ఆమె నవ్వి, "వెళ్ళండి, హోస్టు ఏమయ్యాడా అని బయట కంగారు పడుతూంటారు" అంది.
అతడు మళ్ళీ బయటకు వచ్చాడు. దక్షిణం వేపునుంచి ఆకాశం నెమ్మదిగా మేఘావృతమవుతోంది. చల్లటిగాలి వీస్తున్నది. డిన్నర్ పూర్తయింది. నౌఖర్లు ప్రూట్ సలాడ్ సర్వ్ చేస్తున్నారు.
"గుడ్ ఈవినింగ్" పొడిగా అన్నాడు రవి. ఎంత దాచుకున్నా అతడి ముఖంలో అసహ్యం కనబడుతోంది. తాము నిస్సహాయ స్థితిలో ఉంటే, దాన్ని తనకోసం ఉపయోగించదల్చుకొన్నవాడు-ఇప్పుడు ఏమీ జరగనట్టు తనని విష్ చేస్తున్నాడు.
"ఈయన యశస్వి. ప్రొడ్యూసరు" ప్రక్కనున్న అతిధిని ఇంట్రడ్యూస్ చేసేడు నానక్ రామ్. పంచా లాల్చీలో హుందాగా వున్నాడు. ఆయన రవికి షేక్ హాండిస్తూ. "మనం కలుసుకోలేదు. మీ అన్నయ్య బాగా తెలుసు నాకు" అన్నాడు.
"ఏమిటీ మీ కొత్త పిక్చరు....." సంభాషణ కలుపుతూ రవి అడిగేడు.
అంతలో చైతన్య అక్కడికి వచ్చేడు. "హల్లో యశస్వీ...." చేయి అందిస్తూ అన్నాడు.
"హల్లో చైతన్యా! ఎలా వుంది వ్యాపారం?"
"దేవుడి దయవల్ల బాగానే వుంది?"
నానక్ రామ్ ఆశ్చర్యంగా "మీరు దేవుడ్ని నమ్ముతున్నారా?" అన్నాడు, అంతకుముందు అలా అనటం వినకపోవటంవల్ల.
ఆ ప్రశ్నకి వెంటనే సమాధానం చెప్పలేదు చైతన్య. కొంచెం ఆగేడు. "దేవుడున్నాడో లేదో నాకు తెలీదు, కానీ సకల చరచరాల్నీ ఆడిస్తున్న శక్తి ఒకటున్నదని నమ్ముతున్నాను."
యశస్వి నవ్వి, "చాలా నిజాయితీతో చెబుతున్నారే" అన్నాడు.
చైతన్య నవ్వలేదు. "ఔను" అన్నాడు.
యశస్వి జేబులోంచి రూపాయికాసు తీసేడు.
"పందెం కట్టండి, ఇది బొమ్మ పడుతుందో - బొరుసు పడుతుందో, బొరుసు పడితే నేను దేవుడున్నాడని నమ్ముతాను..... బొమ్మ పడితే....."
చైతన్య మాట్లాడలేదు. ఆయన చేతిలో వున్న రూపాయికాసు వేపే తదేకంగా చూసి....నెమ్మదిగా అన్నాడు.... "నేను నా నమ్మకాన్ని ఉపసంహరించుకుంటాను."
ఆయన నవ్వి, "అదేం పందెం? ఇంకేదన్నా పెద్దది కాయండి" అన్నాడు.
అప్పటికే అది అందర్నీ ఆకర్షించింది. చుట్టూ చేరేరు. అందరిలోను కుతూహలం. చూపుడు వేలి క్రింద బొటనవేలు పెట్టి, దానిమీదున్న రూపాయికాసుని ఎగరవేయబోతూ, "చెప్పండి" అన్నాడు.
అదే గంభీరమైన గొంతుతో చైతన్య నెమ్మదిగా స్ఫుటంగా అన్నాడు. "బొమ్మ పడితే నా ఆస్థి సర్వస్వం మీకు వదులుకుంటాను."
అక్కడ గాలి స్థంభించింది. ఆయన చప్పున చెయ్యి వెనక్కి తీసుకుని, "ఏమిటీ" అన్నాడు తనుసరీగ్గా వినలేదేమోనని.
