Previous Page Next Page 
13... 14.... 15 పేజి 33


    "వచ్చాక చెపుతాను" అని ఫోన్ పెట్టేసింది. మరోగంట గడిచింది. ఆరున్నరకి మాధుర్ వచ్చాడు. సాయంత్రంపూట ఏ బార్ లోనో కూర్చోవటం అలవాటు. మాధుర్ విష్ణుకి ఫైనాన్సియర్. అంతకన్నా ఎక్కువగా స్నేహితుల్లా వుంటారు.

    "వెళ్దామా? ఏమయినా పనుందా?" అని అడిగాడు మాధూర్. విష్ణుకి అతడితో వెళ్ళాలనే అనిపించింది. వాళ్ళు రోజూ కలుసుకుంటూనే వుంటారు. అయినా ఇంకా ఏవో మాటలు వుంటూనే వుంటాయి. తొందరగా ఇంటికివెళ్తే నిజంగానే ఏమీ తోచదు.

    కానీ ఆరోజు భార్య  రమ్మన్నది గుర్తుంది. ఇంటికి ఫోన్ చేసి  రానని చెప్దామనుకున్నాడు. మళ్ళీ చివరి క్షణంలో మనసు మార్చుకుని, "నువ్వెళ్ళు మాధుర్. నేనింటికి వెళ్తాను" అన్నాడు.

    మరో పదినిమిషాల తరువాత అతడు ఇంటికి వెళ్ళాడు. అప్పటికే లక్ష్మి తయారైవుంది. "మనం బయటకి వెళ్దాం" అంది. విష్ణు ఆశ్చర్యంగా. "అందుకోసం రమ్మన్నావా? ఎక్కడికి వెళ్ళాలి?" అని అడిగాడు.

    "ఊరికనే బయటకి"

    "ఊరికే బయటకు వెళ్ళటం కోసం రమ్మన్నావా?"

    "ముందే అడిగానుగా. మీరు  ఖాళీగా వున్నానంటేనే రమ్మన్నాను. అయినా ఇప్పుడు మీకంత కొంపలు మునిగిపోయే కార్యక్రమాలు ఏమున్నాయి గనుక?" అంది. విష్ణు "సర్లె. సర్లె" అంటూ బాత్ రూమ్ లోకి వెళ్ళాడు. అతడిలో అదో మంచిగుణం వుంది. వాదన పొడిగించడు. మగవాడినన్న అహంకారం చూపించడు. ఒకటి రెండు మాటలన్నా పడతాడు.

    ఇద్దరూ కలిసి బయల్దేరేసరికి ఏడయింది.

    "ఎటు?"

    "బ్లూ ఫాక్స్"

    అతడు ఆమెవైపు తలతిప్పి "ముందే చెప్పొద్దా. నా దగ్గిర అంత డబ్బు లేదనుకుంటాను. ఇంటిగ్గానీ ఆఫీసుగ్గానీ వెళ్ళి తీసుకోవాలి" అన్నాడు.

    "అక్కర్లేదు. నాదగ్గిరున్నాయి"

    హొటల్ లో కూర్చున్నాక, "ఎక్కడివని అడగరేం?" అంది. అతడికి ఆప్రశ్న అర్థం కాలేదు.

    "ఎక్కడివి?" అని అడిగాడు.

    "నావి?"

    అతడు మరింతద ఆశ్చర్యంతో, "నీకెక్కడివి?" అని అడిగాడు.

    "నా సీరియల్ కి వచ్చినవి"

    ఆమె కథ పత్రికలో వచ్చిందని తెలుసుకానీ పూర్తయిందని అతడికి తెలీదు. "ఎంత ఇచ్చారు?"

    "మూడువేలు"

    "మంచిమొత్తమే" అన్నాడు. "ఎన్నాళ్ళు పట్టింది వ్రాయటానికి"

    "మూడునెలలు"

    "నెలకి వెయ్యి. ఫర్వాలేదు. పదినుంచి అయిదువరకూ ప్రైవేటు ఆఫీసుల్లో పనిచేస్తే అంతే వస్తుంది" అన్నాడు.

    ఆమెక్కోపం వచ్చింది. "వ్రాయటమనేది ఆత్మసంతృప్తికోసం" అంది.

