Previous Page Next Page 
పర్ణశాల పేజి 33


    "హేయ్ వెళ్ళు, వెళ్ళు" అక్కడే నిలబడి పరిశీలనగా చూస్తున్న భిక్షకుని అదిలించేడు గూర్ఖా.

    ఆమె కదల్లేదు. "ఎవరు బాబూ ఇప్పుడిందులో వుంటున్నది?" అని అడిగింది.

    "నీకెందుకు పో" కసిరేడు. యజమాని చూస్తే కొత్తగా వచ్చిన తన ఉద్యోగం పోతుందేమో అని వాడి భయం.

    ఆమె ఇంకో అడుగు ముందుకేసింది. మాటల్తో చెబితే  పోదని, బెదిరించటానికి కర్ర ఎత్తేడు. ఇంతలో లోపల్నుంచి నౌఖరు దగ్గరగా వచ్చి, "ఇదిగో ఇది తీసుకో" అంటూ చేతిలో పెట్టాడు.

    "పో, ఇక పో" అన్నాడు గూర్ఖా. ఆమె పిడికిలి విప్పింది. వందరూపాయల నోటు....

    గూర్ఖా కూడా దాన్ని చూసేడు. తలమునకలయ్యే ఆశ్చర్యంతో "ఏమిటిది?" అడిగాడు నౌఖర్ని. ఏమో మరి. ఎప్పుడొచ్చినా దీనికిలా ఇవ్వమన్నారు అయ్యగారు" నౌఖరు అంటున్నాడు.

    ఆమె ఆశ్చర్యంగా తలెత్తి ఆ భవనంవైపు చూసింది.

    బాల్కానీ ఖాళీగా వుంది.

    ఆమె కళ్ళల్లో క్షణంపాటు నిరాశ....

    ఆ  బాల్కనీ వెనుకే బెడ్ రూం కిటికీ దగ్గర నిలబడి  చైతన్య చూస్తున్నాడని ఆమెకి తెలీదు. అతడి పిడికిలిలో కర్టెన్ బలంగా నలుగుతోంది. నిశ్చలంగా నిలబడి వుండటానికి సర్వశక్తులూ కూడగట్టుకొంటున్నాడు.

    "ఎవరుబాబూ ఇదిచ్చింది?"

    "బాబుగారు....చైతన్యబాబుగారు".

    ఆమె ముఖంలో క్షణంపాటు ఉజ్వలమైన వెలుగు కనబడింది. క్షణంపాటే... మళ్ళీ చీకటి. ఆమెను ఇక్కడివరకూ  త్రోసిన  అదృశ్యశక్తి- తన  ఉనికిని నిరూపించుకొంది. అసత్యంకాని క్షణం. ఆకాశం కృంగలేదు. భూమి చలనం ఆగలేదు. సముద్రం ఉప్పొంగలేదు. ఆమె తలెత్తి చూసింది.

    తోట ఖాళీగా వుంది. క్రింద వరండా ఖాళీగా వుంది. పక్కకారిడార్ ఖాళీగా వుంది. మనసు ఖాళీగా  వుంది. ఆమె నెమ్మదిగా  వెనుదిరిగింది.

    చేతిలో వున్నది ప్రీతిదత్తమా? లేక అదివేదనికమా?

    "బాబుగారి దయపడింది. దృష్టవంతురాలు" వెనుకనుంచి నౌఖరు అంటున్న మాటలు వినబడ్డాయి.

    'అదృష్టవంతురాలు!' ఆమెకి పెద్ద పెట్టున నవ్వొచ్చింది. దానితో పాటు  ఏడుపూ  వచ్చింది. ఆ తర్వాత ఆ రెంటికీ అందని  ఆలోచన వచ్చింది.

    ఎందుకొచ్చింది ఇంతదూరం? ఏమీ  వుండదని తెలుసు. ఏముందో తెలుసుకోవాలని ఆశా?

    ఏడు అడుగులు నడిచిన అనుబంధాన్ని క్షణంలో త్రుంచివేయగలిగిన మనసు- ఏడు సంవత్సరాలు నివసించిన భవనాన్ని చూడాలని ఎందుకింత బలవంత పెట్టింది? ఇక్కడ  అతడు  కనబడటం యాదృచ్చికమేగా? అతడు  తన పూర్వపు నెలవు కోరుకోవటంలో ఆశ్చర్యం లేదు. తను రావటమే ఆశ్చర్యం!

    ఆమె చేతిలో  వందరూపాయలనోటు నలుగుతోంది. దాంపత్యం ఖరీదు వందా?

    మరి ప్రేమ ఖరీదు? చంపాలాల్ కారు కాదా?....

    అయితే మాత్రం ఇంత  పెద్ద శిక్ష...