చైతన్య మళ్లీ చెప్పేడు. ఎవరో అతన్ని వారించబోయేరు. యశస్వి భార్య చైతన్య వేపు జాలిగా చూసింది. తన భర్తకి ఈ బొమ్మా బొరుసూ ఆడటం సరదా అని ఆమెకి తెలుసు. ఈ రూపాయికాసు ఆయన తీసిన సినమాలోది-రెండువేపులా బొమ్మ వున్నది.
పరిచయస్తుల్ని దాంతో ఏడిపించటం ఆయన అలవాటు.
అతడి ఆస్థి ఆయన తీసుకోకపోవచ్చు. కానీ చైతన్య మాత్రం అందరిలోనూ అవమానం పొందడం నిశ్చయం. అదీ దేవుడి ఉనికి విషయంలో, ఆమె భయం అదే.
అప్పటివరకూ నవ్వుతూన్న రవి మొహం టెన్షన్ తో ఎర్రబడింది. చైతన్య ఈ మాటల్ని నవ్వుతూ అనలేదని అతడికి తెలుసు. కిరణ్మయి జరుగుతున్నదంతా ప్రేక్షకురాలిలా చూస్తోంది.
"బాగా ఆలోచించే ఈ పందెం కాస్తున్నారా?" అడిగేడు ఆయన.
చైతన్య తలూపేడు. ఆయన చేతిలో కాసు గాలిలోకి ఎగిరింది. అందరూ వూపిరి బిగపట్టారు.
అది క్రింద పడగానే ఇద్దరు ముగ్గురు చప్పున ఆత్రుతగా వంగి చూసేరు.
బొరుసు!
ఎంతో కాన్ఫిడెంట్ గా- నమ్మకంగా వున్న ఆయన మొహం నమ్మశక్యం కానిది చూస్తున్నట్లు విస్తుబోయింది. ఆయన భార్య కూడా క్షణం ఆశ్చర్యపోయింది. కానీ అంతలోనే తేరుకుంది. ఏదో అర్థమైనట్లు ఆమె పెదవుల మీద చిరునవ్వు వెలిసింది.
భర్తవేపు తిరిగి "టాక్సీవాడు రెండు రూపాయ కాసులు ఇచ్చేడు కదండీ! మీ సినిమా రూపాయి వాటిలో కలిసిపోయినట్లుంది" అంది.
అప్పటివరకూ అయోమయంగా చూస్తున్న ఆయనకు ఏదో ఆధారం దొరికినట్లయింది. చప్పున జేబులో చెయ్యి పెట్టి ఇంకో రెండు రూపాయలు తీసేడు. అందులో ఒకటి తను ప్రొడ్యూస్ చేస్తున్న సినిమాలోది-
రెండు వేపులా బొమ్మ వున్నది.
అందరూ తేలిగ్గా వూపిరి పీల్చుకున్నారు. ఒకరిద్దరు చప్పట్లు కొట్టారు కూడా
"దేవుడున్నాడని నమ్ముతున్నారా ఇప్పుడన్నా?" నానక్ రామ్ అడిగేడు. యశస్వి ఏదో చెప్పబోయేంతలో చైతన్య కల్పించుకుని అన్నాడు.
"నేను చెప్పింది దేవుడి గురించి కాదు. మనల్ని ఆడిస్తున్న అదృశ్య హస్తం గురించి.... దేవుడున్నాడో లేదో నాకు తెలీదు".
ఒప్పుకుంటున్నట్లు యశస్వి తలూపేడు.
తర్వాత టాపిక్ అతీత శక్తుల మీదకీ, సిక్త్ సెన్స్ మీదకీ వెళ్ళింది. "మీకున్న సిక్త్ సెన్స్ ఉపయోగించి ముందేం జరగబోతోందో ఏదయినా ఒక విషయం చెప్పగలరా?"
"చెప్పగలను" అన్నాడు చైతన్య.
"ఏమిటి చెప్పండి?"
"ఇంకొంచెం సేపట్లో బ్రహ్మాండమైన వర్షం రాబోతోంది".
మళ్ళీ పెద్ద పెట్టున నవ్వులు చెలరేగాయి. ఆకాశంలో పూర్వంకన్నా ఎక్కువగా మబ్బులు ముసురుకొంటున్నాయి. ఒకరొకరే శలవు తీసుకొని వెళ్ళి పోసాగారు. అందరూ వెళ్ళేక లోపలికి వస్తోంటే కిరణ్మయి అడిగింది, "ఏ ధైర్యంతో అంత పెద్ద పందెం కాసేరు?"
