Previous Page Next Page 
13... 14.... 15 పేజి 36


    అతడు లేచి ఆమె నడుము పట్టుకుని పైకి లేపుతూ, "వెళ్దాం పద" అన్నాడు. అతడి వళ్ళు వెచ్చగా తగిలింది. ఆమె నైటీ టవల్ లా భుజాన వేసుకుంటూ, "ఇంతకీ నాప్రామిస్ సంగతి?" అని అడిగింది అది తేల్తేగానీ క్రిందికి రానన్నట్టు.

    "దీనిమీద ఒట్టు. లిమిట్ లోనే వుంటాను. సరేనా" అంటూ క్రిందికి బయల్దేరాడు.....ఆమె చెయ్యి విదిలించికొట్టాక.

    "మల్లెపూలు కార్లోనే వుండిపోయినయ్ "క్రిందికి వెళ్ళాక అంది.

    ".....వాటి సంగతి రేపు చూసుకుందాంలే"

    తరువాత దాదాపు గంటసేపు వాళ్ళు శరీరాల్తో మాట్లాడుకున్నారు స్త్రీ పురుషులమధ్య సెక్స్ కన్నా బెస్ట్ కమ్యూనికేషన్ మరేదీ లేదని నిరూపించే పద్ధతిలో.

    "ఇవ్వాళ  చాలా కొత్తగా వున్నావ్. ఏమిటి విశేషం?"

    "ఏదో మనోవిశ్లేషణ పుర్తకంలో చదివాను. మొగవాడి చేతులు, పెదవులు, వేళ్ళు, నాలుక.....మొత్తం శరీరం.....రోమాన్స్  లో ఎంత ఆక్టివ్ గా  కదుల్తాయో, ఆ పనులన్నీ అప్పుడప్పుడూ స్త్రీ కూడా చేస్తే అది చాలా గొప్పగా వుంటుందట."

    "నాకర్థం కాలేదు. చెయ్యితియ్యి. సరిగ్గా చెప్పు."

    "మగవాడు చేసే పనులన్నీ  సరిగ్గా  అదేపద్ధతిలో స్త్రీకూడా చేస్తే చాలు. అంతకన్నా గొప్ప రొమాన్సు మరేమీ ఉండదు."

    అతడు గట్టిగానవ్వి "కరెక్ట్. ఒక్కమాటలో భలే చెప్పావు" అన్నాడు. ఆమె  కళ్ళు మూసుకుంది. ఆర్నెల్లక్రితం అతడన్న ఒకమాట......శవంలా పడుకోవటం తప్ప.....ఆమాట గుర్తొచ్చింది. ఆమె ఆలోచనలో పడటం చూసి, "ఏమిటాలోచిస్తున్నావ్?" అని అడిగాడు.

    "ఒక నెలరోజులపాటు ఎక్కడన్నా తిరిగివద్దాం. ఈ టెన్షన్లూ ఇవీ ఎప్పుడూ వుండేవే."

    "వచ్చేనెల ఎలాగూ అమెరికా వెళ్ళాలి. రెండు టిక్కెట్లు బుక్ చేసే వున్నాయి. నువ్వు రా."

    రెండో టికెట్  ఎవరికోసం బుక్ చేసి వుంచారు? అని అడగలేరు.....అతడిని ఇబ్బంది పెట్టటం ఇష్టంలేక. "అయితే ఒక్క షరతు. చాలా ఇష్టంగా తీసుకెళ్ళాలి" అంది.

    అతడు అర్థం కానట్టు...."ఇష్టంగా తీసుకువెళ్ళటం.....అయిష్టంగా తీసుకువెళ్ళటం అని రెండు రకాలుంటుందా?" అన్నాడు.

    "చాలామంది భర్తలు తమ భార్యల్ని ఒక బాధ్యతలాగా బయటకి తీసుకెళ్తారట లెండి."

    అతడు మొహం చిట్లించి, "నాకలాటి హిపోక్రసీలేమీ లేవు.  ఇష్టం లేకపోతే మొహంమీద చెప్పేస్తాను" అన్నాడు.

    "తెలుసు మహానుభావా! ఇన్నాళ్ళు సంసారం చేసాను. ఆమాత్రం తెలీదా" మనసులో అనుకుంటూ పైకి అంది...... "నా తరువాత కథకి టైటిల్ దొరికింది"

    "ఏమిటది?"