    ఇందులో శిక్షేముంది? వచ్చినప్పుడల్లా వంద దొరుకుతుంది కదా! అయిదు  నిముషాలకొకసారి వెళితే పదిరోజులలో లక్షాధికారి అవ్వొచ్చు. కాడిలాక్ కారు కొనుక్కోవచ్చు. కాడిలాక్ లో  తిరిగితే తిరిగి చైతన్య  ప్రేమిస్తాడా!

    ఆమె మళ్ళీ  నవ్వొచ్చింది.

    ఏమాశించి వచ్చింది తను? చూసి వెళ్ళిపోవాలని..... మనసెంత  విచిత్రమయింది! కొంచెం ఆధారం దొరికేసరికి ఇంకొంచెం ఆశించడం  మొదలెట్టింది. ఏమిటా ఆశ?

    "పరిస్థితుల ప్రాబల్యంతో నువ్విలా అయ్యేవు. నీ తప్పులేదు. శరీరం అపవిత్రమయినా మనసు మాత్రం అపవి-"

    కాదు, మనసూ అపవిత్రమై పోయిందే. ఇప్పుడంటే రోగం శరీరాన్ని కాల్చేసేక మనసు పునీతమయింది కానీ - లేకపోతే పశ్చాత్తాపం అనేది వుందా?

    అతడు చేయిసాచి ఆహ్వానిస్తే మాత్రం వెళ్ళగలుగుతుందా? ఆహ్వానించటానికి అతడి జీవితం కథాకాదు- కథలోలా  అతడు  ధీరోదాత్తుడూ కాడు. మనసులో మానవత వుంది కాబట్టే ఈ మాత్రమయినా దయ చూపించ గలుగుతున్నాడు. తను మానవతావాదం కాదుగదా, తమ సాంప్రదాయాన్ని కూడా గౌరవించలేక పోయింది. కాంట్రాడిక్షన్.

    ఏది సాంప్రదాయం?

    బుషుల్లోకెల్లా మాన్యతముడవైన ఓ మనువా! నువ్వు చెప్పు, ఏది సాంప్రదాయం?

    వివాహంబంధమైనప్పటికీ విలేయము కాదన్నావు. అయినా ద్వితీయ కళత్రాని కనుమతిచ్చేవు. స్త్రీలు పూజింపబడితే ఐశ్వర్యం నెలకొంటుదన్నావు. మళ్ళీ స్త్రీలు స్వాతంత్ర్యానికి అర్హులు కాదని నువ్వే అన్నావు. సాధు ప్రవర్తన కలవారు సాధువులవుతారని,దుశ్చరిత్రలు అధర్మాత్ములవుతారనీ బృహదారణ్యకంలో చెప్పిన మంత్రము నిజమయితే మన ఖర్మలు నిష్టుర కారణత నియమశృంఖలా బద్దములా! అయితే స్వచ్ఛందతకు చోటేది?

    కర్మ సంచితం కావచ్చు. ప్రారబ్ధము కావచ్చు. అగామికావచ్చు. మిగతా  రెండు విషయాల్లో మనిషి  స్వాతంత్ర్యము లేదు.

    మనువు చెప్పినా  మార్క్స్ చెప్పినా  ధర్మశాస్త్ర ప్రవర్తనా  సూత్రముల విధి  నిషేధాల గురించి కాని, విధ్యనుసరణంకన్నా ఎక్కువ ప్రాధాన్యత గలది మనిషి  జీవితంలో ఇంకొక్కటి వుందని మనుస్మృతే ఒప్పుకొంది.

    అది- బ్రతుకుతో ముడిపడివున్న కర్తవ్యంతా సమస్య!

    ...    ...    ...    ...


    ఆమె పెదవులమీద  చిరునవ్వు వెలసింది.

    ఆకలికి చెత్తకుండీ దగ్గర నిలబడి  ఎంగిలాకులు ఏరుకోబోతున్న క్షణం మనిషి బలహీనత అర్థమయి చైతన్య ఆమెని ఎలా క్షమించగలిగేడో, ఈ క్షణం ఆమె అతడిని క్షమించగలిగింది.

    ఆ రోజు రాత్రి లోకం రాత్రి లోకం సమస్తం నిద్రించినవేళ నిర్మానుష్యమైన శ్మశానంలో ఆహ్వానించే సమాధుల మధ్య..... కాలే  చితుకులు మధ్య ఒక ప్రాణి తన వంటికి  నిప్పంటించుకొని దగ్ధమయింది.

    భర్త యిచ్చిన వందలో రెండు రూపాయలు మాత్రం కిరసనాయిలుకు ఖర్చవగా, మిగతాది ఆమెతోపాటే మసి అయింది.

    దట్టమైన  అడవిలో ఓ గడ్డిపూస రాలిపోతే ఎవరికి  తెలుస్తుంది? అదే  సమయానికి తన గదిలో కూర్చొని వున్నాడు చైతన్య. బెడ్ లైట్ మసక వెలుతురు  చీకటిని పూర్తిగా  పారద్రోలలేక పోతోంది. అతడి ముందు బల్లమీద, ఆ రోజు  వచ్చిన పోస్టు వుంది. ఒకటి చెల్లి జ్ఞాపకం  వచ్చి, రెండు వచ్చి వెళ్ళిపోయిన భార్య గురించి.

