తప్పేమీ లేదంటావా?" ఈ సారి తెల్లబోవటం నా వంతయింది. "నా తప్పా? నా తప్పేముంది?"
"నువ్వూ ప్రమద్వరా ప్రేమించుకున్న విషయం నా కూతురికి చెప్పకపోవటం..."
"ఇది మీకు ... మీకెలా తెలుసు?" తడబడుతూ అడిగాను.
ఆయన దానికి సమాధానం చెప్పకుండా "మీ ఇద్దరిమధ్య ప్రేమ విషయం మీతో కలిసి తిరుగుతూ కూడా నా కూతురు గ్రహించలేకపోయింది. అంత అమాయకపుది అది. అటువంటి దానికి మీ సంగతి ఎందుకు చెప్పలేదు? పోనీ చెప్పవలసిన అవసరం మీకు లేదనుకుందాం? కనీసం తను నిన్ను చేసుకొంటాను అని అన్నప్పుడైనా నువ్వా విషయం చెప్పాలికదా? ఎందుకు చెప్పలేదు? అక్కడికొచ్చేసరికి నీ ప్రాణం ముఖ్యం అనిపించిందా?.....నేనిలా మాట్లాడుతున్నానని కోపం తెచ్చుకోకు. నా తరఫునుంచి ఆలోచించు. ఇలా నేనూ వాదించవచ్చు కదా! నీ గుండెజబ్బు- దాన్ని నయం చేయటం- అన్నది మనిద్దరిమధ్యా ఒప్పందం. నిజంగా ప్రమద్వరపట్ల నీ ప్రేమ నిజమయిందైన పక్షంలో నువ్వు తరళకి అన్ని సంగతులూ చెప్పి వుండేవాడివి ఎందుకు చెప్పలేదు?" ఆయన మాటలకి నా ఆవేశం పెరిగిపోతూ వుంది. ఆయన నా మాటలు పట్టించుకోకుండా అన్నాడు.
"కాబట్టి - నీకేదైనా కోపం వుంటే నా మీద తీర్చుకో ఆనంద్! తరళ మీద కాదు- ఇక ప్రమద్వర విషయం అంటావా- అది-" ఆయన పూర్తిచేయబోతూంటే "చాలాపండి!" అని అరిచాను. "...మీకు తెలుసా? నేనీ పెళ్ళి చేసుకోవటానికి కారణం ప్రమద్వరే- నేను బ్రతుకుతే చాలనుకుంది.... నా కోసం తన భవిష్యత్తుని బలిపెట్టుకుంది. తరళని చేసుకోవాలని ఒట్టు వేయించుకుంది".
"నాకు తెలుసు" అన్నాడాయన. "దానికి ప్రతిగా ప్రమద్వర భవిష్యత్తుని నువ్వు కలలో కూడా వూహించనంత గొప్పగా తీర్చిదిద్దుతాను. అది నాకు వదిలిపెట్టు".
క్రమ క్రమంగా నేను వాదనలో ఓడిపోతున్నానన్న విషయం నాకు తెలుస్తోంది. కానీ నా వాదనలో లోపం ఎక్కడో తెలియటం లేదు. అయినా ఈయనతో వాదించవలసిన అవసరం నాకుఏముంది? ఆ మాటే చెప్పి ఆయనేదో అనబోతూంటే దాదాపు బయటకు గెంటి, తలుపు వేసుకున్నాను. తరువాత చెయ్యవలసిన దానిగురించి ఆలోచనలో పడ్డాను. ముందీ వూర్నించి వెళ్ళిపోవాలి.
ప్రమద్వరతో సహా - అంతే!
రావుగారికీ, ఆయన కూతురికీ బుద్దివచ్చేలా చేయాలంటే ఇక్కన్నుంచి వెళ్ళిపోవాలి! వెళ్లేముందు ఈ పల్లెలో అందరికీ ఆయన ఆడిన నాటకం గురించి తెలిసేలా చెయ్యాలి. పెళ్ళి అయిన మరుసటిరోజు కూతుర్ని వదిలేసి అల్లుడు వెళ్ళిపోయాడంటే అంతకన్నా అవమానం ఏం కావాలి? నాకు జరిగిన మోసానికి ఇదే సరియైన సమాధానం అయితే వెంటనే నేను ప్రమద్వర దగ్గిరకు వెళ్ళలేదు. అంతకన్నా ముందు చెయ్యవలసిన పని ఒకటి వుంది.
రావుగారు సామాన్యులు కాదు. కూతురికి విడాకులు ఇవ్వకుండా రెండో వివాహం చేసుకుంటే నన్ను జైల్లో పెట్టించకుండా వూరుకోదు. విషయం అంతవరకూ వస్తే ఎంతవరకైనా తెగిస్తాడు.
అసలాయన ఆర్గ్యుమెంటు చూస్తేనే నాకు మతిపోయింది. ఎంత సులువుగా తప్పంతా నా మీదకు తోసేసేడు!! నేను వెళ్ళి ఆయన కూతురికి మా ప్రేమ విషయం చెప్పి వుండవలసిందట. చెపితే ఏం చేసేది? మా ఇద్దరికీ పెళ్ళి చేసి, ఆస్పత్రి ఖర్చుల నిమిత్తం రెండు లక్షలు ఇచ్చి వుండేదా? అసలు నాటకం ఆడిందంతా ఆయన. హాయిగా సుఖంగా వుండవలసిన మా జీవితాల్లో అతి నికృష్టమైన ప్లాన్ వేసి నిప్పులు పోసింది ఆయన. ఇంతకింతా చెయ్యకపోతే నేను నిద్రపోను.