Previous Page Next Page 
13... 14.... 15 పేజి 32


                            ఆరో అధ్యాయం

    ఆపరేషన్ థియేటర్ నుంచి బయటకు తీసుకొచ్చిన రెండు గంటలకు రాజుని కలుసుకుంది మధూహ. మరో వారంరోజుల్లో అతడికి చూపు స్పష్టంగా వస్తుందని డాక్టరు చెప్పాడు.

    మరుసటిరోజు అతడిని ఆస్పత్రి నుంచి డిశ్చార్జిచేసారు. డాక్టర్లు చెప్పినట్టే వారంరోజుల్లో అతడు మామూలు మనిషయ్యాడు. అయితే ఆసిడ్ వల్ల కలిగిన నల్లటి మచ్చలు మాత్రం మొహంమీదనుంచి పోలేదు. అది పోవాలంటే ప్లాస్టిక్ సర్జరీ చేయాలనీ, దానికి పాతికవేల రూపాయలదాకా ఖర్చవుతుందని ఆస్పత్రిలో చెప్పారు.

    "డాక్టర్ విశాల్ బాగా సంపాదిస్తున్నంత కాలమూ మనకి డబ్బు సమస్య కాదు" అన్నాడు రాజు నవ్వుతూ.

    "నేనూ అదే అడుగుదామనుకుంటున్నాను. నువ్వు బెదిరించగానే డాక్టర్ విశాల్ ఎందుకు పదిహేనువేలు ఇచ్చాడు?"

    రాజు నవ్వుతూనే, "అది ప్రొఫెషనల్ సీక్రెట్. చెప్పను" అన్నాడు.

    "ప్రేమలో రహస్యాలుంటాయా?" అంది అతడి మొహాన్ని తనవైపు తిప్పుకుంటూ రాజుమొహంలో నవ్వు మాయమైంది. ".... ఆ ఒక్కటీ అడక్కు" అన్నాడు.

    "పోనీవద్దులే" అంది ఇక ఆ విషయాన్ని బలవంతపెట్టటం ఇష్టంలేనట్టు. "కానీ వందరూపాయలేమిటి? ఆ విషయం చెప్పు. అది కూడా  రహస్యమా?"

    "అందులో రహస్యం ఏముంది? పేపర్లలో ప్రకటనలు కూడా ఇస్తున్నాం కదా. చూడటంలేదా?"

    "పేపర్లలో ప్రకటనలు ఏమిటి?" ఆశ్చర్యంగా అడిగింది.

    "స్పెర్మ్ డొనేషన్....రక్తదానంలాగే స్పెర్మ్ కూడా అమ్ముకోవచ్చు. సంతానోత్పత్తి కేంద్రాలు వాటిని కొనుక్కుంటాయి. పిల్లలు కలగని దంపతులు కోరితే వారికి, వారి అనుమతితో కృత్రిమ గర్భధారణ కోసం ఆ వీర్యం ఉపయోగిస్తాం. అలా వీర్యాన్ని అమ్మేవాళ్ళుంటే వాళ్ళు మాదగ్గిర రిజిస్టరు చేసుకోవచ్చు. ఒకసారి 'స్పెర్మ్' ఇస్తే, వందరూపాయలు పారితోషికం ఇస్తాము. ఇందులో రహస్యం ఏమీలేదు. పత్రికల్లో చూడలేదా ఎప్పుడూ?

    మధూహకి సంతానోత్పత్తికేంద్రాల వరండాల్లో తారట్లాడే "మగవాళ్ళు" గుర్తొచ్చారు. ఆటో డ్రైవర్లు....రిక్షాతొక్కేవాళ్ళు...

    "వాళ్ళా?" నమ్మశక్యం కానంత ఆశ్చర్యంతో అడిగింది.

    "వాళ్ళు కాకపోతే ఎవరిస్తారు?"

    ఆమె విస్మయం నుంచి ఇంకా తేరుకోలేదు. రాజు అన్నాడు..."దంపతులు కృత్రిమ గర్భధారణకి ఒప్పుకోగానే మేము వీళ్ళలో ఒకరికి కబురు చేస్తాము. కబురు చేయగానే రావాలి. బాత్ రూమ్ లో కెళ్ళి స్పెర్మ్ తీసి ఇవ్వాలి. హైద్రాబాద్ లోని ఖరీదైన ఆస్పత్రుల్లో కూడా ఇలాగే బాత్ రూమ్ లో నిల్చొని హస్తప్రయోగం చేసుకోవాలి. అదంతా చాలా విసుగైన వ్యవహారం. బాగా చదువుకున్న వాళ్ళు మంచిపొజిషన్ లో వున్నవాళ్ళూ వందరూపాయలకి రారు. వీళ్ళే వస్తారు."

