దశరథ, కె.మే, నందిని, సుశీల్ కుమార్ బ్రహ్మానందం వాగ్దాటికి అదిరి పోయారు.
"నన్ను ఎక్కువసార్లు టీవీలో చూపిస్తున్నట్లు ప్రజలు అనుకుంటున్నారట. ఇకపై ప్రతిదానికి నన్ను టీవీలో చూపించవద్దని ప్రధాని వి.పి.సింగ్ బ్రాడ్ కాస్టింగ్ డిపార్ట్ మెంట్ కి వార్నింగ్ ఇచ్చారట. అదీ..... అలా ఉండాలి.... ప్రజలంటే అలా భయపడాలి - ప్రజల అభిప్రాయాలకు అలా విలువివ్వాలి.
టీవీలో ప్రజలు, ప్రజల సమస్యలు, వాటికి పరిష్కారాలు, వారి సంస్కృతి, సాంప్రదాయాలు, వారి విజయాలు, వారి అభిరుచులు, అంత రంగం, తప్పుదారిన వెళ్లే ప్రజలకు గుణపాఠాలు, ఎడ్యుకేట్ చేయటం, ఎవేర్ చేయటం, రియాక్టు చేయటం, మానసిక వికాసాన్ని కలిగించటం, దేశభక్తి, ఆత్మవిశ్వాసం వారిలో ప్రోదిచేసుకొనేలా, న్యాయవ్యవస్థను, రాజ్యాంగాన్ని గౌరవింపజేసేలా చేయాలి. టీవీ. అంతేకాని ఏ మంత్రి ఎక్కడ తిన్నాడు- ఏ బట్టలేసుకున్నాడు - ఎక్కడ పడుకున్నాడు లాంటి నికృష్టపు సంఘటనల్ని చూపించకూడదు. దేశంలో పెరుగుతున్న నిరుద్యోగం..... యువతలో పాదుకుంటున్న నిరాశ నిస్పృహల్ని ఎలా పారద్రోలాలనే విషయాల్ని చూపించాలి. చేతిలో ఐదు పైసలుకూడా లేకుండా తమ శ్రమశక్తితో అభివృద్ధిలోకి వచ్చినవార్ని, అర్హతల్ని సంపాదించుకొన్న వ్యాపారవేత్తల్ని, విద్యావేత్తల్ని, విజ్ఞానవేత్తల్ని చూపించాలి. వారితో ఇంటర్వ్యూలు చేయాలి. ఒక్కమాట చెప్పండి ఇప్పుడు దూరదర్శన్ ప్రసారం చేస్తున్నా ప్రోగ్రామ్స్ దేఆరా ఒక్క యువకుడ్ని -నిరాశా నిస్పృహల్లో మ్రగ్గిపోయే ఒక్క యువకుడ్ని సరైనా దారిలోకి ప్రవేశపెట్టగలరా...........?
పిచ్చి సీరియల్స్, పిచ్చి ప్రోగ్రామ్స్, సంధి ప్రేలాపనలు మా తాతలు నేతులు తాగారు - మీరు మా మీసాల్ని వాసన చూడండి...... కోడిబాయె లచ్చమ్మలు - బేసిక్స్ ఫాలోకాని కూచిపూడి నృత్యాలు, లుచ్చాలాంటి నీచమైన పదాలు- అచ్చుతప్పులు - తేనెలొలికే తెలుగు భాషను ఖూనీ చేయటం- ఏమిటిదంతా....? ఇందుకా వార్ని ప్రజలు పోషించాలి? ఇందుకా ప్రజల ధనాన్ని వృధా చేయాలి.....? ఛీ...చీ....డామ్ ది టీవీ.... ఎన్ని విమర్శించినా, ఎన్ని తిట్టినా బుద్ధిరాదు -" బ్రహ్మానందం చిరాకు పడిపోయాడు.
"ఏంటి రోయ్ పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నావ్?" దశరథ ఒకింత కోపాన్ని ప్రదర్శిస్తూ అన్నాడు.
