అతడు బెల్ కొట్టి అకౌంటెంట్ ని పిలిచి సూచన్లు ఇచ్చాడు. అకౌంటెంట్ కూడా ఆశ్చర్యపడ్డాడు. కానీ పైకి కనిపించలేదు.
అతడితోపాటూ వెళ్ళి కూర్చుంది. స్టాఫ్ కి ఈ విషయం తెలిసినట్టుంది. ఆఫీసంతా కొంచెం గంభీరం వాతారణం చోటు చేసుకుంది. ఆ రోజు హొటల్ లో కనిపించిన అమ్మాయి కూడా అక్కడే వుంది. వంచిన తలెత్తకుండా పనిచేసుకుపోతున్నట్టు వుంది. లక్ష్మికి ఆమెని చూస్తే ఎందుకో జాలి వేసింది.
లంచ్ టైమ్ లో వెళ్ళి ఎదురుగా కూర్చుంది. టిఫిన్ బాక్స్ అప్పుడే తెరిచిన ఆ అమ్మాయి లక్ష్మిని చూసి తత్తరపడి కంగారులో నీళ్ళు మీద ఒలకబోసుకున్నంత పని చేసింది.
లక్ష్మి నవ్వుతూ, "ఈరోజు నుంచీ నాక్కొంచెం పని నేర్పాలి" అంది.
"అ....అ....అలాగే"
ఆమె నవ్వుతూనే, ఇందులో డబుల్ మీనింగ్ డైలాగులేమీ లేవులెండి" అంది. ఆ అమ్మాయి మొహం ఎర్రబడింది.
"మీరొకసారి నవ్వాలి. అలా నవ్వితే, హొటల్ విషయం ఎవరికీ చెప్పనని హామీ ఇస్తాను."
ఆ అమ్మాయికి లక్ష్మి ఏంచేపుతోందో అర్థం కాలేదు. అర్థమయ్యాక సిగ్గుతో తలదించుకుంది. ఈలోపులో లోపల్నుంచి పిలుపొచ్చింది.
"నీ లంచ్ సంగతేమిటి?" అన్నాడు విష్ణు. అతడు ప్రతిరోజూ బాక్స్ తెచ్చుకుంటాడు.
"చేసే వచ్చాను. రేపట్నుంచీ నేనూ తెస్తాను" అంది. అతడు లంచ్ చేస్తూంటే వడ్డించింది. "ఏం నేర్చుకున్నావ్?" అని అడిగాడు.
"బ్యాలన్స్ షీట్లు, అమ్మకాల వివరాలూ చూసాను. వారికన్నా ముఖ్యంగా గమనించిందేమిటంటే మీకు చాలా పని వుంటుంది. కొంత సంపాదించాక డబ్బు దానంతట అదే వస్తుందనుకున్నాను. ఎప్పుడూ కష్టపడుతూనే వుండాలని ఈరోజు మిమ్మల్ని చూస్తే అర్థమైంది."
ఆ మెచ్చుకోలుకి అతడి మొహంలో ఆనందం స్పష్టంగా కనిపించింది. నిజానికి ఆమె అన్నదాన్లో అతిశయోక్తి కూడా ఏమీలేదు. ప్రొద్దున్నించీ రకరకాల విజిటర్స్ తో అతడు చాలా బిజీగా వున్నాడు. తన కష్టాన్ని ఆమె గుర్తించిందన్న సంతృప్తితో అతడి పెదాలు నవ్వుతో అదోలా విచ్చుకున్నాయి. "ఇది కూడా వ్రాస్తావా నీకథలో" అన్నాడు.
"వ్రాస్తాను. మగవాళ్ళు భార్యల్ని, 'చేతనయితే నువ్వు సంపాదించు చూద్దాం' .......అని ఎందుకంటారో కూడా వ్రాస్తాను."
అతడు ఉలిక్కిపడి, అందులో వ్యంగ్యాన్ని గుర్తించినట్టు ఆమెవైపు చూసాడు. లక్ష్మి నవ్వి, "నాకు ఎంత జీతం ఇవ్వబోతున్నారు?" అని అడిగింది. అతడేదో సమాధానం చెప్పబోతున్నంతలో ఫోన్ మ్రోగింది. అతడో నిముషం మాట్లాడి ఫోన్ పెట్టేసాడు.
