Previous Page Next Page 
ఊగవే ఉయ్యాల పేజి 33


    "మిస్టర్ రాజా! ఆర్ యు ఏబుల్ టు సీ?"

 

    తెల్లటి ఏప్రాన్ వేసుకుని సన్నగా, పొడవుగా, స్వచ్చమైన చిరునవ్వుతో దివినుండి భువికి దిగివచ్చిన దేవతలా కనబడుతూ అడుగుతున్నాడో డాక్టర్!

 

    రాజా పెదవులు కదిలాయి. ఎన్నో మెలికలు తిరిగినట్లయి, మరిచిపోయిన అలవాటు మళ్లీ చేసుకుంటున్నట్లు, మాట్లాడటం నేర్చుకుంటున్నట్లు విచిత్రంగా కదిలాయి.

 

    "య....స్"

 

    అక్కడ గుమిగూడిన అయిదారుగురి ముఖాల్లో ఆనందం వెల్లివిరిసింది.

 

    "సక్సెస్.....గ్రాండ్ సక్సెస్!" అంటూ ఒకరికొకరు షేక్ హ్యాండ్స్ ఇచ్చుకుంటున్నారు.

 

    రాజాకేమీ అర్థంకావటంలేదు. ఏమిటి సక్సెస్? తాను బ్రతకటమా? తనకు ఆపరేషన్ చేశారా?

 

    అసలేం జరిగింది?

 

    ఆ రోజు....ఆ రోజు....

 

    తలంతా దిమ్ము. లీలగా గుర్తు వస్తోందిద.

 

    ఆ రోజు....ఆ రోజు...

 

    తనని మాధవి తిరస్కరించి కొండ దిగి వెళ్ళిపోయింది. ఉన్మాదం ఆవహించినట్లయి కొంతసేపలా వుండిపోయి, తర్వాత నెమ్మదిగా దిగివచ్చాడు. ఎక్కడో కూర్చుని మాధవికి ఉత్తరం రాశాడు. పోస్ట్ చేసి స్కూటరెక్కాడు. సుడిగాలిలా దూసుకుపోతోంది. ఆ చీకట్లో ఎలా నడుపుతున్నాడో తనకే తెలియదు. మైళ్ళు గడిచిపోతున్నాయి. దుఃఖం, బాధ, దారుణంగా పోగొట్టుకున్నానన్న అసంతృప్తి రక్తాన్ని పీల్చి పిప్పి చేస్తున్నాయి. దారి తెలియటంలేదు. అయినా ముందుకు పోతూనే వున్నాడు.

 

    రాకాసిలా ఎదురుగా ఏదో వచ్చింది. ఆఖరి నిముషంలో గమనించి ప్రక్కకు తప్పుకోబోయాడు. కానీ అప్పటికే ఆలస్యమయింది. పెద్ద శబ్దం. తాను ఎక్కడికో విసిరివేయబడుతున్నట్లు తెలిసింది. అంతే -

 

    "మాధవి! మాధవి!" అన్నాడు.

 

    అక్కడున్న డాక్టర్లంతా ఆశ్చర్యంగా అతని ముఖంలోకి చూస్తున్నారు.

 

    "వాట్ ఈజ్ హీ సేయింగ్?"

 

    "ఐ థింగ్ హి ఈజ్ అట్టరింగ్ సమ్ నేమ్!"

 

    అప్పుడు గమనించాడు. వాళ్ళలో ఎవరూ భారతీయుల్లా లేరు. అంతా విదేశీయుల్లా వున్నారు.

 

    "ఐ వాంట్ టు సీ మాధవీ యిమ్మీడియట్లీ!"

 

    వాళ్లంతా ఒకరి ముఖంలోకి ఒకరు చూసుకున్నారు.

 

    "కాల్ హిజ్ ఫాదర్!" అన్నారొకరు.

 

    ఒకతను బయటికి వెళ్ళి సీతా రామారావుగారితో లోపలకు వచ్చాడు. రెండు నిముషాల తర్వాత.

 

    ఆయన కళ్ళలో ఆనందభాష్పాలు. దగ్గరకొచ్చి కుమారుడి తల నిమురుతూ "రాజా! రాజా!" అంటున్నాడు ఆనంద పారవశ్యంతో.

 

    "డాడీ!"

 

    "యస్ మై బాయ్"! అన్నాడు కళ్ళు తుడుచుకుని.

 

    "మనమిప్పుడు ఎక్కడ వున్నాం?"

 

    "లండన్ లో!"

 

    రాజా అదిరిపడినట్లయ్యాడు. "లండన్ లోనా?"

 

    ఆయన అవునన్నట్లు తల ఊపాడు. "అవును. హార్లీ స్ట్రీట్ లో వున్న లండన్ క్లినిక్ లో."

