ఎన్నోసార్లు చిలిపిగా అతనికి డ్రింక్ కలిపియిచ్చేది. ఇప్పుడు....ఆమె అసహ్యంగా అతని మొహంలోకి చూస్తోంది. ఆమె కంటికతను మృగంలా గోచరిస్తున్నాడు.
"ఏమిటలా చూస్తున్నావు?" అన్నాడు అదే కటుస్వరంతో.
"నువ్వేమిటలా చూస్తున్నావు?" అనడిగిందామె అంతకంటే విసురుగా.
"చెప్పనా?" వెటకారంగా నవ్వాడు.
"నీ అందాలు"
"ఓస్!" అంది నిర్లక్ష్యంగా "నీలాంటి నీచుల కళ్ళు ఎన్నో పడివుంటాయి. అంతమాత్రాన పాతివ్రత్యం ఏం పోదులే."
"నీ పాతివ్రత్యం ఇంతవరకూ పోయి వుండదులే. కానీ ఇప్పుడు తప్పదు."
"ఏం? బలాత్కరిస్తావా?"
"తప్పదు. మీ అక్కయ్య నిన్ను కన్విన్స్ చెయ్యలేకపోయింది కాబట్టి..."
ఆమె ఎగతాళిగా నవ్వింది. "నా గురించి నువ్వు తక్కువ అంచనా వేశావు."
"నాగురించీ నువ్వు తక్కువ అంచనా వేశావు" అతనామెవైపు కదిలాడు.
క్రిందినుంచి ఏవేవో శబ్దాలు వినిపిస్తున్నాయి. ఎక్కడ్నుంచో వస్తున్నట్లు "ఏమండీ..ఏమండీ... మధూ...మధూ..." అన్న అతి దీనమైన, నిస్సహాయమైన అరుపులు.
చేయిజాస్తే ఆమె అందేటంత దూరంలోకి వచ్చాడు.
నిన్నటిదాకా ఇద్దరూ మామూలు బావామరదళ్ళు. ఆమెగురించి అతని మనసులో అగ్నిపర్వతాలు బ్రద్దలవటం, లావాలుపొంగటం జరుగుతూ వుండవచ్చుకానీ ఆమె ఏ అమరికలూలేని ముగ్ధ. ఇప్పుడతను ఆమెను కబళించివెయ్యడానికి దూకుతున్న ఆకలిగొన్న పులి. ఆమె... జింకపిల్ల కాదు.
అతని ఎర్రబడ్డ కళ్ళు ఆమె కళ్ళని చూస్తున్నాయి. ఆ కళ్ళని తాగెయ్యాలని వుంది. కానీ ఏమూలో కొద్దిగా అదురు. కానీ అహం మీదకు పురిగొల్పింది. ఇంకో అడుగు ముందుకువేసి మెరుపులా ఆమెను అందుకోబోయాడు. కానీ అంతకంటే వేగంగా ఏదో జరిగింది. కళ్ళముందు చీకట్లు కదలాడాయి. చెంప సర్రుమంటున్నది. చేత్తో తడిమి చూసుకుంటే రక్తమై వుండవచ్చు. చల్లగా తగిలింది.
తేరుకునేలోపల ఆమె తలుపు తీసుకుని బయటకువెళ్ళి తలుపు బయటినుంచి గొళ్ళెం పెట్టింది. తర్వాత గబగబ క్రిందకు వెళ్ళిపోయింది.
బయటకు పోబోతుంటే హాల్లో టెలిఫోన్ మ్రోగింది. క్షణంపాటు తటపటా యించి వెళ్ళి రిసీవర్ తీసుకుంది.
"హల్లో! సిక్స్ త్రీ డబల్ నైన్ ఫైవా?"
"యస్!"
"మాధవిగారున్నారా?"
"నేనే మాట్లాడుతున్నాను."
"ట్రంకాల్ ఫ్రం ఒంగోల్"
ఊపిరాగిపోయినట్లయింది.
"మాట్లాడండి"
అవతలినుండి ఓ గొంతు సౌమ్యంగా "ఎవరమ్మా! మాధవా?" అనడిగింది. ఎంతో పెద్దమనిషి తరహాగా వుంది ఆ కంఠం.
"అవునండీ!"
"నేను సీతారామారావునమ్మా! రాజా తండ్రిని."
గుండె చిక్కపట్టినట్లయింది "ఏమిటండీ?" అంది కంపిత స్వరంతో.