    విష్ణు, వ్యాపారానికి సంబంధించిన చాలా ఇంగ్లీషు పుస్తకాలు చదువుతాడు. అలాగే కామర్చు తాలూకు టాపిక్ వస్తే బలంగా వాదిస్తాడు. అందుకే అతడు నిజాయితీతో కూడిన విస్మయంతో, నిజంగానే అర్థంకానట్టు "మరి పత్రికలకు పంపటం ఎందుకు?" అన్నాడు.

    "పదిమంది చదవటం కోసం" అంది.

    "నీ ఆత్మసంతృప్తిని అవతలివాడు క్యాష్ చేసుకుంటున్నప్పుడు, అందులో వాటా అడగటంలో తప్పేముంది?"

    "మీకు తెలీదు లెండి. వ్యాపారం వేరు. సాహిత్యం వేరు."

    ఆమెకి మనసులో సంతోషంగా వుంది. చాలా రోజుల తరువాత ఇద్దరూ ఇంతసేపు మాట్లాడుకోవటం.

    అంతలో అతనన్నాడు. "మనిషి ప్రతిచర్యలోనూ వ్యాపారం వుంటుంది. తృప్తి అనేది కూడా వ్యాపారమే. నువ్వే చెత్త వ్రాసినా కనీసం ఓ పదిమంది చదువుతారు. ఆ పదిమందికోసం వ్రాయటం మానెయ్యి. వందమంది చదివేలా వ్రాయటానికి కష్టపడు. ఆ కష్టానికి ఫలితం చెవులుపిండి వసూలు చెయ్యి. అప్పుడు మరింత పట్టుదల పెరిగి, వాళ్ళతోనే నీ నవల  అడిగించుకునే స్థాయికి ఎదుగుతావు. ప్రస్తుతం నువ్వు ప్రారంభస్థాయిలో వున్నావు. కృషి చేయకపోతే, 'ప్రచారింపబడితేచాలు' అనే స్టేజినుంచి 'ఎందుకొచ్చిన వ్రాయటం' అనే స్టేజిలోకి జారి, ఆపైన 'వ్రాయటం మానేసి విమర్శించే' వాళ్ళ లిస్టులోకి పడిపోతావు. క్రియేటివిటీ కన్నా 'విమర్శే' నీకు తృప్తినివ్వటం ప్రారంభిస్తుంది. ఒక్కమాటలో చెప్పాలంటే......కృషి తక్కువయితే చాదస్తం ఎక్కువ. అవుతుంది."

    లక్ష్మి నవ్వింది. భర్త అంత మాట్లాడటం బావుంది. ఏం మాట్లాడుతున్నాడు   అన్నదానికన్నా .....మాట్లాడటం బావుంది. అతడు ఆమె నవ్వుని వేరేలా అర్థం చేసుకున్నాడు.

    "ఏం? నేను మాట్లాడింది తప్పా? ఏమో. నాకు బిజినెస్ తప్ప సాహిత్యం అంతగా తెలీదు. నేను అనుకునేది ఏమిటంటే......పూర్వకాలం రాజులు పోషించేవారు కాబట్టి కథలు వ్రాసేవారు. ఈ కాలంలో ప్రజలచేత చదివించేలా వ్రాయకపోతే ఎవరూ ప్రచురించారు. ఆ విధంగా ప్రయత్నించూ.....అని చెపుతున్నాను."

    ఇంతలో వెయిటర్ వచ్చాడు. "ఏం ఇప్పిస్తున్నావు?"

    "మీ ఇష్టం."

    ఆమె నవ్వాపుకుని, "మీకెంత కావాలనుకుంటే అంత తాగండి" అంది. అతడు విభ్రాంతుడై చూసాడు. ఆమె తనని తా....గ....మ....ని కోరటం, పైగా తనే దానికి డబ్బు లిస్తాననటం అతడిని సంభ్రమంలో ముంచెత్తింది. వెయిటర్ కి ఆర్డ్ ర్ ఇస్తూ, ఏదో గుర్తొచ్చినవాడిలా, "నీకు......" అన్నాడు.

    "మీఇష్టం" అనలేదు ఎప్పటిలా (ఎప్పటిలా ....అంటే .....పెళ్ళయిన కొత్తలో హొటల్ కొచ్చినప్పుడులా).మెనూ చూస్తూ వుండిపోయింది.

    "మైల్డ్ డ్రింక్" సందిగ్దంగా అడిగాడు.