    "మనింటి పుల్లకూర"


                                                                       6


    "ఎలా జరిగింది. మీ విదేశీ ప్రయాణం?" మధూహ అడిగింది.

    "అద్భుతం" నవ్వింది లక్ష్మి. ఆమె మొహంలో ఆ వెలుగు కొట్టొచ్చినట్టు కనపడుతూంది. "భార్యాభర్తలిద్దరూ కనీసం రెండు సంవత్సారాల కొకసారయినా పదిపదిహేనురోజులపాటు పిల్లల్ని కూడా వదిలేసి బయట ఊళ్లు తిరిగిరావటం దాంపత్య ఆరోగ్యానికి మంచి టానిక్..... అని ఈసారి నవలలో వ్రాద్దామనుకుంటున్నాను."

    "నీలో ఒక మార్పు మాత్రం కొట్టొచ్చినట్టు కనపడుతోంది."

    "ఏమిటి మధూ?"

    "ఈ మధ్య ఎప్పుడూ నవ్వుతూ వుంటున్నావు. గతంలో అలా వుండేదానివి కాదు."

    లక్ష్మి నవ్వింది  " నీ విశేషాలు ఏమిటి చెప్పు. ఈ నెల రోజులూ ఏంచేసావ్?" మధూహ. లక్ష్మి సన్నగా కేకపెట్టినట్టు "వ్వావ్" అంది ".......చాలా ఆశ్చర్యకరమైన......సంతోషకరమైన విశేషమే. కంగ్రాట్స్" అంటూ చేతులు పట్టుకుని వూపేసింది. అయితే మధూహ మొహం నిర్వికారంగా వుంది.

    శుభలేఖ చదవటం ప్రారంభించిన లక్ష్మి మోహంలో మార్పు చోటు చేసుకుంది. చేయి అప్రయత్నంగా వణికింది. నమ్మలేనట్టు మధూహ మొహంలోకి చూస్తూ"ఇదే.....ఇదేమిటి...నువ్వు. రాజు ....." అంటూ మళ్ళీ శుభలేఖ పరిశీలిస్తూ అపనమ్మకంగా,".......నవ్వూ ప్రహసిత్ పెళ్ళి చేసుకుంటున్నారా?" అని అడిగింది.

    "అవును. కలిసి వుండబోతున్నాం"

    లక్ష్మి స్థబ్దురాలైంది. అక్కడ అకస్మాత్తుగా నిశ్శబ్దం రాజ్యమేలింది. లక్ష్మి మోహంలో మారిన భావాల్ని మధూహ గమనించింది. అర్థం చేసుకోగలిగింది కూడా. సన్నటి స్వరంతో నెమ్మదిగా అంది, "ప్రేమగురించి అన్ని గొప్ప గొప్ప కబుర్లు చెప్పిన మనిషి ఇలాటి పని చేస్తున్నాడేమిటా  అనుకుంటున్నావ్ కదూ."

    లక్ష్మి మాట్లాడలేదు. కానీ ఆమె మనసులోని అలజడి మొహంలో కనపడుతూంది. మధూహ గిల్టీగా ఫీలయ్యింది. "ప్రహసిత్ విశిష్టమైన వ్యక్తి లక్ష్మి! అటువంటి వాళ్ళు ప్రపంచంలో ఒకరో ఇద్దరో వుంటారు" అంది.

    లక్ష్మి తలదించుకుని, "నన్ను కొంచెంసేపు ఒంటరిగా వుండనివ్వు మధూ. ప్లీజ్" అంది ఆ ప్రసక్తి ఇష్టంలేనట్టు.

    "లేదు ఇదంతా. నీకు తెలియాలి. నీ మానసులో ప్రహసిత్ పట్ల  ఏవిధమైన విరక్తి భావమూ కలుగకముందే నీకు అతడి గురించి చెప్పాలి. మొదట్లో అతడి తొలిచూపు ప్రేమ గురించి నేనూ తేలిగ్గా అనుకున్నాను. కానీ నీపట్ల అతడి ప్రేమ అనిర్వచనీయం. అజరామారం. దాన్ని మాత్రం తేలిగ్గా అంచనా వేయకులక్ష్మి...."

    "ఓహొ....అతడి ప్రేమగురించి అంతలోతుగా అప్పుడే తెలిసిందా నేకు?"