"నావి మాటలా.....? కడుపుమండి కూస్తున్న బూతులు. ఎప్పుడో ప్రజలు తిరగబడి వేటాడి, వెంటాడి బుద్ధి చెబుతారు. అప్పుడు గాని బుద్ధిరాదు- ఇంతటి బోడి ప్రోగ్రామ్స్ కోసం పదమూడు, పద్నాలుగు వేలుపెట్టి టీవీలు కొనుక్కోవాలా.........?" బ్రహ్మానందం తెగించాడు.
"అమ్మో....వీడు మందుకొడితేనే బెటర్......వెంటనే మందు తెప్పించాలి" అంటూ దశరథ చప్పట్లు కొట్టాడు.
క్షణాల్లో మందు బాటిల్స్ వచ్చేసాయి.
తలా ఓకే పెగ్గు తీసుకున్నారు.
"ప్రజల సొమ్ము చెట్లకు కాస్తున్నాయా..........? ఆహా........ నాకు తెలీక అడుగుతున్నాను..." అని నందినివైపు తిరిగి "ఏమ్మా.... మహానటి..... నువ్వో స్మితాపాటిల్ ననుకుంటున్నావా....? కన్నాంబ, సావిత్ర ననుకుంటున్నావా.....మధుబాల, నర్గిస్ నను కుంటున్నావా.....? సిగ్గులేదు.. వెధవ నటి పెళ్ళికి హిందుస్థానీ రాగమని.....నీకు కారు కావాలి.....? అదీ ఏసీ....? పళ్ళరసాలు కావాలా....? గట్టిగా ఒక్క డైలాగ్ చెప్పగలవా? గ్లిజరిన్ లేకుండా కళ్ళనీళ్లు తెప్పించగలవా.....? నీ పాత్రకు నీవు డబ్బింగ్ చెప్పుకోగలవా....? ఒంపుసొంపులు చూపి, వయ్యారాలు పోవటంకాదు నటనంటే.....ఆగు ఇంకోపెగ్గు వేసుకోనివ్వు .....అప్పుడు చెబుతా నటనంటే ఏమిటో........" అంటూ మరోపెగ్గు అందుకున్నాడు బ్రహ్మానందం.
నందిని కళ్లు కోపంతో ఎరుపెక్కాయి.
సుశీల్ కుమార్ కి అవమానంగా ఉంది - కాని సీన్ లో దశరథ ఉండటంతో మాట్లాడలేకపోయాడు.
'వాడి మాటలకేం గాని - ఇప్పుడు హంపీ సీరియల్ కి స్పాన్సరర్స్ ఎవరు.....?" దశరథ విషయంలోకి వస్తూ అన్నాడు.
"ఎవరేమిటి....... ఎవరయినా వస్తారు..... ఆమె ఒక అపర్ణాసేన్.... సీరియల్స్ డ్రామాలు తీయటం ఆమెకు చాతకాదు. ఛాలెంజింగ్ లేడీ.....డైనమిక్ డైరెక్టర్ ..... ఆమె సీరియల్ కి ఈయన స్పాన్సరర్స్ ని చూడకపోతే కొంప మునుగుతుందా.......?" బ్రహ్మానందం రెండోపెగ్ పూర్తిచేస్తూ అన్నాడు.
"నువ్వూరుకోరా బాబు....." అని బ్రహ్మానందాన్ని ఉద్దేశించి అంటూ సుశీల్ కుమార్ వేపు తిరిగి "మీరు చెప్పండి కుమార్ గారు" అన్నాడు దశరథ.
తనలో రేగుతున్న కోపాన్ని తమాయించుకుంటూ "ఇంకా తెలీదండి.... తెలుసుకుంటాను" అన్నాడు సుశీల్ కుమార్ సీరియస్ గా.
"ఏంటి తెలుసుకొనేది ..... తేలుగాడి కొండి.... అవతలవాళ్ళు మంచిపనులు చేస్తుంటే చూసి అభినందించగలిగే గొప్ప మనస్సుండాలి. ఎప్పుడూ రాజకీయాలు - అసూయ - ఏడవటం - అడ్డు తగలటం. మీలాంటి వాళ్ళు పైకెందుకురారో తెలుసా......? మీమీ వృత్తులమీద పెట్టవలసిన కాలాన్ని అవతల వాళ్ళనుచూసి ఏడవటానికి ఉపయోగిస్తూ వృధా చేసుకొంటారు గనుక...." బ్రహ్మనందం మూడో పెగ్ లోకి వెళ్తూ అన్నాడు.