    "మరి దంపతులకి ఈ విషయం తెలుసా? తమకి ఎవరివల్ల సంతానం కలుగుతుందో?"

    "తెలియకపోవచ్చు. దాత ఎవరో మేము చెప్పము. వాళ్ళు కూడా దానిగురించి అంతగా పట్టించుకోరు. అప్పటికే వాళ్ళు చాలా డిప్రెస్ట్ స్టేజీలో వుంటారు. ఇదంతా రకరకాల స్థాయిలో వుంటుంది. పెళ్ళయిన మూడు నాలుగేళ్ళకి అత్తగారి తరపునుంచి సణుగుడు మొదలవుతుంది. అప్పుడు డాక్టర్ ని సంప్రదిస్తారు. మొదట్లో, భర్తవలన సంతానం కలగాలని అడుగుతారు. దీన్నే ఆర్టిఫీషియల్ ఇన్ సెమినేషన్ బై హజ్జెండ్ అంటాం. అది ప్రయత్నిస్తాం! అంటే భర్త తాలూకు వీర్యాన్ని భార్యలోకి ఇంజెక్ట్ చేయటం! కానీ అదికూడా ఫలితం లేకపోవచ్చు. ఎందుకంటే సంతానం కలగకపోవటానికి చాలావరకూ పురుషుడే బాధ్యుడు. కానీ ఈ విషయాన్ని ఒప్పుకోవటానికి మగవాడి అహం అడ్డొస్తుంది. అతడిమీద పరీక్షలకి ఒప్పుకోడు. దానివల్ల వచ్చేలాభం కూడా అంతగా వుండదు."

    "కానీ మీరుపయోగించేది......రైల్వేకూలీలు, నిరక్షరాస్యులు.......జెనిటికల్ గా తక్కువ తెలివితేటలున్నవారి...... అంటూన్న ఆమె మాటలు మధ్యలో ఆపుచేస్తూ, "భారతదేశంలో స్పెర్మ్ ని నిలువవుంచటానికి కావలసిన అత్యాధునికమైన పరికరాలు లేవు. నేను ముందు చెప్పినట్లు, విద్యావంతులు, ఎక్కువ ఐక్యూ వున్నవారూ ఫోన్ చేసి పిలవగానే రారు." అన్నాడు.

    "డాక్టర్ విశాల్ వల్ల మాకు సంతానం కలిగింది అని పేపర్లలో చెప్పుకుంటూన్న దంపతులు ఇలా సంతానయోగం పొందినవారేనా?"

    "కాదు" రాజుమాటల్లో గర్వం తొణికిసలాడింది. "కేవలం విశాల్ క్లినిక్ లో మాత్రమేస్త్రీలు "భర్త" వల్ల సంతానం పొందుతారు."

    ఆమె అర్థంకానట్టు "......ఎలా?" అంది.

    "డాక్టర్ విశాల్ దైవాంశ సంభూతుడు. కేవలం ప్రజల కష్టాలు తీర్చటం కోసమే దేవుడు తనని పుట్టించాడని మనస్ఫూర్తిగా  నమ్ముతాడు. ప్రతిరోజూ రెండుగంటలు దైవప్రార్థన చేస్తాడు. ఎందరో అతడికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ వుత్తరాలు వ్రాస్తారు"

    "కానీ కేవలం దైవప్రార్థనవల్ల పిల్లలు పుట్టరుగా"

    "ఎన్నో సంవత్సరాలుగా పిల్లలు పుట్టని వాళ్ళు, ఎన్నోచోట్ల ఎన్నో విధాలుగా ప్రయత్నించి విఫలమైనవాళ్ళు డాక్టర్ విశాల్ ని సంప్రదించి సంతానవంతులవటం నేను చూసాను. మిగతా ఆస్పత్రుల్లోలా కాకుండా భర్తవల్లే గర్భవతులవటం నేను స్వయంగా గమనించాను. అది అతడి చేతుల్లోని కళ అనుకుంటావో, దైవకృప అంటావో నీ ఇష్టం. వాస్తవాన్ని మాత్రం కాదనలేవుకదా. కావాలంటే విశాల్ క్లినిక్ లో ట్రీట్ మెంట్ పొందిన ఏ దంపతులనైనా ఈ విషయం నువ్వు అడగవచ్చు."