    "అవును తెలిసింది" దృఢంగా చెప్పింది మధూహ. ".......నిన్ను ప్రేమించి, నువ్వు వివాహితురాలివని తెలిసి, తన మనసు తలుపులు మూసేసుకున్నప్పుడే తెలిసింది. నువ్వు నీభర్తతో ప్రస్తుతం సుఖంగా వుంటున్నావని చెప్పినప్పుడు అతడి మొహంలో స్వచ్చమైన.....నిజాయితీతో కూడిన ఆనందం కనిపించింది లక్ష్మీ! నేను చాలా గమనించి చూసాను. కేవలం ప్రేమలో బుష్యత్వం సాధించిన వ్యక్తులకే అది  సాధ్యం. తను ప్రేమించిన వ్యక్తి తన పరోక్షంలోనో.....లేక మరోవ్యక్తి సమక్షంలోనో..... సంతోషంగా వుంటోంది అని తెలిసినప్పుడు.....దాన్ని సంతోషంగా తీసుకోగలిగేటంత స్వార్థరహితమైన ప్రేమకన్నా గొప్పది ఈ ప్రపంచంలో మరొకటి వుంటుందంటావా? మనుష్యుల్లో ....ముఖ్యంగా మగవాళ్ళలో ఆమాత్రం స్వార్థం వుండటం చాలా సహజమైన ప్రక్రియ కాదా? నీకు తెలీదు లక్ష్మి! హీ ఈజ్ గ్రేట్......అతడు మళ్ళీ నిన్ను జీవితంలో కలుసుకొకపోవచ్చు. లేదా కలుసుకున్నా ఒక అపరిచితవ్యక్తి లాగానే మిగిలిపోవచ్చు. కానీ జీవితంలో అతడు నిన్నుతప్ప మరెవర్నీ ప్రేమించడు. ప్రేమించలేడు."

    "కానీ నిన్ను మాత్రం వివాహం చేసుకుంటాడు."

    "అవును. చేసుకుంటాడు...."

    "గత ప్రేమ గురించి గొప్పగా సమర్థించుకుంటూ నీతో కలిసి కాపురం చేస్తాడు....."

    "గొప్ప వ్యంగ్యంగా మాట్లాడుతున్నాననుకోకు"

    "ఏం? ఎందుకు మాట్లాడకూడదు? మనుష్యులంతా చేసేది అదేగా. రొమాంటిసైజింగ్ ది పాస్ట్"

    "నువ్వు నీ భర్తతో సుఖంగా వుంటూ కూడా, అతడు నన్ను వివాహం చేసుకోబోతున్నాడంటే ఈర్ష్యపడుతున్నావ్. అతడిని మార్చిపోయి నువ్వు నీ సంసారం చక్కదిద్దుకుంటున్నావంటే అతడు సంతోషిస్తున్నాడు. దీన్నిబట్టే తెలియటం లేదూ ఎవరు గొప్పో?"

    "నాకు నీ జడ్జిమెంటు అవసరం లేదు. ఇప్పుడు నువ్వు అతడికి లభించావు కాబట్టి గతప్రేమ గురించి ఎన్ని కబుర్లయినా చెపుతాడు. అయినా ఎందుకతన్ని అంత సమర్థిస్తున్నావ్? కాబోయే భర్త అనా?"

    "కాదు. పుట్టబోయే నాబిడ్డకు తండ్రని....."

    ఆవేశపు శిఖరంనుంచి ఒక్కసారిగా జారిపడినట్టయింది. విస్తుబోయి "....మధూ" అంది లక్ష్మి.

    "అవును. కేవలం లోకం బారినుంచి నన్ను రక్షించటానికి! సమాజంలో ఒక గౌరవప్రదమైన స్థానం కల్పించటానికి...."

    "కానీ.....కానీ.....రాజు.....??"

    జరిగినదేమిటో మధూహ చెప్పటం ప్రారంభించింది. తాను ఇనస్పెక్టర్ దగ్గిరకివెళ్ళి చెప్పటం నుంచీ  మొదలుపెట్టింది.

    ఆమె చెప్పిందంతా శ్రద్ధగా విన్నాడు ఇన్ స్పెక్టర్ భైరవమూర్తి. విశాల్ పేరు చెప్పినప్పుడు అతడి భృకుటి ముడిపడింది. "......మీరు చెప్పిన మోసాలన్నీ  అక్కడ జరుగుతూ వుండవచ్చు. కానీ వీటిలో కనీసం ఒకదాన్ని అయినా మనం నిరూపించలేం......"