"నన్ను నేను పరీక్షించుకోవాలనిపించింది".
"అయితే మాత్రం అంత పెద్ద పందెమా?"
"పెద్దది.....వాళ్ళ దృష్టిలో...." అని అతడు తన గదిలోకి వెళ్ళేడు. దూరంగా తొమ్మిది కొట్టింది. బాగా అలసిపోవటం వల్ల మాగన్నుగా నిద్రపట్టింది. కానీ ఎక్కువ సమయం గడపకముందే దూరంగా ఎక్కడో గట్టిగా ఉరమడం వల్ల మెలకువ వచ్చింది బయట కుండపోతగా వర్షం కురుస్తోంది. మెరిసినప్పుడల్లా కారిడార్ వెలుగుతో నిండిపోతోంది. అతడికెందుకో వర్షాన్ని చూస్తూ కూర్చోవాలనిపించింది. గది తలుపులు తీసుకుని, వరండాలోకి వచ్చేడు. కారిడార్ చివర అద్దాల కిటికీ దగ్గర పడక కుర్చీలో కూర్చున్నాడు. దూరంగా ఏ పాక, పర్ణశాలలా వుంది. ఇంత చలిలో అందులోని వాళ్ళెలా వుంటారో అనుకున్నాడు.
పెద్ద పెద్ద కొమ్మలు గాలికి అటూ యిటూ వూగుతూ మరింత భీభత్సాన్ని సృష్టిస్తున్నాయి. అతడు నిశ్చలంగా చూస్తున్నాడు. దూరంగా ఎక్కడో పిడుగు పడింది. కొంచెంసేపటికి తలుపు తీసిన చప్పుడు. వెనుక అలికిడి వినిపించి, "ఎవరదీ" అన్నాడు.
చీకట్లో అతడు కనబడకపోయినా, కంఠం గుర్తించి "నేను" అంది శారద, "కరెంటు పోయినట్టుంది".
"ఔను" అన్నాడు అతడు.
"ఏం చేస్తున్నారు చీకట్లో?"
"వర్షాన్ని చూస్తున్నాను".
ఆమె పక్కగా వచ్చి "వర్షాన్ని చూస్తే మీకు భయం కదా....! అంది.
"ఇప్పుడు కాదు, ఒకప్పుడు" అన్నాడు చైతన్య. "కొన్ని సంవత్సరాల క్రితం ఇదే క్రిస్ట్ మస్ రోజు రాత్రి వచ్చిన వర్షం నాకు కలిగించగలిగినంత నష్టాన్ని కలిగించి వెళ్ళిపోయింది. దానితోపాటే అదంటే నాకు భయమూ పోయింది" అంటూ కుర్చీలో కూర్చున్నాడు. చాలాసేపు మౌనంగా వుండి, "....ఈ రోజు బాబు పుట్టినరోజు-" అన్నాడు. అలా అన్నప్పుడు అతని కంఠం వణికింది.
ఆమె తలెత్తి చూసింది. ఏ జ్ఞాపకాలు అతన్ని ఈ రోజు చుట్టుముట్టకుండా ఈ యేర్పట్లన్నీ చేసిందో- ఆ విషాద ఛాయలు అతడి మొహంమీద ప్రతిబింబించటం చూసి కలవరపడింది. మాటమారుస్తూ, "మీకు వర్షాన్ని చూస్తూ కూర్చోవాలనిపిస్తూంది. నాకయితే యింకో కోర్కె కలుగుతోంది...." అంది ప్రక్కనే క్రింద కూర్చుంటూ.
"ఏమిటీ?"
"చేతనయితే ఓ కుంచెతో ఈ ప్రకృతి అందాల్ని ఫ్రేములో బిగించడం...."
అదే సమయానికి హరికెన్ లాంతరు వెలిగించటానికి వచ్చిన కిరణ్మయి, బయట్నుంచి పడుతూన్న మసక వెలుతురులో ఏదో అపురూపమైన దృశ్యం చూస్తున్నట్టు నిలబడిపోయింది.
చెల్లెలు మోకాళ్ళమీద కూర్చొని వేలితో నేలమీద గీతలు గీస్తోంది. అతడు వెనక్కి కళ్ళు మూసుకుని వున్నాడు.
అలికిడికి కళ్ళు తెరచి "రా కిరణ్మయీ! అలా నిల్చుండి పోయావేమిటీ?" అన్నాడు.