"సాధారణంగా మీరొక్కరే చేస్తారా లంచ్?" అని అడిగింది. నిజానికి ఆమె చాలా క్యాజువల్ గా అడిగినా, అతడు ఇబ్బందిగా చూసి సమాధానం చెప్పటానికి ఆలస్యం చేయటంతో మాట మారుస్తూ. "నేనీరోజు ఆఫీసుకొస్తూ ఏమనుకున్నానో తెలుసా? మొన్నరాత్రి మీరు చెప్పారుగా.....వ్యాపారంలో నష్టం వస్తుందని. ఆ విషయంలో....."
"ఏమనుకున్నావ్?"
"ఆఫీసుకొచ్చి మొదటిసారి సీట్లో కూర్చోగానే, మీ వ్యవహారాలన్నీ పరిశీలించి, లంచగొండి అయిన మీ మనేజర్ని శిక్షించి, క్షణాల్లో మీ ఆఫీసు పరిస్థితి మార్చేసినట్టు.....మీరు ఆనందంతో తబ్బిబ్బు అయిపోయి, నన్ను గాలిలో ఎత్తితిప్పేస్తూ కన్నీళ్ళతో కదిలిపోయినట్లు....." ఆమె మాటలు పూర్తి కాలేదు. అతడు ఎంతగట్టిగా నవ్వేడంటే, లోపం ఏం జరిగిందో అన్న కంగార్లో ప్యూన్ తలుపుతీసి చూసాడు. నవ్వుతో అతడికి పొలమారింది. ఆమె నీళ్ళు అందిస్తూ "ఏదో సినిమాలో అలాగే జరుగుతుందండీ" అంది అమాయకంగా. అది అమాయకత్వం కాదనీ అంతకు ముందు అడిగిన ప్రశ్నకి తమ సమాధానం చెప్పేటందుకు ఇబ్బంది పడటం చూసి కావాలనే మాటమార్చిందనీ ఊహించలేనంత అమాయకుడు కాదు అతడు.
లంచ్ అయిన తరువాత ఆమె తిరిగి తన సీట్ లోకి వచ్చేసింది. అంతకు ముందు ఆమె చెప్పింది నిజమే. ముందు హాల్ లో ఆమె వుండటం వలన స్టాఫ్ నిజంగానే ఎక్కువ పనిచేస్తున్నారు. విష్ణు ఆమెని లోపలికి పిల్చి ఒకటి రెండు పనులు చెప్పాడు కూడా. మానేజర్ సాయంతో ఆమె వాటిని పూర్తి చేసింది.
సాయంత్రం మాధుర్ వచ్చాడు. ఆమెని ఆఫీసులో చూసి ఆశ్చర్యపోయాడు. కొంచెంసేపు విష్ణుతో మాట్లాడిన తరువాత లేచి, "నేనెళ్ళొస్తాను" అన్నాడు.
"ఇదేమిటి? క్లబ్ కి వెళ్దాం! ఉండు" అన్నాడు విష్ణు, మాధుర్ ఇబ్బందిగా చూసాడు.
"నేను ఆటోలో వెళ్తాలెండి" అంది లక్ష్మి 'అలాగే వెళ్ళు' అనలేక, విష్ణు "నేను తనని ఇంటి దగ్గిర దింపేసి వస్తాను" అన్నాడు మాధుర్ తో మాధుర్ కొద్దిగా తటపటాయించి "మావాళ్ళు ఎప్పటినుంచో సినిమాకి వెళ్దామంటున్నారు. ఈరోజు తీసుకువెళ్తాను" అన్నాడు లేస్తూ.
ఆరింటికి భార్యాభర్తలు ఇద్దరూ ఇంటికి బయల్దేరారు. కార్లో విష్ణు కాస్త సీరియస్ గా వుండటం గమనించింది. రొటీన్ పాడవటం వలన కలిగే చిరాకు అలజడి అది.
దార్లో మల్లెపూల రిక్షా దగ్గిర ఆపుచేయమంది. "ఎంతవి కావాలి?" అని అడిగాడు.
"కిలో...."
"సరిగ్గా వినిపించలేదేమో అనుకుని "వ్వాట్?" అన్నాడు.
