Previous Page Next Page 
ఆనందం పరమానందం పేజి 36

దేవుడు చెరువు గట్టు మీద -
భద్రాచలం కాలుకాలిన పిల్లిలా తిరుగుతున్నాడు.
దూరంగా సింహాచలం కనిపించేడు. అతను తనవేపు వేగంగా రావడం చూచి, అతనికి ఎదురు వెళ్లేడు భద్రాచలం.
ఇద్దరూ  కలుసుకున్నారు. చెరువుకి చెవులుంటాయని చెప్పుకున్నారు. అందుచేత పర్ర అని పిలవబడే మైదానం వేపు నడక సాగించేరు.
                                             *        *        *
పరమానందం పడక్కుర్చీలో చుట్ట కాల్చుతూ కూచున్నాడు.
చుట్ట పొగలో భద్రాచలం కనిపించేడు. అతను  కనిపించగానే ఆత్రంగా అడిగేడు.
"ఏమిటి విశేషం?"
"తమకు తోటాస్ టైర్ల కంపెనీ తెలీదు  కాబోలు!"
"అంచేత  తోట పాండు అనే ఆ టైర్ల కంపెనీ ప్రొప్రయిటరు కూడా తమకు తప్పకుండా తెలిసుండరు."
"అంతేగా మరి!"
అప్పుడు భద్రాచలం తాపీగా అన్నాడు -
"అనందం గారికి తోటాస్ టైర్ల కంపెనీ  తెలుసు. ఆ కంపెనీ ప్రొప్రయిటరు తోట పాండుగారు ఆనందం గారికి మంచి ఫ్రెండు."
"ఊఁ, అయితే?"
"ఆ కంపెనీలో సత్యమూర్తికి ఉద్యోగం వేయిస్తున్నారు."
"మంచిదే! ఉద్యోగం దొరికినంత మాత్రాన ఆ కుర్రాడు ఆర్నెల్లలో అయిదు లక్షలు సంపాయించగలడా?
"చిత్తం! ఆ పాయింటుకే వస్తున్నానండీ! సత్యమూర్తికి తోట పాండు గారు రేపు మధ్యాన్నమే అయిదు లక్షలు అడ్వాన్సుగా ఇస్తున్నారండీ!"
"ఏమిటేమిటి? టైర్ల కంపెనీలో గుమాస్తా ఉద్యోగానికి అయిదు లక్షలు అడ్వాన్సా?" పరమానందం ఆశ్చర్యపోతూ అడిగేడు.
"చిత్తం ! ఆనందం గారికి  తోట పాండుగారు ప్రాణ మిత్రులని చెప్పేను గదండీ! అంచేత ఆ ఏర్పాటు చేస్తున్నారండి!"
"అదెట్లా వీలవుతుంది? అది మా షరతుకి విరుద్దం."
"చిత్తం! అడ్వాన్సు డబ్బు అనందం గారు సర్దడం లేదండీ! తోట పాండుగారు సత్యమూర్తికి ఉద్యోగంతో పాటు ఇస్తున్న అడ్వాన్సు."
పరమానందం నీరసంగా  అన్నాడు -
"అయితే నేను పందెంలో ఓడిపోయినట్టే?"
"వరస చూస్తుంటే అట్లాగే కనిపిస్తోందండి. ఆనందంగారు గెలుస్తే తమరు బస్టాండులో టీ అమ్ముకోవాలి. నేను మీ వెంట  కుంపటి పట్టుకు తిరగాలి!" అన్నాడు భద్రాచలం.
పరమానందం కొంచెం స్వరం తగ్గించి అడిగేడు -
"అసలు నీకీ విషయాలన్నీ  ఎట్లా తెలిసేయి?"
"ఒక మాజీ  సిఐడీ ఆఫీసర్ని కలిసేనండి! అతను లంచాలు పట్టడం వల్ల ఉద్యోగం పోగొట్టుకున్నాడండీ! ప్రస్తుతం అదే  ఉద్యోగం ప్రైవేటుగా చేస్తున్నాడు. సత్యమూర్తి ఉద్యోగ వివరాలు చెప్పినందుకు పాతిక వేలు ఫీజు అడిగేడు ఇస్తానన్నాను."
"ఎట్లా ఇస్తావ్?"
"ముష్టి .... ముష్టెత్తుకుని సంపాయిస్తానండీ, అది నా స్వామి భక్తి!" అని చేతులు జోడించేడు.
పరమానందానికి అదంతా గందరగోళంగా తోచినా , దాచుకుని అన్నాడు.
"మనకి అనుకూలంగా పని జరగాలే కాని, ఆ పాతికవేలు నేను ఇస్తాను."
"చిత్తం!"
"సత్యమూర్తికి అక్కడ ఉద్యోగం దొరికినా, అయిదు లక్షలు దొరక్కూడదు."
"అది కూడా మాటాడేనండి, సత్యమూర్తికి అక్కడ ఉద్యోగం దొరక్కుండా, ఐదు లక్షలు దక్కకుండా అడ్డం పడే బాధ్యత  అతనే తీసుకుంటానన్నాడు."
"మంచి మాటన్నాడు."
"అందుకు లక్ష రూపాయలు ఫీజీవ్వాలన్నాడు."