    "ఇంతకాలం నేను చాలా వివరాలు సేకరించాను ఇన్ స్పెక్టర్ గారూ. కానీ అవన్నీ బయటనుంచి సేకరించిన వివరాలే. ఇప్పుడు నేనే ఆ విషవలయంలో ప్రవేశిద్డామనుకుంటున్నాను."

    "ఎలా?"

    "నాకు  పెళ్ళయి అయిదేళ్ళయిందనీ పిల్లలు పుట్టలేదనీ చెప్తాను. ఎలా ట్రీట్ చేస్తాడో చూస్తాను."

    "కానీ మీకు పెళ్ళికాలేదుగా"

    "మెళ్ళో మంగళసూత్రం వేసుకుంటాను"

    ఇన్ స్పెక్టర్ ఒకక్షణం ఆలోచించి, "ఇందులో కూడా ఒక చిక్కువుందనుకుంటాను. ఎంతకాదనుకున్నా అతడూ ఒక డాక్టరు. మిమ్మల్ని పరీక్షించగానే మీరు కన్య అని తెలుసుకుంటాడు."

    ఆమె తలదించుకుని, "నేను కన్యని కాదు ఇన్ స్పెక్టర్ గారూ. ఆమాటకొస్తే గర్భవతిని కూడా" అంది.

    భైరవమూర్తి ఇంకా షాక్ నుంచి తేరుకోలేదు.

    ".........నాబోయ్ ఫ్రెండ్  నన్ను దాదాపు రేప్ చేశాడు. కానీ అదృష్టవశాత్తు మాపెళ్ళికూడా నిశ్చయమైపోయింది. ప్రస్తుతం నాకు రెండోనెల అని అనుమానంగా వుంది. నాకాబోయే భర్త అంధుడై ఇటీవలే తిరిగి చూపుపొందాడు. డాక్టర్ విశాల్ తిరిగి అతడికి ఉద్యోగమివ్వబోతున్నాడు. వాళ్ళిద్దరి మధ్యా ఏదో ఒక రహస్య ఒప్పందం వుంది. ఆ రహస్యం ఆధారంగా రాజు ఆ డాక్టర్ ని బ్లాక్ మెయిల్ కూడా చేస్తూ వుంటాడు. రాజు మళ్ళీ విశాల్ క్లినిక్ చేరకముందే ఆ రహస్యాన్ని పట్టుకోవాలి."

    "డాక్టర్ విశాల్ మిమ్మల్ని గుర్తుపట్టడా?"

    "ఒకేసారి చూసాడు. గుర్తుపట్టకపోవచ్చు......"

    "నువ్వు చాలా రిస్క్ తీసుకుంటున్నావని నాకనిపిస్తోందమ్మాయ్."

    "లేదు ఇన్ స్పెక్టర్ గారూ. నాకళ్ళల్లో ఎప్పుడూ ఒకే దృశ్యం మెదుల్తూ వుంటుంది. లాయర్ శివశంకరం అనే ఒక యువకుడు తన కాళ్ళు పోగొట్టుకున్న దృశ్యం!! ఒక అన్యాయాన్ని ఎదుర్కోవటం కోసం డాక్టర్ విశాల్ తో తలపడి. అతడి కౄరత్వానికి బలైపోయాడు. అతడు తీసుకున్న రిస్క్ తో పోల్చుకుంటే నాది ఏపాటిది? చూద్దాం ఆ విశాల్ నన్నేం చేయగలడో....."

    "విశాల్ ఏమీ చేయలేకపోవచ్చమ్మా. ఏమీ చేయకుండా నేనెలాగూ బయట కాపలావుంటాను. కానీ రాజు నీమీద వత్తిడి తీసుకురావచ్చు."

    "డాక్టర్ విశాల్ అరెస్ట్  అయితే రాజు మారతాడు ఇన్ స్పెక్టర్ గారూ! అందుకే.....అతడు వుద్యోగంలో చెరకముందే ఇదంతా జరిగిపోవాలి. ఈసాలెగూడు లోంచి నాక్కాబోయే భర్తని. రక్షించుకోవాలనే నాప్రయత్నమంతా....."

 Previous Page Next Page