నందినికి, సుశీల్ కుమార్ కి బ్రహ్మానందాన్ని పీకపిసికి చంపేయాలన్నంత కోపంగా ఉంది.
"మనం ఏదో ఒకటిచేసి ఆ హంపీని దెబ్బకొట్టాలి....." అంది నందిని కోపంగా.
"ఏంటి నువు దెబ్బకొట్టేది..... ఏటవతల ఏకాంబరంలా....? నిన్ను హీరోయిన్ పాత్రలోంచి పీకేయకుండా ఉంటేచాలు......ఆమెకేదారి లేక నిన్ను పెట్టుకొని ఉంటుంది. సీరియల్ మధ్యలో నువ్వూ, ఆ మహానటుడు ప్రశాంత్ ఎక్కడికో చెక్కేసి ఆమెని ఇరుకున పెట్టాలని చూస్తున్నారని నాకు తెలుసు. అదే జరిగితే మీరు వ్రాసిన అగ్రిమెంట్స్ కోర్టులోపడేసి మిమ్మల్ని రాజమండ్రికి పంపిస్తుంది......" మిర్చీని కసిగా కొరుకుతూ అన్నాడు బ్రహ్మనందం.
"వీడేమిటి మధ్య మధ్యలో ఇలా బ్రెయిన్స్ తినేస్తుంటాడు....?" కె.మే చిరాకుపడిపోయాడు.
"ఓసోస్! బ్రెయిన్స్ అని జోకులు.... అవి మీకెక్కడున్నాయి నేను తినడానికి....? మీకు ఆత్మసాక్షి అంతరాత్మలు లేవు- ఉండవు. వాటిలోటో- మీ నిజాల్ని బయటపెట్టి నేను తీరుస్తుంటాను.....చెప్పుకోండి....చెప్పుకోండి- వినాశనం గురించి బాగా చెప్పుకోండి" అంటూ నాలుగోపెగ్ వేసుకొనే ప్రయత్నాన్ని తాత్కాలికంగా వాయిదా వేసుకొని బాత్ రూమ్ కి వెళ్ళాడు బ్రహ్మానందం.
"ఈసారామెను దెబ్బకొట్టడం కొంచెం కష్టమే...." అన్నాడు సుశీల్ కుమార్ సాలోచనగా.
"అమ్మ......మ్మ.....అలా అంటే ఎలా .....? మీరే ఏదో దారి చూపించాలి' దశరధ బ్రతిమాలాడాడు.
కొద్దిక్షణాలు ఏదో ఆలోచిస్తూండిపోయాడు సుశీల్ కుమార్ సాలోచనగా.
"ఇక్కడ నేనే ఇప్పటివరకు పెద్ద ప్రొడ్యూసర్ ని..... ఇప్పుడీ హంపీ నన్ను డామినేట్ చేస్తే నా పరువేపోతుంది....." దశరథ వాపోయాడు.
"హొమ్ మినిస్టర్ మీకేమవుతారు........?"
"ఏమి అవటం ఏమిటి......?స్వయంగా నా తమ్ముడు"
"ఓన్ బ్రదరా........?"
"అవును"
"అవసరమయితే మీకు అండగా నిలుస్తాడా.....?"
దశరధకి, సుశీల్ కుమార్ కి మధ్య జరుగుతున్న సంభాషణని కె.మే, నందిని శ్రద్దగా వింటున్నారు.
"అండగానా.....? ప్రాణమివ్వమంటే ఇస్తాడు....మనం వాడితో చేయించుకోవాల్సిన పనులేమన్నా ఉన్నాయా....? అంటే చెప్పండి... క్షణాల్లో చేసేస్తాడు....."
"అవుటాఫ్ ది వే వెళ్ళి చేయగలడా.........?"