    చిత్రంగా వుంటుంది. అయినా  ఏ మూలో ఆశ వుంది. చెల్లి చేసిన  తప్పేమిటి.... వస్తే తన భార్యగా  ఆమెను దీపక్ ఎందుకు ఆదరించకూడదు? శరీరంతో  పాటు మనసు మలినం అవదని నమ్మితే చాలు. తన స్వవిషయం వేరు. అక్కడ మలినం అయింది మనసు.

    అయితే తనకు మనసెంత  ముఖ్యమో, పక్కవాడికి శరీరం అంత ముఖ్యం కావొచ్చు. తనలాగే  పక్కవాళ్ళూ ఆలోచించాలనుకోవటం పొరపాటు.

    ఆలోచన మెదడును రాసిపెట్టే  సంఘర్షణని సృష్టిస్తుందే తప్ప- ఇంకే విధంగానూ లాభించదు.

    ఒకసారి ఇది స్ఫురించాక అతడు శుభలేఖని డ్రాయరు  సొరుగులోకి, ఆలోచనలని మనసు అడుగు పొరలలోకి తోసేశాడు.

    అవసరమైన దాని గురించి ఆలోచించకుండా వుండటాన్ని అతడు మనసుకి ఎప్పుడో నేర్పేడో నేర్పేడు.

    పక్కమీద వాలి పది నిమిషాలలో నిద్రపోయేడు.

    ఆ మరుసటి రోజు క్రిస్టమస్!

    ఆ రోజున  చైతన్య ఇంట్లో పార్టీ  ఏర్పాటు చేయబడింది. దానికివెనుకున్నది శారదే. పాత సంప్రదాయాన్ని వదిలిపెట్టటం ఆమెకిష్టం లేదు. అదీగాక  'ఆ రోజు చైతన్యని పాత ఆలోచనలనుంచి రక్షించేటందుకు ఏదో వ్యాపకం వుండాలని తలచింది. 

    ఆమె ఆలోచనని రవీ, కిరణ్మయి సమర్థించటంతో చైతన్యకి కూడా ఒప్పుకోక తప్పలేదు. పార్టీ  జరుగుతూ వుండగా శారద ఎంత మంచి ఆలోచనతో ఈ ఏర్పాటు చేసిందో అతడికి అర్థమైంది. చాలాకాలం తర్వాత మళ్ళీ అందరూ  అతనింట్లో కలుసుకోవటం.

    చైతన్య చాలా ఉత్సాహంగా అటూ ఇటూ తిరుగుతూ అందర్నీ పలకరించ సాగేడు. శారద లోపల్నుంచి అన్నీ సరిగ్గా అందుతున్నాయో లేదో  చూస్తోంది.

    ఎవరితోనో మాట్లాడుతున్న రవిని దూరంనుంచి గమనించింది కిరణ్మయి. ఎంతో బాధ్యతనుంచి రిలీఫ్ పొందినట్లు  తేలిగ్గా  వున్నాడు.


    చైతన్య లోపలికి  వెళ్ళాడు. చీరకొంగు నడుములోకి  దోపి ఏర్పాటులను పరిశీలస్తోంది శారద. తలరేగింది. నుదుటిమీద చెమట పట్టింది. అతడిని చూసి చిరునవ్వుతో "ఇలా  వచ్చారేమిటి?" అంది.

    అతడు దానికి సమాధానమివ్వకుండా ఆమెని పరిశీలనగా చూస్తూ "నీకెందుకు ఇదంతా, పనివాళ్ళు అంతమంది ఉండగా" అన్నాడు.

    "వాళ్ళు చేస్తే మనం స్వయంగా చూసుకున్నంత బాగా వుంటుందా" అందామె.

    "నువ్వూ రాకూడదూ అందరికీ పరిచయం చేస్తాను".

    "ఏమని చేస్తారు?....." అనబోయేటంతలో నౌఖరు వచ్చి ఖాళీగిన్నె బల్లమీద పెట్టి వెళ్ళిపోయాడు.

    బల్లకి అవతలివేపున ఆమె చేతిలోంచి డిషెన్ వున్న గిన్నె తీసుకొని పక్కనే  వున్న నౌఖరుకి అందించుతూ "నువ్వు  పదిమందిలోకి రావాలి, ఇక మునుపట్లా కాదు" అన్నాడు.

    "మనుపట్లా ఏం కాదు?"

    "మళ్ళీ ఈ ప్రపంచంలోకి వచ్చేశాంగా!"

    "ఈ ప్రపంచం అంటే పదిమందిలోకి రావటమా?" అంది అర్థంకానట్టు.

    అతడీ ప్రశ్నకు తికమకపడి ఏం జవాబు చెప్పాలో తెలియక "నే వెళతాను" అన్నాడు.

 Previous Page Next Page