    మధూహ చాలాసేపటి తరువాత నవ్వింది. "ఏ దంపతులయినా తమకి బయటివాళ్ళ వల్ల పిల్లలు పుట్టారని చెప్పుకోరుగా......పెద్దయ్యాక ఇంకేవో పోలిక లొస్తే, ఏ మామయ్యవో తాతయ్యవో  అని సంతృప్తి పడతారనుకుంటాను."

    రాజు మొహం జేవురించింది. అతడిని తిరిగి మామూలు మూడ్ లోకి తీసుకురావటం కోసం,  "పోనీలే. నువ్వు చెప్పిందీ  నిజమే అయివుండవచ్చు. ఇన్నాళ్ళూ సంతానయోగం లేదనుకున్న నా స్నేహితురాలు లక్ష్మి మీక్లినిక్ వల్ల గర్భవతి అయిందిగా. ఆ బుజువు చాలు" అంది.

    "ఎవరా లక్ష్మి? మొన్న అబార్షన్ అయిన ఆమేనా?"

    "నీకు గుర్తుందా?" అనుమానంగా అడిగింది.

    "తెలుసు. ఆమెకి జీవితంలో సంతానవతి అయ్యే యోగం...." అంటూ, నోరుజారానని గ్రహించి నాలుక్కర్చుకున్నాడు.

    ఆమె స్థాణువై "ఏమిటి నువ్వు చెపుతోంది?" అంది.

    "ఏమీలేదులే" అంటూ దాటవెయ్యబోయాడు. ఆమె చప్పున అతడి చెయ్యి తీసుకుని తన నెత్తిమీద పెట్టుకుని "చెప్పకపోతే నా మీద ఒట్టే" అంది.

    "నన్ను బలవంతపెట్టకు. నేను పనిచేసిన ఆస్పత్రి రహస్యాలు బయట పెట్టటం నిజాయితీ అనిపించుకోదు."

    "అలా బయటపెట్టకుండా వుండటంకోసం యజమానిని బ్లాక్ మెయిల్ చేయటం నిజాయితీ అనిపించుకుంటుందా?"

    అతడు ముందు అయోమయంగా చూసి, ఆ తరువాత ఆమె చెప్పింది అర్థమై ".....లేదులేదు. దానికీ దీనికీ ఏ సంబంధమూలేదు." అన్నాడు. అతడు నిజమే చెపుతున్నాడనిపించింది.

    మధూహ నిరాశగా, "పాపం లక్ష్మి ఆ రెండు నెలలూ ఎంత సంతోషించిందో" అంది, తనలో తనే అనుకుంటున్నట్టు.

    "చూసావామరి. ఇదంతా పేషెంట్ ని సంతోషపెట్టటానికే."

    ఆ మాటతో అతడితో నిజం ఎలా చెప్పించవచ్చో ఆమెకి అర్థమైంది.

    చేతిమీద చేయివేస్తూ "నువ్వు చెప్పిందీ  నిజమే. పూర్తిగా సంతానయోగం లేదన్న నిస్పృహకన్నా ఇది మంచిదేగా" అంది.

    "నువ్వు ఇప్పుడు కరెక్ట్ గా ఆలోచిస్తున్నావు"

    "ఆమెకసలు సంతానయోగం లేదన్నావుగా. మరి ఇదెలా సాధ్యపడిందో చెప్పవా?" అభ్యర్థనగా అడిగింది.

    "హార్మోన్ ఇంజేక్షన్స్"

    "అంటే....."

    "ఆ ఇంజేక్షన్స్ ద్వారా పీరియడ్స్ తాత్కాలికంగా ఆగిపోతాయి. గర్భం అన్న ఆశ కలుగుతుంది. స్కానింగ్  ద్వారా దాన్ని నిర్థారణ చేస్తాం."