ఆమె లోపలికి వస్తూ "ఇదిగో -హరికెన్ లాంతరు వెలిగిద్దామని" అంది. శారద లేస్తూ, "నేను తీసుకొస్తాను" అని లోపలికి వెళ్ళింది.
కిరణ్మయి వచ్చి కుర్చీలో కూర్చొంది.
చాలాసేపు మౌనం.
"ఏమిటి ఆలోచిస్తున్నావ్?"
ఆమె ఉలిక్కిపడి "ఏమీ లేదు" అంది.
అతడు నవ్వి,"ఏమీ లేకుండా ఎలా వుంటుంది?" అన్నాడు.
"చెప్పమంటారా?" అని ఆమె చాలాసేపు మౌనంగా వుండి, తనలో తనే మాట్లాడుకొంటున్నట్లు అంది. "చాలా రోజుల వెనుక- కొన్ని సంవత్సరాల క్రితం....ఈ కారిడార్ లోనే నేనొక అపూర్వ దృశ్యం చూసేను చైతన్యబాబూ! ఒక భర్తకి భార్య తమలపాకులు అందించటం. చాలా మామూలు దృశ్యం అది. కానీ నా మనసులో ఎందుకో సూటిగా హత్తుకుపోయింది. నాకనిపించింది అప్పుడు.... 'డబ్బుంటేనే ఆప్యాయతలూ, మమతలూ వస్తా' యని ఆ మాటే మీతో అంటే - డబ్బుకీ అనురాగానికీ సంబంధం లేదని మీరన్నారు అప్పుడు. జ్ఞాపకం వుందా?" అని ఆమె ఆగింది-"మీ మాటే నిజం అని ఇప్పుడు అనిపిస్తోంది. నా అభిప్రాయం తప్పు".
"అప్పటి నీ అభిప్రాయమే నిజం కిరణ్మయీ! ఈ ఆప్యాయతలు డబ్బు వస్తాయనీ నా అనుభవం నాకు చెప్పింది. డబ్బులేకపోతే-" అంటూ ఆగి నెమ్మదిగా "మనిషిని మనిషిగా చూడరు.... భార్య భర్తని చూడదు. నా అభిప్రాయం మార్చుకొంటున్నాను" అన్నాడు.
"అదేమిటి? నేను నా 'అప్పటి' అభిప్రాయాన్ని మార్చుకొని మీరు ఏకీభించబోతూ వుంటే, మీరు మీది మార్చుకోవడం యేమిటీ? ఎంత డబ్బు అనురాగాన్ని అది పుట్టించదు. నేను అనుభవపూర్వకంగా తెలుసుకొన్నది అది....డబ్బు భార్యాభర్తల మధ్య విద్వేషాల్ని సృష్టించటానికి తప్ప దేనికీ ఉపయోగపడదు'
"డబ్బు లేకపోతే డాక్టరు తోటి మనిషిని చూడడు. తనకున్న చదువు సంస్కారం స్త్రీని ఏ విధంగానూ రక్షించలేవు" అన్నాడు. "భర్త సర్వస్వం మన పర్ణశాలకి వెళితే ఏ భార్యా ఈ రోజుల్లో అనుసరించదు".
"మీకు తెలియదా- ఈ డబ్బు చేసే మాయ గురించి?" అంది కిరణ్మయి.
"డబ్బు చేసేది 'మాయ' అని నువ్వు అన్నావు కదా! డబ్బు ప్రేమ సృష్టిస్తుంది. ఆ మాయే లేకపోతే...." ఏదో అనబోతున్న చైతన్య సన్నటి వినిపించేసరికి సంభాషణ ఆపుచేసేడు.
గుమ్మం దగ్గర నిలబడి వాళ్ళ సంభాషణ వింటూన్న శారద, చైతన్య తలెత్తేసరికి చప్పున నవ్వు ఆపేసింది. అయినా అది అతని కంటపడింది.
తెగిన ఆలోచన....ఆలోచిస్తే దొరికే సమాధానం....సమాధానం కొరకు ప్రయత్నం -ప్రయత్నిస్తే జ్ఞాపకాల పూసల పేరు దండ గుచ్చితే ఆకృతి ఆకృతి అనుభవం చెప్పలేని నిజం.
ప్రియమైన పాఠకూడా, శారద ఎందుకు నవ్వింది!
(శుభం)