    ఆమె ఫర్వాలేదన్నట్టు తలూపింది. అతడి మొహంలో లీలగా ఆశ్చర్యం కదలాడింది. వెయిటర్ వైపు తిరిగి, "ఒక పెగ్ జిన్ విత్ లెమన్ కార్దియల్ " అన్నాడు. వెయిటర్ నోట్ చేసుకుని వెళ్ళిపోతూండగా, "తాగితూలనుకదా" అంది అనుమానంగా.

    "ఒక పెగ్ కి ఏమీ అవదులే. అయినా ఈరోజు ఏమిటి దీనిమీదికి దారిమళ్ళింది? మొదట్లో ఎంత బ్రతిమాలినా ముట్టుకునేదానివి కాదు కదా"

    "నేను కూడా అలవాటు చేసుకుందామనుకుంటున్నాను" నవ్వుతూ అంది. తను ఇంట్రావర్షన్ నుంచి బయటపడటం ఆమెకి స్పష్టంగా తెలుస్తోంది.

    వ్యాపారంలాగే డ్రింగ్స్ ప్రసక్తి వచ్చినా అతడు ఉపన్యాసాలిస్తాడు....."ఒకటి రెండు పెగ్ ల వరకూ ఫర్వాలేదు. అంతకన్నా ఎక్కువయితే తట్టుకోలేవు" అన్నాడు.

    "మొదట్లో మీరూ అలాగే తాగేవారూ. ఇప్పుడు అయిదారువరకూ వెళ్తోంది."

    "నరాలు దానికి ఎడ్జెస్ట్ అయిపోతాయి! మొదట్లో వున్నంత సున్నితత్వం వుండదు."

    "కొంతకాలానికి నేనూ అలాగే అయిపోతానా?"

    వ్యసనంగా మారితే అయిపోతావు"

    "మారుతుందా?"

    "అది నీ కంట్రోల్ మీద ఆధారపడివుంటుంది. అదితప్పనిసరి అనే పరిస్థితి రాకూడదు. నా వుద్దేశ్యంలో ఆనందంకోసం తాగాలి తప్ప అవసరం కోసం కాదు."

    అతడి విషయంలో అది నిజమని భార్యగా ఆమెకు తెలుసు."కానీ ఈమధ్య మీరు దాదాపు ప్రతిరోజూ తాగుతున్నారు."

    అతడు కొంచెం ఇబ్బందిపడ్డట్టు కనిపించాడు. "అవును. కొంచెం వర్రీస్ లో వున్నాను. వ్యాపార విషయాల్లో."

    "మరి ఇప్పుడు ఇది 'అవసరం' అయింది కదా"

    "కనీసం రాత్రిళ్ళూ  బాగా నిద్రపడుతుంది."

    "నాకూ ఇది అవసరంగా మారితే?"

    అతడామెవైపు ఆశ్చర్యంగా చూసి, "నీకేమిటి వర్రీస్?" అన్నాడు. ఆమె నవ్వటానికి ప్రయత్నిస్తూ "మీకేనా? మాకుండవా బాధలు" అంది.

    "అదే. ఏమిటీ అని అడుగుతున్నాను"

    "ఈరోజు మధ్యాహ్నం మధూహ వచ్చింది."

    "ఏమిటట?"

    "నాకు అబార్షన్ జరగటం అబద్ధం! అసలు గర్భమే అబద్ధమట. అంతేకాదు....నేను జీవితంలో తల్లిని కాలేను. ఎప్పటికీ.....ఇక ఎప్పటికీ" లోపల్నుంచి దుఃఖం తన్నుకొచ్చింది. ఆమె పెదవులు బిగపట్టి దుఃఖం ఆపుకోవటానికి ప్రయత్నించింది. వెయిటర్ ఈలోపులో డ్రింక్స్ తీసుకొచ్చి బల్లమీద  సర్దాడు. తన కళ్ళనీళ్ళు అతడి కంటబడకుండా వుండటం కోసం ఆమెతల బాగా  వంచుకుని, అతడు వెళ్ళిపోయాక కర్చీఫ్ తో కళ్ళు  తుడుచుకుంది.

    విష్ణు నిశ్శబ్దంగా  గ్లాసుల్లో డ్రింక్ కలిపాడు. ఆమె గ్లాసుముందుకు తోసి, తన గ్లాసు అందుకుని, "తాగు" అన్నాడు.