    "కానీ స్కానింగ్  నిజం తెలుస్తుందిగా"

    "ఆ రిపోర్టు బదులు ఇంకో గర్భిణిస్త్రీవి చూపిస్తాం. అవేమీ స్టూడియోలో తీసిన ఫోటోలు కావుగా. ఎవరికయినా చూపించవచ్చు. రెండు మూడు నెలల తరువాత డిశ్చార్జి కనపడగానే అబార్షన్ అంటాము. ఆ విధంగా వారిని సంతృప్తి పరుస్తాము."

    "కాదు" దిక్కులు పిక్కటిల్లేలా అరవాలన్న కోరికని అతికష్టంమీద ఆపుకుంది. ఆమె మొహం కసితో, కోపంతో, నిస్సహాయతతో ఎర్రగా కందిపోయింది. ఉక్రోషంతో కళ్ళవెంట నీళ్ళు తిరిగాయి. "మీరు వాళ్ళని సంతృప్తి పరచటం కోసం కాదు. మీ జేబుల్ని సంతృప్తి పర్చుకోవటం కోసం  చేస్తున్నారు. ఒక గొడ్రాలికి లేనిపోని ఆశలు కల్పిస్తున్నారు. గర్భం వచ్చిందని డబ్బులు తీసుకుంటున్నారు. మళ్ళీ అబార్షన్ అని డబ్బులు వసూలు చేస్తున్నారు. అన్నిటికన్నా ఘోరంమైనా  మోసం ఏమిటంటే, చిన్న ఆశ చూపించి వశీకరణ మంత్రం వేసినట్టు ఆమెని మీ చుట్టూ తిప్పుకుంటున్నారు. అన్ని ఆశలూ కోల్పోయిన స్త్రీకి, మీరు దేవుడిలా కనిపిస్తారు. ఇక జీవితాంతం మీచుట్టూ తిరుగుతూనే వుంటుంది, ఎప్పటికయినా తన కడుపులొ జీవం పోసుకుంటూన్న చిన్నారి, తొమ్మిదినెలలపాటు ప్రాణాలు నిలుపుకుని బయటికి రాడా అన్న చిరు ఆశతో, తమ ఆదాయాన్నంతా మీకు  సమర్పించుకుంటుంది. సిగ్గుగాలేదూ? మిమ్మల్ని తల్చుకుంటూంటే మీకే అసహ్యంగాలేదూ?"

    అతడు దగ్గిరకొచ్చి అనునయంగా ఏదో అనబోయాడు. ఆమె అసహనంగా తల  విదిలిస్తూ, "నన్ను కొంచెంసేపు ఒంటరిగా వుండనివ్వు" అంది. ఏమనుకున్నాడోగాని అతడు అక్కడనుంచి మౌనంగా వెళ్ళిపోయాడు.

       
                                     2

    సాయంత్రం అయిదున్నరయింది!

    విష్ణు ఆ రోజు చాలా విసుగ్గా వున్నాడు. గత సంవత్సరంనుంచి వ్యాపారం బావోలేదు. స్టాఫ్ జీతాలు ఇవ్వటం కూడా కష్టంగా వుంది. పళ్ళబిగువున అదిమిపెట్టి లాక్కొస్తున్నాడు. అతడు సాధారణంగా ఇటువంటి విషయాలు ఎవరితోనూ చర్చించడు. అతడికి జీవితంలో  సంతోషాలకీ, విషాదాలకీ పెద్దగా తారతమ్యం వుండదు. స్పందనల తేడా తక్కువ. అతడి మొహం ఆనందాన్ని గానీ విషాదాన్ని గానీ పెద్దగా చూపించదు.

    ప్రస్తుతం అతడు ఒక రైల్వే కాంట్రాక్టు కోసం ప్రయత్నిస్తున్నాడు. అడిగానీ వస్తే కష్టాలనుంచి బయటపడినట్టే. ఆ విషయమై ఎవరితోనో మాట్లాడుతూవుండగా, మరోఫోన్ మ్రోగింది. ఎత్తి "హలో" అన్నాడు.

    "నేనూ.....లక్ష్మిని"

    ఆమె సాధారణంగా ఆఫీసుకి ఫోన్ చేయదు.

    "ఏమిటి?" అన్నాడు  విసుగ్గా.

    "ఈ సాయంత్రం ఖాళీగా వుంటారా?"

    అతడు మొహం చిట్లించి "ఎందుకు?" అన్నాడు.

    "చెప్తాను"

    "ఉంటాను"

    "అయితే తొందరగా రండి ఇంటికి"

    "ఏమిటి విశేషం?"

 Previous Page Next Page