 

    "ఇదంతా ఎలా జరిగింది?"

 

    ఆయన ఏదో చెప్పబోయాడు. ప్రక్కనున్న డాక్టర్ వారించి "అవన్నీ నిదానంగా చెప్పండి. అతనిప్పుడే సెన్సెస్ లోకి వచ్చాడు, స్ట్రెయిన్ తట్టుకోలేడు" అన్నాడు ఇంగ్లీషులో.

 

    "పోనీ మాధవి ఎక్కడుంది? అదయినా చెప్పండి?"

 

    "తెలియదు" అన్నాడాయన విచారంగా.

 

    "తెలియదా?" అని "అవును, ఎలా తెలుస్తుంది? అసలీ సంగతి మీకెవరికీ తెలీదు కదా!" అని గొణుక్కున్నాడు నిరాశగా.

 

    "అతని సెన్సెస్ అన్నీ నార్మల్ గా వున్నాయి. జ్ఞాపకశక్తి కూడా సక్రమంగా వుంది. హి ఈజ్ ఫర్ ఫెక్ట్ లీ ఆల్ రైట్!" అనుకుంటున్నారు డాక్టర్లు వాళ్లలో వాళ్ళు హర్షాతిరేకంతో.

 

    కొంచెం ఆగి రాజా "సుధాకర్-వాడ్నొక్కడ్నీ ఇండియాలో వదిలి వచ్చారా?" అని అన్నాడు.

 

    "లేదు, నాకు సాయంగా యిక్కడే వున్నాడు"

 

    "ఏడీ?"

 

    "పిలుచుకువస్తాను" అని ఆయన బయటకు వెళ్ళారు.

 

    తండ్రి ఎందుకలా వున్నాడు? ఆయన ముఖంలో చాలా మార్పు కనిపిస్తోంది. ఎంతో పెద్దవాడయిపోయినట్లు....వయసు పెరిగినట్లు...దుఃఖ భారం వల్లనా?

 

    ఒకటి రెండు నిముషాలు గడిచాక సీతా రామారావుగారు ఓ పదిహేనేళ్ళ కుర్రాడితో లోపలకు వచ్చారు.

 

    రాజా ఆ కుర్రాడివంక ఆశ్చర్యంగా చూస్తున్నాడు. నూనుగు మీసాలు... కళ్ళలో మెరుపు...

 

    "అన్నయ్యా!" అన్నాడు ఆ కుర్రాడు దగ్గరకు వస్తూ.

 

    "మైగాడ్! వాడే వాడే....సుధాకర్! ఇంత పెద్దవాడెలా అయ్యాడు?"

 

    "ఇక్కడికి ఎప్పుడొచ్చాను? నన్నిక్కడికి ఎప్పుడు తీసుకువచ్చారు?"

 

    సంభాషణ తెలుగులో జరుగుతూ వుండటంవల్ల అతనేమంటున్నదీ అక్కడున్న డాక్టర్లకు అర్థం కావటంలేదు.

 

    సీతా రామారావుగారు వాళ్ళవంక చూశాడు. చెప్పవచ్చునో లేదో ఆయనకు తెలీదు. ఒక్కక్షణం తటపటాయించి అన్నాడు "మనం ఇక్కడకు వచ్చి మూడేళ్ళు గడిచింది."


                                    * * *


    మూడేళ్ళు...మూడేళ్ళు తాను కోమాలో వున్నాడా? ఇన్నాళ్ళూ తాను చచ్చిపోయినట్లే లెక్క. కానీ తెలివి వచ్చింది కాబట్టి బ్రతికినట్టు.

 

    తండ్రి చెప్పాడు. స్కూటర్ యాక్సిడెంట్ అవగానే తాను స్పృహ కోల్పోయాడు. గుంటూరులో రాయవెల్లూరు తీసుకువెళ్లమని సలహా యిచ్చారు. అక్కడవాళ్ళు బ్రెయిన్ కు ఆపరేషన్ చేసి ప్రాణమైతే పోశారుగానీ, కోమాలోంచి బయటకు తీసుకురాలేకపోయారు. రెండు మూడునెలల విశ్వప్రయత్నం చేసి ప్రయోజనంలేక ఇహ లండన్ తీసుకువెళ్ళమన్నారు. సీతారామారావుగారు వారం పదిరోజులలో స్నేహితుల సాయంవల్ల ఏర్పాట్లన్నీ చేసుకున్నారు. లండన్ లో ఆయన బంధువులూ, మిత్రులూ కొందరున్నారు. వారందరి సాయంతో హాస్పిటల్ లో చేర్చి యింతకాలమూ కొడుకుదగ్గరే వుండిపోయారు.

 Previous Page Next Page