    ఆమె అంత దుఃఖంలో కూడా ఆశ్చర్యంగా అతడివైపు చూసింది. అతడి మోహంలో ఏ భావమూ అంతగా గోచరించలేదు. తన గర్భవతి అని చెప్పినప్పుడూ లేదు. అబార్షన్ అయిందని చెప్పినప్పుడూ లేదు. ఇప్పుడిక జీవితంలో తల్లిని కాలేనని చెపుతున్నాప్పుడూ లేదు. అంత నిరాసక్తతని ఆమె భరించలేకపోయింది. మాతృత్వం లేదన్న దుఃఖంకన్నా భర్త నిర్లక్ష్యం మరింత దుఃఖం కలిగించింది. అప్పటివరకూ హొటల్ లో భర్తతో సంభాషించటం వల్ల వచ్చిన ఆనందం గాలిలో వూదినట్టు పోయింది.

    ఆమె మొహంలో మారుతూన్న, భావాలు అతడు గుర్తించినట్టున్నాడు ".......ఎందుకు ఈ విషయానికి నువ్వంత బాధ పడతావు?" అన్నాడు. ".......ఈ ప్రపంచంలో ఎవరైనా చాలా సులభంగా చేయగల ఏకైకపని అదే. పిల్లల్ని కనటం. మనకి సంతానం లేకపోతే విచారించవలసిన విషయమే కానీ, అది మరీ అంతగా కుమిలిపోవలసిన  విషయం కాదు. దేశంలో చాలామంది అనాధపిల్లలున్నారు. ఎవరినన్నా తెచ్చి పెంచుకోవచ్చు. దీనికోసం విపరీతంగా  దుఃఖించకు. ఎవరన్నా అడిగితే ఈ లోపమంతా నాదికాదు. నాభార్తదని చెప్పు. ఎవరూ వచ్చి నన్ను నిలదీసి అడగరు కదా!"

    ఆమె విస్మయంగా తలెత్తి చూపింది. అతడు చాలా మామూలుగా నిర్వికారంగా వున్నాడు. అతడు అలా ఆలోచించగలడని ఆమె అనుకోలేదు. ఆమె  మనసు తేలికయింది. అప్పటివరకూ మనసులోవున్న బాధనంతా చేత్తో తీసేసినట్టయింది. ఇంతకీ తన బాధ ఏమిటి? ప్రేమ పంచటానికి కొడుకో, కూతురో లేకపోవటమా? లేక తను గొడ్రాలు అని ప్రపంచం అనుకుంటుందనా?

    రెండోది కారణం కాకపోతే, ఎవడో రోడ్డుపక్కన పేపర్లు ఏరుకునే వాడి అంశని తనలో ప్రవేశపెట్టుకుని నవమాసాలూ మోసి, భర్తని తండ్రిని చేయటమెందుకు? ఒక అనాధ పిల్లాడికి నిండుమనసుతో తామిద్దరూ కలిసి ప్రేమని పంచుతే సరిపోతుంది కదా!

    ఆక్షణం అతడంటే ఆమెకి అప్రయత్నంగా అమితమైన గౌరవంతో కూడిన ఇష్టం కలిగింది. ఒక మనిషిని వేరే కోణంలోంచి చూడగలిగితే మరోలా కనిపిస్తాడేమో!

    కొన్నిక్షణాళ క్రిందటి అతడి నిరాసక్తత, ఇప్పుడు మెచ్యూరిటీలా కనిపిస్తోంది.

    గ్లాసు దగ్గిరకి తీసుకొంటూంటే, పెదాలమీద నవ్వు కదలాడింది.

    "ఎందుకు నవ్వుతున్నావు?"

    ఆమె కంగారుపడుతూ, "ఏమీలేదు. ఏమీ లేదు" అంది.

    "లేదు. చెప్పాల్సిందే."

    "ఏమీలేదు. చెప్తే బావోదు"

    అతడు బలవంతం చేయలేదు. మళ్ళీ తనే ఏమనుకుందో ఏమో, నెమ్మదిగా అంది. "ఈ డబ్బుల్తో చీర కొనుక్కుందామనుకున్నాను"

    "కొనుక్కోవలసింది. స్వార్జితం కదా!"

    "కానీ అది ఇంత బాగా ఉపయోగపడుతుందనుకోలేదు."

    ఆ మాటలు అర్థం అవటానికి అతడికి అరనిముషం పట్టింది.

 Previous Page Next Page