"రాజా డైరీలో నీగురించి తెలుసుకుని నీ ఫోన్ నెంబరు కూడా దాన్నుంచే తెలుసుకుని ఫోన్ చేస్తున్నానమ్మా! విజయవాడనుంచి వస్తుంటే రాజాకి స్కూటర్ యాక్సిడెంట్ జరిగింది. పరిస్థితి చాలా విషమంగా వుంది. గుంటూరులో చూపిస్తే రాయవెల్లూరు తీసుకెళ్ళమన్నారు. బట్టలూ అవీ తీసుకెళ్లడానికి ఇక్కడికొస్తే రాజా డైరీవల్ల నీగురించి వివరాలు తెలిశాయి. వాడి మనసూ తెలిసింది. నీకు తెలియపరచటం భావ్యమని ఫోన్ చేస్తున్నాను."
ఎట్లాగో గొంతు స్వాధీనంలోకి తెచ్చుకుని "రాజా ఎక్కడున్నాడండీ?" అని అడిగింది.
"గుంటూరులో."
"నేను వస్తున్నానండీ!"
"నీ ఇష్టమమ్మా!"
"ఒక్క విషయం చెప్పండి? రాజాకి బాగా సీరియస్ గా వుందా?"
"తలకి మళ్లీ బలమైన గాయం తగిలిందమ్మా! డీప్ కోమాలో వున్నాడు"
"నేను వెంటనే బయల్దేరుతున్నానండీ" అని ఆమె ఫోన్ పెట్టేసింది.
బయటి ద్వారంవైపు నాలుగడుగులు వేసిందో లేదో లోపలి గదిలోనుంచి పెద్ద పెట్టున కేకలు. గుండె అదిరినట్లయి వెనుదిరిగి చూసేసరికి గదిలోంచి మంటలు కనిపించాయి. కిరసనాయిలు వాసన.
అర్థమైంది "అక్కయ్యా!" అంటూ లోపలకు పరిగెత్తింది.
కిరసనాయిలు పోసుకున్న బట్టలు మంటలు ఎగజిమ్ముతుండగా బాదహ్తో అరుస్తూ సత్య అటూఇటూ గెంతుతోంది. ఆమె శరీరానికా శక్తి ఎక్కడినుంచి వచ్చిందో పరుగులు పెడుతోంది.
మాధవికేం చెయ్యడానికీ పాలుపోలేదు. బ్లాంకెట్ లాంటిదేమైనా కప్పుదామా అంటే దగ్గర్లో ఏమీ కనబడలేదు. చీరె లాగెయ్యడం మినహాయించి వేరే గత్యంతరం లేదు. ఒక్క ఉరుకున ముందుకు పరుగెత్తి ఆమె చీరకుచ్చిళ్ళు పట్టుకునేందుకు ప్రయత్నించింది.
చేతులు భగ్గుమన్నాయి. ముఖంమీదకు వెచ్చని సెగలు. చేతుల్లోంచి పట్టు జారిపోయింది. మళ్ళీ ముందుకు చేతులు జాచేలోపల సత్య అరుస్తూ ప్రక్కకి తిరిగి ఆమెమీద పడింది.
తప్పించుకునేందుకు వ్యవధి లేకపోయింది. ఆమె కట్టుకున్న టెర్లిన్ చీరె భగ్గుమని అంటుకుంది. క్షణంలో మంటలు నాలికలు జాస్తూ మీదకు లేచాయి. సరాసరి ముఖంమీదకు వచ్చాయి.
మాధవి ముఖం అగ్నిగోళంలో చిక్కుకునిపోయినట్లయింది. ఏం జరుగుతుందో అర్థం చేసుకునేలోపల ముఖం దారుణంగా కాలిపోయింది. ఎప్పుడు స్పృహ కోల్పోయిందో కూడా ఆమెకు తెలీదు.
13
రాజా కళ్ళు విప్పాడు.
తలంతా ఏదో బరువు. శరీరంలో నరాలన్నీ విద్యుత్ ప్రవహిస్తున్నట్లుగా అనుభూతి.
కళ్ళముందు మసక మసగ్గా ఏదో దృశ్యాలు....పొగమంచు వీడినట్లు తెర తొలగినట్లు క్రమంగా స్పష్టత వచ్చింది. పైన తిరుగుతున్న సీలింగ్ ఫ్యాన్, తెల్లగా పాలరాయి పరిచినట్లు మెరిసే గోడలు. తాను పడుకున్న మంచం చుట్టూ మనుషులు....