"లేకపోతే ఏమిటండీ? పెళ్ళానికి ఎన్ని మల్లెపూలు కొనాలో తెలీదా..... ఇన్ని సంవత్సరాలు కాపురం చేసారు" అంది.
అయిదు నిముషాలు గడిచాక అతడు వచ్చి కూర్చుని స్టార్ట్ చేసాడు. "పూలేవీ?" అడిగింది.
"వెనుక డిక్కీలో పెట్టాను"
ఆమె అదిరిపడి, "మల్లెపూలు డిక్కీలో పెట్టారా? తలలో పెట్టుకునేవి?" అని అడిగింది.
"అవును రెండు గంపలు"
"ఏడాదికి సరిపడా కొన్నారా?"
"అతడు మాట్లాడలేదు. ఇంటికొచ్చి స్నానంచేసి వంట ప్రారంభించింది. అతడు ముందు హాల్లో కూర్చుని పేపరు చదువుకుంటున్నాడు. "కొంచెం వొచ్చి ఉల్లిపాయలు కోసి పెట్టొచ్చుగా"
అతడు విసుక్కుంటూ వచ్చి పనిచేయటం ప్రారంభించాడు. గంటలో వంట పూర్తయింది.
"పైన డాబామీద కూర్చుందాం" అంది.
"బోరు" అన్నాడు విసుగ్గా.
"ఈ ఒక్కరోజుకీ.....రేపటినుంచీ నాకూ ఎలాగూ కుదరదు"
అతడు విస్మయంగా "ఏం?" అని అడిగాడు.
"కంప్యూటర్ క్లాస్ లో చేరుతున్నాను. వారానికి నాలుగు రోజులు. రాత్రి ఏడునుంచీ పదివరకూ."
"మరి అంతరాత్రి ఒక్కదానివే రాగలవా?"
"మీరు క్లబ్ నుంచి వచ్చేటప్పుడు తీసుకువద్దురు గానీ....."
అతడు ఇబ్బందిగా చూసాడు. "సర్లే చూద్దాం" అన్నాడు. అతడు డాబామీదకు వెళ్ళేసరికి అక్కడ బల్లమీద డ్రింకు, గ్లాసులూ వున్నాయి. తనగ్లాసులో వంపుకుని తాగుతూ కూర్చున్నాడు. పదినిముషాల తరువాత ఆమె వచ్చింది. పల్చటి నైటీలో వుంది. నిజంగా ఆ నైటీలో ఆమె చాలా బావుంది. అందంకాదు కానీ, దానికన్నా ఎక్కువగా ఆమె స్ట్రక్చర్. ఆమె తెల్లటి తెలుపు కాదు. చామనఛాయకన్నా ఒక పిసరు ఎక్కువ తెలుపంతే. కానీ ఎక్కడో ఏదో తెలియని అందం వుంది.
ఆమె కూల్ డ్రింక్ పోసుకోవటం చూసి, "అదేమిటి?" అని అడిగాడు.
"నాకు అది పెద్దగా సహించటంలేదు. మొన్న రాత్రంటే ఏదో తాగాను. ఏం? మీకేమన్నా ఇబ్బందా?"
"లేదులే. ఏదో ఒకటి తాగు. ఒక్కణ్ణీ అయితే నాకు బోరు"
డాబామీదకి వంగిన కొబ్బరిచెట్టు గాలికి వూగుతూంటే అందమైన ఆడపిల్ల ఎక్సర్ సైజ్ చేస్తున్నట్టు వుంది. "నైటీ తీసెయ్యనా?" అని అడిగింది క్యాజువల్ గా .
అతడు మామూలుగా తాగుతున్నాడు. ఏదో ఆలోచిస్తున్నాడు. ఆలోచిస్తూ తాగుతున్నాడు. ఆమె అన్న మాట మొదట సరిగ్గా అర్థం కాలేదు. కళ్ళు చిట్లించి చూసాడు. సరిగ్గా వినపడలేదేమో అనుకుని "ఏమన్నావ్ ఇప్పుడూ?" అని అడిగాడు. ఆమె నవ్వుతోంది. ".....నైటీ తీసెయ్యనా అని అన్నావా?" నిర్ధారణ చేసుకోవటం కోసమన్నట్టు అడిగాడు. ఆమె తలూపింది. 'నీకేమయినా మతిపోయిందా? ఆరుబయటా?' అన్నట్టు చూసాడు.