"అసలాయన ఎప్పుడు సరైన దారిలో వెళ్ళాడు...? ఎప్పుడూ అవుటాఫ్ ది వేలో వెళ్తూ కోట్లు సంపాదించిన గొప్పోడు. మా అయ్యాగారి తమ్ముడు మొదట్లో పెద్ద తాగుబోతూ- తిరుగుబోతు - గూండా....వాటినే పెట్టుబడిగా పెట్టి ఎమ్ .ఎల్.ఏ అయ్యాడు. మా అయ్యగారు డబ్బు వెదజల్లి... అంటే యాభైలక్షలు హార్డ్ కాష్ ఇచ్చి తమ్ముడ్ని మంత్రిని చేయిచుకున్నాడు. ఆ ముఖ్యమంత్రి మంత్రి పదవులను వేలం పాత పెట్టాడు. అబ్బో..... ఆయనో పెద్ద జంతర్ -మంతర్.....ప్రతి దానికి రేటుబెట్టి కోట్లకుకోట్లు సంపాదించిన ఘనుడు..... అడగండి తమరికేం వెధవపని కావాలో....." బ్రహ్మానందం బాత్ రూమ్ లోంచి వస్తూ అన్నాడు.
"అయితే..... ఆ హంపీనే కాదు - ఎవరినైనా ఏమైనా చేయగలం" సుశీల్ కుమార్ నవ్వుతూ అన్నాడు.
"హమ్మయ్యా........ ఇప్పుడు ధైర్యం వచ్చింది" దశరథ ఊపిరి తీసుకుంటూ అన్నాడు.
"రేపే మనం మీ బ్రదర్ ని కలవాలి."
"అలాగే"
"ఏంటలా.... అలాగే అనేస్తారు....? మీ బ్రదర్ ఆ అంతర్జాతీయ క్రిమినల్ తో..... అదే..........తో కలసి ఏదో కొంప ముంచే పనిలో నిమగ్నమయి ఉన్నాడుగా.....? ఖాళీగా ఎక్కడున్నాడు..........?" బ్రహ్మానందం మాటలకి దశరథ ఉలిక్కిపడ్డాడు.
ఆపైన కోపంగా మ్రింగేసేలా బ్రహ్మానందంవేపు చూసాడు.
అంతమత్తులోనూ ఆ అంతర్జాతీయ క్రిమినల్ పేరుని చెప్పకుండా దాటవేయగలిగిన బ్రహ్మానందాన్ని చూసి సుశీల్ కుమార్, నందిని, కె.మే విస్మయపడితే, దశరధ గుండెలనిండా ఊపిరి తీసుకున్నాడు.
'అందుకే వీడంటే నాకు చాలా ఇష్టం- వీడు చాలామందికి ఆత్మ సాక్షి........' అనుకున్నాడు మనస్సులోనే దశరధ.
"ఏమ్మా....ఎలా వస్తోంది సీరియల్.....? తన అరికాళ్ళను మృదువుగా మర్థిస్తున్న కూతురికేసి ప్రేమగాచూస్తూ. ప్రశ్నించాడు సీతారామారావు.
"ఫర్వాలేదు నాన్నగారు....." అంది తల ఎత్తకుండానే హంపి.
సీతారామారావు లేచికూర్చుని హంపీ తలను మృదువుగా నిమురుతూ "మనం చేసేపని కనీసం మనకైనా సంతృప్తిని కలిగించాలమ్మ...... ఎంతో ఉత్సాహంగా చెప్పవలసిన నువ్వు ఫర్వాలేదంటున్నావంటే కనీసం నీవైనా తృప్తిపడటం లేదనిపిస్తోంది. ఎందుకని....." సీతారామారావు వాత్సల్యంతో అడిగాడు.
ప్రసిద్ధ సినీనటి సుహాసిని తమిళ టీవీ సీరియల్ తీస్తోంది. దానికి తనే డైరెక్టర్- తానే కెమేరా...."
"మరో యువతి కూడా నీకు తోడుందన్నమాట.....?"
"అవును నాన్నగారు - హేమమాలినికూడా ఒక సీరియల్ తీసింది నూపుర్ అని"