"లక్షా?" ఈ గండం గడిస్తే ఆనందంగారి ఆస్తి మొత్తం తమ సొంతమవుతుంది కదా! ఆలోచించండి."
"అద్సరే! అతని రేటుకి నువ్వేమన్నావు? ఆ డబ్బు కూడా నువ్వే  ఇస్తానన్నావా?"
"భద్రాచలం నీళ్లు నముల్తూ అన్నాడు -
"క్షమించాలి! అంత మాట అనలేకపోయేను. తమర్ని కనుక్కుని చెబ్తానన్నాను."
"అంటే ... మొత్తం లక్ష ...."
"పాతికవేలు! లక్షా పాతికవేలు!"
"ఆ డబ్బు నీకిస్తే సరిపోతుందా?" అని  కావాలని అడిగేడు.
"ఆ మాటకి భద్రాచలం గొప్ప వినయంగా మోయలేను. వ్యవహారం స్వయంగా తమరే  చూసుకోడం మంచిది. దునియా దగ్గరికి తమర్ని తీసుకువెడతాను. తమరే తమ చేతుల్తో ఆ డబ్బు దునియా కివ్వండి!"
"దునియా?"
"చిత్తం! అదతని పేరండి!"
"దునియాని మనం ఎప్పుడు కలవాలి?"
"ఈ రాత్రికి కలుస్తేనే మంచిది."
పరమానందం క్షణం ఆలోచించి అన్నాడు -
"మంచిది! ఆ ఏర్పాటు చూడు!"
                           *        *        *
ఆ రాత్రి ....
అక్కడంతా  కోలాహలంగా వుంది. ఆ పరిసరాలను గమనించి పరమానందం అన్నాడు -
"తాగి తందనాలాడుతున్నారు కదూ?"
"చిత్తం!"
"తాగుడు సరే! అమ్మాయిలు అర్ధనగ్నంగా డాన్స్ చేయడమేవిటయ్యా! బొత్తిగా!"
"చిత్తం! ఆ డాన్సు చూస్తూ తాగితే ఎంత తాగిందీ తెలీదండి. తప్పుడు బీల్లులు రాసి వేలకి వేలు సంపాయించాలంటే ఇలాంటి డాన్సు ఏర్పాటు తప్పదండి!"
"ఇక్కడికి రావడం నాకిష్టం లేదు."
"చిత్తం! అవసరం మనదండి! ఇంటికి పోదామన్నా నాకు అభ్యంతరం లేదండి!"
"ఇంత దూరం వచ్చి ఇంటికేం వెడతాం?"
"చిత్తం!"
"ఈ మందుమందలో - అతని పేరేమిటన్నావ్?"
"మిస్టర్ దునియా!"
"అదే! ఆ దునియా వున్నాడేమో చూడు!" అన్నాడు పరమానందం.
భద్రాచలం ఆ పరిసరాలను కళ్లతో వెతికి అన్నాడు -
"ఉన్నాడండి."
"ఎక్కడ?"
"అటు చూడండి! ఆ మూలగా , ఆ పిల్ల చెవిలో ఏదో చెబుతున్నాడే, అతనే దునియా!"
పరమానందం చూస్తున్నాడు.
అమ్మాయెవరో అందంగా వుంది. కాకపోతే దుస్తులు మాత్రం చాలా  పొదుపుగా కట్టుకుంది. ఆ మాట కొస్తే - ఆ అమ్మాయి  ఒంటిమీద దుస్తులే లేవని ప్రకటించినా తప్పులేదు. దునియా పిల్లిగడ్డంతో, మొహమ్మీద  తారుపోసిన అవతారంతో గొప్ప వికృతంగా వున్నాడు.
"అతను అమ్మాయి చెవిలో ఏం చెబుతున్నాడు?" అని భద్రాచలాన్ని కుతూహలంగా అడిగేడు పరమానందం.
"చిత్తం! బహుశా ఆ అమ్మయి పేరు అడుగుతున్నాడల్లె వుందండి!" అన్నాడు భద్రాచలం.
"పేరు అడగడం కూడా  అంత రహస్యంగా అడగాలా?" అడిగేడు  పరమానందం.
"చిత్తం! సి.ఐ.డీ కదండీ! అంతేనండీ! ఏమి అడిగినా చెవిలోనే అడుగుతాడండి! ఏమి చెప్పదలచుకున్నా  చెవిలోనే చెబుతాడండి!" అన్నాడు భద్రాచలం.
"నే నక్కడికి రాను"
"చిత్తం!"
"అతన్నే ఇక్కడికి తీసుకురా!"
"చిత్తం, ప్రయత్నిస్తానండి!" అని భద్రాచలం దునియా దగ్గరికి వెళ్లేడు విష్ చేసేడు. అతని చెవిలో అన్నాడు -
"పరమానందం డబ్బు తీసుకోచ్చేడు. నిన్ను తన దగ్గరికి తీసుకురమ్మన్నాడు. నీ పేరు దునియా!"
దునియా అనబడే సింహాచలం - భద్రాచలం చెవిలో అడిగేడు -
"నన్ను గుర్తుపట్టలేదుగా?"
"లేదు"

 Previous Page Next Page