"నేనిప్పుడు వ్రాస్తున్న కథలో భార్యభర్తలిద్దరూ ఒకరోజు బిక్ నీల్లో వంట చేస్తారు." అన్నదామె.
అతడు నవ్వి, "నాకభ్యంతరంలేదు. పైగా సంతోషిస్తాను కూడా" ఇంగ్లీషులో అన్నాడు.
ఆమె సుతారంగా నైటీ తీసేసి, ఒళ్ళో పెట్టుకుంది.
కొబ్బరి చెట్లమీదనుంచి వచ్చేగాలికి ఆమె భుజాలమీద జుట్టు కదుల్తోంది.
గ్లాసు ఎత్తి "ఛీర్స్" అన్నాడు. ఆమె కూల్ డ్రింక్ చేతుల్లోకి తీసుకుని, "రైల్వే కాంట్రాక్టు ఏమైంది?" అని అడిగింది.
"మినిస్టరు చాలా లంచం అడుగుతున్నాడు. అంత ఇస్తే మాకు లాభం రాదు" అంటూ దాదాపు అయిదునిముషాలు ఆ వివరాలన్నీ చెప్పాడు.
"అన్నట్టు చెప్పటం మర్చిపోయాను. వచ్చేనెల నా పుస్తకం ఆవిష్కరణ సభవుంది. మీరూ రావాలి."
"నన్ను చంపకు. నాకు అలాంటి సభలంటే బోరు. పైగా అక్కడ నువ్వు స్టేజి మీద కూర్చుంటావు. నన్ను క్రింద కూర్చోపెడతారు."
"అలా గట్టిగా అనకండి. స్త్రీవాదులేవరయినా విన్నారంటే మిమ్మల్ని ఉరితీస్తారు. అయినా మీరడిగినప్పుడు నేను టెన్నీస్ మ్యాచ్ లకు రానూ? అదీ నాకు బోరే....."
"సరే చూద్దాంలే" కుర్చీ వెనక్కి వాలాడు. వెన్నెల కిరణపు నీడ తాలూకు గీత ఆమె వక్షోజాల మధ్య నిలువుగానూ, పొత్తికడుపుమడత మీద అడ్డంగానూ పడుతోంది. అతడు చుట్టూ చూసాడు. ఎవరూ చూసే స్కోప్ లేదు. చాలా గమ్మత్తుగా వుంది ఆ అనుభవం.
"ఎలా వచ్చింది నీకీ ఆలోచన?"
"మీరు మీ వ్యాపారం పెంచుకోవటాని ఎప్పుడూ రకరకాల పథకాలు ఎలా ఆలోచిస్తారో, అలాగే నేనూ నిరంతరం ఆలోచిస్తూ వుంటాను. ఇది తట్టింది. ఇంతకీ ఎలా వుంది?"
"అద్భుతంగా వుంది. లేకపోతే చాలా మిస్ అయ్యేవాళ్ళం."
"థాంక్స్"
"క్రిందికి వెళ్దామా?"
"మీరింకా మొదటిపెగ్ లోనే వున్నారు"
"చాలా టెంప్టింగ్ గా వుంది."
"కొంచెం సేపుండండి. ఇలా మాట్లాడుకుంటూంటే బావుంది. మనం మొన్నరాత్రి ఒక టాపిక్ మధ్యలో వదిలేసాం. కష్టాల్లో వున్నప్పుడు ఎక్కువ తాగడం గురించి" అంది. అతడోక్షణం ఆలోచించి "అవును. గుర్తొచ్చింది" అన్నాడు.
"అవసరమొస్తే మిమ్మల్ని మీరు కంట్రోలు చేసుకోగలనన్నారు."
"అవును"
"ఈరోజునుంచీ మీ మామూలు కోటాకన్నా ఎక్కువ తాగనని ప్రామిస్ చేయగలరా?"
అతడు నవ్వి, "ఏభార్య అయినా భర్తతో, ఈరోజునుంచీ తాగనని ప్రామిస్ చెయ్యండీ అంటుంది. నువ్వేమిటి కోటాకన్నా ఎక్కువ తాగకండీ.....అని అడుగుతున్నావ్" అన్నాడు ఏడిపిస్తున్నట్టు.
"నాప్రశ్నకి సమాధానం అదికాదు"